మెదక్

చివరికి నీరందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్: మహబూబ్‌నహర్ చివరి ఆయకట్టు వరకు సాగునీరందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. సింగూరు నుండి ఘన్‌పూర్ ఆనకట్టకు, అక్కడి నుండి మహబూబ్‌నహర్, ఫతేనహర్ కాలువలకు నీటిని విడుదల చేసిన విషయం తెల్సిందే. జైకా, ప్రభుత్వం నిధులతో కాలువలను ఆధునీకరించారు. ఎంఎన్ కాలువ చివరికి ఇంకా చేయాల్సి ఉంది. ఇందుకోసం 32 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినప్పటికీ చివరి ఆయకట్టు వరకు సాగునీరించాలన్న ఉద్దేశ్యంతో ఫరీద్‌పూర్ వరకు కాలువ నీరురాగా సర్దన, జక్కన్నపేట నుండి పోచంరాల్ వరకు నీరు వెళ్లేందుకువీలుగా జెసిబితో కాలువలో ఉన్న ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారు. ఆదివారం నీటిపారుదల శాఖ డిఇ శివనాగరాజు చివరి కాలువ ఆయకట్టు ప్రాంతాలైన జక్కన్నపేట, సర్దన తదితర ప్రాంతాలు సందర్శించారు. సిబ్బందిని అక్కడే ఉంచి నీరు చివరి వరకు వెళ్లేలా పర్యవేక్షించారు. రైతులు కూడా ముందుకొచ్చొనట్లచయితే చివరి చెర్వులు నింపుతామని తెలిపారు. ఇదిలా ఉండగా కాలువ కింద రైతులు ముమ్మరంగా వరినాట్లు వేస్తున్నారు. మండలంలోని ఎగువ ప్రాంతంలో గల మాచవరం, పేరూర్, చిట్యాల, జానకంపల్లి, బొల్లారం, మెదక్, హవేళీఘణాపూర్ మండలంలోని ముత్తాయికోట, మద్దుల్‌వాయి, కూచన్‌పల్లి, ముత్తాయిపల్లి గ్రామాల వరకు కాలువ నీరు వస్తున్నాయి. దీంతో పెద్దయెత్తున రైతులు వరినాట్లు వేయడంలో నిమగ్నమయ్యారు. చివరి ఆయకట్టు రైతులు సైతం కాలువతోపాటు బోర్లపై ఆధారపడి వరినాట్లు వేస్తున్నారు. కాలువ నీరు వస్తే మరింత మేలు జరగనుంది.

ప్రశాంతంగా టెట్
సంగారెడ్డి, జూలై 23: ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఆదివారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహించారు. ఎస్‌జిటి అభ్యర్థులకు ఉదయం, బిఇడి అభ్యర్థులకు మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు అభ్యర్థులు ఆసక్తిగా హాజరయ్యారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటల్లో ఉదయం, మధ్యాహ్నానికి సంబంధించి మొత్తం 120 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసారు. 27407 మంది అభ్యర్థులకుగాను 26121 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 1286 మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి ఎవరిని అనుమతించమనే నిబంధనలను పరిగణలోకి తీసుకున్న అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఉదయం 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా మొత్తం 4516 మంది అభ్యర్థులకుగాను 4271 మంది హాజరుకాగా 245 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షను మొత్తం 33 కేంద్రాల్లో నిర్వహించగా 7773 మంది అభ్యర్థులకు 7374 మంది హాజరుకాగా 399 మంది పరీక్షలకు హాజరుకాలేకపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాశాఖ ప్రత్యేక అధికారి వెంకటేశ్వర శర్మ, డిఇఓ విజయకుమారి పరీక్ష కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. సంగారెడ్డి, జోగిపేట, పటన్‌చెరు, రామచంద్రాపూర్, సదాశివపేట, జహీరాబాద్ తదితర పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి అభ్యర్థులకు వెసులుబాటు కల్పించారు. సిద్దిపేట జిల్లాలో ఉదయం పరీక్షకు 2971 మందికి 2893 మంది హాజరుకాగా 78 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 5424 మందికిగాను 5227 మంది హాజరుకాగా 197 మంది పరీక్షకు రాలేకపోయారు. 36 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డితో పాటు జిల్లా స్థాయి అధికారులు పరీక్షలను పర్యవేక్షించారు. మెదక్ జిల్లాలో ఉదయం 14 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు మొత్తం 2857 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2732 మంది పరీక్షలు వ్రాసారు. 125 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 18 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 3866 మంది హాజరుకావాల్సి ఉండగా 3624 మంది మాత్రమే హాజరయ్యారు. 242 మంది అభ్యర్థులు పరీక్ష వ్రాయలేకపోయారు. ప్రత్యేక అధికారి వెంకటేశ్వర శర్మ, డిఆర్‌ఓ రామానుజాచారి, డిఇఓ సరోజినిదేవి పరీక్ష కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు. మొత్తంమీద ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డిలో భావి ఉపాధ్యాయులుగా నియమితులయ్యేందుకు అర్హత పరీక్షలకు హాజరై తమ భవిషత్తును నిర్దేశించుకునే ఫలితాన్ని త్వరలోనే తెలుసుకోనున్నారు.

మెదక్ బల్దియాలో ముదిరిన ఆధిపత్య పోరు!
మెదక్, జూలై 23: మెదక్ బల్దియా రాజకీయాలు గ్రూప్ తగాదాలు వేడెక్కాయి. ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి శనివారం మెదక్‌లోని పలు వార్డులలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డులో కౌన్సిలర్ యశోద, 6వ వార్డులో కౌన్సిలర్ అరునార్తి రమణ, 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్ మధుసూదన్‌రావు పాల్గొన్నారు. 14వ వార్డులో కౌన్సిలర్ రబ్బీన్ దివాకర్ లేకపోవడంతో హరితహారం ఉపసభాపతి రద్దు చేశారు. 27వ వార్డులో హరితహారం జరిగినప్పటికినీ కౌన్సిలర్ బట్టి జగపతి పాల్గొనలేదు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్మన్ మల్లిఖార్జున్ గౌడ్ వర్గం కౌన్సిలర్లు మొత్తం మెదక్ మున్సిపల్ సమావేశ మందిరంలో ఉన్నారు. దీంతో ఉపసభాపతి వర్గం కౌన్సిలర్లు, చైర్మన్ వర్గం కౌన్సిలర్ల మధ్య ఉన్న విభేదాలు పూర్తిగా రచ్చకెక్కాయి. ఇదిలా ఉండగా చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైస్ చైర్మన్ రాగి అశోక్ పావులు కదుపుతున్నట్లు విశ్వనీయంగా తెలిసింది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఇరువర్గాలు కూడా వారి మెజార్టీని పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెరాస పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఆ రాజీనామాను ఉపసంహరించుకున్న 19వ వార్డు కౌన్సిలర్ బట్టి సులోచన ఉపసభాపతిని వ్యతిరేకించి చైర్మన్ గ్రూప్‌లో చేరారు. ఇప్పుడు చైర్మన్ వర్గాన్ని వ్యతిరేకించి వైస్ చైర్మన్ వర్గంలో ఆమె చేరారు. మెదక్ పట్టణంలో బిజేపి కౌన్సిలర్లు ఇద్దరు ఉన్నారు. వారిలో గోదల జ్యోతి చైర్మన్‌కు మద్దతు ఇవ్వగా, దొంతి లక్ష్మివైస్ చైర్మన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ కౌన్సిలర్లు ముగ్గురు ఉండగా అందులో మధుసూదన్‌రావు, దాయర యశోద వైస్ చైర్మన్‌కు మద్దతు ఇవ్వగా, రబ్బీన్ దివాకర్ చైర్మన్‌కు మద్దతుగా నిలిచాడు. అయితే మెదక్ పట్టణంలో 27 వార్డులు విస్తరించి ఉన్నాయి. ఈ వార్డులలో మూడు కాంగ్రెస్, రెండు బిజేపి, ఒకటి టిడిపి కౌన్సిలర్లు ఉండగా మిగిలిన వార్డులన్నీ తెరాస కౌన్సిలర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ గ్రూప్‌లుగా విడిపోయారు. వైస్ చైర్మన్ రాగి అశోక్ ఉపసభాపతికి దగ్గరయ్యాడు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చైర్మన్ దంపతులు గాయత్రి మల్లికార్జున్‌గౌడ్ నిరంతర పోరాటం చేశారు. జైలుకు కూడా వెళ్లారు. చైర్మన్‌పై కేసులు కూడా మోపారు. తెరాస పార్టీ నుంచి ఒక దఫా పద్మాదేవేందర్‌రెడ్డికి టికెట్ దొరకనప్పుడు ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమెకు కుడి భుజంగా మల్లి వ్యవహరించాడు. ఆ తరువాత తిరిగి ఎన్నికలు వచ్చినప్పుడు పద్మాదేవేందర్‌రెడ్డికి కెసిఆర్ టికెట్ ఇచ్చారు. ఆమె గెలుపునకు చైర్మన్ అత్యంత కృషి చేశారు. అలాంటి అభ్యర్థిని విస్మరించి పార్టీకి ఎలాంటి సేవలూ చేయనటువంటి వైస్ చైర్మన్ రాగి అశోక్‌ను ఉపసభాపతి దగ్గరకు తీసుకోవడం చైర్మన్ వర్గానికి మింగుడు పడటం లేదు. అయితే చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెడితే అందుకు మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులు అంగీకరించరని తెలుస్తుంది. ఇప్పటి వరకు చైర్మన్‌కు మెజార్టీ కౌన్సిలర్లు మద్దతుగా నిలిచారు. రాగి అశోక్ వర్గంలో రాధా, బట్టి సులోచన, అమీన, సలాం, మాయ మల్లేశం, రమణలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానంలో కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌లతో రాగి అశోక్‌కు తొమ్మిది ఓట్లు రాగా చైర్మన్‌కు మాత్రం 11 ఓట్లు నిలిచాయి. ఇందులో కౌన్సిలర్లు అనిల్‌కుమార్, ఐతారం నర్సింలు, కండెల నాగయ్య, సోహెల్, జెల్ల గాయత్రి, గోదల జ్యోతి, ఆరెళ్ల గాయత్రి, యశోద, చంద్రకళ, విజయలక్ష్మీల 11తో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు రబ్బీన్‌దివాకర్, అవసరమైతే 27వ వార్డు కౌన్సిలర్ బట్టి జగపతి చైర్మన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిసింది. అందువలన ఇప్పటి నుంచే కౌన్సిలర్ల మెజార్టీని పెంచుకునేందుకు వైస్ చైర్మన్ అశోక్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో దాయర రవి మాట్లాడుతూ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైస్ చైర్మన్ సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. చైర్మన్ పదవి ఉపసభాపతి ప్రకటించిన పేరుకు మద్దతు ఇస్తామని ఆయన తెలిపారు. దీంతో మెదక్ బల్దియాలో అవిశ్వాస తీర్మానంపై పెద్దయెత్తున ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ ఇరువర్గాల మధ్య ఏర్పడిన విభేదాలు రచ్చకెక్కినప్పటికీ, రెండు వర్గాల బలాబలాలను మంత్రి హరీష్‌రావు కోరినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. కానీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ తెలంగాణ ఉద్యమంలో నిరంతర పోరాటం చేసి జైలుకు వెళ్లిన అతని వైపు మంత్రి కెటిఆర్, మైనింగ్ చైర్మన్ సుభాష్‌రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందువలన ఇరువర్గాల మధ్య రాజీమార్గమే ఉపసభాపతికి అండ అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ రాజీతో కుంటుపడిన అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నిన్న గాక మొన్న వచ్చిన వైస్ చైర్మన్ అశోక్‌కు చైర్మన్ పట్టం కట్టడం అంత సులువుకాదని విపక్షాలు చర్చించుకుంటున్నాయి. రాగి అశోక్ చైర్మన్‌గా మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో మధుసూదన్‌రావుకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. బల్దియా రాజకీయం ఊపందుకోవడంతో అంతట చర్చనియాంశంగా మారింది.

బూర్గుపల్లిలో ఘనంగా బోనాల సంబరాలు
గజ్వేల్, జూలై 23: గజ్వేల్ మండల పరిదిలోని బూర్గుపల్లిలో ఆదివారం బోనాల సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలు గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించడంతోపాటు తమ పిల్లలను చల్లగా చూడాలని, సంవృద్దిగా వర్షాలు పడాలని, పాడి పంటలు సంవృద్ధిగా పండాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగురైలు అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సిఎం కెసిఆర్‌కు సద్బుద్ది ప్రసాదించాలని గ్రామ దేవతలకు మొక్కుకున్నట్లు పేర్కొన్నారు.
కేతకిలో అమావాస్య పూజలు
* పెద్ద సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
ఝరాసంగం, జూలై 23: దక్షిణ కాశీగా ప్రసద్ది చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శ్రావణమాస అమవాస్య ప్రత్యేక పూజలను నిర్వహించారు. కర్నాటక, మహరాష్ట్ర, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శించుకునే భక్తులకు సరయైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై అసహానం వ్యక్తం చేశారు. జహీరాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఫుడ్ కార్పోరేషన్ సభ్యులు శంకర్ నాయక్, ఎంపిపి సంగీత సంగమేశ్వర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శించుకున్నారు.

తెలంగాణ అస్థిత్వాన్ని చాటిన దాశరథి
* దాశరథి రచనలు సాహితీ జగత్తులో చిరస్థాయిగా నిలుస్తాయి
* జయంతి సభలో వక్తల నివాళి
సిద్దిపేట అర్బన్,జూలై 23: తెలంగాణ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన మహాకవి దాశరథి తెలంగాణ సాహిత్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటుందని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. దాశరథి జయంతి పురస్కరించుకొని శనివారం రాత్రి సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా తెలంగాణ రచయితలు దాశరథికి అక్షరాంజలి ఘటించారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నాల బాలయ్య, ప్రధాన కార్యదర్శి యాదగిరి, జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు రంగాచారి, టిపిటిఎప్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తెలంగాణ వికాస సమితి నందిని భగవాన్ రెడ్డి, మరసం ప్రతినిధులుతోట అశోక్, తైదల అంజయ్య, యాదగిరిలు మాట్లాడుతూ తెలంగాణ సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన దాశరథి కృష్ణమాచార్యులు చిన్న తనంలోనే ఆసమాన ప్రతిభ పాటావాలను కనబర్చినాడని కొనియాడారు. సంస్కృతం, ఉర్ధూ, పార్శీ, తెలుగు, ఆంగ్ల భాషల్లో అద్భుతతమైన పాండిత్యాన్ని గడించిన దాశరథి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడన్నారు. సాహిత్యంలో అన్నిప్రక్రియల్లో రచనలు చేసిన దాశరథి సాహిత్యం అన్నార్థులను, అనాథలు లేని నవసమాజం కోసం పాటుపడాలన్నారు. నిజాం నిరంకుశ పాలనపై తన రచనలద్వారా తిరుగుబాటు జెండా ఎగురవేశాడన్నారు. నిజాం ప్రభువు తన రచనలు నిషేధించి జైల్లోపెట్టిన తన రచనలు ఆపలేదన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నినదించాడని ముసలి నక్కకు రాచరికం దక్కదని స్పష్టం చేశాడన్నారు. అణచివేతకు నిర్భంధాలకు వ్యతిరేకంగా ఆయన కలం నిరంతరం నినదించిందన్నారు. దాశరథి సాహిత్య విలువలు నేటి తరం కవులు ఆకలింపు చేసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. అంతకు ముందు దాశరథి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో రచయితలు సురేందర్, రాజేశం, మురళిధర్ శర్మ, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

చర్చలకు పిలిచి రైతులను బెదిరించడం శోచనీయం

గజ్వేల్, జూలై 23: మల్లన్నసాగర్ ముంపు బాదిత రైతులను సిఎం కెసిఆర్ చర్చల పేరిట ఎర్రవల్లి ఫాంహౌజ్‌కు పిలిపించి బెదిరింపులకు గురిచేయడం సిగ్గుచేటని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు భూములకు ఎకరాకు రూ. 12 లక్షలు చెల్లిస్తుండగా, సమీపంలోని మల్లన్నసాగర్ నిర్వాసితులకు రూ. 6లక్షలు మాత్రమే ఇస్తామని పేర్కొంటుండడం దురదృష్టకరమని నిలదీశారు. ముఖ్యంగా 2పంటలు పండి కరువు కాటకాలు తెలువని మల్లన్నసాగర్ బాధిత రైతుల డిమాండ్‌లు ఒప్పుకుంటే వచ్చే నష్టమేమిటని, సర్వం కోల్పోయి గ్రామాలను వదిలిపెడుతున్న ఆ అన్నదాతల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. అయితే 2013 చట్టం ప్రకారం ముంపు బాదితులను ఆదుకోవాలన్నదే తమ డిమాండ్ కాగా, అదిరించి బెదిరించి భూములు లాక్కుంటామంటే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. కాగా కోర్టులు సైతం మల్లన్నసాగర్ నిర్వాసితులకు అండగా నిలిచినట్లు గుర్తుచేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే డ్రగ్స్ వ్యవహారాన్ని సిఎం కెసిఆర్ తెరపైకి తెస్తుండగా, నరుూం వ్యవహారం ఎంతవరకు వచ్చిందని నిలదీశారు.
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయక పోగా, ప్రజలను మభ్య పెడుతూ అధికారం కెసిఆర్ నిలబెట్టుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు బొల్లారం ఎల్లయ్య, ఆర్కె శ్రీనివాస్, మతీన్, మహిపాల్, శ్రీనివాస్, హన్మంతరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

గుజరాత్‌లోని అహ్మద్‌నగర్ ఉల్లిగడ్డ మార్కెట్ నిర్వహణ విధానంపై
ఎమ్మెల్యే గూడెం నేతృత్వంలోని బృందం అధ్యయనం

పటన్‌చెరు, జూలై 23: పటన్‌చెరు నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బృందం ఆదివారం గుజరాత్ అహ్మద్‌నగర్‌లోని ఉల్లిగడ్డ మార్కెట్ యార్డును సందర్శించింది. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయడానికి అవసరమైన హంగులు కల్పించడానికి అనుగుణంగా ఎమ్మెల్యే బృందం అహ్మద్‌నగర్ మార్కెట్ పరిశీలనకు బయలుదేరి వెళ్లింది. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ శివారులోని మలక్‌పేట ఉల్లిగడ్డ మార్కెట్‌ను స్థానికంగా ఇటీవల ఏర్పాటైన మార్కెట్‌యార్డుకు బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అతి ప్రసిద్ధి పొం దిన అహ్మద్‌నగర్ ఉల్లిగడ్డను యార్డును పరిశీలించడానికి ఏర్పాట్లు చేసింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు బూరుగడ్డ పుష్పనాగేష్‌యాదవ్‌లతో పాటు ఉపాధ్యక్షుడు పొగాకు భసవేశ్వర్‌లతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పలువురు ప్రజాప్రతినిధులు తరలి వెళ్లారు. అహ్మద్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విలాస్‌రావ్ షిండేతో కలిసి ఎమ్మెల్యే బృందం మార్కెట్‌యార్డును సునిశితంగా పరిశీలించింది. యార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన బృందానికి తెలియచేసారు. అహ్మద్‌నగర్‌లో అతి పెద్దదయిన ఉల్లిగడ్డ మార్కెట్‌లో ప్రతిరోజు జరుగుతున్న వ్యాపారం గురించి వారికి వివరంగా తెలిపారు. ఉల్లిగడ్డ డీలర్లకు మార్కెట్ కమిటీ తరపున ఇస్తున్న కమిషన్, ప్రతిరోజ జరుగుతున్న వ్యాపార లావాదేవీల గురించి మార్కెట్ కమిటీ చైర్మన్ విలాస్‌రావ్ షిండే కూలంకషంగా తెలియచేసారు. పటన్‌చెరు ఎంపిపి గొల్ల శ్రీశైలంయాదవ్, రామచంద్రాపురం మండల పరిషత్ అధ్యక్షుడు యాదగిరియాదవ్, జిన్నారం ఎంపిపి రవీందర్ర్రెడ్డి, భానూర్ సర్పంచ్ శాంతయ్య, టిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు దశరథరెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ బురిగారి వెంకటరెడ్డి, ఇంద్రేశం ఎంపిటిసి అంతిరెడ్డిగారి అంతిరెడ్డి, సుల్తాన్‌పూర్ మాజీ ఎంపిటిసి రాజు, మాజీ ఎంపిపి గాయత్రి పాండు తదితరులు బృందంలో ఉన్నారు.

ముగిసిన ఉర్సు ఉత్సవాలు
సంగారెడ్డి టౌన్, జూలై 23: పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ దర్గాలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న హజ్రత్ వౌలానా హజ్రత్ అమిరుల్లా షా నూరి 17వ ఉర్సు ఉత్సవాలు ఆదివారం ముగిసాయి. రెండు రోజుల పాటు దర్గా పీఠాధిపతి సజ్జార నాషిన్, హజ్రత్ సైఫుల్లా షా అమీర్ నూరి సమక్షంలో ఉత్సవాలను ఘనంగా జరిగాయి. శనివారం రాత్రి గంధారాదన ఊరేగింపు, జల్సా, ఫైజాన్ జాలియ, ఆదివారం చాదర్ ఎ గుల్, మహఫిల్, ఖవ్వాలి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు.

ఏడుపాయలకు పోటెత్తిన జనం
పాపన్నపేట, జూలై 23: ఆదివారం రోజు భక్తులు ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో ప్రవహిస్తున్న పవిత్ర మంజీర నదీపాయల్లో, షవర్ బాత్‌లు, చెక్ డ్యామ్‌లలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించారు.. సింగూర్ నుంచి నీరు వదలడంతో ఘణపురం ఆనకట్ట పొంగిపొర్లుతుంది. ఈ ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు భక్తులు, యాత్రికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి వనదుర్గామాత ఆలయంలో అమ్మవారికి అలయ అర్చకులు అభిషేకం, కుంకుమార్చన తదితర ప్రత్యేక విశేషాలంకరణ పూజలు నిర్వహించారు. అమ్మవారిని ఆలయ గర్భాలయంలో అలయ అర్చకులు ఆకుపచ్చని పట్టు వస్త్రంలో అత్యంత సుందరంగా అలంకరించారు. గర్భాలయంలో వనదుర్గామాత అమ్మవారు దీప కాంతుల మధ్య కోటి సూర్యప్రభ కాంతులతో కొలువుదీర్చారు. డప్పుచప్పులు, బ్యాండ్ మేళాల మధ్య భారీ బోనాల ఉరేగింపులు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించే విధంగా ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది. అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయంలో క్యూలైన్ల ద్వారా వనదుర్గామాతను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. యథావిధిగా మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ పి.విష్ణువర్దన్‌రెడ్డి, ఈఓ టి.వెంకటకిషన్‌రావు, ఆలయ డైరెక్టర్లు, సిబ్బంది చల్లా గోపాల్, జెన్న రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, పి.మధుసూదన్‌రెడ్డి, సూర్య శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, ప్రతాప్‌రెడ్డి, తదితరులు భక్తులకు తమతమ సేవలందించారు.