ఖమ్మం

ఎమ్మెల్సీ బరిలో వైసిపి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తటస్థంగా న్యూడెమోక్రసీ..?
ఖమ్మం, డిసెంబర్ 4: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో వైసిపి కూడా పోటీలో ఉండేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు పేరును ఖరారు చేయగా, అధికార టిఆర్‌ఎస్ పార్టీ రెండు రోజుల్లో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సుమారు 90 ఓట్లను కలిగి ఉండగా వాటిని దక్కించుకునేందుకు వామపక్ష పార్టీల నేతలు, కాంగ్రెస్ నేతలు పలు దఫాలు చర్చలు కూడా జరిపారు. అయితే అధికార పార్టీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలు ఏకమవుతున్న క్రమంలో వైసిపి కూడా వామపక్షాల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ప్రచారం జరిగింది. కాని ఆ పార్టీ అధిష్టానం ఎవరికి మద్దతు ఇవ్వకుండా తమ పార్టీ అభ్యర్థినే రంగంలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. గడిచిన ఎన్నికల్లో సత్తుపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన డాక్టర్ మట్టా దయానంద్‌ను ఎమ్మెల్సీ బరిలో నిలిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రేసులో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి కూడా ఉన్నప్పటికీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దయానంద్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఇతరులకు మద్దతు ఇవ్వడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లాలో మరో బలమైన పార్టీగా ఉన్న సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ గతంలో మాదిరిగానే తటస్థంగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సుమారు 50 ఓట్లు కలిగిన సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ వామపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇస్తారని ప్రచారం జరిగినా ఆ పార్టీ నాయకత్వం తటస్థత వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీల నిర్ణయంతో అధికార టిఆర్‌ఎస్‌లోనూ, వామపక్ష పార్టీలోనూ కొంత నిరాశ వ్యక్తమవుతోంది. ప్రధానంగా వామపక్షాలు వైసిపి, న్యూడెమోక్రసీల మద్దతును ఆశ్రయించాయి. మరో వైపు అధికార టిఆర్‌ఎస్ మాత్రం ఈ రెండు పార్టీల ఓట్లు తమకు రాని పక్షంలో ఎవరికీ రాకుండా ఉంటే బాగుంటుందంటూ ఆశించాయి. ఒకానొక సమయంలో టిఆర్‌ఎస్ న్యూడెమోక్రసీతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారం కూడా జరిగినా అది వాస్తవం కాదని ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

పకడ్బందీగా ముక్కోటి ఏర్పాట్లు
భద్రాచలం, డిసెంబర్ 4: భక్తులు సంతృప్తి చెందేలా ముక్కోటి ఉత్సవ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ముక్కోటి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించాలని, పట్టణంలోని ముఖద్వారాల వద్ద ఉత్సవాలకు సంబంధించిన అర్చ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రాచలం రామాలయం వద్ద ఉన్న చిత్రకూట మండపంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. దేవాలయం నుంచి స్వామిని తెప్పోత్సవానికి తీసుకొచ్చే మార్గంలో భక్తుల తొక్కిసలాట జరగకుండా రెండు వరుసలలో బారీకేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రమాదాన్ని తెలిపే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు, ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులు క్రమపద్ధతి పాటించే విదంగా చూడాలని, ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలను విక్రయించాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. విఐపీ, వివిఐపీ పాసులతో పాటు విధులు నిర్వహించే సిబ్బందికి పాసులు జారీ చేయాలని, ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రోటోకాల్ వ్యవహారాన్ని రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా పర్యవేక్షించాలన్నారు. పండుగ రోజుల్లో భక్తులకు ఆహార పదార్థాలను నామమాత్రపు ధరలకు విక్రయించే విధంగా హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించాలని, అలాగే ఆహార పదర్థాల్లో నాణ్యత ఉండేలా తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నదిలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు నాటు పడవలను సిద్ధంగా ఉంచుకోవాలని ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించుకోవాలని చెప్పారు. బాణాసంచా కాల్చే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వామి తెప్పోత్సవం నిర్వహించే హంస వాహనంపై పరిమితికి మించి అధికారులను అనుమతించవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వామి తెప్పోత్సవం అనంతరం రాజవీధిలో ఊరేగింపు సందర్భంగా ఇబ్బందులు వస్తున్నాయని ప్రధాన అర్చకులు వివరించగా ఆ మార్గంలో వాహనాలను అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశించారు. రాజవీధిని అందంగా విద్యుద్దీపాలతో ముస్తాబు చేయాలన్నారు. భద్రాచలం పట్టణంలో పరిశుభ్రత చర్యలు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. భద్రాచలం పట్టణాన్ని 12 సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గోదావరి పరిసరాల్లో ఉన్న వ్యర్థాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని రహదారులను మరమ్మతులు చేయించాలని, ఖమ్మం నుంచి భద్రాచలం వరకు ప్రధాన రహదారి మరమ్మతులు చేయించాలని ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. భక్తులు అస్వస్థతకు గురైతే ప్రథమ చికిత్సలు నిర్వహించేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని, మొబైల్ టీమ్‌లను, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలన్నారు. రాజమండ్రి నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య సిబ్బందిని తెప్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రజలకు రక్షిత నీటిని మాత్రమే సరఫరా చేయాలని, నీటి ఫ్యాకెట్లు పంపిణీ చేయవద్దని ఆదేశించారు. భక్తుల కోసం స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుద్దీపాలతో అలంకరించాలని డీఎంకు సూచించారు. జిల్లాలోని దర్శనీయ స్థలాల సమగ్ర సమాచారంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ ప్రదేశాల్లో ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. ఉత్సవాల రెండురోజులు భద్రాచలం, పర్ణశాలల్లో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఆబ్కారీ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మాంసాహార విక్రయాలు కూడా నిలిపివేయాలని, ఆటో ఛార్జీలు అధికంగా వసూలు చేయకుండా చూడాలని ఆర్డీవోకు సూచించారు.
పర్ణశాలలో ఏర్పాట్లు చేయాలి
పర్ణశాలలో కూడా ముక్కోటి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నది ఒడ్డున బారీకేడింగ్, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పర్ణశాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం ముక్కోటి గోడపత్రికలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పీవో కాళీచరణ్, ఈవో జ్యోతి, అదనపు ఎస్పీ సాయికృష్ణ, భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్, కొత్తగూడెం డీయస్పీ సురేందర్‌రావు, ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు, సీతారామాచార్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

వామపక్షాల అభ్యర్థిని గెలిపించండి
* లెఫ్ట్ పార్టీల అభ్యర్థిగా పువ్వాడ ఖరారు
* విలేఖరుల సమావేశంలో కూనంనేని, పోతినేని
ఖమ్మం, డిసెంబర్ 4: జిల్లాపై సమగ్ర అవగాహన కలిగి, విద్యార్థి దశ నుండే జిల్లా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించిన అనుభవం ఉన్న వామపక్షాల అభ్యర్థిని స్థానిక సంస్థల శాసనమండలికి జిల్లా నుండి పంపించాలని సిపిఐ రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్‌లో జరిగిన లెఫ్ట్ పార్టీల విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అధికార పార్టీ ఆగడాలను అరికట్టేందుకు లెఫ్ట్ పార్టీల అభ్యర్థిగా జిల్లా రాజకీయ యోధుడు, అనేక ఉద్యమాల సారధి పువ్వాడ నాగేశ్వరరావును బరిలోకి దించుతున్నట్లు ఆయన ప్రకటించారు. పువ్వాడను గెలిపించుకోవడం జిల్లా సమస్యల సాధకుడ్ని ఎన్నుకున్నట్లేనన్నారు. విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అనేక ఉద్యమాలను విజయవంతంగా నిర్వహించిన ఘనత ఆయనకు ఉందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పువ్వాడ సరైన వ్యక్తి అన్నారు. ఆయన గెలుపుకు సిపిఎం ప్రజా ప్రతినిధులందరూ కంకణబద్దులై ఉన్నారని తెలిపారు. జిల్లాలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో పాటు సెక్యులర్ పార్టీల మద్దతును కూడా అభ్యర్థించామన్నారు. వారి నుండి సానుకూలమైన స్పందన వచ్చిందన్నారు. త్వరలో ఆయా పార్టీల నుండి ప్రకటనలు కూడా వెలువడనున్నాయన్నారు. అలాగే జిల్లాలోని 722 మంది ప్రజా ప్రతినిధుల మద్దతు కూడా అభ్యర్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
నేడు పువ్వాడ నామినేషన్
ఈ నెల 27న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు శనివారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డిలు హజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఏజే రమేష్, నున్నా నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు పోటు ప్రసాద్, జితేందర్‌రెడ్డి, జానీమియాలు పాల్గొన్నారు.

టిడిపి, కాంగ్రెస్ పార్టీల తీరు అనైతికం
* టిఆర్‌ఎస్ జిల్లా నేత నల్లమల విమర్శ
ఖమ్మం, డిసెంబర్ 4: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలకు మద్దతు పలుకుతూ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు తమ అనైతికతను ప్రదర్శిస్తున్నాయని టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు నల్లమల వెంకటేశ్వర్లు విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కొనలేక టిడిపి, కాంగ్రెస్‌లు వామపక్ష పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టిడిపి నేడు ఎలా కలిసి పని చేస్తుందని విమర్శించారు. బషీర్‌బాగ్, ముదిగొండ కాల్పులకు కారణమై అమాయకులను పొట్టనపెట్టుకున్న పార్టీల మద్దతును తీసుకోవడంలో వామపక్షాల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను, నేతలను చేర్చుకుంటున్న టిడిపికి ఇక్కడ టిఆర్‌ఎస్‌లో చేరుతున్న నేతల గురించి ప్రశ్నించే అర్హత లేదన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నంత కాలమే తెలంగాణలో టిడిపి ఉంటుందని, బాబు పాలన ఏపిలోకి పూర్తి స్థాయిలో వెళ్ళిపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు బోడెపూడి రమేష్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి పాల్గొన్నారు.

దేశభక్తుల ఆశయ సాధనకు కృషి చేయాలి
సత్తుపల్లి, డిసెంబర్ 4 : ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన నిజమైన దేశభక్తుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) 20వ మహాసభల సందర్భగం జరిగిన బహిరంగ సభలో విద్యార్థిలోకానికి వక్తలు పిలుపునిచ్చారు. పీడీఎస్‌యు జిల్లా అధ్యక్షులు శరత్ అధ్యక్షతన సత్తుపల్లిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో పిడిఎస్‌యు రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఇప్టూ రాష్ట్ర నాయకులు ఎస్‌ఎల్ పద్మ, సీపీఐ న్యూడెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోటు రంగారావులు మాట్లాడుతూ విద్యారంగం పట్ల పాలకులు అనుసరిస్తున్న తీరును దుయ్యబట్టారు. తెలంగాణ సాధనోద్యమ సమయంలో ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదని, కెజి నుండి పీజీ వరకు ఉచిత విద్య పేరుతో విద్యాప్రైవేటీకరణకు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సాంఘిక సం క్షేమ వసతి గృహాలనుమెరుగు పరిచేందుకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి విద్యాప్రణాళికను ప్రకటించలేదని, రూ.1800 కోట్లు ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలుండగా కేవలం రూ. 400 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. గత పాలకులపై విమర్శలతోనే కేసిఆర్ కాలం వెళ్ళబుచ్చుతున్నారని విమర్శించారు.
అలరించిన కళారూపాలు :ఈ బహిరంగ సభలో పాల్వంచ డివిజన్ అరుణోదయ సాంస్కృతిక కళాకారులు నిమ్మల రాంబాబు నేతృత్వంలో కళాబృందాలు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి.
భారీ ప్రదర్శన: ముందుగా స్థానిక జెవిఆర్ కళాశాల నుంచి బస్టాండ్ సెంటర్, కల్పతరు రోడ్ మీదుగా పాతసెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్‌యు జెండాలను చేతపట్టుకొని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో పీడీఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెయస్ ప్రదీప్, జిల్లా ప్రధానకార్యదర్శి పృద్వీ,, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు కూకలకుంట రవి, గోగకినేపల్లి వెంకటేశ్వరరావు, ఆవుల అశోక్, కె.సంధ్య, సీతారామరాజు, విప్లవకుమార్ పాల్గొన్నారు.

ఇద్దరు మావోల లొంగుబాటు
ఇల్లెందు, డిసెంబర్ 4: అజ్ఞాత నక్సల్స్ దళాల్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న భార్యాభర్తలు జిల్లా ఎస్పీ షాన్‌వాజ్‌ఖాశీం ఎదుట లొంగిపోయారని డిఎస్పీ ఆర్ వీరేశ్వరరావు తెలిపారు. శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ గుండాల మండలం పగిడేరు గ్రామానికి చెందిన గారె రవి, రాజేశ్వరి, న్యూడెమోక్రసీ పార్టీ అనుబంధంగా ఉన్న చంద్రన్నవర్గాలు అజ్ఞాతంగా కార్యకలాపాలు కొనసాగించారన్నారు. గుండాల, పినపాక, తాడ్వాయి తదితర అటవీప్రాంతాల్లో దళాలు నిర్వహించిన కార్యకలాపాలలో పాల్గొన్నారన్నారు. లొంగిపోయిన నక్సలైట్లకు ప్రభుత్వపరంగా సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో లొంగిపోయిన దంపతులు మాట్లాడుతూ పలు కారణాల వలన తాము లొంగిపొయామన్నారు. సమావేశంలో సిఐ ఎ నరేందర్, ఎస్‌ఐలు అశోక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం
* అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో కళాప్రదర్శన
జూలూరుపాడు, డిసెంబర్ 4: సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని నిర్మూలించి, అవినీతి రహిత సమాజం కోసం ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా పనిచేయాలని అవినీతి నిరోధకశాఖ ఖమ్మం సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌లు వెంకటేశ్వరరావు, పద్మలు ప్రజలను కోరారు. మండల కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య కళా ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు లంచం ఇచ్చి పనులు చేయించుకోరాదన్నారు. లంచం తీసుకోవటంతో పాటు ఇవ్వటం కూడా ప్రధాన నేరమేననే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. అవినీతికి పాల్పడే ఉద్యోగులపై చర్యలుంటాయని, అవినీతితో పాటు లంచం అడిగిన వారి సమాచారాన్ని సమాచారం తెలియజేస్తే అట్టి వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచటమే కాకుండా శాఖ పరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని వారు తెలిపారు. అవినీతి నిర్మూలనపై కళాకారులు ప్రదర్శించిన వివిధ కళా రూపాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో స్థానిక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ నాయుడు మల్లయ్య స్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.