క్రీడాభూమి

టీమిండియాకు కొత్త కోచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ముగిసే లోపుగానే టీమిండియాకు కొత్త కోచ్‌ని నియమించే ప్రక్రియను పూర్తి చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కోచ్ పదవికి దరఖాస్తులను బోర్డు ఆహ్వానించింది. ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే కాంట్రాక్టు చాంపియన్స్ ట్రోఫీతో ముగుస్తుంది. దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నకారణంగా కుంబ్లే కూడా తన అభ్యర్థిత్వాన్ని పంపాడు. అతనికి మాజీ ఓపెనర్ వీరేందర్ సెవాగ్ నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చు. వీరిద్దరితోపాటు కోచ్ పదవికి టామ్ మూడీ, రిచర్డ్ పీబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డా గణేష్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ క్రెగ్ మెక్‌డార్మట్ కూడా తన దరఖాస్తును పంపాడు. అయితే, బోర్డు నిర్దేశించిన తుది గడువు మే 31 తర్వాత అందడంతో దానిని పరిగణలోకి తీసుకోవడం లేదు. కాగా, సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సిఎసి) దరఖాస్తులను పరిశీలించి, జాబితాను కుదించి, ఇంటర్వ్యూ చేయాల్సిన అభ్యర్థులను ఖాయం చేస్తుంది. ఇంటర్వ్యూ ప్రక్రియను ముగించిన తర్వాత బిసిసిఐకి ప్రతిపాదనలతో కూడిన నివేదిక పంపుతుంది. దాని ఆధారంగానే కొత్త కోచ్‌ను బోర్డు అధికారికంగా ప్రకటిస్తుంది. ఒకటి రెండు రోజుల్లో సిఎసి సమావేశమై, ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఈనెల 18వ తేదీతో చాంపియన్స్ ట్రోఫీ ముగుస్తుంది. ఈలోపే కోచ్ ఎంపిక పూర్తి కావాలన్న అభిప్రాయం బిసిసిఐ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
కుంబ్లేపై వ్యతిరేకత?
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు ఆటగాళ్లకు కుంబ్లేపై వ్యతిరేకత ఉందని వార్తలు వచ్చాయి. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇటీవల లండన్‌లో భారత ఆటగాళ్లను కలిసి, వారి అభిప్రాయాలను సేకరించాడని కూడా కథనాలు వినిపించాయి. గంగూలీ ఆ వార్తలను ఖండించినప్పటికీ, బిసిసిఐ ఇప్పటికే కుంబ్లే గురించి కోహ్లీ, అతని సహచర బృందం ఏమనుకుంటున్నారనే సమాచారాన్ని తీసుకుందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. సక్రమంగా ఆడకపోతే, జట్టులో స్థానం ఉండదంటూ కుంబ్లే తరచూ బెదిరిస్తుంటాడని ఆటగాళ్లు ఆరోపిస్తున్నట్టు తెలుస్తున్నది. నిజానిజాలు ఎలావున్నా, కొత్త కోచ్‌కి దరఖాస్తుల స్వీకరణను మే 25న ఆరంభించగా, మొదటి దరఖాస్తు కుంబ్లేదే అయింది. ప్రస్తుత కోచ్ హోదాలో అతనికి ‘డైరెక్ట్ ఎంట్రీ’ లభించింది. ఈ అవకాశం ఉన్నప్పటికీ, కుంబ్లే దరఖాస్తును పంపాడు. నిజానికి బోర్డుకు అందిన మొదటి దరఖాస్తు అదే కావడం గమనార్హం. టీమిండియా బలాబలాలను విశే్లషించడంతోపాటు, రాబోయే కాలంలో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన చర్యలను కూడా అతను తన దరఖాస్తులో వివరించాడు. అన్ని నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలన్న సుప్రీం కోర్టు ఆదేశంతో, బిసిసిఐ మొట్టమొదటిసారి కోచ్ పదవికి నిరుడు దరఖాస్తులను ఆహ్వానించింది. అప్పటికే ప్రత్యేకంగా తన కోసమే సృష్టించిన జట్టు డైరెక్టర్ హోదాను అనుభవిస్తూ, పరోక్షంగా కోచ్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్న రవి శాస్ర్తీ ఎంపిక లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ, చివరిగా దరఖాస్తు చేసుకున్న కుంబ్లేకు అనూహ్యంగా కోచ్ పదవిని కట్టబెట్టారు. కుంబ్లే కోచ్‌గా వ్యవహరించిన ఏడాది కాలంలో భారత్ 17 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. 12 మ్యాచ్‌లను గెల్చుకుంది. నాలుగు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. అతని పర్యవేక్షణలోనే టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. కుంబ్లే సాధించిన ఫలితాలను పరిగణలోకి తీసుకొని అతనిని కోచ్‌గా కొనసాగిస్తారా లేక జట్టు కెప్టెన్ కోహ్లీసహా కొంత మంది ఆటగాళ్లు వ్యతిరేకిస్తున్న కారణంగా అతని స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారా అన్నది ఆసక్తి రేపుతున్నది. మరో పది రోజుల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడడం ఖాయంగా కనిపిస్తున్నది.