మెదక్

ఖేడ్‌లో ఊపందుకున్న ఉప ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 22: మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఘట్టం పూర్తి కాకముందే ప్రధాన పార్టీలు ప్రచార పర్వానికి తెరలేపాయి. అధికార టిఆర్‌ఎస్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, టిడిపి పార్టీలు తమ తమ మద్దతుదారులను కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఉప ఎన్నికలో అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న మంత్రి హరీష్‌రావు నియోజకవర్గంలోనే మకాం పెట్టి వ్యూహరచనలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణించిన అనంతరం ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో శాసన సభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అందరికంటే ముందుగానే ఉప ఎన్నికపై దృష్టి సారించి పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని పెద్దశంకరంపేటలో బహిరంగ సభను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. సాయంత్రం నారాయణఖేడ్ పట్టణంలో కూడా మంత్రి హరీష్‌రావు పర్యటించి అభ్యర్థికి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసారు. ప్రతి మండలానికి ఒక ముఖ్యమైన నాయకుడికి ప్రచార బాధ్యతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాలను చుట్టేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన నారాయణఖేడ్ మండలం, పట్టణంలో టిఆర్‌ఎస్ శ్రేణులను ముందుకు నడిపించే బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణకు అప్పగించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.్భపాల్‌రెడ్డి స్వంతమైన కల్హేర్ మండల బాధ్యతను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు అప్పగించారు. కంగ్టి మండలానికి జూకల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉమాకాంత్ పాటిల్, మనూర్ మండలానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీధర్ యాదవ్, పెద్దశంకరంపేట మండల బాధ్యతను టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డికి అప్పగించగా మెదక్ నియోజకవర్గానికి చెందిన టిఆర్‌ఎస్ ముఖ్య నాయకులంతా ఈ మండలంలోనే మకాం పెట్టి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి నారాయణఖేడ్ పట్టణంలో పర్యటించి ఆయా కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సానుభూతితో విజయం సాధించాలన్న లక్ష్యం కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపి సురేష్ షెట్కార్, మాజీ ఎమ్మెల్యే పి.శశిధర్‌రెడ్డిలు శుక్రవారం పెద్దశంకరంపేట, కంగ్టి మండలాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి, నారాయణఖేడ్ ఎంపిపి అధ్యక్షుడు పి.సంజీవరెడ్డి 20 రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ పార్టీ శ్రేణులను సమకట్టుకుని ప్రజామద్దతు కూడగట్టేందుకు నిరంతరం శ్రమించారు. సైకిల్ పార్టీ తామేం తక్కువ కాదంటూ పార్టీ శ్రేణులు జారీ పోకుండా చాపకింద నీరులా అభ్యర్థి ఎం.విజయపాల్‌రెడ్డి తనదైన శైలీలో వ్యూహరచనలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. మండలాల వారిగా టిడిపి నాయకులు, కార్యకర్తలను రప్పించుకుని ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచనలు చేసుకుంటున్నారు. ప్రచార పర్వానికి తెరలేవకముందే నేతలు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు దిగుతున్నారు. అధికార పార్టీ నేతలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి విజయపాల్‌రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పరిశీలకులకు పిర్యాదు చేయడం గమనార్హం. ఉప ఎన్నిక రంగంలో దిగిన ముఖ్యమైన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించడానికి అన్ని పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు మారుమూల గ్రామాలకు తరలివెళుతున్నారు. మండలాల వారిగా బాధ్యతలు చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎంపిలు తమ తమ మద్దతుదారులను రప్పించుకుని గ్రామాల్లో హల్‌చల్ చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నా చితకా పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎంత మంది పోటీకి దిగినా ప్రధానమైన పోటీ టిఆర్‌ఎస్, కాంగ్రెస్, టిడిపిల మధ్యనే ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ నెల 30వ తేదీతో నామినేషన్ల ఉప సంహరణ పూర్తికాగానే ఖేడ్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామం, పల్లె, తండా అనే తేడాలేకుండా ప్రచారంతో మారుమ్రోగడం ఖాయమని చెప్పవచ్చు.

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
* వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 22: ఓటర్ నమోదును పెంచి భారత ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్లను కోరారు. శుక్రవారం హైదరాబాద్ నుండి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పండగ వాతావరణంలో జరుపాలని సూచించారు. కార్యక్రమాల్లో ఓటర్ల నమోదుతో పాటు ప్రజలు ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచేలా కృషి చేయాలన్నారు. జిల్లాస్థాయిలో వకృత్వ, క్విజ్, డ్రాయింగ్ పోటీలను సీనియర్, జూనియర్ స్థాయిలో నిర్వహించాలన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారిని 23తేదీ సాయంత్రంలోగా హైదరాబాద్‌కు తీసుకరావాలన్నారు. పోలింగ్ బూత్‌లలో డ్రాప్ట్ ఓటర్ లిస్టుతో పాటు ఓటర్ రిజిస్ట్రేషన్, మార్పులు, చేర్పులకు అవసరమైన దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలన్నారు. డివిజన్, జిల్లా కేంద్రాల్లో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. జిల్లా స్థాయిలో న్యాయమూర్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. సీనియర్ సిటిజన్లను సన్మానించాలని, ఓటింగ్ ప్రక్రియలో ఉన్నత ప్రగతి సాధించిన ఈఆర్‌ఓ, ఎఈఆర్‌ఓ, బిఎల్‌ఓలను ఎంపిక చేసి నివేదికను అందజేయాలని సూచించారు. కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలోని 1713 పోలింగ్ కేంద్రాల్లో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాకేంద్రంలో కళాశాల విద్యార్థులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లతో ర్యాలీ, మానవహారం నిర్వహిస్తామన్నారు. జిల్లా న్యాయమూర్తిని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో ఓటర్లతో ప్రతిజ్ఞ, సీనియర్ సిటిజన్లకు సత్కారం, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి గౌరవిస్తామన్నారు. ఈ నెల 18నుండి ప్రచార శకటాన్ని గ్రామాల్లో తిప్పుతున్నామన్నారు. సమావేశంలో డిఆర్వో దయానంద్, మెదక్ ఆర్డీఓ నగేష్ తదితరులు ఉన్నారు.
నేడు ముగ్గుల పోటీలు
జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23న కలెక్టరేట్ ప్రాంగంణంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. కలెక్టరేట్ మహిళా ఉద్యోగులందరూ ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

కాంగ్రెస్, టిడిపి పాలనలో అభివృద్ధి శూన్యం
పెద్దశంకరంపేట, జనవరి 22: గత 60 సంవత్సరాల కాంగ్రెస్, టిడిపి పాలనలో నారాయణఖేడ్ నియోజకర్గం అభివృద్ద్ధి జరిగిందంటే పోలీసు కేసులు, ప్రజల వలసలతోనే అభివృద్ది జరిగిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరిష్‌రావు ఎద్దెవా చేశారు. శుక్రవారం టిఆర్‌ఎస్ ప్రచారంలో భాగంగా శంకరంపేటలో జరిగిన టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో హాజరై ప్రసంగించారు. గత 50 సంవత్సరాల పాలనలో 40 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు టిడిపి ఖేడ్ నియోజకవర్గాన్ని పాలించిందని, కానీ అన్ని రంగాల్లో వెనుకపడేసినప్పటికీ పోలీసు కేసులు, ప్రజల వలసల్లో మాత్రం ఈ పాలకులు అభివృద్ది సాధించారన్నారు. గత 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ది కేవలం గత 60 రోజుల్లో అభివృద్ధ్ది అంటే ఎలా ఉంటుందో నియోజకవర్గ ప్రజలకు చేసి చూపించామన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోని 10, 12 విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉంటే నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధినలో 5 మండలాల్లో కేవలం 20 సబ్‌స్టేషన్లు ఉన్నాయంటే ఈ ప్రాంత ఏపాటి అభివృద్ది చెందిందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఈ 60 రోజుల్లో నియోజకవర్గాన్ని 12 సబ్‌స్టేషన్లు మంజూరు చేసి కొన్నింటిని పూర్తి చేశామన్నారు. నెల రోజుల్లోనే పెద్దశంకరంపేటలోని జంబికుంట సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఘనత టిఆర్‌ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డిదే అన్నారు. అలాగే రహదారుల విషయానికి వస్తే ఏ గ్రామానికి వెళ్లాలన్నా సరైన రోడ్లు లేవని, ఈ 60 రోజుల్లో కనీవిని ఎరుగని రీతిలో రహాదారులు అభివృద్ది చేసి చూపాలమన్నారు. ముఖ్యంగా కంగ్టి నుండి కడ్పల్ రోడ్డును 18 కోట్లతో అభివృద్ది పరిచామన్నారు. అలాగే గత 10 సంవత్సరాలుగా కంగ్టి ప్రజలు మంచినీటి కోసం విలవిలలాడినా గత పాలకులు పట్టించుకోలేదని ఈ 60 రోజుల్లోనే కౌలాస్ ప్రాజెక్ట్ నుండి నీరు తెప్పించిన ఘనత తెరాస ప్రభుత్వందే అన్నారు. అలాగే మెదక్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో మంచినీటి కోసం 750 కోట్ల రుపాయలను తెరాస ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాంతంలోని గిరిజనులు పెద్దయేత్తున వలసలు పోతున్నా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. జిల్లాలో 5 లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల నుండి దారిద్రరేఖను దిగువన ఉన్న అన్ని వర్గాల వారికి కళ్యాణ లక్ష్మీ పథకం క్రింద 51 వేల రుపాయలు ప్రభుత్వం ఇవ్వనుందన్నారు. ఇలాంటి అభివృద్ది చేస్తున్న ముఖ్యమంత్రికి నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు అండగా ఉండి రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి భూపాల్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, తెరాస రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర గీత పారిశ్రామిక సంస్థ మాజీ చైర్మన్ రామాగౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు విజయరామరాజు, మాజీ ఎంపిపి శ్రీనివాస్‌గౌడ్, సుభాష్‌గౌడ్, వేణుగోపాల్‌గౌడ్, సురేష్‌గౌడ్‌తో పాటు మండల పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మాటలతో మభ్యపెడుతున్న టిఆర్‌ఎస్
పెద్దశంకరంపేట, జనవరి 22: బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెబుతూ మాటలతోనే తెలంగాణ ప్రజలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం మభ్యపెడుతున్నారని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ్మా విమర్శించారు. శుక్రవారం పెద్దశంకరంపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మన నీరు, మన ఉద్యోగాలు, మన ప్రాంతం అని చెప్పి నేడు అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఏమి కృషి చేస్తున్నాడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 10 వేల కోట్ల పైచిలుకు ఆదాయంతో తెలంగాణ ప్రభుత్వం ఉండేదని, నేడు 20 నెలల పాలనలో 61 వేల కోట్ల అప్పుల్లో ఎలా కూరుకుపోయిందో ముఖ్యమంత్రి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే కాకుండా 24 వేల కోట్ల రుపాయలు బాండ్ల రూపంలో అప్పులు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, ఆ రైతుల కోసం రుణమాఫి చేస్తామని అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం రుణమాఫి క్రింద 18 వేల కోట్లను ఎందుకు ఇవ్వలేదన్నారు. ఈ రుణ మాఫిని కూడా విడతల వారిగా ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 18 వేల కోట్లు ఇస్తే రైతులకు ఎంతో మేలు జరిగేదని, కానీ 36 వేల కోట్లతో మిషన్ భగీరథ క్రింద పైపులు కొనుగోలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో కరువు ఏర్పడి ప్రజలు అతలాకుతలం అవుతున్నారని, వీరి కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చెప్పాట్టారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు, యువత పాల్గొని నేడు రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక వహించారని, కానీ నిరుద్యోగుల కోసం ఎన్ని ఉద్యోగాలు విడుదల చేశారో శే్వత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభవాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలన్నారు. గత 20 నెలలుగా నారాయణఖేడ్ ప్రాంతంపై లేని ప్రేమ కేవలం నాలుగు నెలల్లోనే తెరాస నాయకులకు ఎందుకు కలిగిందే ప్రజలు అర్దం చేసుకోవాలన్నారు. ఖేడ్‌లో ఎన్నికలు రావడం వలనే నేడు తెరాస మంత్రులు అభివృద్ది మంత్రం చెబుతున్నారని, గతంలో రాష్ట్రానికి మంత్రిగా ఉన్న మంత్రివర్యులు ఖేడ్ అభివృద్దినికి ఎందుకు నిధులు కెటాయించలేదో ప్రజలు నిలదీయాలన్నారు. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని దామోదర్ రాజనర్సింహ్మా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డి, జహిరాబాద్ మాజీ ఎంపి సురేష్ షేట్కార్, పేట ఎంపిపి రాయిని సంగమేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆర్యన్ లక్ష్మీనారాయణ, రాజేందర్‌గౌడ్, సర్పంచ్‌లు రాములు, మధుసూదన్, నర్సింలు, నారాయణగౌడ్, మురళీపంతులు, పేట ఉప సర్పంచ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

ఖేడ్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని తలపిస్తున్న హరీష్ వ్యూహం
*ఓటు ఓటు కూడగట్టేందుకు శ్రేణుల శ్రమ *గెలుపు ధీమాలో భూపాల్‌రెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, జనవరి 22: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మరోవైపు క్యాడర్ తగ్గని టిడిపి పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొని మొట్టమొదటి సారిగా గులాబి జెండాను ఎగుర వేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అభ్యర్థిని మించిన స్థాయిలో వ్యూహరచనలు చేస్తున్నారు. ఉప ఎన్నిక అనివార్యమైన నారాయణఖేడ్‌పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఖేడ్ ప్రాంతాన్ని మరో సిద్దిపేటగా తీర్చిదిద్దుతానని మంత్రి గతంలోనే శపథం చేసారు. అదే స్థాయిలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామాలకు చేరవేసారు. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఇంతగా ప్రచారం నిర్వహించని హరీష్‌రావు ఖేడ్‌లో తెరాస ప్రాబల్యాన్ని పెంచేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. సాధారణంగా వార్డు మెంబర్‌కు పోటీ చేసే వారు సైతం ఉత్కంఠగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయడం పరిపాటి. ఉప ఎన్నికలు అన్ని పార్టీల అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారని, టిఆర్‌ఎస్ అభ్యర్థి ఎం.్భపాల్‌రెడ్డి మాత్రం నిశ్చింతగా ఉన్నారంటూ ఖేడ్‌లో చర్చించుకోవడం విశేషం. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు వచ్చి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటే భూపాల్‌రెడ్డి గెలుపు ధీమాలో ఉన్నారన్న ప్రచారం కొనసాగుతుంది. ఒక్కో ఓటును కూడగట్టేందుకు టిఆర్‌ఎస్ శ్రేణులు గ్రామ గ్రామాన పర్యటిస్తూ తెరాస ఓటు బ్యాంకును పెంచేందుకు కృషి చేస్తుండగా పోటీలో ఉన్న అభ్యర్థిపై పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్‌రావు తీసుకుంటారని జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా మాట్లాడిన సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. సిఎం పెట్టిన బాధ్యతను ఎక్కడ కూడా విస్మరించకుండా గెలుపే లక్ష్యంగా మంత్రి హరీష్‌రావు ఖేడ్‌లో మకాం వేసి పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు. పట్టున్న కాంగ్రెస్, టిడిపి పార్టీలను చిత్తు చేసి మొదటి సారిగా ఉద్యమ పార్టీ అభ్యర్థిని అసెంబ్లీకి తీసుకువెళ్లాలన్న మంత్రి లక్ష్యం ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే.

రోహిత్ మృతికి కారకులైన మంత్రులను తొలగించాలి
* సంగారెడ్డిలో నిరసన ర్యాలీ, దిష్టిబొమ్మల దగ్ధం
సంగారెడ్డి టౌన్, జనవరి 22: హెచ్‌సియు విద్యార్థి రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను మంత్రి వర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ రోహిత్ సల్‌డారిట్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ ముందు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బి.మల్లేశం, బిసి సంఘం జిల్లా అధ్యక్షులు బీరయ్య యాదవ్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మానిక్యం, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజ్ తదితరులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలకు ఉద్యమాలకు నిలయాలని, అనేక భావాల సంఘర్శనలకు కేంద్రాలన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాసంస్థల్లో, యూనివర్శిటిల పరిపాలనలో జోక్యం పెరిగిందన్నారు. మద్రాస్ ఐఐటిలో అంబేద్కర్ పెరియార్ స్టడిసర్కిల్స్‌ను నిషేధించారన్నారు. పూణేలోని ఎఫ్‌టిఐఐకి అనర్హున్ని చైర్మన్‌గా నియమించారన్నారు. ఇలాంటి విధానాలను ప్రశ్నిస్తున్న విద్యార్థులను రప్టిగేషన్‌లు, సస్పెషన్స్ పేరుతో తీవ్ర హింసకు గురి చేయడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ మృతి కారణమైన కేంద్ర మంత్రులను వెంటనే తొలగించాలని, హెచ్‌సియు వీసి అప్పారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో పిఆర్‌ఎస్‌ఎస్ జిల్లా చైర్మన్ అనంతయ్య, అంబేద్కర్ స్టడి ఫోరం జిల్లా అధ్యక్షులు రామారావు, బిఎస్పీ నాయకులు నర్సింలు, సిఐటియు నాయకులు ప్రవీన్, దళిత సంఘాల నాయకులు మల్లయ్య, మాణయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌పిజి పొదుపు మంత్రం
సంగారెడ్డి టౌన్, జనవరి 22: ముందస్తు ప్రణాళికతో ఎల్‌పిజి గ్యాస్‌ను వినియోగిస్తే పొదుపు చేయడంతో పాటు ఆర్థికంగాను ప్రయోజనం చేకూరుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అనురాధ తెలిపారు.
గ్యాస్ పొదుపు పక్షోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జిల్లాకేంద్రంలో భారత్ గ్యాస్ డీలర్లు, సిబ్బంది, వినియోగదారులతో కలిసి ర్యాలీ నిర్వహించి అవగాహాన కల్పించారు. కలెక్టరేట్‌లో డిఎస్‌ఓ అనురాధ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి ప్రసాధించిన తరగణి వనరులైన సోలార్ శక్తులను వినియోగించుకొని తరిగే వణరులైన పెట్రోలియం తదితర ఉత్పత్తులను పొదుపు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో భారత్ పెట్రోలియం సెల్స్ ఆఫీసర్ అరవింద్, డీలర్లు బాల వీరయ్య, శ్రీకాంత్‌గౌడ్, మానిక్‌రెడ్డి, వినోద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చెక్‌పోస్టుల వలయంలో ఖేడ్ నియోజకవర్గం
* భారీగా తరలివచ్చిన పోలీసు బలగాలు * మండలానికో డిఎస్పీ* అడుగడుగునా నిఘా
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, జనవరి 22: మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్ని దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభానికి గురి చేసేందుకు విస్తృతంగా డబ్బులు, మద్యం పంపిణీ చేయడానికి పార్టీలు చేసే ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు నియోజకవర్గం చుట్టూ 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసారు. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంకాగా దళిత, గిరిజన సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఏ ఎన్నిక అయినా ఉత్కంఠగానే కొనసాగుతుంది. ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించే స్థాయిలో ఇక్కడ వర్గపోరు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామ గ్రామాన పోలీసు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఐదుగురు డిఎస్పీలకు బందోబస్తు బాధ్యతను అప్పగించారు. నామినేషన్ల పర్వం ముగియకముందే వందలాది మంది పోలీసులు ఖేడ్‌కు చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎస్పీ బడుగుల సుమతి ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలో సివిల్, సాయుధ పోలీసు బలగాలతో కవాతు నిర్వహించి అల్లర్లకు పాల్పడే వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసారు. కర్నాటక, మహారాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మనూర్, కంగ్టి, కల్హేర్ మండలాల పరిధిలోని కరస్‌గుత్తి, పుల్‌కుర్తి, నాగూర్ (కె), తడ్కల్, డేగూల్‌వాడిల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి లారీలు, జీపులు, ట్రక్కులు, ద్విచక్ర వాహనాలను అణువణువు సోదిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న మాసాన్‌పల్లి వద్ద అకోల-హైదరాబాద్ జాతీయ రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పిట్లం నుంచి నారాయణఖేడ్‌కు వచ్చే రహదారిపై పత్తేపూర్ వద్ద మరో చెక్‌పోస్టును ఏర్పాటు చేసారు. రేగోడు మండలం పోచారం, అల్లాదుర్గం మండలం కోళ్లపల్లి, పెద్దశంకరంపేట నుంచి నార్సింగ్ వెళ్లే రహదారిపై కూడా చెక్‌పోస్టును ఏర్పాటు చేసారు. ఉప ఎన్నిక పరిశీలకులు చెక్‌పోస్టులపై నిఘా వేయడంతో పోలీసులు ప్రతి వాహనాన్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదు, నగలను తీసుకువెళ్లినా అనుమతించకుండా సొత్తును సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖలో జమ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సైతం నిఘాను ఏర్పాటు చేసేందుకు సిసి కెమెరాలు, వీడియో చిత్రీకరణ చేయడానికి ఏర్పాట్లు చేయడమే కాకుండా కంప్యూటర్ ఆపరేటర్లను సమకూర్చుకుంటున్నారు. వర్గాలు, ముఠాలకు నిలయమైన ఖేడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు అదనపు బలగాలను రప్పించనున్నారు. గ్రామాల్లో ఇప్పటి నుంచే ఘర్షణ వాతావరణం నెలకొనడంతో మొబైల్ పోలీసు బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తంమీద నారాయణఖేడ్ ఉప ఎన్నికను పోలీసులు చాలెంజ్‌గా తీసుకుని బందోబస్తును ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు.

పార్టీలకు తలనొప్పిగా మారిన జంప్ జిలానీలు
* కండువాలు మార్చుతూ కంగారు పెడుతున్న నేతలు
* అయోమయంలో శ్రేణులు
ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, జనవరి 22: పార్టీల పరువు ప్రతిష్టలకు భంగం కలుగకుండా ఉప ఎన్నికల్లో ఉనికిని చాటుకోవాలని ఆరాటపడుతున్న నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు కండువాలు మారుస్తూ శ్రేణులను కంగారు పెడుతున్నారు. ఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన పి.కిష్టారెడ్డి గత యేడాది ఆగస్టు 25వ తేదీన మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నాలుగు నెలలుగా ఈ నియోజకవర్గంలో ఆయా పార్టీలకు చెందిన ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, వార్డు మెంబర్లు పార్టీలు పిరాయింపులు ప్రారంభించారు. కాంగ్రెస్, టిడిపిల కంటే కాస్తంత బలహీనంగా ఉన్న పార్టీ క్యాడర్‌ను పెంచేందుకు టిఆర్‌ఎస్ పార్టీ ఎత్తుగడలు వేస్తూ ప్రజాప్రతిధులు తమ పార్టీ వైపు ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు పలువురు సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు గులాబి కండువాల కప్పుకున్నారు. స్వంత గూటిని విడిచి గులాబి గూటికి చేరిన వారంతా ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో మళ్లీ తిరుగు ప్రయాణమవుతుండటంతో అధికార టిఆర్‌ఎస్ పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమ చెక్ పవర్ రద్దు చేస్తామని బెదిరించడం వల్లనే టిఆర్‌ఎస్ పార్టీలో చేరానని, తాను ఆ పార్టీలో పని చేయనంటూ ఒకరు, ఆ పార్టీలో ఉన్న పాత నేతల కింద తాను పని చేయలేనంటూ మరో నాయకుడు పేర్కొంటూ మళ్లీ తమ స్వంత గూటికి చేరుకుంటున్నారు. ఓటరు నాడిని అంచనా వేయలేని ఖేడ్‌లో రోజుకో వింత నాటకం చోటు చేసుకుంటుండటంతో ప్రజలు అవాక్కు అవుతున్నారు. కాగా పోయిన వారిని లెక్క చేయకుండా ఉన్న వారే సంకల్ప బలంతో పని చేస్తే ఉప ఎన్నికలో గెలుపు సునాయాసం అవుతుందన్న ధీమాతో కాంగ్రెస్, టిడిపి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అభ్యర్థులు గుండె నిబ్బరంతో ఉంటే ఓట్లు రాబట్టుకు వస్తామంటూ మనో ధైర్యాన్ని కల్పిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం పూరె్తై, ఉప సంహరణ ముగిస్తే మరింత ఉత్కంఠకు గురి చేసే చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. మొత్తంమీద జిల్లా వ్యాప్తంగా నారాయణఖేడ్ ఉప ఎన్నిక చర్చనీయాంశం కాగా, గెలుపు, ఓటములు, పార్టీల భవితవ్యంపై రాష్ట్ర స్థాయిలో పెద్ద చర్చకు వచ్చే అవకాశానికి తావివ్వడం ఒక్క ఖేడ్ నియోజకవర్గానికే మరోమారు దక్కింది.

విద్యార్థులకు మొక్కల పంపిణీ
నంగునూరు, జనవరి 22: విద్యార్థులు పాఠశాల ఆవరణ, ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలని ఎంఇఓ దేశిరెడ్డి అన్నారు. శుక్రవారం బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మగ్దుంపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మొక్కలు పంపిణి చేశారు. పర్యావరణ పరిరక్షణ పై కళాబృందం ప్రదర్శనలు ఇచ్చారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసి చైర్మన్ నర్సింగరావు, నాయకులు మహేశ్, అశోక్, సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.