ఉత్తరాయణం

చిరువ్యాపారులకు ఇబ్బందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్లను రద్దు చేశాక బడాబాబులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. నగదు కొరత, చిల్లర సమస్యతో పేద, మధ్యతరగతి వారు నానా యాతన అనుభవిస్తున్నారు. చిరువ్యాపారులకు జీవనోపాధి కరవయ్యే ప్రమాదం ఏర్పడింది. పెద్దనోట్ల రద్దు ఫలితంగా చిల్లర నోట్లను సమకూర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో ఈ దుస్థితి ఏర్పడింది. నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద భారీ క్యూలు తప్పడం లేదు. ఇకనైనా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆర్‌బిఐ చర్యలు తీసుకోవాలి. లేకుంటే నగదు సంక్షోభంతో లక్షలాది కుటుంబాలు ఆకలికేకలతో అలమటించక తప్పదు.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్

వడ్డీ తగ్గింపు తగదు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఉద్యోగులు కుటుంబ అవసరాల కోసం తీసుకునే ప్రావిడెంట్ ఫండ్ విత్ డ్రాలపై పన్ను విధించడం దారుణం. బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ పదివేల రూపాయలు దాటితే పన్ను వేయడం సబబు కాదు. దీంతో పొదుపును ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఆశయానికి గండి పడుతుంది. రిటైర్డు ఉద్యోగులు బ్యాంకులో దాచుకునే నగదుపైన, ఫిక్స్‌డ్ డిపాజిట్లపైన పన్ను విధించడం అన్యాయం. పేదవర్గాల నడ్డివిరుస్తున్న మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తోంది. జిఎస్‌టి విధానం వల్ల కార్పొరేట్ శక్తులు విపరీతంగా లాభాలను గడిస్తాయి. పారిశ్రామికవేత్తలు, ఉత్పత్తిదారులు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందుతూ అన్ని వస్తువుల ధరలను పెంచేస్తున్నారు. నల్లధనాన్ని నివారించాల్సిన అవసరం ఉన్నా, పెద్దనోట్ల రద్దు తర్వాత పేదవర్గాలే ఇబ్బందులు పడుతున్నారు. బడాబాబులు పాతనోట్లను మార్చుకొనడంలో గానీ, కొత్తనోట్లను పొందడంలో గానీ ఎలాంటి బాధలు పడడం లేదు. చిరు వ్యాపారులు కమీషన్ ఇచ్చుకుని చిల్లర నోట్లను పొందడం మన దౌర్భాగ్యానికి నిదర్శనం.
- జి.రామ్‌గోపాల్, అనపర్తి

సామాన్యులు విలవిల
నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా పెద్దనోట్లను రద్దు చేయడంతో నగదు కోసం సామాన్యులు నరకం చవిచూస్తున్నారు. బ్యాంకుల వద్ద, ఎటిఎంల వద్ద గంటల తరబడి పడిగాపులు పడుతున్నా కనీసం రెండువేల రూపాయలైనా దక్కుతుందన్న గ్యారంటీ లేదు. చలిలో అర్ధరాత్రి, తెల్లవారు జామున ఎటిఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. బ్యాంకుల వద్ద వృద్ధులు, మహిళలు, రోగుల పరిస్థితి వర్ణణాతీతం. నల్లకుబేరులు సుఖంగా నిద్రపోతుండగా, సామాన్యులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. జీతం డబ్బులు బ్యాంకులో ఉన్నా తగినంత నగదు లభించక పేద, మధ్యతరగతి వారు దిగాలుపడిపోతున్నారు. నగదు ఇచ్చేందుకు బ్యాంకులు సవాలక్ష షరతులు విధిస్తున్నాయి. నెలరోజులైనా జనం కష్టాలు పెరుగుతున్నాయే తప్ప తరగడం లేదు. నగదు పొందడంలో విధించిన షరతులను సడలిస్తే కొంత ఉపశమనం కలుగుతుంది.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

స్వైపింగ్ మిషన్లు ఏవీ?
ప్రజలంతా నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని ప్రభుత్వం చెబుతున్నా ఇందుకు తగిన ఏర్పాట్లు ఎక్కడా కనిపించడం లేదు. రైల్వే, ఆర్టీసీ కౌంటర్లు, చౌకడిపోలు, రైతుబజార్లు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలి. నగదు రహిత లావాదేవీలను కొన్ని శాఖల్లో మాత్రమే నూరుశాతం అమలు చేసే పరిస్థితి ఉంది. అన్ని రకాల పన్నుల చెల్లింపులకు వీటిని విధిగా వాడాలి. చిల్లర దుకాణాల్లో వీటిని వినియోగించడం సాధ్యం కాదు. కొత్త సంవత్సరం నుంచైనా చిల్లర కష్టాలను తొలగించని పక్షంలో ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదు.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు