ఉత్తరాయణం

నోట్లరద్దుతో పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం సముచితమైనదే, కాదనటం లేదు. కానీ, చేతిలో డబ్బుల్లేక పేద, మధ్యతరగతి వారిలో రోగుల పాట్లు వర్ణణాతీతం. పల్లెటూళ్ల నుంచి ప్రైవేటు ఆస్పత్రులుండే పట్టణాలకు ఎంతోమంది రోగులు వస్తుంటారు. చాలా ఆస్పత్రుల్లో 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడం లేదు. బ్యాంకులు, ఎటిఎంలు, పోస్ట్ఫాసులు ప్రజల అవసరాలను తీర్చడం లేదు. ఎవరినైనా చేబదులు అడుగుదాం అంటే వంద నోట్లు కొనే్న వున్నాయి, మాకే సరిపోవని అంటారు. పరిచయస్థులే లేని బయటి ఊళ్లలో రోగులు ఏం చేయాలి? నగలు కుదువబెట్టాలా? బస్సుల్లో, రైళ్ళలో పాతనోట్లు తీసుకోకపోతే ప్రయాణాలు సాగేదెలా? బ్యాంకుల్లో పాతనోట్ల మార్పిడి అంతులేని ప్రహసనంగా మారింది. ఈ పరిస్థితిలో సామాన్యుడికి దిక్కెవరు?
-బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ

నల్లధనంపై కొరడా!
నల్లధనాన్ని సమూలంగా నియంత్రించాలన్న ప్రధాని మోదీ నిర్ణయం అభిలషణీయం. విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణిలో వున్న ఈ సమయంలో ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. నకిలీ నోట్లు ఇచ్చి మంచి నోట్లు మార్చుకోవాలనేవారికి ఇది చెంపపెట్టు. రియల్ ఎస్టేట్ రంగంలో, పెట్టుబడిదారీ వర్గాల్లో ఇపుడు టెన్షన్ మొదలైందనే చెప్పాలి. నల్లధనాన్ని అరికడితే ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతుంది. మోదీ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా చెప్పవచ్చు. సంపద కేవలం కొందరి చేతుల్లో ఉన్నందున సమాజంలో ఆర్థిక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంటోంది. -పెండెం శ్రీనివాస శివప్రసాద్, మంగళగిరి

గవర్నర్ల కొరత!
దేశంలో 29 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుండగా, ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. కానీ, ఒక గవర్నర్ పదవీకాలం ముగియగానే పక్క రాష్ట్ర గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పడం ఇపుడు పరిపాటిగా మారుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకూ ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతున్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తమిళనాడుకు అదనపు బాధ్యతలు వహిస్తున్నారు. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ తరచూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గవర్నర్ల పదవికి బిజెపిలో తగిన అర్హతలు ఉన్నవారు లేనిపక్షంలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు స్వీకరించి నియామకాలు చేయవచ్చు. ప్రతి రాష్ట్రానికొక గవర్నర్‌ను నియమించి సమర్థ పాలనకు ప్రధాని మోదీ చర్యలు చేపట్టాలి.
-కెహెచ్ శివాజీరావు, హైదరాబాద్

పెద్దనోట్లు.. అవినీతికి మెట్లు
దేశంలో పేరుకుపోయిన నల్లధనం, నకిలీ కరెన్సీ నుంచి ఆర్థిక వ్యవస్థకు విముక్తి కలిగించాలని ప్రధాని మోదీ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం సబబే. నల్లకుబేరులకు, అవినీతిపరులకు ఈ నిర్ణయం కొరడా దెబ్బలా తగిలింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, ఉన్నతాధికారులు లంచాలు గుంజుతూ ప్రజలను దోచుకుంటున్నారు. ఇంకొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో కోట్లకు పడగలెత్తి నల్లధనాన్న రాశులుగా నింపుకుంటున్నారు. వైద్యవృత్తిని వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ ఆసుపత్రులు, పారితోషికం పేరిట నల్లధనాన్ని పోగేసుకుంటున్న సినీపరిశ్రమవారు, కాల్‌మనీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చుతున్న వడ్డీ వ్యాపారులు, అక్రమ సంపాదనకు చిరునామాగా మారిన రాజకీయ నాయకులకు ఇకనైనా చట్టపరంగా శిక్షలు పడాలి. ఉగ్రవాదం కన్నా భయంకరమైన అవినీతిని, నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించాలి. పేదలకు మేలు జరిగేలా మరిన్ని ఆర్థిక సంస్కరణలను కఠినతరంగా అమలుచేయాలి.
-ఉప్పు సత్యనారాయణ, తెనాలి

నిబంధనలు బేఖాతరు
జంటనగరాల్లో చాలా విద్యాసంస్థలకు చెందిన బస్సులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మలుపుల వద్ద కూడా మితిమీరిన వేగంతో ఈ బస్సులను నడుపుతున్నందున తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సులు నడపడం, ఇండికేటర్స్ ఉపయోగించకపోవడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో డ్రైవర్లకు స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు తరచూ సూచనలివ్వాలి. నిబంధనలు అతిక్రమించినవారిపై చర్యలు తీసుకోవాలి. వేగాన్ని అదుపుచేయకుంటే ఈ బస్సుల్లోని విద్యార్థులకే కాదు, మిగతా వాహన చోదకులు, పాదచారులు తీవ్ర సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం