ఖమ్మం

ముస్తాబైన ఈద్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 25: పవిత్ర రంజాన్ ఉపవాసాల మాసం ఆదివారంతో పూర్తయింది. 30రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు నేడు రంజాన్ పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు అన్ని మసీదుల వద్ద ఆదివారం రాత్రి సైరన్ మోగించి చాటింపు చేశారు. రంజాన్ మాసం పూర్తవడంతో నిత్యం నిర్వహించే తరావి నమాజ్ ప్రార్థనలు నిలిపివేశారు. జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లోనూ రంజాన్ పర్వదినం జరుపుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ముస్లింలు నూతన వస్త్రాలను ధరించి సంబంధిత గ్రామం, పట్టణవాసులంతా ఒక్కచోట చేరి నేడు నమాజ్ చేపట్టనున్నారు. రంజాన్ సందర్భంగా మార్కెట్లలో సందడి నెలకొంది. సోమవారం రంజాన్ కావడంతో ఆదివారమే పండుగ శోభ సంతరించుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు సందడి కనిపించింది. వస్త్ర దుకాణాలతో పాటు చెప్పుల దుకాణాలు, కాస్మోటిక్ దుకాణాలు, పూల దుకాణాలు, పండ్ల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కాగా రంజాన్ సందర్భంగా సామూహిక ప్రార్థనలకు ఈద్గాలు ముస్తాబయ్యాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఈద్గాలకు రంగులు వేయడంతో పాటు మైదానాలను శుభ్రపరిచి పండుగ ప్రార్థనల కోసం సిద్ధం చేశారు. పలుచోట్ల దర్గాలు, ఖబరస్తాన్(ముస్లింల శ్మశానవాటిక)ల లోనూ పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ప్రార్థనలకు సిద్ధం చేశారు. ఈద్గాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకే రంజాన్ సామూహిక ప్రార్థనలు కొనసాగనున్నాయి. ప్రార్థనలకు ఎటువంటి ఆటంకం కలగకుండా షామియానాలు, కార్పెట్‌లను ఏర్పాటు చేశారు. మత ప్రవక్తలు బోధనలు చేసేందుకు ప్రత్యేక వేదికలను సిద్ధం చేశారు. ప్రజాప్రతినిధులు ఈద్గాల వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. రంజాన్ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎస్పీ అంబర్‌కిశోర్‌ఝా, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, సున్నం రాజయ్య తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు భద్రాచలం, పాల్వంచ, అశ్వారావుపేట, మణుగూరు పట్టణాల్లోని ప్రార్థనా మందిరాల వద్ద సిబ్బందిని మోహరించారు. పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.