ఖమ్మం

శరవేగంగా పవర్ ప్రాజెక్టు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 21: సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మాణం చివరి దశకు వచ్చిన సింగరేణి థర్మల్ పవర్‌ప్రాజెక్టులోని మొదటి, రెండవ యూనిట్‌లకు చెందిన పనులను శరవేగంతో పూర్తిచేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆకాంక్ష మేరకు 1200 మెగావాట్ల సింగరేణి విద్యుత్‌ను ఏప్రిల్ మాసం వరకు తెలంగాణ రాష్ట్రానికి అందించాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ సింగరేణి అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. సింగరేణి థర్మల్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించిన అనంతరం గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మార్చినెలలో మొదటి యూనిట్ నుండి విద్యుత్ ఉత్పాదన ప్రక్రియ ప్రారంభం కావాలని, ఏప్రిల్ నెలలో రెండవ యూనిట్ నుండి విద్యుదుత్పత్తిని ప్రారంభించి మొత్తం 1200మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందించే విధంగా మూడుషిఫ్ట్‌ల పనులను లక్ష్యం దిశగా వేగవంతం చేయాలని సూచించారు. థర్మల్‌ప్లాంట్‌లోని ప్రతి పనిని తనిఖీ చేశారు. నీటి రిజర్వాయర్ పనులు చివరిదశకు వచ్చిన విషయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గోదావరి నది నుండి సెట్‌పల్లి ద్వారా ఒక టిఎంసి నీటి సేకరణకు సంబంధించి పైపులు వేసే పనులు పూర్తికావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవారంలోగా రిజర్వాయర్‌లోని మిగిలిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. తరువాత వ్యూపాయింట్ నుండి బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ పనులను పరిశీలించారు. 14ఎబి కనే్వయర్‌బెల్ట్ పనిని తనిఖీ చేశారు. తాత్కాలిక లోడర్, బొగ్గుస్టాక్ యార్డును పరిశీలించారు. రైలుమార్గం ద్వారా వచ్చే బొగ్గు అన్‌లోడ్ అయ్యే ట్రాక్ హుపర్ పనులను పరిశీలించారు. సివిల్ పనులు పూర్తికాగా మెకానిక్ పనులు కూడా చివరిదశకు వచ్చాయని అధికారులు వివరించారు. యాష్‌హ్యాండ్లింగ్ సిస్టమ్ పనులను, సిడబ్ల్యూ పంపుపనులను పరిశీలించారు. సిడబ్ల్యూ డక్టింగ్ పనులను తనిఖీ చేసిన తరువాత కాంక్రీట్ గ్యాంగ్‌లను పెంచి మూడుషిఫ్ట్‌లలో పనులను నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా థర్మల్ పవర్‌ప్లాంట్ ఆవరణలో తారురోడ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. బిహెచ్‌ఇఎల్ ఆధ్వర్యంలో పూర్తయిన బాయిలర్, టర్బయిన్, జనరేటర్ (బి.టి.జి)పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కంట్రోల్‌రూంలను ఆయన పరిశీలించి సింక్రనైజేషన్‌కు సంబంధించిన విషయాలపై అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి థర్మల్ విద్యుత్‌కేంద్రం నిర్మాణంపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని, నిర్ణీత సమయంలో పూర్తిచేసి 800మెగావాట్ల విద్యుత్‌ను అందించాల్సిన బాధ్యత సింగరేణిపై ఉందన్నారు. ఏప్రిల్ నాటికి 1200మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి అందించడం ద్వారా బంగారు తెలంగాణ నిర్మాణంలో సింగరేణి సంస్థ కూడా పాలు పంచుకోవాలని అన్నారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో సిఎండి వెంట డైరెక్టర్ (ఆపరేషన్స్) బి రమేష్‌కుమార్, డైరెక్టర్ (ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) ఎ మనోహర్‌రావు, డైరెక్టర్ (ఇఅండ్‌ఎం) పి రమేష్‌బాబు, ఇడి (ఎస్‌టిపిపి) సంజయ్‌సూర్, జనరల్ మేనేజర్ (సివిల్) మురళీకృష్ణ, జనరల్ మేనేజర్ (సిడిఎన్) జె నాగయ్యలు పాల్గొన్నారు.
పూర్తిస్థాయిలో వసూలుకాని పన్నులు
* ఆర్థిక ఇబ్బందుల్లో మున్సిపాలిటీలు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 21: జిల్లాలో ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలున్నాయి. వీటి ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్నులే. కానీ అవి వసూళ్ళు పూర్తిస్థాయిలో కాకపోవటంతో మున్సిపాలిటీలు ఆర్థికంగా నీరసించిపోతున్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌లో ఏడాదికి ఆస్తిపన్నుల రూపంలో దాదాపు 20కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం ఆరున్నర కోట్ల రూపాయలు మాత్రమే వసూలయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో రెండు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో వీటి వసూలు ప్రశ్నార్థకంగా మారుతోంది. మరో వైపు మొండి బకాయిల వసూళ్ళలో అధికారుల వైఖరి స్పష్టంగా లేకపోవటం గమనార్హం. ప్రజలను చైతన్యపరిచి పన్ను కట్టేలా చేయటంలో మున్సిపల్ శాఖాధికారులు విఫలమవుతున్నారు.
ఇదిలా ఉండగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పాల్వంచ మున్సిపాలిటీలో గతేడాది ఉన్న 16లక్షల బకాయిలతో కలిపి 2.40కోట్ల రూపాయల ఆస్తిపన్ను ఈ ఏడాది వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటికి సుమారు 1.20కోట్ల రూపాయలు మాత్రమే వసూళ్ళయ్యాయి. మిగిలిన సగం రెండు నెలల్లో వసూలు చేయటం సాధ్యం కాదని సిబ్బందే చెప్తున్నారు. కానీ పన్నుల వసూళ్ళకు ఇక్కడ ఆరుగురు సిబ్బంది ఉండగా, ఇద్దరు డిప్యూటేషన్‌పై ఉండగా,మరో నలుగురు తాత్కాలిక ఉద్యోగులే.
కొత్తగూడెం మున్సిపాలిటీలో 18,500ఇళ్ళు, సుమారు 2వేల వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటన్నింటి నుంచి సుమారు 2.67కోట్ల రూపాయల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 35శాతం మాత్రమే వసూలు చేశారు. గతేడాది బకాయిలతో కలుపుకొని సుమారు 2కోట్ల రూపాయలు వసూలు కావాల్సి ఉంది.
ఇక మధిర నగర పంచాయతీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మధిర నగరపంచాయతీగా మారటంతో పన్నులపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదు. ఆస్తిపన్నుల వ్యవహారం ఎటూ తేలకపోవటంతో ఇప్పటికే ఉన్న 1.44కోట్ల రూపాయల పాత బకాయిలకు తోడు మరో కోటి రూపాయలకు పైగా వసూలు కావటం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఇక్కడ పరిస్థితి మరింత ఇబ్బంది కలిగేలా ఉంది. ఇల్లెందు మున్సిపాలిటీలో ఈ ఏడాది 1.10కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, 50లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇక్కడ గిరిజనులు అధికంగా నివశిస్తుండటంతో ఆస్థిపన్ను వసూలు సమస్యగా మారినట్లు తెలుస్తోంది.
సత్తుపల్లి నగర పంచాయతీలో జిల్లాలో అధికంగా పన్నుల వసూళ్ళు జరిగింది. పాత వాటితో కలిపి సుమారు 2కోట్లు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటికి దాదాపు 1.50కోట్ల రూపాయలు వసూలయ్యాయి. అయితే ఇక్కడ ఉన్న వారిలో ఒక్కరు మినహా ఐదుగురు తాత్కాలిక బిల్ కలెక్టర్లు కావటంతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నాయనే ఆరోపణలున్నాయి. మణుగూరు మున్సిపాలిటీపై కోర్టు కేసు ఉండటం, గిరిజనులు అధికంగా నివశిస్తుండటం, సింగరేణి కాలరీస్ విస్తరించి ఉండటంతో ఇక్కడ పన్నుల వసూళ్ళు 50శాతం కూడా కాలేదు.
ఇదిలా ఉండగా పన్నుల వసూళ్ళపై ప్రభుత్వం జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 90శాతానికి పైగా పన్ను వసూళ్ళు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
సమస్యలు తెలుసుకోవటానికే
విద్యాలయాల్లో ఫిర్యాదుల బాక్స్‌లు
* తొలిసారిగా ముదిగొండ, ఖమ్మం రూరల్ విద్యాలయాల్లో ప్రారంభం
ముదిగొండ, జనవరి 21: మండలంలోని విద్యాలయాల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోవాటానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫిర్యాదుల బాక్సులు గురువారం ఏర్పాటు చేశారు.ఖమ్మం రూరల్ సిఐ ఆంజనేయులు నేతృత్వంలో మీసేవలో పోలీస్‌శాఖ పేరుతో మండలంలోని జూనియర్ కళాశాల, హాస్టల్స్, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో 10 ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ బాక్సులను ఏ విధంగా ఉపయాగించుకోవాలో ముదిగొండ ఎస్‌ఐ జంగం నాగేశ్వరరావు విద్యార్థులకు వివరించారు. నేరుగా పోలిస్ స్టేషన్‌కు వచ్చి చెప్పుకోలేని సమస్యలు, వేధింపులకు గురవుతున్న బాలికలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోలేని పరిస్ధితులలో పోలీస్‌శాఖకు తెలియజేసి అసాంఘిక శక్తుల ఆగడాలను అరికట్టడానికి ప్రయోగాత్మకంగా ఈ బాక్సులను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. నేరుగా సమస్య కాగితం పై రాసి బాక్సులో వేస్తే సరిపోతుందని తమ వివరాలు తెలియజేయాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. ఈ బాక్సుల ద్వారా వచ్చిన సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు. పోలీస్‌శాఖకు సంబంధం లేని సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ప్రయోగత్మకంగా జిల్లాలోని ముదిగొండ, ఖమ్మం రూరల్ విద్యాలయాల్లో మొదటి సారిగా ప్రారంభించారు.ఇక్కడ సక్సెస్ సాధిస్తే జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఖమ్మం రూరల్ సిఐ ఆంజనేయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఎస్‌ఐ లు హూస్సేన్, వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.
నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
* సెట్‌కం సిఈఓ పరంధామరెడ్డి
ఖానాపురం హవేలి, జనవరి 21: నిరుద్యోగ, యువతీ యువకులకు నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ పాల్వంచ ఆధ్వర్యంలో నవభారత్ ఒకేషనల్ ఇనిస్టిట్యూట్ ద్వారా పలు వృత్తులపై శిక్షణనివ్వనున్నట్లు సెట్‌కం సిఈఓ పరంధామరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నిరుద్యోగులైన యువతీ, యువకులకు అర్హతలను బట్టి కోర్సులు ఉన్నాయన్నారు. వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫ్లంబర్‌కు కోర్సు శిక్షణకు పదో తరగతి లేదంటే ఐటిఐ ఉత్తీర్ణులై ఉండటంతో పాటు 18నుంచి 30సంవత్సరాల్లోపు వారు మాత్రమే అర్హులన్నారు. ఈ కోర్సు కాల పరిమితి ఆరు నెలలు ఉండగా, ఉపకార వేతనం వెయ్యి రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. అదే విధంగా రిఫ్రజిరేటర్, ఎయిర్ కండిషనర్స్‌కు ఆరు నెలల పాటు శిక్షణనివ్వనున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా కంప్యూటర్ కోర్సులో డిగ్రీ పూర్తయిన వారికి ట్యాలీ కోర్సు శిక్షణ మూడు నెలలు ఉంటుందని, ఉపకార వేతనం 750రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఇంటర్ పూర్తయిన వారికి డిటిపి కోర్సుకు 3 నెలల శిక్షణ ఉంటుందని, వీరికి కూడా ఉపకార వేతనంగా 750రూపాయలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. టైలరింగ్ శిక్షణకు 3నెలల కోర్సు ఉంటుందని, వీరికి 750రూపాయలు ఉపకార వేతనంగా అందించటం జరుగుతుందన్నారు. బ్యూటిషియన్, ఆటోమోబైల్ తదితర రంగాల్లో కూడా శిక్షణ ఇస్తామన్నారు. ఈ కోర్సులన్నింటికి కోర్సును బట్టి పరిమితమైన సీట్లు ఉంటాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం పాల్వంచలోని నవభారత్ ఇనిస్టిట్యూట్, సెట్‌కం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.