కర్నూల్

కరవు నిధులు వచ్చేదెన్నడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 19:కరవు బారిన పడిన అన్నదాతలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్న ఆరోపణలు అధికమవుతున్నాయి. కరవు పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులతో నివేదికలు తెప్పించుకున్నా నష్టపరిహారం అందడంలో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంటోంది. దీంతో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన సాయం సకాలంలో అందక మరిన్ని కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. జిల్లాలో కరవు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు 2013 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ. 120 కోట్ల మేర నిధులు మంజూరైనా రైతులకు అందింది కేవలం రూ. 40 నుంచి రూ. 45కోట్లు మాత్రమేనని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఆ ఏడాది రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య కొరవడిన సమన్వయం కారణంగా ఆన్‌లైన్ వ్యవస్థలో లోపాలు తలెత్తాయి. దాంతో కరవు బారిన పడిన రైతులకు చెందాల్సిన పరిహారం బ్యాంకు ఖాతాలకు చేరలేదని తెలుస్తోంది. దీంతో సకాలంలో రైతులకు పంపిణీ చేయలేక సుమారు రూ. 80 కోట్ల మేర నిధులు వెనక్కి మళ్లినట్లు సమాచారం. ఇక 2014లో ఆలూరు, ఆస్పరి, చిప్పగిరి, దేవనకొండ, పత్తికొండ మండలాలకు కరవు సహాయంగా అందాల్సిన రూ. 70.24 కోట్ల నిధులు ఇంత వరకూ మంజూరు కాలేదు. ఆయా మండలాల్లో కరవు రక్కసి బారిన పడి అప్పులపాలైన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నిధులు వచ్చి రైతులకు చెల్లిస్తే ఒకింత ఊరట లభిస్తుందని అయితే ఏడాది గడిచినా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. ఈ లెక్కలు ఇలా ఉండగా గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా కరవు ఏర్పడిందని ప్రభుత్వం ప్రకటించినా ప్రస్తుతం 40 మండలాలకు సంబంధించి రూ. 310 కోట్ల నష్టం జరిగిందని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపారు. ఈ నిధులను చెల్లించడం కోసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తాజాగా నూతన విధానాన్ని సిద్ధం చేశారు. ఆన్‌లైన్ మానిటరింగ్ సిస్టం (ఓఎల్‌ఎంఎస్) ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా చెల్లించే ఏర్పాట్లు చేశారు. కరవు బారిన పడిన రైతు పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్, ఆధార్ నెంబర్, పట్టాదారు పాసు పుస్తకం నెంబరు, సర్వే నెంబర్ తదితర వివరాలు అందులో పొందుపరిచారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే నేరుగా ఆయా ఖాతాలకు వారికి చెల్లించాల్సిన మొత్తం చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 2015 ఖరీఫ్ సీజన్‌లో 2,55,960.71 హెక్టార్లలో పంట నష్టం సంభవించగా 3,48,118 మంది రైతులు నష్టపోయినట్లు అధికారులు సర్వేలో తేల్చారు. వీరికి మొత్తం రూ. 310 కోట్ల నిధులు చెల్లించాల్సి ఉంది. ఇక రెండో విడత గుర్తించిన 5 మండలాలు, మూడవ విడత గుర్తించిన 8 మండలాలకు సంబంధించిన సర్వే ప్రస్తుతం కొనసాగుతోంది. కాగా గత ఏడాది కంటే నష్టపరిహార మొత్తాన్ని పెంచారని వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. అరటి తోటలకు అధికంగా హెక్టార్‌కు రూ. 25 వేలు, మామిడి, చీనీ, జామ వంటి పండ్ల తోటలకు రూ. 20వేలు, వరి, వేరుశెనగ, పత్తి, ఉల్లి, మిరప, చెరుకు పంటలకు రూ. 15వేలు, మొక్కజొన్న పంటకు రూ. 12,500, పెసర, కంది, మినుము వంటి పప్పు్ధన్యం పంటలకు ఎకరాకు రూ. 10వేలు, కొర్ర పంటకు రూ. 5 వేల చొప్పున నష్టపరిహారం అందనుంది. ఈ మొత్తం గత ఏడాది కంటే 30 నుంచి 50శాతం ఎక్కువని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని కరవు పరిహారం ఎప్పుడు అందుతుందోనన్న అనుమానం రైతుల్లో వ్యక్తమవుతోంది. గతంలో 2013, 2014 సంవత్సరాల్లో చెల్లించాల్సిన పరిహారం ఇంత వరకూ రైతులకు చేరలేదని తాజా పరిహారం ఇంకెంత కాలం తరువాత అందుతుందోనని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతులకు చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని వీలైనంత త్వరితగతిన చెల్లించాలని కోరుతున్నారు.
నంద్యాలలో భారీగా పెరిగిన
ఇంటి అద్దెలు..
* ఇబ్బందుల్లో పేద, మధ్య తరగతి ప్రజలు
నంద్యాల, జనవరి 19:దిన దినాభివృద్ధి చెందుతున్న నంద్యాల పట్టణంలో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి. పేద, మధ్యతరగతి ప్రజలు అద్దె ఇంటి కోసం పట్టణంలో ప్రదక్షణలు చేసినా దొరకని పరిస్థితి నెలకొంది. విద్యారంగంలో దూసుకుపోతున్న నంద్యాల పట్టణంలో ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో నంద్యాలకు వచ్చి వివిధ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులు, బ్యాంకు కోచింగ్, ఆర్మీ కోచింగ్, పోలీసు కోచింగ్ తదితర శిక్షణా సంస్థల్లో నిరుద్యోగులు ఉద్యోగానే్వషణ కోసం రాష్ట్రంలోని నలుమూలల నుండి బ్యాంకు కోచింగ్ కోసం నంద్యాలకు వస్తున్న విషయం విధితమే. బ్యాంకు కోచింగ్ కేంద్రం ఉన్న ఎన్‌జీవో కాలనీలో సింగల్ రూము కావాలన్నా రూ.2 వేలకు పైగానే అద్దె చెల్లించాల్సి వస్తుంది. నంద్యాల పట్టణ పరిసర ప్రాంతాల్లో అగ్రికల్చర్, మెడికల్, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటిఐ, ఎంబిఎ, బిఇడి, డిఎడ్ కళాశాలలతో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ కళాశాలల్లో చదువుకొనేందుకు వచ్చే విద్యార్థులు పట్టణంలోని వివిద ప్రైవేటు హాస్టళ్లలో ఉండడంతోపాటు కొందరు విద్యార్థులు కలసి చిన్న రూములను అద్దెకు తీసుకుంటూ కాలం గడుపుతున్నారు. దీంతోపాటు ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయంలో తీవ్ర నష్టం రావడం, రబీ పంటలు లేక పోవడంతో సన్నకారు రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు కూడా పట్టణ ప్రాంతానికి ఉపాధి కోసం వలసలు వస్తున్నారు. పట్టణ ప్రాంతంలో కూలీ పనులు చేసుకొనేందుకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పొట్ట పోసుకొనేందుకు వస్తుండడంతో వీరికి వసతి దొరకడం గగనమైపోయింది. పట్టణంలో అపార్టుమెంట్లలో డబుల్ బెడ్‌రూము అద్దెలు నెలకు రూ.8 నుంచి రూ.10 వేలు, అలాగే రెండు మూడు రూములు ఉన్న ఇంటికి కూడా రూ.5 నుంచి 6 వేల రూపాయలు ఇంటి అద్దెలు చెల్లించాల్సి వస్తుంది. అద్దె ఇల్లు కావాలంటే మూడు నెలల అద్దె ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో బయటి ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చే వారు ఇల్లు దొరకక పట్టణంలోని ఖాళీ ప్రదేశాల్లో పాకలు వేసుకొని కాలం గడుపుతున్నారు. పాతిక సంవత్సరాల క్రితం 60 వేల జనాభా ఉన్న నంద్యాల పట్టణం నేడు మూడు లక్షల జనాభాకు చేరింది. నంద్యాల పట్టణంలో భారీ పరిశ్రమలతో పాటు వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి సాధించడంతో నంద్యాల డివిజన్‌లోని గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం భారీ సంఖ్యలో పట్టణానికి తరలివస్తున్నారు. విద్యార్థులను, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని ఇంటి యజమానులు భారీగా అద్దెలు పెంచి పేద, మద్యతరగతి ప్రజలకు ఇల్లు దొరకని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద గత రెండు మూడు సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో పలు రకాల శిక్షణా సంస్థలు ఏర్పాటు కావడంతో ఉద్యోగార్థులు వివిధప్రాంతాల నుండి శిక్షణ కోసం నంద్యాలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా నంద్యాలలో ఉన్న బ్యాంకు కోచింగ్ సెంటరు రాష్ట్రంలోనే బ్యాంకు ఉద్యోగాల సాధనలో మంచి ఫలితాలు సాధిస్తుండడంతో వేల సంఖ్యలో నిరుద్యోగులు బ్యాంకు ఉద్యోగాల శిక్షణ కోసం ఇతర రాష్ట్రాల నుండి కూడా వస్తుండడం విశేషం. ఒక్క బ్యాంకు కోచింగ్ కేంద్రంలోనే సుమారు 16 వేల మంది శిక్షణ పొందుతుండడం గమనార్హం. మొత్తం మీద నంద్యాల పట్టణంలో అటు విద్యార్థులు, ఇటు నిరుద్యోగులు, పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఇంటి అద్దెలు తలకు మించిన భారంగా మారాయని పేద, మధ్య తరగతి ప్రజలు వాపోతున్నారు. ఇంటి అద్దెల నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో గృహ యజమానులు ఇష్టానుసారంగా ఇంటి అద్దెలు పెంచి వేస్తున్నారని వాపోతున్నారు.
పత్తికొండ ప్రాంతాన్ని
సస్యశ్యామలం చేస్తాం
* డిప్యూటీ సిఎం కెఇ
పత్తికొండ, జనవరి 19:ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా పత్తికొండ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. పత్తికొండలోని తన ఇంటి లో మంగళవారం కెఇ నియోజకవర్గ స్థాయి అధికారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంత రం కెఇ విలేఖరుల సమావేశంలో మా ట్లాడుతూ రూ. 395 కోట్లతో నియోజకర్గం నుండి అన్ని చెరువులకు నీటిని తరలిస్తామని చెప్పారు. రూ. 1.2 కోట్ల వ్యయంతో పందికోన రిజర్వాయర్ నుండి పత్తికొండకు పైపులైన్ ద్వారా నీటిని తరలించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి తాగునీరు, సాగునీరు అందించడం ద్వారా సస్యశ్యామలం చేస్తామన్నారు. సంజీవిని పథ కం ద్వారా పంట కుంటలు నిర్మాణం చేసి భూగర్భజలాలను అభివృద్ధి చేస్తామని దీని ద్వారా కరవు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలు తయా రు చేయాల్సిందిగా అధికారులు ఆదేశించామని చెప్పారు. సమీక్ష సమావేశంలో జడ్పీ సిఇఓ ఈశ్వర్, జిల్లా పం చాయతీ అధికారిని శోభాస్వరూపరాణి, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్ ఇంజంనీర్లతోపాటు అన్ని మండలాల ఎంపిడిఓ, తహశీల్దార్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కెయి శ్యాంబాబు, సాంబశివారెడ్డి, జడ్పీపిటిసిలు సుకన్య, పురుషోత్తం చౌదరి, ఎంపిపి వరలక్ష్మీ, గురుస్వామి, తుగ్గలి నాగేంద్ర, మనోహర్‌చౌదరి, తిరుపాల్, అశోక్‌కుమార్, నాగయ్యగౌడ్, శ్రీనివాసగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
అధికారులు ప్రజలతో
సత్సంబంధాలు కలిగిఉండాలి
* రిజర్వేషన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
* బిసి శాసనసభా కమిటీ చైర్మన్ గుండుమల
కర్నూలు సిటీ, జనవరి 19: జిల్లా అధికారులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి మానవతా దృక్పథంతో పని చేయాలని బిసి శాసనసభా కమి టీ చైర్మన్ గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవన్‌లో మంగళశారం నిర్వహించిన సమావేశంలో శాసనసభా కమిటీ సభ్యులు, ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాదరావు, ఎమ్మెల్యే రమణమూర్తి, శాసనసభ అడిషనల్ సెక్రటరీ సుబ్బారెడ్డి, కలెక్టర్ విజయమోహన్, జెసి హరికిరణ్, ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి కెఇ ప్రభాకర్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిప్పేస్వామి మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఉల్లంఘించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బిసి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా తెలసుకుని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేయడానికే ఈ పర్యటన అన్నారు. కొందరు జిల్లా ఉన్నతాధికారులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఇకనైనా ప్రజలను చులకనగా చూడకుండా ప్రతి అధికారి మానవతా దృక్పథం అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా అధికారులు విధులు సక్రమంగా నిర్వహిస్తే జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వప్రసాదరావు మాట్లాడుతూ జిల్లాలో బిసిలు అధిక సంఖ్యలో ఉన్నారని ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అందజేయాలన్నారు. బిసి కుల వృత్తులు, ఫెడరేషన్‌లకు రుణాలు అందించడంలో అధికారులు, బ్యాంకర్లు సహకరించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని తెలిపారు. రామణమూర్తి మాట్లాడుతూ బిసి సంక్షేమ నిధులను వారి సంక్షేమానికే వినియోగించాలన్నారు. కొందరు ఆర్థిక పరమైన కారణాలతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని అటువంటి వారికి సంక్షేమ పథకాలను అందించి ఆదుకోవాలని సూచించారు. జడ్‌పి చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ జడ్‌పిలో 70 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని అవుట్ సోర్సింగ్ కింద భర్తీ చేస్తూ అందులో బిసిలను ఎంపిక చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. 18 బిసి హాస్టళ్లు అద్దె భవనాల్లో ఉన్నాయని సొంత బిల్డింగ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల బిసి హాస్టళ్లు అద్దె భవనల్లో కొనసాగుతున్నాయని వాటిలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు కనీస వసతులు లేని వసతి గృహాలను గుర్తించి నిధుల కోసం నివేదికలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో అన్ని బ్యాంక్‌ల అధికారులతో సమావేశం నిర్వహించి రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్, అన్ని శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
‘ఎన్టీఆర్ జలసిరి’ కింద
10,200 బోర్లు వేయిస్తాం..
* డ్వామా పిడి పుల్లారెడ్డి
ఆదోనిటౌన్, జనవరి 19:ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ జలసిరి కింద జిల్లా వ్యాప్తంగా 10,200 బోర్లు వేయిస్తామని డ్వామా పిడి పుల్లారెడ్డి పేర్కొన్నారు. ఆదోనిలో మంగళవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ నీటి వసతి ఉన్న గ్రామాల్లో భూగర్భజలాలు భాగా ఉన్న గ్రామలను ముందుగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో దీని కోసం 12వేల దరఖాస్తులు వచ్చాయని వాటిని గ్రామ స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి అర్హులకు ఎంపిక చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 420 గ్రామాల్లో 35 మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్నవారికి ఎంపిక చేస్తామని అన్నారు. రైతు పొలాల్లో రూ.24వేలతో 200 అడుగుల వరకవు బోరు వేస్తామని, అలాగే రూ.50వేలతో విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, రూ.40వేలతో మోటర్ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. ప్రభుత్వ అంచనాలకు మించితే రైతులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులు ఐదుశాతం, ఇతర రైతులు 20శాతం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం పట్టాదారు పాస్ పుస్తకం, ఆదార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా నకలు ఇవ్వాలని తెలిపారు.
ప్రతి మున్సిపాలిటీకి రూ. 727 కోట్లు
* రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి
కర్నూలు సిటీ, జనవరి 19:14వ ఆర్థిక సంఘం కింద ప్రతి మున్సిపాలిటీకి రూ. 727 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపాలిటీల రీజినల్ డైరెక్టర్ సిహెచ్.విజయలక్ష్మి పేర్కొన్నారు. ‘14వ ఆర్థిక సంఘం నిధులను ఏ విధంగా రాబట్టాలి’ అనే అంశంపై మంగళవారం నగరంలోని డివిఆర్ మాన్సన్‌లో కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లలో పని చేస్తున్న రెవెన్యూ, ఇంజినీరింగ్, శానిటేషన్ అధికారులకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు వైభవ్, ఎస్కోని, కర్నాకర్ పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో నిర్వహించే అకౌం ట్స్, ఆడిట్, పౌర సేవలో స్థాయిని బట్టి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. అలాగే గత ఏడాది సాధించిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం కింద ప్రతి మున్సిపాలిటీకి రూ. 727 కోట్లు మంజూరు చేస్తూ, నీటి సరపరా, చెత్త సేకరణ విధానంతో పాటు పటిష్టమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ మున్సిపాలిటీల స్థాయిలో లెక్కలు కట్టి ప్రభుత్వ పద్ధతుల ప్రకారం చేపడుతామన్నారు. ఈ విధంగా మున్సిపాలిటీల్లో పక్కాగా ఉన్నట్లయితే అదే స్థాయిలో నిధులు కేటాయిస్తామన్నారు. ఈ నిధులను ఏడాదికి రెండు విడతల చొప్పున విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ పివి. రామలింగేశ్వర్, ఇన్‌చార్జి ఎస్‌ఇ శివరామిరెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణ చక్రవర్తి, ఎంఇ రాజశేఖర్, డిఇలు తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు చర్యలు
* డిఐజి రమణకుమార్
కర్నూలు, జనవరి 19:పోలీసులు అభివృద్ధి చేందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నేరాల నియంత్రణకు కృషి చేయాలని కర్నూ లు రేంజ్ డిఐజి బివి రమణకుమార్ పిలుపునిచ్చారు. నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 10వ బ్యాచ్ 4 రోజుల పోలీసు సిబ్బంది పునశ్చరణ తరగతులను మంగళవా రం డిఐజి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల విధి నిర్వహణలో ఎంతో సమ యం ఆదా అవుతుందని, వ్యయ ప్రయాసలు కూడా తగ్గుతాయన్నారు. పోలీసులు విధి నిర్వహణలో మానవతా దృక్పథంతో వ్యవహిరించాలని, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల సమస్యల పట్ల సానుభూతితో వ్యవహరి స్తూ వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. డిటిసి ప్రిన్సిపాల్, ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులు వ్యక్తిగత క్రమశిక్షణ అలవరుచుకుని వ్యక్తి జీవితంలో నైతిక విలువలు పాటించి ప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. డిటిసి వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్‌రాజు మాట్లాడుతూ శిక్షణలో తామిచ్చే సలహాలు, సూచనలు తప్పకుండా పాటించి విధి నిర్వహణలో పోలీసుశాఖకు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమం లో డిటిసి ఎస్‌ఐలు చంద్రమోహన్, దగ్గిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కీచక ఉపాధ్యాయుడిపై వేటు
కర్నూలు అర్బన్, జనవరి 19:బనగానపల్లె మండల పరిధిలోని రాళ్లకొత్తూరు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయడిపై సస్పెన్షన్ వేటు పడింది. రాళ్లకొత్తూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు డేవిడ్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిసున్నారని గతంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. దాంతో ఎంఇఓ నరసింహమూర్తి సమక్షంలో విచారణ కమిటీ వేయగా ఆ కమిటీ ఆ ఉపాధ్యాయుడు ప్రవర్తన విద్యార్థినుల పట్ల అసభ్యంగా వుందని జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడు డేవిడ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు మంగళవారం డిఇఓ రవీంద్రనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
హంద్రీనీవా పనులు వేగవంతం చేయండి:కలెక్టర్
కర్నూలు, జనవరి 19:హంద్రీనీవా సుజల సవ్రంతి నిర్మాణ పనుల్లో అనవసర జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ విజయమోహన్ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఇంజినీర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవనంలో మంగళవారం కలెక్టర్ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాలువ పనుల్లో అనుకున్నంత పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే వారం నుంచి రోజూ వారే పనితీరు లెక్క కట్టి ఆ మేరకు మట్టి, కాంక్రీటు పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మంగళవారం కాలువ పురోగతిపై సమీక్షిస్తానని అదనపు మిషనరీని వినియోగించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. భూసేకరణ పూర్తయిన 700 ఎకరాలకు అవార్డు పాస్ చేసి సంబంధిత రైతులకు నష్టపరిహారం అందించాల్సి వుందని, ఈ మేరకు ఈ నెలాఖరులోగా రాత్రింబవళ్లు పని చేసి పూర్తి చేయాలని శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ అధికారి సుబ్బారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శశిదేవికి కలెక్టర్ సూచించారు. 23,28,29 ప్యాకేజీల్లో ఎర్థ్‌వర్క్, కాంక్రీట్ పనులు అధిక మొత్తంలో పెండింగ్‌లో వున్నాయని ఇరిగేషన్, గుత్తేదారుల సమన్వయ లోపం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. అధికారుల పరిధిలో పరిష్కారం కాని సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే సంబంధిత రైతులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి ఒప్పిస్తానన్నారు. స్వాధీనం చేసిన భూములకు మెగ్‌మార్క్ ఇవ్వకుండా కాలువ తవ్వకంలో అలక్ష్యం చేయడం సరికాదని పనితీరు మెరుగుపరచుకోవాలని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఇఇని ఆదేశించారు. సిద్దాపురం స్కీంకు 121 ఎకరాల భూమి ఇవ్వాల్సి వుందని రైతులు ఒప్పుకోని పరిస్థితుల్లో యాక్టు ప్రకారం జనరల్ అవార్డు పాస్ చేయాలని ఎస్‌ఇ సత్యంను ఆదేశించారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద పులికనుమ, పులకుర్తి, చిలకలడోన స్కీంలను త్వరగా పూర్తి చేయాలని ఇఇ నారాయణస్వామిని ఆదేశించారు. వచ్చే ఆరు నెలల్లో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ పనులను పూర్తి చేసి మిగిలిన 65 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఇంజినీర్లను ఆదేశించారు.
నాణ్యమైన విద్యనందించాలి:కలెక్టర్
కర్నూలు అర్బన్, జనవరి 19:విద్యార్థులకు నాణ్యమైన విలువలతో కూడిన విద్యనందించాలని కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ సూచించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మంగళవారం పదవ తరగతి పరీక్షలపై విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, దత్తత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి వుందన్నారు. చదువులో వెనుకబడిన వారిని ఎ, బి, సి కేటగిరీలుగా విభజించి అదనపు తరగతులు నిర్వహించి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యను బోధించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని, అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. పదవ తరగతి పరీక్షలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎలాంటి పొరపాటు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో విద్య సంపూర్ణంగా వుందని అదేవిధంగా మన దేశంలో కూడా నాణ్యమైన విద్యను బోధించి మెరికల్లాంటి విద్యార్థులను తయారు చేసి నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. పరీక్షలకు సమయం తక్కువగా వుందని విద్యార్థులకు కావాల్సిన ప్రోత్సాహం అందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఇఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఎ పిఓ వెంకటకృష్ణుడు, డిప్యూటీ డిఇఓలు, ఎంఇఓలు, దత్తత అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం
బేతంచెర్ల, జనవరి 19:మండల పరిధిలోని సీతారామపురం బస్ స్టేజీ సమీపంలో ఉన్న కల్వర్టులో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం గుర్తుపట్టలేని విధంగా పడి ఉండడం సంచలనం రేపింది. ఎక్కడో హత్య చేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పైపులతో ఏర్పాటు చేసిన కల్వర్టులో వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో మృతదేహం గుర్తుపట్టేందుకు కూడా వీలులేని విధంగా కాలిపోయింది. విషయం తెలిసిన వెంటనే సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ హనుమంతురెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపరీక్ష బుధవారం చేయించనున్నట్లు తెలిపారు. ఆధారాల కోసం డాగ్ స్వ్కాడ్, క్లూస్ టీంను రప్పించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది మూడో సంఘటన..
బేతంచెర్ల పట్టణ సమీపంలో గుర్తుతెలియని మహిళ శవం లభ్యం కావడం ఇది మూడోసారి. 2013లో బనగానపల్లె రహదారిలోని కస్తూరిబా గాంధీ పాఠశాల సమీపంలో మైలవరం డ్యాంకు చెందిన యువతిని హతమార్చి నిప్పు అంటించడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ సంఘటన మరువక ముందే డోన్ రహదారిలో ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్.కొత్తపల్లె రోడ్డు పక్కనే మరో మహిళ మృతదేహాన్ని కాల్చి వేసిన విషయం వెలుగుచూసింది. పోలీసుల దర్యాప్తులో ఎన్నో మలుపులు తిరిగిన అనంతరం ఒక కేసులో ప్రేమికుడే నిందితుడని తేల్చి జైలుకు పంపారు. మరో కేసులో నిందితుడు కూడా మృతి చెందినట్లు నిర్ధారించి కేసు మూసివేశారు. మళ్లీ తాజాగా మండల పరిధిలోని సీతారామపురం బస్ స్టేజీ వద్ద శవం లభ్యం కావడం చర్చనీయాంశంగా మారింది.
అప్పుల బాధతో చెరువులో పడి
రైతు ఆత్మహత్య
క్రిష్ణగిరి, జనవరి 19:మండల పరిధిలోని కంబాలపాడు గ్రామంలో మంగళవారం రైతు ఈడిగ శ్రీరాములు(56) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపారు. వివరాలు.. ఈడిగ శ్రీరాములుకు 4 ఎకరాల పొలం ఉంది. గత నాలుగేళ్లుగా పంటల సాగు కోసం దాదాపు రూ. 4 లక్షల వరకూ అప్పులు చేశాడు. అయితే పంట దిగుబడి సరిగా చేతికందకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో చెప్పి పొలం వెళ్లాడు. అయితే రాత్రి 8 గంటలైనా శ్రీరాములు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు టార్చిలైట్ల సాయంతో అతడి కోసం గాలించారు. చివరకు అతడు చెరువులో శవమై కనిపించాడు. దీంతో గ్రామస్థులు శవాన్ని బయటకు తీశారు. కుటుంబ పెద్దదిక్కు ఆత్మహత్యకు పాల్పడడంతో అతడి భార్య, కుమారులు బోరున విలపించారు.