ఉత్తరాయణం

ఆలయాల్లో చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి కాలంలో దేవాలయాల్లో హుండీలు చోరీలకు గురవుతున్నాయి. ఆలయాల్లో హుండీలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. ఆదాయం వున్న గుడుల్లోనే హుండీ దొంగతనాలు జరుగుతున్నాయి. దేవాలయాల్లో రక్షణ నిమిత్తం సెక్యూరిటీ గార్డులను నియమించాలి. దొంగలు దేవుడి నగలు సైతం దొంగిలిస్తున్నారు. ఈ చోరీలను అరికట్టాల్సిన బాధ్యత సంబంధిత దేవాలయాల ధర్మకర్తలకు, కమిటీ సిబ్బందికి, అధికారులకు ఉంది. ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఆలయాల్లో దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలి.
-అయినం రఘురామారావు, ఖమ్మం

చిన్ననోట్లపై చిన్నచూపు
కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు పెద్దనోట్లపై ప్రదర్శిస్తున్న శ్రద్ధాసక్తులు చిన్ననోట్లపై చూపకపోవడం విచారకరం. తాజాగా 2 వేల రూపాయల నోటును విడుదల చేయడం ఆర్థిక సంస్కరణలో ఓ భాగం కావచ్చు. కొనే్నళ్లనుంచి 1, 2, 5 కరెన్సీ నోట్లు, నాణేలు లభ్యం కాని పరిస్థితి కొనసాగుతోంది. దాంతో ప్రజలు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు ఘోరంగా ఉన్నాయి. బస్సుల్లో, రైల్వే స్టేషన్లలో, కిరాణాషాపుల్లో, చిన్న చిన్న వ్యాపార కేంద్రాల వద్ద చిల్లర కారణంగా వాగ్వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది వర్తకులు ప్రత్యామ్నాయంగా చాక్‌లెట్‌లను అంటగడుతున్నారు. ఇక అర్థరూపాయల కొరత ఎలానూ పట్టి పీడిస్తోంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1, 2, 5 కరెన్సీ నోట్లను, నాణేలను, అర్థరూపాయి నాణేలను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్చలు తీసుకోవాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు

భారతీయ సంస్కృతికి చేటు
పిచ్చి ముదిరి తలకెక్కినట్లు ఎపి ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విశాఖలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించ తలపెట్టడం శోచనీయం. భారతీయ సంస్కృతి, సత్సంప్రదాయాలను పణంగా పెట్టి అశ్లీలతకు తెర తీసి బీచ్ ఫెస్టివల్స్ గతంలో గోవా, కర్నాటక, ముంబయి వంటి నగరాలలో నిర్వహించగా, అవి ఎంతటి వివాదాలకు దారితీశాయో అందరికీ గుర్తుండే వుంటుంది. తాగుడు, అశ్లీల నృత్యాలు, విచ్చలవిడితనం పరాకాష్ఠకు చేరే ఇటువంటి ఫెస్టివల్స్‌ను నిషేధించాలని పలు సాంస్కృతిక సంఘాలు, ఆధ్యాత్మిక వాదులు గతంలో ఎన్నో విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. భారతీయ సంస్కృతిపై జరిగే దాడిలాంటి బీచ్ ఫెస్టివల్‌ను వాలంటైన్స్ డే రోజున విశాఖలో నిర్వహించతలపెట్టడం బాధాకరం. పాశ్చత్య విష సంస్కృతిలో జాతి నిర్వీర్యమైపోయే ప్రమాదం వున్నందున బీచ్ ఫెస్టివల్ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం

హింస అవసరమా?
నేటి సినిమాల్లో ఫైటింగ్‌లు తప్పనిసరి అవుతున్నాయి. సందేశాన్నిచ్చి సమాజాన్ని మంచి త్రోవలో పెట్టాల్సిన సినిమాలు హింస, కొట్లాటలను ప్రోత్సహిస్తూ యువతరాన్ని పతనం వైపు నడిపిస్తున్నాయి. కత్తులతో నరుక్కోవడం, చంపుకోవడం, మతిమీరిన రక్తపాతాలు సినిమాలలో పెరుగుతున్నాయి. హీరోలతోనూ, విలన్లతోనూ మితిమీరిన సాహసాలను చేయిస్తున్నందున కొంతమంది యువకులు వాటిని ఆచరిస్తున్నారు. సినిమాలను అనుకరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫైటింగ్‌ల చిత్రీకరణ కొన్నిసార్లు నటుల ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. షూటింగ్‌ల సందర్భంగా నటులు తీవ్రంగా గాయపడటమో, మరణించడమో జరుగుతోంది. దీనికి ఎవరు బాధ్యులు? ఇంత హింస అవసరమా? సినిమాల్లో రక్తపాతాలను, ప్రాణాంతకమైన సాహసాలను నిషేధించాలి. చలన చిత్రాలు సమాజాన్ని మంచి దారిలో పెట్టేలా చక్కని కథలతో రావాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం