వీక్లీ సీరియల్

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్!! -8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ అబ్బాయిలో ఈ అతీంద్రియ శక్తి ఎలా ప్రేరేపితమయ్యిందో ఖచ్చితంగా ఊహించలేకపోతున్నాను. ఇదో మిరాకిల్. దట్సాల్!’’ అంటూ తన అశక్తత తెలియబరిచాడాయన.
అది విని నిరుత్సాహపడ్డారిద్దరూ.
‘‘ఫైనల్‌గా మీ సజెషన్ ఏంటంటారు?’’ నిరుత్సాహంగా అడిగాడు వసంత్.
డాక్టర్ కూడా ఏదీ తేల్చి చెప్పకపోవడంతో నివేదితలో తిరిగి గుబులు చోటుచేసుకుంది.
అయోమయంగా, ఏదీ అర్థం కాకుండా ఉంది అఖిల్‌కి.
అందర్నీ మార్చి మార్చి చూస్తుండిపోయాడు.
డాక్టర్ నుండి సమాధానం లేకపోవడంతో నివేదిత అంది.
‘‘ఏమైనా మందులు...’’
‘‘అఖ్కర్లేదండి. ప్రస్తుతానికి మీ వాడికి ఏ జబ్బూ లేదు. అపాయం అంతకన్నా లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. ఎలాంటి ట్రీట్‌మెంట్లూ వద్దు. ప్రయోగాలు అనవసరం. ఫ్రీగా వదిలేయండి. కుర్రాడ్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. కాకపోతే మీ అబ్బాయి మైండ్ తరచూ డిస్ట్రబ్ అవకుండా చూసుకోండి. అనవసరంగా కలవరపాట్లుకి లోనవ్వకుండా జాగ్రత్తపడండి.
ఇలాంటి అద్భుత శక్తులు బాల్య దశలో ఓ మెరుపులా తళుక్కుమని మెరిసి మాయమవుతుంటాయి.
అతీంద్రియ శక్తులన్నీ కోల్పోయి ఒక దశలో మామూలుగా మారే ఆస్కారం కూడా ఉంది.
ఇంత చిన్న ప్రాయంలో అది చేశాడు. ఇది చేశాడు అని అప్పుడప్పుడూ మనం కొందరు పిల్లల గురించి పేపర్లో చదువుతుంటాం. అదే పిల్లవాడు పెద్దయ్యాక మరిన్ని అద్భుతాల్ని సృష్టించాలి కదా! అలాంటి న్యూస్ ఎప్పుడూ వినే్లదు మరి. అంటే నా ఉద్దేశం కంటిన్యూ అవ్వొచ్చు. కాకపోవచ్చు అని. సో నిశ్చింతగా ఉండండి.
జస్ట్ యు హావ్ టు ప్రొవైడ్ హిమ్ ఎ లాటాఫ్ రెస్ట్. దట్సాల్. ఇంత చేసీ ఈయన చెప్పిందేమీ లేదని మీ మనసుకి అనిపిస్తే మీ అబ్బాయిని ఎవరైనా సైకియాట్రిస్ట్‌కి చూపెట్టుకోండి. దట్స్ యువర్ ఓన్ ఒపీనియన్’’ అంటూ ముగించాడాయన. తన వైద్య వృత్తిలోని అనుభవాల్ని మధిస్తూ.
థాంక్స్ చెప్పి బయటపడ్డారిద్దరూ.
కానీ వాళ్లకి తెలియని విషయం మరొకటుంది. రహస్యంగా జత కళ్లు తమని గమనిస్తున్నాయని.
ఆ కళ్లలో మెరిసి మాయమైన ఆశ రూపుదిద్దుకోనున్న ఓ బృహత్తర ప్రణాళికకి సంకేత సూచికలా ఉంది.
తృప్తిగా తలాడిస్తూ అక్కడి నుండి నిష్క్రమించాడా వ్యక్తి.
ఆ మెసేజ్‌ని మరొక వ్యక్తికి పాస్ చేశాడు.
అలా ఓ నూతనాధ్యాయానికి శ్రీకారం చుట్టబడిందా క్షణంలోనే!
* * *
ఒక చారిత్రాత్మకమైన మలుపులా.
గోదావరి ఖనిలో జరిగిన హత్యని అఖిల్ బయటపెట్టిన కథనాన్ని ఎప్పుడైతే తను నియమించిన సీక్రెట్ ఏజెంట్ తనకి చేరవేశాడో.. అప్పుడే వేదవ్యాస్ ఊహ నిజమైంది.
తను గెస్ చేసినట్టుగానే అఖిల్‌లో అద్భుత శక్తి ఉండడం వేదని అబ్బురపరిచింది. త్వర త్వరగా ఆలోచింపజేసింది!
అఖిల్‌ని క్షణం క్షణం కనిపెట్టుకొని అతడి చర్యల్ని గమనించేలా చేసిన ఏర్పాటు వృధా కాలేదు.
అతననుకున్నదొక్కటే.
అఖిల్ గురించి ఎక్కువగా ప్రచారం కాకుండా జాగ్రత్తపడాలని!
అందుకు తగిన చర్యలు కూడా తీసుకున్నాడు.
వాస్తవానికి ఆ థాట్ వేదవ్యాస్‌కి రాకుండా ఉంటే మాత్రం అఖిల్ ఖచ్చితంగా మాస్ మీడియా దృష్టిలో పడి అత్యధిక ప్రచారాన్ని పొందేవాడు.
కానీ అత్యంత మేధావి, చురుకైనవాడు అని పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకున్న వేదవ్యాస్‌కి కూడా తెలియని విషయం ఒకటుంది.
తనలాగే మరో అదృశ్య వ్యక్తి అఖిల్‌లోని అతీంద్రియ శక్తిని పసిగట్టే ప్రయత్నంలో ఉన్నాడని.
అలా ఆ పసివాడి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.
* * *
దేవుడిపై నివేదితకి గల అచంచలమైన భక్తి అఖిల్‌లోని శక్తి దైవప్రేరణే అని నమ్మకం కలిగిస్తున్నా..
దుష్ట శక్తి ప్రభావం కాదు కదా అనే అనుమానం ఏ మూలో వ్యక్తమవుతోంది!
‘‘మమీ! నేన్రడీ.’’ అంటూ పరుగెత్తుకు వచ్చిన అఖిల్ తల్లిని అల్లుకుపోయాడు.
‘‘నువీ రోజు స్కూల్‌కి వెళ్లడం లేదు నిట్టూ!’’ వాడ్ని దగ్గరకు తీసుకొని బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్పింది నివేదిత.
‘‘ఎందుకు?’’ తన కళ్లని చక్రాల్లా తిప్పుతూ సందేహంగా అడిగాడు.
‘‘ఈ రోజు ఓ స్వామీజీ మనింటికి రాబోతున్నారు. ప్రణిత ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. ఆయన వచ్చాక పూజ చేస్తారు. పూజ అయ్యాక దేవుడికి దణ్నం పెట్టాలి. మరి నువ్వు స్కూల్‌కెళితే ఎలా? అందుకని ఈ రోజు స్కూల్ మానేయమంటున్నాను’’ చెప్పింది నివేదిత.
వాడి ముఖంలో ఎలాంటి ఫీలింగ్ లేకపోయేసరికి ‘‘సరేనా?’’ అంది.
‘‘ఓకే! మమీ’’ అంటూ ‘‘మమీ! బాబాలు స్వామీజీలు ఒక్కటేనా?’’ అనడిగాడు.
‘‘అందరూ దైవ భక్తులేరా నాన్నా’’ అంది.
‘‘మరే మహిమలు వాళ్లకి తెలుసా?’’
‘‘తెలుసు.’’
‘‘మరలాగయితే అప్పట్లో తన నిలయంలో హత్యలు జరిగితే సత్యసాయిబాబా నోరు విప్పలేదెందుకని?
హంతకుల పేర్లు చెప్పలేదెందుకని?’’ అంటూ ప్రశ్నించాడు.
అది విని అవాక్కయ్యిందామె. వాడి వంక విస్మయంగా చూసింది.
ఎలాంటి ప్రశ్న వేసా చూడూ? అన్నట్టుంది వాడి చూపు.
తల మీద సన్నగా ఒక్కటిస్తూ ‘‘తప్పురా నిట్టూ. కళ్లు పోతాయి. సత్యసాయిబాబాని అలా అనకూడదు. ఆయనకి అన్నీ తెలుసు. అయినా చెప్పలేదు. దేవుడాయన. దేవుడ్ని తప్పు పట్టొచ్చునా?’’ అంది మందలింపుగా.
బుద్ధిమంతుడిలా తలూపాడు.
‘‘మమీ! చంద్రస్వామీజీని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో పడవేశారెందుకని?’’ తిరిగి ప్రశ్నించాడు.
ఆ చిన్ని బుర్రలో ఎన్ని అనుమానాలో? ఎన్ని సందేహాలో? నుదురు చరుచుకుంది నివేదిత.
వాడి ప్రశ్నలకి బ్రేక్ వేయకపోతే బావుండదని ‘‘ఇవన్నీ నీకెవరు చెప్పార్రా?’’ కావాలనే కాస్త తీవ్ర స్వరంతో అడిగింది.
‘‘మా మేడమ్ చెప్పింది.’’
‘‘అదా అసలు విషయం.’’
వాడంత పెద్ద పెద్ద విషయాల్ని ప్రస్తావిస్తుంటే ఏమిటో అనుకుంది
అప్పుడర్థమయ్యిందామెకు.
‘‘నిట్టూ! అవన్నీ నీకెందుగ్గానీ నోరు మూసుకొని కాసేపు నిశ్శబ్దంగా ఓ చోట కుదురుగా కూర్చుంటావా?
పూజ పూర్తయ్యేటంతవరకు టిఫిన్ గట్రా తినకూడదు. అందుకే పాలు తాగు. మాల్టోవా కలిపి తెస్తాను’’ అంటూ వంటింట్లోకి వెళ్లింది.
చప్పున పెదాలు బిగించి సోఫాలో కూలబడ్డాడు.
కాసేపట్లోనే పాలతో వచ్చింది నివేదిత. డోర్ బెల్ శబ్దం వినిపించడంతో పాల కప్పుని అఖిల్‌కి అందించి వెళ్లి తలుపు తీసింది.
ఎదురుగా సుమారు అరవై ఏళ్లు పైబడిన వృద్ధుడొకాయన నిలబడి ఉన్నాడక్కడ.
* * *
పై ఆచ్ఛాదన లేకుండా, కింద పంచె కట్టుతో, భుజాన కాషాయపు రంగు బ్యాగ్ వేసుకొని హుందాగా ఉన్నాడు.
శరీరమంతా విభూతి రేఖలతో, మెడలో రుద్రాక్షమాలలతో పూజ్యభావం కలిగేలా ఉన్నాడు. శరీరం ముడతలు పడ్డా తెల్లని వర్చస్సుతో దివ్యత్వం ఉట్టిపడే మోము ఆయనది. జుత్తు వేద సాంప్రదాయానుసారం కొప్పులా ముడిచి ఉంది.
చూస్తూనే ఆయన్ని పోల్చుకోగలిగింది. సాదరంగా లోపలకి ఆహ్వానించింది.
ఆ ప్రశాంత మూర్తిని చూడగానే భక్త్భివం మదిలో మొదలవ్వడంతో వినయంగా పాదాలకి నమస్కరించింది.
‘‘అవిఘ్నమస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. శుభమస్తు’’ అంటూ మనసారా ఆశీర్వదిస్తూ సోఫాలో కూర్చున్నాడు.
‘‘తమరు రామాలయం పూజారిగారేనా స్వామీ?’’
‘‘అవునమ్మా! మనీ మనీ బ్యాంక్ మేనేజరుట. పేరు.. పేరేదో గుర్తుకురావడం లేదు’’ కళ్లు మూసుకొని గుర్తు చేసుకొనే ప్రయత్నం చేయబోయాడు.
‘‘పాండవీయం గారండీ’’ చెప్పింది తను.
‘‘ఆ.. అతనే వచ్చాడు. ఎవరో కుర్రాడికి పూజ చేసి తాయెత్తు కట్టాలని ఈ ఇంటి అడ్రస్ ఇచ్చి వెళ్లాడు.
ఇంతకీ ఎవరా కుర్రాడు?’’ అనడిగాడు.
పాలు తాగేసి, వచ్చిన కొత్త వ్యక్తిని ఆసక్తిగా గమనిస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు అఖిల్.
వాడిని చూపెడుతూ ‘‘ఇదిగోండి. వీడే మా అబ్బాయి. పేరు అఖిల్’’ అంది.
అఖిల్‌ని ఆపాదమస్తకం పరిశీలనగా చూశాడొకసారి.
‘‘ఇంతకీ విషయం ఏమిటి? మీ వాడికేం జరిగిందసలు. ఏదీ దాచకుండా నిజం చెప్పు’’. తల తిప్పి ఆ గదిని కలయచూస్తూ ప్రశ్నించాడు.
ఆయనలా అడగడమే తరువాయి జరిగిన విషయాలన్నింటిని ఏకరవు పెట్టిందామె.
ఆమె చెప్పింది జాగ్రత్తగా విన్న ఆ పూజారి సాలోచనగా తల పంకించాడు. ఓ అయిదూ.. పది నిముషాలు కళ్లు మూసుకొని స్థిరంగా ఉండిపోయాడలాగే.
నెమ్మదిగా తేరుకొని, అన్నాడిలా.
‘‘చూడమ్మాయ్! జబ్బు మానసికమూ కావచ్చు, శారీరకమూ కావచ్చు. వ్యాధి మానసికమైతే జీవిని చరింపచేస్తుంది. శారీరకమైతే క్షీణింప చేస్తుంది. ఒక దశలో హరింప చేస్తుంది. అది రోగతీవ్రతను బట్టి ఉంటుంది. కానీ ఈ కుర్రాడ్ని చూస్తుంటే నీవు చెప్పినదాని ఆధారంగా అలాంటివేమీ గోచరించడం లేదు. అనుమానమనేది భయోద్వేగాల సమాహారం. మనసులో అనుమాన బీజం పడిందంటే అది మొలకెత్తి చివరకి వటవృక్షమై మనిషిని విస్తరిస్తుంది. ఆ అనుమానమే ప్రస్తుతం నీ భీతావహ పరిస్థితికి కారణమన్పిస్తోంది’’ అంటూ ఆగాడొక్క క్షణం.
‘‘కానీ, స్వామీ..’’ అంటూ ఆమె ఏదో చెప్పబోయేంతలో తిరిగి తనే అన్నాడా పూజారి.
‘‘నేను చేసే పూజ మీ వాడి వ్యాధిని నయం చేస్తుంది... కట్టబోయే తాయెత్తు వాడిని మునుపటిలా మారుస్తుందని... నీవు నమ్మితే అలాగే కానీ! ఆ నమ్మకమే సకల శుభాలకూ నాంది.’’
‘‘ఇకపోతే హనుమంతునికి మంగళ, శనివారాలు ప్రీతికరమైనవి. ఈ రోజు శనివారం శుభదినం. కాబట్టి త్వరలో పూజ ప్రారంభిస్తాను’’ అంటూ పూజకి ఏయే సామాగ్రి అవసరమో చెప్పాడామెకు.
ఆమె తలూపుతూ లోపలికి వెళ్లింది.
ఆ హాల్లోనే తన ఏర్పాట్లు మొదలుపెట్టాడాయన.
* * *
‘‘ఏమిటలా గదిని తదేకంగా గమనిస్తున్నారు?’’ గదిలోకి అడుగుపెడుతూ ప్రశ్నించాడు షణ్ముగం.
ఆ పలకరింపుకి గది అలంకరణని పరిశీలిస్తున్న పాండవీయం కంగారుగా లేచి నిలబడ్డాడు.
‘‘నమస్కారమండీ!’’ విష్ చేశాడు కూర్చుంటూ.
‘‘నమస్కారం’’ అంటూ అతనికెదురుగా కూర్చున్నాడు షణ్ముగం.
‘‘నథింగ్ సర్! మీ కళాభిరుచికి దర్పణం పడుతున్న ఈ రూమ్ డెకరేషన్‌కి పులకరించిపోతున్నాను. సింప్లీ సూపర్బ్! రూమ్‌ని చాలా బాగా డెకొరేట్ చేయించారు. ఎన్నో బిజినెస్‌లకి చీఫ్‌గా ఉన్న మీరు అంత బిజీలో కాస్త సమయాన్నైనా ఈ గదికి కేటాయించడం అభినందనీయం.’’
షణ్ముగాన్ని మనస్ఫూర్తిగా అభినందించాడు పాండవీయం.
ఆ పొగడ్తకి చిన్నగా నవ్వాడు.
‘‘చేసేది చేయించేది అంతా నేనే! అనేది శ్రీకృష్ణ పరమాత్మ స్టేట్‌మెంట్.
బిజినెస్‌లో ఎంత బిజీ అయితేనేం? నాకూ మనసుంది. నా భావుకతకు తగినట్లు, కళాహృదయులను అలరించేటట్లు ఈ రూమ్‌కి మేకప్ చేయించాను. అది సరే మీ రాకకు కారణం...’’ అనడిగాడు.
‘‘ఐ యామ్ సారీ! మీరు నాకు కేటాయించిన ఈ కాస్త సమయాన్ని ఇతర విషయాలు మాట్లాడ్డం ద్వారా వేస్ట్ చేస్తున్నట్లున్నాను. వాస్తవానికి మిమ్మల్ని స్వయంగా కలవాలని అందుకు మీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నానండీ. కానీ వీలు చిక్కలేదు.’’
‘‘చేసేది చేయించేది అంతా నేనే! అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మనిద్దరం ఈ వేళ కలుసుకోవాలని ఉంది, కలిశాం. దట్సాల్!’’
‘‘నా పరిచయం...’’
‘‘ప్రత్యేకంగా అవసరం లేదు. మనీ మనీ కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్‌గా స్పెషల్‌గా బదిలీకాబడ్డ మిస్టర్ పాండవీయంగారే కదా!’’
షణ్ముగం తన వివరాల్ని అలా చెప్పుకుపోతుంటే ఆశ్చర్యచకితుడయ్యాడు పాండవీయం. అందుకే ఆయన బిజినెస్‌లో అంత షార్ప్ కాగలిగాడనుకున్నాడు.
‘‘నాతో టచ్ ఉన్న ప్రతి ఒక్కరి బయోడేటాని సేకరించి పెట్టుకోవడం నా బిజినెస్‌లో ఒక అంశం. పైగా తాను నివశిస్తున్న నగరం జరిగే ప్రతి మూవ్‌మెంట్‌ని అబ్జర్వ్ చేయటం మంచి బిజినెస్‌మేన్‌కి ఉండాల్సిన సహజ లక్షణం కూడాను. సో మీరేం కంగారుపడకండి’’ పాండవీయం మనోభావాల్ని పసిగట్టిన వాడిలా చెప్పకుపోయాడు షణ్ముగం.
ఒక బిజినెస్‌మేన్ ఆక్టివ్‌నెస్ ముందు గవర్నమెంట్ ఉద్యోగిగా తానెంత తేలికైపోతున్నాడో అర్థమవ్వసాగింది పాండవీయానికి.
అయినా తన ఫీలింగ్స్‌ని పైకి కనబడనీయకుండా.
‘‘వెరీ ఇంట్రెస్టింగ్. మీ గురించి చాలా విన్నాను మాస్ మీడియాల ద్వారా. మీ గురించి ఎన్నో తెలుసుకున్నాను వివిధ రకాల వ్యక్తుల నుండి. కానీ చూస్తేనే తెలుస్తోంది. అసలు మీరో వ్యక్తి కాదని. మహాశక్తని’’ అన్నాడు.
‘‘ఇందులో నా గొప్పేమీ లేదు. చేసేది చేయించేది అంతా నేనే! శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. పొగడ్తలంటే నాకు మహా ఎలర్జీ, ప్రొసీడ్’’ షణ్ముగం అన్నాడు కాస్త ఇబ్బందిగా ముఖం పెట్టి.
‘‘సారీ! ఇంతకీ నేను వచ్చిన పనేమిటంటే..’’
షణ్ముగం మధ్యలోనే అడ్డుపడ్డాడు.
‘‘మీ బ్యాంక్‌తో నేను అటాచ్‌మెంట్ ఏర్పర్చుకోవాలి. ఆ సంబంధం ఎకౌంట్ తెరవడం ద్వారానో లేదా అధిక మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారానో కావచ్చు. ఏమ్ ఐ కరెక్ట్’’ పాండవీయాన్ని అడిగాడు.
అదిరిపడ్డాడు పాండవీయం.
జీవితంలో తొలిసారిగా షాక్‌కి గురయ్యాడతను. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టడమంటే ఏంటో తెలిసొచ్చింది.
‘‘అవునండి. గతంలో జరిగిన దోపిడీతో మనీ మనీ బ్యాంక్ పై ప్రజల్లో చులకన భావం ఏర్పడింది. బిజినెస్ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. నేను చార్జ్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మార్పు లేదు. ఒక ఉద్యోగిగా విచారించవలసిన విషయం. అయినా ప్రయత్నిస్తున్నాను.’’
‘‘ఎందుకిలా జరుగుతోంది.’’
(ఇంకా వుంది)

-ఎనుగంటి వేణుగోపాల్ 9440236055