జాతీయ వార్తలు

మోగిన నగారా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: కొత్త రాష్టప్రతి ఎన్నిక నగారా మోగింది. ఎన్నిక ఏకగ్రీవం కానిపక్షంలో జూలై 17న ఓటింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూలై 20న ఢిల్లీలో నిర్వహిస్తారు. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24తో ముగుస్తోంది. కొత్త రాష్టప్రతి జూలై 25న పదవీ బాధ్యతలు చేపడతారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ బుధవారం విలేకరుల సమావేశంలో కొత్త రాష్టప్రతి ఎన్నిక షెడ్యూలు ప్రకటించారు. పార్లమెంట్ సభ్యులు, ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సరఫరాచేసే ప్రత్యేక పెన్నును ఉపయోగించాల్సి ఉంటుంది. తమ సొంత పెన్నుతో బ్యాలెట్ పత్రంపై టిక్ కొడితే అతని ఓటు చెల్లకుండాపోతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి స్పష్టం చేశారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ కొత్త రాష్టప్రతి ఎన్నికకు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. ఓటింగ్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది. కొత్త రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జూన్ 14న జారీ చేస్తారు. నామినేషన్ పత్రాలను జూన్ 28లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్ పత్రాల పరిశీలన జూన్ 29న చేపడతారు. జూలై 1లోగా నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిపై జరుగుతుంది కాబట్టి ఏ రాజకీయ పార్టీ కూడా ఓటు వేయటం గురించి తమ ఎంపీలు, శాసన సభ్యులకు విప్ జారీ చేసేందుకు వీలులేదని నసీం జైదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు, ఢిల్లీ, పాండిచ్చేరితోపాటు ఇతర అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు రాష్టప్రతిని ఎన్నుకుంటారు. నామినేషన్ పత్రాలపై రాష్టప్రతి పదవికి పోటీ చేసే అభ్యర్థి పేరును యాభై మంది ప్రజాప్రతినిధులు ప్రతిపాదిస్తే మరో యాభై మంది ప్రజాప్రతినిధులు బలపర్చాల్సి ఉంటుంది. ఒక ఎంపీ లేదా శాసన సభ్యుడు ఒక అభ్యర్థిని మాత్రమే ప్రతిపాదించటం లేదా సమర్థించేందుకు వీలుంటుంది. ప్రతి అభ్యర్థి నాలుగు నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చని నసీం జైదీ తెలిపారు. ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్‌లో తమ ఓటును వేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు తమ ఓట్లను శాసన సభలో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాల్లో వేయాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ఎంపీలు తమ ఓటును రాష్ట్ర శాసనసభలో ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రంలో వేసేందుకు వీలు కల్పిస్తారు. అయితే దీనికోసం వారు పోలింగ్‌కు పది రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నిలకు సంబంధించిన చట్టం ప్రకారం ఎన్నికల సందర్భంగా డబ్బు ఆశ చూపించటం లేదా వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించటం నిషిద్ధం. ఇలాంటి ప్రయత్నం జరిగినట్టు రుజువైతే ఎన్నిక రద్దవుతుందని జైదీ స్పష్టం చేశారు.

రాష్టప్రతి ఎన్నికల షెడ్యూల్‌ను మీడియాకు వివరిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జైదీ