క్రీడాభూమి

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, ఏప్రిల్ 30: హోం గ్రౌండ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చెలరేగిపోయింది. ప్రత్యర్థిని కేవలం 67 పరుగులకు కట్టడి చేసి, ఆతర్వాత ఇంకా 73 బంతులు మిగిలి ఉండగానే, పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. అన్ని రకాలుగా విఫలమైన డేర్‌డెవిల్స్ చిత్తుచిత్తుగా ఓడింది. ఐపిఎల్ చరిత్రలోనే మూడో అత్యల్ప స్కోరును నమోదు చేసిన ఆ జట్టు అవమానకరమైన రీతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. పంజాబ్ బౌలింగ్‌ను, ప్రత్యేకించి సందీప్ శర్మను డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ఫలితంగా తక్కువ స్కోరుకే ఆలౌటైన ఆ జట్టు పది వికెట్ల తేడాతో చిత్తయింది. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, మొదట బ్యాటింగ్‌కు దిగిన డేర్‌డెవిల్స్ 17.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. కొరీ ఆండర్సన్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుంది. అతనితోపాటు ఈ మ్యాచ్‌కి కెప్టెన్సీ వహించిన కరుణ్ నాయర్ (11), టెయిలెండర్ కాగిసో రబదా (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. సమర్థులుగా పేరు సంపాదించిన సంజూ శాంసన్ (5), శామ్ బిల్లింగ్స్ (0), శ్రేయాస్ అయ్యర్ (6), రిషభ్ పంత్ (3), క్రిస్ మోరిస్ (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అమిత్ మిశ్రా 4 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, మహమ్మద్ షమీ (2), షాబాజ్ నదీం (0) తమ ఉనికిని నిరూపించుకోలేకపోయారు. పంజాబ్ మీడియం పేసర్ సందీప్ శర్మ బౌలింగ్ డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్‌ను నానా ఇబ్బందులకు గురి చేసింది. నాలుగు ఓవర్లు బౌల్ చేసిన అతను కేవలం 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఒక రకంగా డేర్‌డెవిల్స్ పతనానికి అతనే కారకుడయ్యాడు. అక్షర్ పటేల్ 22 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. కాగా, వరుణ్ ఆరోన్ కూడా డేర్‌డెవిల్స్ బ్యాట్స్‌మెన్‌పై పంజా విసిరాడు. రెండు ఓవర్లు బౌల్ చేసిన అతను రెండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. మోహిత్ శర్మ 7 బంతులు బౌల్ చేసి, మూడు పరుగులకు ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
గుప్టిల్ హాఫ్ సెంచరీ
సాధించాల్సిన లక్ష్యం చాలా చిన్నది కావడంతో, ఎలాంటి ఒత్తిడి లేకుండా పంజాబ్ ఇన్నింగ్స్‌ను హషీం ఆమ్లాతో కలిసి ప్రారంభించిన మార్టిన్ గుప్టిల్ స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు కొల్లగొట్టాడు. దీనితో ఆమ్లా అతనికి మద్దతునిచ్చే పాత్రను పోషించాల్సి వచ్చింది. కేవలం 7.5 ఓవర్లలోనే, వికెట్ నష్టం లేకుండా 68 పరుగులు సాధించిన పంజాబ్ పదివికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. గుప్టిల్ 27 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 50 పరుగులు చేయగా, ఆమ్లా 20 బంతుల్లో 16 పరుగులు సాధించాడు. డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీసిన సందీప్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఇలావుంటే, ఐపిఎల్ పవర్ ప్లే సమయంలో సందీప్ శర్మ ఇంత వరకూ 114 బంతులు వేశాడు. ఓవర్‌కు సగటున 6.57 పరుగులిచ్చాడు. పవర్ ప్లే సమయంలో అతను ఆరు వికెట్లు పడగొట్టాడు. ఫీల్డింగ్ నిబంధనలు అమల్లో ఉంటాయ కాబట్టి, సహజంగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయ ఆడే పవర్ ప్లేలో ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసిన అతి కొద్ది మంది బౌలర్లలో సందీప్ శర్మ ఒకడు. బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగే ఐపిఎల్‌లో కొంత మంది బౌలర్లు కూడా రాణిస్తారనడానికి ఇదే నిదర్శనం.
స్కోరుబోర్డు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: సంజూ శాంసన్ సి మోసిత్ శర్మ బి సందీప్ శర్మ 5, శామ్ బిల్లింగ్స్ సి వృద్ధిమాన్ సాహా బి మోహిత్ శర్మ 0, కరుణ్ నాయర్ బి అక్షర్ పటేల్ 11, శ్రేయాస్ అయ్యర్ సి అండ్ బి సందీప్ శర్మ 6, రిషభ్ పంత్ ఎల్‌బి గ్లేన్ మాక్స్‌వెల్ 3, కొరీ ఆండర్సన్ బి వరుణ్ ఆరోన్ 18, క్రిస్ మోరిస్ సి అండ్ బి అక్షర్ పటేల్ 2, కాగిసో రబదా సి షాన్ మార్ష్ బి సందీప్ శర్మ 11, అమిత్ మిశ్రా 4 నాటౌట్, మహమ్మద్ షమీ సి సందీప్ శర్మ బి వరుణ్ ఆరోన్ 2, షాబాజ్ నదీం సి అండ్ బి మోహిత్ శర్మ 0, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (17.1 ఓవర్లలో) 67 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-1, 2-7, 3-22, 4-25, 5-30, 6-33, 7-59, 8-62, 9-67, 10-67.
బౌలింగ్: సందీప్ శర్మ 4-0-20-4, నటరాజన్ 2-0-7-0, మోహిత్ శర్మ 1.1-0-3-1, అక్షర్ పటేల్ 4-0-22-2, గ్లేన్ మాక్స్‌వెల్ 4-0-12-1, వరుణ్ ఆరోన్ 2-0-3-2.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్: మార్టిన్ గుప్టిల్ 50 నాటౌట్, హషీం ఆమ్లా 16 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (7.5 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 68.
బౌలింగ్: మహమ్మద్ షమీ 2-0-19-0, కాగిసో రబదా 2-0-18-0, క్రిస్ మోరిస్ 2-0-13-0, అమిత్ మిశ్రా 1-0-9-0, షాబాజ్ నదీం 0.5-0-9-0.

చిత్రం..మూడు వికెట్లు పడగొట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మకు సహచరుల అభినందన