జాతీయ వార్తలు

ఆసనం ఆరోగ్య శాసనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/న్యూఢిల్లీ, జూన్ 21: మూడవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది యోగాసనాలు వేశారు. లక్నోలోని రమాబాయి అంబేద్కర్ మైదానంలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు వేలాది మంది ఔత్సాహికులతో కలిసి యోగాసనాలు వేశారు. లండన్‌లోని ట్రాఫల్గర్ స్క్వేర్ మొదలుకొని చైనా గ్రేట్‌వాల్ దాకా అనేక దేశాల్లోను యోగ దినోత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇప్పుడు యోగ ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగమైందన్నారు. మన భాష, సంస్కృతి సంప్రదాయాలు తెలియని చాలా దేశాలు ఇప్పుడు యోగద్వారా భారత్‌తో అనుసంధానం అవుతున్నాయన్నారు. శరీరాన్ని, మనస్సును అనుసంధానం చేసే యోగ ఇప్పుడు ప్రపంచాన్ని ఒక్కటి చేయడంలోను ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. లక్నోలో బుధవారం తెల్లవారుజామునుంచి భారీవర్షం కురుస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో జనం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ యోగను తమ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోదీ, ఆదిత్యనాథ్‌లతో పాటుగా యుపి గవర్నర్ రాంనాయక్ పాల్గొన్నారు.
న్యూఢిల్లీలోను బుధవారం తెల్లవారుజామునుంచి వర్షం కురుస్తున్నప్పటికీ 77 వేల మందికి పైగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన యోగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎర్రకోట లాన్స్‌లో జరిగిన ప్రధాన కార్యక్రమానికి 50 వేల మంది హాజరు కాగా, కన్నాట్‌ప్లేస్‌లో పదివేల మంది, రోహిణిలోని డిడిఏ పార్కులో 9వేల మంది పాల్గొన్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. లోధీ గార్డెన్, నెహ్రూ పార్కు, తాల్‌కటోరా గార్డెన్, ఇండియా గేట్ వద్ద ఉన్న చిల్డ్రన్స్ పార్కులోను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కన్నాట్‌ప్లేస్ వద్ద జరిగిన వేడుకల్లో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, విజయ్ గోయల్, ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, బిజెపి రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, ఆ పార్టీ సీనియర్ నేత మీనాక్షి లేఖి తదితరులు పాల్గొన్నారు. పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సైతం తమ ఉద్యోగులకోసం ఆఫీసుల వద్ద పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల పెద్దసంఖ్యలో జనం అంతర్జాతీయ యోగ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. లండన్ ఐ, ట్రాఫాల్గర్ స్క్వేర్, చైనా గ్రేట్‌వాల్ లాంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో జనం యోగాసనాల్లో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో అమెరికాలోని ప్రవాస భారతీయులతో పాటుగా స్థానికులు సైతం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలోని సొవేటో టౌన్‌షిప్‌లో దాదాపు 1200 మంది తొలిసారిగా యోగాసనాలను వేశారు.
ఐరాస ప్రధాన కార్యాలయంలో..
ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత దౌత్య కార్యాలయం ఐరాస ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన భారీ కార్యక్రమంలో ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు పీటర్ థామ్సన్, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, ఐక్యరాజ్య సమితికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, వివిధ దేశాల రాయబారులతోపాటు వివిధ రంగాలకు చెందినవారు, చిన్నారులు కూడా భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీటర్ థామ్సన్ మాట్లాడుతూ ఇప్పుడు యోగ అంతర్జాతీయ గుర్తింపు సంపాదించిందని, జనం మానసిక సమతౌల్యతను సాధించడానికి యోగ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. యోగ దినోత్సవాన్ని పురస్కరించుకోని ఐరాస ఒక ప్రత్యేక తపాలాబిళ్లను కూడా విడుదల చేసింది.
చిత్రం : లక్నోలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ