జాతీయ వార్తలు

‘అమర్‌నాథ్’ కుట్రదారు కోసం వేట ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జూలై 12: అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన కుట్రదారు, పాకిస్తాన్ జాతీయుడు, లష్కర్ ఏ తోయిబా కమాండర్ అబూ ఇస్మాయిల్‌కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ప్రధానంగా దక్షిణ కాశ్మీర్‌లో ఇస్మాయిల్‌కు సంబంధించిన సమాచార వ్యవస్థను ట్రాక్ చేసేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి. సోమవారం అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు ఆరుగురు మహిళలతోసహా మొత్తం ఏడుగురు యాత్రికులను హతమార్చి, 19మందిని గాయపరచిన సంగతి తెలిసిందే. ‘నెల రోజులుగా ఒకదాని వెంట ఒకటిగా వరుసగా తమకు నష్టం జరుగుతుండటంతో ఉగ్రవాదులకు పాలుపోని పరిస్థితి నెలకొంది. దీంతో వారు సాధారణ పౌరులు, పర్యాటకులను లక్ష్యం చేసుకుంటున్నారు’ అని ఓ సీనియర్ అధికారి అన్నారు. చాలాకాలంగా కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న అబూ ఇస్మాయిల్ ఏడాది క్రితమే దక్షిణ కాశ్మీర్‌కు మకాం మార్చాడు. అక్కడినుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ హిందూ ఉగ్రవాదితో సహా లష్కర్ కీలక నాయకుడిని అరెస్టు చేసినట్లు ప్రకటించిన కొద్దిగంటల్లోనే అనంత్‌నాగ్‌లో అమర్‌నాథ్ యాత్రికులపై దాడి జరగటం గమనార్హం. విచిత్రమేమంటే ఈ దాడిని లష్కర్ సంస్థ ఖండించింది. యాత్రికులపై దాడి చేయటం ఇస్లామిక్ సంప్రదాయాలకు విరుద్ధమని ఆ సంస్థ ప్రతినిధి అబ్దుల్లా ఘజ్నవి ప్రకటించాడు. ఈ దాడి తీవ్రంగా గర్హించదగినదని, ఇస్లాం సంప్రదాయం ఏ మత విశ్వాసానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించదని అతను అన్నాడు.
కట్టుదిట్టంగా భద్రత
అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసినట్లు కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ తెలిపారు. అనంత్‌నాగ్ దాడి నేపథ్యంలో యాత్రికుల రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ ఏర్పాట్లపట్ల కేంద్రం సంతృప్తిగా ఉందని మంత్రి వివరించారు. భవిష్యత్తులో యాత్రికులపై ఎలాంటి దాడులు నిర్వహించకుండా చర్యలు చేపట్టామన్నారు. అమర్‌నాథ్ యాత్ర భద్రతకు సంబంధించి కేంద్రం, జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని గత 30 ఏళ్లుగా అమర్‌నాథ్ యాత్రపై ఉగ్రమూకలు కన్నువేస్తూనే ఉన్నాయని, యాత్రను భగ్నం చేసేందుకు కుట్రపన్నుతూనే ఉన్నాయని ఎప్పటికప్పుడు రక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నామని మరో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. కాగా, పహల్గామ్‌లో నన్‌వాన్ కాంప్‌లోని మార్కెట్‌ను అమర్‌నాథ్ యాత్రికులపై దాడికి నిరసనగా బంద్ పాటించారు.
అహ్మదాబాద్‌లో బంద్ ప్రశాంతం
గుజరాత్‌కు చెందిన అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో బుధవారం గుజరాత్‌లోని వాల్సాద్‌లో బంద్ ప్రశాంతంగా జరిగింది. షాపులు, మాల్స్, థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రధాన వ్యాపార కూడళ్లన్నీ మూతపడ్డాయి. వాల్సాద్‌లో ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగలేదు.
చిత్రం.. అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా బుధవారం ఢిల్లీలో భారీ త్రివర్ణ పతాకంతో నిరసన తెలుపుతున్న ఎబివిపి కార్యకర్తలు