జాతీయ వార్తలు

సెగ తగలని కమలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: యూపీఏ తరువాత అంతే బలమైన జాతీయ కూటమికి సారథ్యం వహిస్తున్న పార్టీగా బీజేపీ ఈ నాలుగేళ్లలో మరింత శక్తిని సంతరించుకుంది. 2014 ఎన్నికలకు ముందు ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, శివసేన, కాశ్మీర్‌లో పీడీపీ సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగి దీనికి మరింత శక్తిని అందించాయి. ఈ నాలుగేళ్లలో జాతీయ రాజకీయాల్లో అనూహ్య మార్పు వచ్చింది. ఒక రాష్ట్రం తరువాత ఒక రాష్ట్రంగా బీజేపీ అధికారాన్ని సంతరించుకుని అనూహ్యరీతిలో దేశమంతా వేళ్లూనుకుంది. అదే స్థాయిలో ఒకదాని తరువాత ఒకటిగా రాష్ట్రాలను కోల్పోతూ కాంగ్రెస్ పార్టీ తన ఉనికికే సవాల్‌వంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాజాగా సీన్ రివర్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, మహారాష్టల్రో శివసేన, పీడీపీవంటి పార్టీలు బీజేపీపై తిరగబడే పరిస్థితి తలెత్తింది. అలాగే పంజాబ్‌లో అకాలీలు కూడా బీజేపీ ధోరణిపట్ల తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నాలుగేళ్లలో బలమైన మిత్రపక్షాలు ఇంత తీవ్రస్థాయిలో ఎదురుతిరిగిన దాఖలాలు లేవు. బాహాటంగానే ఈ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ఈ పాటికే బీజేపీలో కలవరపాటు కలిగి ఉండాలి. కానీ, అలాంటి సంకేతాలు ఏమీ కనిపించటం లేదు. ఇందుకు బలమైన కారణాలే ఉన్నాయని బీజేపీ సీనియర్ నేతలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రావడం, రాజకీయంగా తిరుగులేని శక్తిని సంతరించుకోవడం అత్యంత విశ్వాసపాత్రంగావుండే మిత్రపక్షాల్లోనే ఒకరకమైన నిరుత్సాహానికి కారణమైందని, అందుకే ఈ రకమైన తిరుగుబాటు సంకేతాలు అందిస్తున్నాయన్నది బీజేపీ సీనియర్ నేతల అంచనా. ముఖ్యంగా మహారాష్టల్రో శివసేనతో పొత్తు ఉన్నప్పటికీ ఆ ప్రాంతీయ పార్టీని అధిగమించి మరీ బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే అడపాదడపా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, బలమైన మిత్రపక్షాలు ఎన్డీయేను వదిలిపెట్టే అవకాశం లేదన్న ధీమా కూడా బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా విషయంలో నిరసన వ్యక్తం చేస్తూ, ఇద్దరు కేంద్ర మంత్రులను వెనక్కి తీసుకుందే తప్ప ఎన్డీయేతో తెగతెంపులు చేసుకోలేదని గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం తాత్కాలికంగా వేరుపడటమే తప్ప, శాశ్వతంగా విడాకులు తీసుకోవడం కాదని కొందరు నేతలు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ పరిణామాలను అంత తేలికగా కొట్టిపారేయడం బీజేపీకి ఎంతమాత్రం మంచిది కాదన్న అభిప్రాయాన్ని జెఎన్‌యూకి చెందిన రాజకీయ అధ్యయనాల విశే్లషకుడు మణిందర్‌నాథ్ ఠాకూర్ అంటున్నారు. మిత్రపక్షాల్లో అసంతృప్తి అన్నది ఇప్పుడంత తీవ్రంగా కనిపించకపోవచ్చుగానీ, దీన్ని విస్మరిస్తే పరిస్థితులు మరింత ముదిరిపోయే ప్రమాదం ఉంటుందన్నది రాజకీయ వాస్తవమన్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికలను ఇంతే ధీమాగా ఎదుర్కోవాలంటే మిత్రపక్షాల్లో తలెత్తిన అసంతృప్తిని చల్లార్చి, వాటిని మరింత అక్కున చేర్చుకోవడం బీజేపీకి ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుతమున్న సంఖ్యలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు రావన్నది వాస్తవమని, దీనికి ప్రత్యేక విశే్లషణలు అవసరమే లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి అత్యంత బలాన్నిచ్చే ఏకైక అంశం ఆయా రాష్ట్రాల్లో దాని మిత్రపక్షాలు చాలా బలంగా ఉండటమేనని, వచ్చే ఎన్నికల్లో కూడా వాటి ఆసరా బీజేపీకి ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు. మొదటినుంచీ బీజేపీతో అత్యంత సన్నిహితంగావున్న శివసేన ఇటీవలి కాలంలో బాహాటంగానే విమర్శలు మొదలుపెట్టింది. అంతేకాదు లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోరటం చేస్తామని కూడా వెల్లడించింది. తాజాగా టీడీపీ కూడా కేంద్ర ధోరణిని నిరసించిన నేపథ్యంలో రానున్న కొద్దిరోజుల్లోనే బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీయే మిత్రపక్షాలు బాహాటంగానే విమర్శలు గుప్పించే అవకాశాలు లేకపోలేదని, పరిస్థితి విషమిస్తే ఎన్డీయే నుంచి కూడా తప్పుకునే అవకాశాలు స్పష్టమని పేర్కొన్నారు. మిత్రపక్షాల విషయంలో సంకీర్ణ ధర్మంతో వ్యవహరించాలే తప్ప, వాటిపట్ల పెడధోరణిని కనబర్చడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వాజపేయి సారథ్యంలోని ఎన్డీయే అనుసరించిన విధానం వేరు. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాల పట్ల అనుసరిస్తోన్న వైఖరి వేరని అభిజ్ఞవర్గాలు చెబుతున్నాయి. వాజపేయి హయాంలో ఉన్నట్టుగా ఇప్పుడు ఎన్డీయే మిత్రపక్షాలకు స్వేచ్ఛలేదని, అందుకు కారణం అప్పట్లో ఎన్డీయే సర్కారు మనుగడకు మిత్రుల అండదండలు అవసరమయ్యాయని, కానీ ఇప్పుడు మోదీకి ఆ అవసరం లేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. వాజపేయి హయాంలో ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు చక్రం తిప్పారని, కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా ఓ భాగస్వామ్యపక్షానికే పరిమితమయ్యారని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. అంతేకాదు మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం, అమిత్ షా సారథ్యంలోని బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ మిత్రులను బుజ్జగించేందుకు రాజీపడేది లేదన్న సంకేతాలు ఆయన అందించారు. తొలి ఎన్డీయే సర్కారులో మిత్రులకు ఎంతో వెసులుబాటు ఉండేదని, కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో అవి మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడిందని, వాటి పోకడలపై నియంత్రణ కొనసాగుతోందని తెలిపారు.
అంతేకాదు దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో అధికారం సంపాదించుకుంటూ, ఓటర్లను ఆకర్షించుకుంటూ అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రాల్లోనూ బలంగా దూసుకెళ్లేంతకాలం మిత్రపక్షాల నుంచి వచ్చే ఇబ్బంది కూడా ఏమీ ఉండదని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఎన్డీయే ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలిగిందే తప్ప, ఆ కూటమి నుంచి కాదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే, మిత్రపక్షాలను ఇదే రీతిలో ఇబ్బందిపెట్టే విధంగా బీజేపీ వ్యవహరిస్తే దాని ప్రభావం కచ్చితంగా 2019 ఎన్నికలపై ఉంటుందని, ఒకవేళ బీజేపీకి అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోతే ఈ మిత్రపక్షాలు షరతులతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014 స్థాయిలో లోక్‌సభ ఎన్నికల్లో సీట్లను గెలుచుకోవాలంటే బీహార్‌వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఓట్ల తుపానునే సృష్టించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.