ఉత్తరాయణం

పరువు తీస్తున్న నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ టిప్పు సుల్తాన్ జయంతి సభలో నిమగ్నం కాగా- సందట్లో సడేమియాలా అశ్లీల వీడియోలు చూస్తూ కర్నాటక విద్యాశాఖ మంత్రి తన్వీరు అడ్డంగా ఓ వీడియోలో బుక్కయ్యారు. టీవీ జర్నలిస్ట్ తీసిన ఆ వీడియోను మరుక్షణమే టీవీల్లో ప్రసారం చేశారు. ‘నాకు సంబంధించిన వీడియోను తీసి, బయటపెడతావా..’ అంటూ ఆగ్రహంతో ఆ మంత్రివర్యుడు- సదరు రిపోర్టర్, వీడియో తీసిన కెమెరామెన్‌పై పోలీసులకు ఫిర్యాదుచేశారు. అమాత్యుడు చేసిన ఫిర్యాదును స్వీకరించాక కేసు నమోదుచేసినట్లుగా ఓ పోలీసు అధికారి వెల్లడించారు. పబ్లిక్‌గా సిగ్గుతో తలదించుకునే పనిచేసిన విద్యాశాఖమంత్రిగారే ఇలా ప్రవర్తిస్తే, ఈ విషయమై కర్నాటక సిఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ- పూర్తి వివరాలు తనకు తెలియవని, ఆ మంత్రితో మాట్లాడి నిజానిజాలు తెలుసుకొని తప్పు జరిగినట్లు తెలిస్తే చర్యలు తప్పవన్నట్లుగా మాట్లాడారు. ఎవర్నీ సమర్ధించే ప్రసక్తేలేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిత్యం సెల్‌ఫోన్లకు అతుక్కుపోతూ పరిసరాలను సైతం మరచిపోతున్నారు. సెల్‌లో బూతు వీడియోలు చూడడం, గేమ్స్‌తో కాలక్షేపం చేయడం అలవాటుగా మారింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ప్రజాప్రతినిధులు బూతు వీడియోలు చూస్తూ బుక్కవడం అందరికీ తెలిసిందే. చివరికి స్పీకర్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు సెల్‌ఫోన్‌లు ఉంచాలని చట్టం చేస్తే కానీ ఈ జాఢ్యానికి స్వస్తి పలకరేమో! బహిరంగ సభల్లో పాల్గొనే ప్రముఖులందరూ తమ సెల్‌ఫోన్స్ ఇంటిదగ్గరే పెట్టి వెళ్లాలని సంబంధిత పార్టీల అధినేతలు ఉత్తర్వులు జారీచేస్తే తమ పార్టీ మర్యాద కాపాడుకొన్న వారవుతారు.
-cvrk1948@yahoo.com

చైనా వైఖరి ఏమిటి?
ఓ వైపు పాకిస్తాన్‌కు మద్దతునిస్తూ, మరోవైపు భారత్‌తో సఖ్యతగా ఉంటున్నట్లు నటిస్తూ చైనా గోడమీది పిల్లిలా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచం యావత్తూ వ్యతిరేకిస్తుంటే చైనా ఇప్పటికీ స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదు. మరోవైపు చైనా తన వ్యాపారాన్ని భారత్‌లో వృద్ధిచేసుకొంది. భారతీయులు ఇకనైనా చైనా వస్తువులను అడ్డుకోవాలి. భారత్ సరిహద్దుల్లో చైనా, పాక్ కవ్వింపు చర్యలు కొత్తకాదు. మన సైనికులు గట్టిగా బుద్ధి చెబుతున్నా పాక్ ఇంకా దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు సహాయ సహకారాలు అందకుండా చేస్తే ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చు. పాక్‌కు చైనా అండగా నిలబడడం మరీ దారుణం.
-అయినం రఘురామారావు, ఖమ్మం

బాలకార్మికుల అవస్థలు
బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించడంలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా షాపుల్లో, ఆలయాల వద్ద పిల్లలచే పనిచేయించుకోవడం ఇప్పటికీ కనబడుతోంది. 14 ఏళ్ళలోపు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్ళి చదువుకునేలా చర్యలు తీసుకోవాలి. పిల్లల చేత చాకిరీ చేయిస్తే వారి తల్లిదండ్రులను, దుకాణాల యజమానులను చట్టపరంగా శిక్షించాలి. ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుందనే సత్యాన్ని మరువకూడదు.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

కరవు భత్యం పెంచాలి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా రెండు శాతం కరవు భత్యం (డిఎ) పెంచారు. ఇదే విధానాన్ని అనుసరించి కరవు భత్యం పెంచేందుకు ఎపి ప్రభుత్వం కూడా చొరవ చూపాలి.
- జవ్వాది వెంకటరమణ, విశాఖపట్నం

లైబ్రరీల్లో సమస్యల తిష్ట
గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం. మన మేధోసంపత్తిని పెంచేవి గ్రంథాలయాలు మాత్రమే. స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయోద్యమం కీలకపాత్ర పోషించింది. అలాంటి విజ్ఞాన సర్వస్వాలైన గ్రంథాలయాలు నేడు ఆదరణ కోల్పోతున్నాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంత గ్రంథాలయాల్లో సమస్యలు తిష్టవేశాయి. దినపత్రికలు సక్రమంగా రాకపోవడం, బెంచీలు, కుర్చీలు లేకపోవడం, గ్రంథాలయాధికారులు అందుబాటులో వుండకపోవడం లాంటి సమస్యలు తప్పడం లేదు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తిస్థాయిలో వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కొన్ని లైబ్రరీల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇరుకైన గదులలో పాఠకులు పుస్తకాలు చదవాల్సిన దుస్థితి నెలకొంది.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట