ఉత్తరాయణం

స్థాయిని మరచి కేజ్రీ వ్యాఖ్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల మన సైనికులు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరిపిన ‘మెరుపుదాడి’ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవు. ఓ వైపుప్రధాని నరేంద్ర మోదీకి జైకొడుతూనే మరోవైపు మెరుపుదాడికి సంబంధించిన వీడియోలను బయటపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది. కేజ్రీ నిజాలు మాట్లాడారని ఆయన అభిమానులు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు ప్రశంసల వర్షం కురుపించవచ్చు. కేజ్రీవాల్ ఓ హీరోలాగా స్పందించారని సోషల్ మీడియాలో పాకిస్తానీయులు పోస్టులు పెడుతున్నారు. పాక్ ఉగ్రవాదులకు కేజ్రీ నమస్కారం చేస్తున్నట్టుగా ఇండియన్లూ పోస్టులు చేస్తున్నారు. కీలక పదవిలో ఉన్న కేజ్రీవాల్- మన శత్రుదేశానికి లాభం కలిగే విధంగా మాట్లాడటం సరికాదు. మెరుపుదాడిపై వీడియాలను కేంద్రం విడుదల చేస్తే అది తప్పక పాక్‌కు మేలు చేసినట్లు అవుతుందని సామాన్య భారతీయుడికి ఉన్న అవగాహన కేజ్రీవాల్‌లో లోపించటం శోచనీయం. కేజ్రీవాల్ సొంతంగా మాట్లాడుతున్నారా? లేక విదేశీ శక్తుల ప్రమేయంతో మాట్లాడుతున్నారా? ఖర్మకాలి ఒకవేళ యుద్ధమే వస్తే ‘ఎలా యుద్ధం చేస్తారో ఆ వివరాలను ఒక రోజు ముందుగా మీడియాకి, ప్రజలకు చెప్పాలం’టూ కేజ్రీవాల్ అడిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఉన్నత విద్యావంతుడైన కేజ్రీ దేశ భద్రత విషయాలలో ఇలా తల దూర్చటం ఏమీ బాగుండలేదు. భారత సైనికుల్లో మనోధైర్యం పెరిగేలా మాట్లాడాలే తప్ప చౌకబారు రాజకీయ ప్రయోజనాల కోసం కేజ్రీవాల్ తపన పడడం మానుకుంటే మేలు.
Pcvrk1948@yahoo.com

‘రియల్’ మోసాలు చూడండి..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది. కొంతమంది రియల్టర్లు పేద రైతుల భూములను కారుచౌకగా కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. ప్లాట్ల అమ్మకాలు జరిగిన తరువాత కొందరైతే స్థలాలను ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా బోర్డులు తిప్పేస్తున్నారు. సామాన్యులైన కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రియల్ వ్యాపారులు మాత్రం అతి తక్కువ పెట్టుబడితో రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారు. స్థలాలు కొనుగోలు చేసి మోసపోయినవారికి న్యాయం చేయటానికి, అక్రమార్జన పరులను శిక్షించటానికి ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కానీ, ఫిర్యాదుల విభాగాలను కానీ ఏర్పాటు చేయకపోవటం ప్రజల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.
-టి.జయగోపాల్, ఏలూరు

ఆచరణ సాధ్యం కాదు
లోక్‌సభకు, అన్ని శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుందన్న విషయమై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. 1967 వరకూ ఏకకాలంలోనే ఎన్నికలు జరిగాయి. 1967లో 10 రాష్ట్రాలలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. అప్పటి నుంచి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగడం లేదు. మనది బహుళ పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్థ. శాసనసభలు తప్పనిసరిగా ఐదు సంవత్సరాలు ఉండాలని రాజ్యాంగం నిర్దేశించలేదు. అనూహ్య రాజకీయ పరిణామాల వల్ల ఏదైనా రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేసినా ఎన్నికలు జరిపే సంవత్సరం మారుతుంది. మనకు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చాలా ఉన్నాయి. ఎన్నికైన సభ్యులు ఇష్టానుసారంగా పార్టీలు మారుతుంటారు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వాల అనిశ్చితికి దారితీస్తున్నది. అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఇటీవలి రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యం వ్యవస్థకు చేటు తెచ్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభ, అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదనిపిస్తోంది.
-కెహెచ్ శివాజీరావు, హైదరాబాద్

ప్రాణాలతో చెలగాటం వద్దు
హైదరాబాద్ నగరంలో ఆటోలు, మోటారు సైకిళ్ళు లైట్లు లేకుండా మితిమీరిన వేగంతొ పోతున్నాయి. చిన్నపిల్లలు, వృద్ధులు డివైడరు దాటి అవతలి వైపు పోవడానికి నానా ఇబ్బంది పడుతున్నారు. ఆకస్మికంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఎంత ప్రమాదకరమో ఆలోచించాలి. లైట్లు లేకుండా బైక్‌లు, ఆటోలు వెళితే ట్రాఫిక్ పోలీసులు ఉపేక్షించకూడదు. డ్రంకెన్ డ్రైవ్ నేరమైతే ఇదీ కూడా అంతే. కొంతమంది వాహన చోదకులు చీకట్లో పాదచారులను ఢీకొట్టి వెళిపోతుంటారు. రాత్రి సమయంలో లైట్లు వెలగని వాహనాలను నడిపేవారిపై చర్యలు తీసుకోవాలి.
-బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ