కర్నూల్

భూమా హామీలన్నీ నెరవేర్చాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 23: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలన్ని నెరవేర్చామని, ఈ విషయాన్ని పట్టణంలోని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాల్సిన బాద్యత స్థానిక నేతలదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నంద్యాల టిడిపి నాయకులకు దిశానిర్దేశం చేశా రు. ముఖ్యమంత్రి 22వ తేదీన నంద్యా ల అసెంబ్లీ పరిధిలో పర్యటన ముగించుకొని రాత్రి 1.30 గంటలకు ఆర్‌అండ్‌బి అతిథిగృహం చేరుకొని విశ్రాంతి తీసుకున్నారు. 23వ తేదీ ఉదయం విడతల వారిగా మంత్రులు, నియోజకవర్గం బాద్యులతో ప్రత్యేక బస్సులో సమావేశమయ్యారు. అనంతరం అతిథి గృహంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను శిలాఫలాకాలు వేసి భూమి పూజలు నిర్వహించిన పనులను వేగంగా పూర్తి చేయాలని, నిధుల కొరత లేదని, పను లు పూర్తి చేయడంలో అశ్రద్ద వహిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జిలు, వివిధ గ్రామాలకు చెందిన టిడిపి నాయకులతో ఆయన రహస్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి మీడియా ప్రతినిధులను అనుమతించలేదు. సమావేశంలో ముఖ్యమంత్రి టిడిపి నేతలతో మాట్లాడుతూ నంద్యా ల అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.1300 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని, మరిన్ని పనులు చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. అయితే నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, దివంగత నేత భూమానాగిరెడ్డి ఇచ్చిన హామీలన్ని నెరవేర్చామని, ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి చేరవేసే బాద్యత నాయకులు, కార్యకర్తలదేనన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తల సైనికుల్లా పనిచేసి అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపిస్తే నంద్యాలకు ఇంకా అవసరమైన అభివృద్ధి పథకాలను చేపట్టడం జరుగుతుందని, ఈ విషయాన్ని సవాలుగా స్వీకరించి పనిచేయాలన్నారు. కేవలం ఒకటిన్నర సంవత్సరం కాలానికి పోటీలో నిలబడిన శిల్పామోహన్‌రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. ప్రతిపక్షం గెలిచినా లాభం లేదని, వారు అధికారంలో ఉన్నప్పుడే పనిచేయలేదని, అధికారం లేని సమయంలో ఏమి చేస్తారని ప్రశ్నించారు. వైకాపా అధినాయకుడు జగన్మోహన్‌రెడ్డి అవినీతి కేసుల్లో కూరుకుపోయి దిక్కుతెలియక తెలుగుదేశం పార్టీపై బురద చల్లుతున్నారని, ఆ పార్టీ నాయకుల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. ముఖ్యంగా నంద్యాల నియోజకర్గంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు సమిష్టిగా పనిచేయడం లేదన్న సమాచారం తన వద్ద ఉందని, అయితే విబేదాలు మరచి టిడిపి నాయకులందరు కలసి కట్టుగా పనిచేసి టిడిపి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఎన్ ఎండి ఫరూక్, ఉర్దూ అకాడమి చైర్మన్ డా. ఎస్ ఎండి నౌమాన్, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ, టిడిపి నాయకులు భూమా ప్రధాన అనుచరుడైన ఎవి సుబ్బారెడ్డి, బలిజ సంఘం నాయకులు శాంతిరాముడు, ఎంపి ఎస్పీవైరెడ్డి వర్గాలన్ని కలసి సమిష్టిగా పనిచేయాలని, ఎన్నికల ప్రచారాన్ని కూడా అందరు కలసి నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె ఇ కృష్ణమూర్తి, నంద్యాల ఇన్‌చార్జి మంత్రి కాల్వ శ్రీనివాసులు, మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమరనాధరెడ్డి, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలతోపాటు స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జిలు, బాద్యులు పాల్గొన్నారు.
ఆనవాయితీ, సంప్రదాయాలకు వైకాపా తిలోదకాలు..
నంద్యాల, జూలై 23: నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో వైకాపా తమ అభ్యర్థిని పోటీకి నిలిపి ఏమి సాధిస్తుందో చెప్పాలని, ఆనవాయితీకి, సంప్రదాయానికి తిలోదకాలిచ్చి అభివృద్ధిని అడుకునే చర్యలు మానుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి హితవు పలికారు. మొదటి నుండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా పనిచేస్తూ మరణించిన వారి నియోజకవర్గంలో పోటీని పెట్టకుండ ఏకగ్రీవానికి మద్దతు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మంత్రి అమరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణిస్తే విజయమ్మపై పోటీ పెట్టకుండ ఏకగ్రీవం చేశామన్నారు. ఆళ్లగడ్డ శాసన సభ ఎన్నికల్లో దివంగత నేత శోభానాగిరెడ్డి మరణిస్తే ఆమె కూతురు భూమా అఖిల ప్రియపై పోటీ పెట్టలేదన్న విషయాన్ని వైకాపా గుర్తించాలన్నారు. ఆనవాయితీకి, సాంప్రదానాకి తిలోదకాలిచ్చి విలువలను తుంగలో తొక్కి ఏమి సాధించాలని నంద్యాల అసెంబ్లీ బరిలో వైకాపా అభ్యర్థిని పోటీ పెడుతున్నారని ప్రశ్నించారు. నంద్యాల నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చి చూపిస్తున్నామని, తెలుగుదేశం పార్టీ మరో రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుందని, నంద్యాలను మరింత అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా కుప్పం నియోజకవర్గంతో పోటీ పడేవిధంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా వైకాపా పోటీకి దింపడం అభివృద్ధిని అడ్డుకొనేందుకు కాదా? అన్నారు. ప్రజలను మభ్యపెట్టి నంద్యాలలో తెలుగుదేశం పార్టీపై బురదచల్లే కార్యక్రమాన్ని వైకాపా చేపడుతుందని ఎద్దేవా చేశారు. నంద్యాల నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించిన ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అర్థరాత్రి వరకు వేచి ఉండి ఆయన ప్రసంగాలను ప్రశాంతంగా విని చప్పట్లతో అభినందించిన విషయాన్ని మరచిపోరాదన్నారు. పోటీచేసే అభ్యర్థికి డిపాజిట్లు దక్కవని హెచ్చరించారు. వైకాపా అధినేత జగన్ ఇప్పటికైనా సాంప్రదాయాన్ని, ఆనవాయితీని పాటిస్తూ విలువలతో కూడిన రాజకీయం చేయాలని, లేనిపక్షంలో నంద్యాలలో వైకాపా ఘోర పరాజయం పొందుతుందన్నారు. మంచి పనులకు మద్దతు ఇవ్వాలని, అభివృద్ధికి అండగా నిలువాలని, నియోజకవర్గ ప్రజలను ఆయన కోరారు. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గంలో ఇప్పటికే రూ.1300 కోట్ల నిధులతో అనేక విభాగాల్లో పనులు ప్రారంభమయ్యాయని, నంద్యాలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తే మరో రెండేళ్లపాటు అభివృద్ధి నిరంతరంగా జరుగుతుందన్నారు. వైకాపా గెలిచినా నిష్ప్రయోజనమని, జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా సజావుగా సాగవని, ఈ విషయంపై వైకాపా నాయకులు ప్రజలకు ఏమి సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. నంద్యాల నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందజేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని, ఈ దిశలో ఎన్నికల్లో ఆనవాయితీని, సాంప్రదాయాలను పాటించి ఏకగ్రీవం చేస్తే వైకాపాకు కొంత మేరకైనా ప్రతిష్ట మిగులుతుందని అన్నారు. పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో ఉండి అభివృద్ధిని విస్మరించిన శిల్పామోహన్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో మూడు సంవత్సరాలు ఉన్నా భూమా చేస్తున్న అభివృద్ధిని అడ్డుకొనేందుకే తమ సమయం వెచ్చించారని, అభివృద్ధి నిరోదకులుగా ముద్రపడిన శిల్పామోహన్‌రెడ్డిని నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికలో చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏవి సుబ్బారెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
కర్నూలు, జూలై 23:జిల్లా ఎస్పీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ బ్యాంకులో శనివారం రాత్రి దొంగలు దోపిడీకి ప్రయత్నించి విఫలం చెందారు. వివరాలు.. జిల్లా ఎస్పీ బంగ్లాతో పాటు 2వ పట్టణ పోలీస్‌స్టేషన్ వెనుకభాగంలో ఉన్న కరూర్ వైశ్యా బ్యాంకులో దొంగల దోపిడీ యత్నంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు అర్ధరాత్రి సీసీ కెమెరా కనెక్షన్స కట్ చేసి బ్యాంకు వెనుక బాగంలోని కిటికీ గుండా లోపలికి ప్రవేశించారు. అనంతరం లాకర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించి విఫలం చెందారు. అయితే దొంగలు తమ వెంట తెచ్చుకున్న బ్యాగు, బ్లౌజులు, దోపిడీకి సంబంధించిన ఇనుపరాడ్లతో పాటు స్క్రూడ్రైవర్లను బ్యాంకులోనే వదిలి పెట్టి వెళ్లారు. దొంగలు రాత్రి నుంచి ఉదయం వరకూ బ్యాంకు చోరీకి ప్రయత్నించారు. ఇందులో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరకు అలారం మోగడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వారి సమాచారం మేరకు 2వ పట్టణ పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని పరిశీలించారు. బ్యాంకులో నగదుతో పాటు ఎలాంటి విలువైన వస్తువులు చోరీకి గురికాకపోవడంతో బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధానంగా సెక్యూరిటీ సిబ్బంది వ్యవహార శైలిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
టౌన్ మోడల్ జూ.కళాశాల విద్యార్థులకు 25 నుంచి మధ్యాహ్న భోజనం
కర్నూలు, జూలై 23:నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు శాంతి ఆశ్రమ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుంచి ఉచితంగ మధ్యాహ్న భోజనం అందజేయనున్నట్లు ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీ హిమాలయ గురుదేవులు తెలిపారు. నగరంలోని కళాశాల ఆవరణలో ఆదివారం గురూజీ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కళాశాలలో 1100 మంది విద్యార్థులు ఉన్నారని, వారందరూ మధ్యాహ్న భోజన విరామ సమయంలో బయటికి వెళ్లాల్సి రావటంతో చదువుకు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో తమ ట్రస్టు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తుందన్నారు. మొత్తం విద్యార్థులందరికీ ఈ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఏపిఎస్పీ అసిస్టెంట్ కమాండెంట్ బాషా మాట్లాడుతూ విద్యార్థుల కోసం శాంతి ఆశ్రమం ట్రస్టు ఈ బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ప్రిన్సిపాల్ చెన్నయ్య మాట్లాడుతూ ట్రస్టు ఏర్పాటు చేసిన ఈ భోజన పథకం వల్ల విద్యార్థుల్లో గైర్హాజరు శాతం పూర్తిగా తగ్గిపోతందని, దీంతో కళాశాలలో ర్యాంకులు సాధించే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. సినీ నిర్మాత గూడూరు గోపాల్ మాట్లాడుతూ శాంతి ఆశ్రమ ట్రస్టు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. సమావేశంలో ట్రస్టు సభ్యులు ప్రతాప్, హరీష్, రఘు పాల్గొన్నారు.
బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి
కర్నూలు సిటీ, జూలై 23:రాష్ట్రంలో అధికార టిడిపి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రతిపక్ష వైకాపా ప్రజామన్నన పొందలేక పోతుందని ఈ తరుణంలో రాజ్యాధికార పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని ఆ పార్టీ పాలసీ నిర్ణయ కమిటీ చైర్మన్ విజిఆర్.నారగోని పిలుపునిచ్చారు. నగరంలోని ప్రజాపరిరక్షణ సమితి కార్యాలయంలో ఆదివారం బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నారగోని మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ఆ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవటంలో వైకాపా విఫలం చెందిందని, ఈ తరుణంలో రాజ్యాధికార పార్టీ బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని, ఖచ్చితంగా హంగ్ ఏర్పడుతుందన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఆగస్టు మొదటి వారంలో జిల్లా రాజ్యాధికార పార్టీ జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నంద్యాల ఉపఎన్నికలో అన్ని పార్టీలు కలిసి ఒకే వర్గానికి చెందిన వారికి టికెట్లు ఇవ్వటం అప్రజాస్వామన్నారు. సమావేశంలో రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లిగట్ల రెడ్డప్ప, ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌సలీమ్, దళిత మహాసభ రాష్ట్ర నాయకులు నారాయణస్వామి, ప్రజాపరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం, డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాఘవుని సేవలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్
మంత్రాలయం, జూలై 23 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేష్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం రాత్రి మంత్రాలయం చేరుకున్న ఆయన మఠం విఐపి అతిధి గృహంలో బస చేశారు.ఆదివారం ఉదయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠం చేరుకున్న దంపతులకు మఠం అధికారులు మేనేజర్ శ్రీనివాస్‌రావు, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తిపూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పీధివపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు వారికి శేష వస్త్రం ఫల మంత్రాక్షితలు, జ్ఞాపికను, ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆదోని ఆర్డీఒ ఓబులేష్,తహాసీల్దార్ వసుంధర, డిటి చంద్రశేఖర్‌వర్మ,విఆర్‌ఒ జనార్ధన్‌రావు,ఎస్సై శ్రీనివాస్‌నాయక్, ధార్మిక సిబ్బంది వ్యాసరాజాచార్, బిందుమాదవాచార్, కుర్డిజయతీర్థాచార్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం ఆదివారం కిరిక్ పార్టికన్నడ చిత్రం హీరోరక్షిత్ శెట్టి, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ వృషభశెట్టి వచ్చారు. వారికి మఠం సహాయ మేనేజర్ ఐపినరసింహమూర్తి స్వాగతం పలికారు. వారు ముందుగాగ్రామదేవత మంచాలమ్మను, శ్రీరాఘవేంద్ర స్వామిమూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం వారికి పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు శేష వస్త్రం ఫల మంత్రాక్షితలు జ్ఞాపికను ఇచ్చి ఆశీర్వదించారు.
కొనసాగిన ఉపాధ్యాయ బదిలీలు
కర్నూలుటౌన్, జూలై 23:ఉపాధ్యాయుల బదిలీల్లో 2వ రోజైన ఆదివారం బదిలీల ప్రక్రియను మధ్యాహ్నం 3 గంటలకు సర్వశిక్షా అభియాన్ సమావేశ మందిరంలో ప్రారంభించినట్లు డిఇఓ తాహెరాసుల్తానా తెలిపారు. నగరంలో ఆదివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ నిబంధనల మేరకు బదిలీల కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే 36 మంది గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులకు స్థానాలు కేటాయించామన్నారు. 2వ రోజు పిఇటిలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించామని, అందులో జిల్లా వ్యాప్తంగా 183 మంది బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అనంతరం డిఇఓ గ్రేడ్-2 హెచ్‌ఎంలకు కొత్త స్థానాలను కేటాయిస్తూ నియామక పత్రాలు అందజేశారు. సమావేశంలో డోన్ డిప్యూటీ డిఇఓ నాగభూషణం, పరిపాలన అధికారిణి అనురాధ, డిసిపి ఓంకార్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
తాగునీటిని మళ్లిస్తే చర్యలు..
ఆదోనిటౌన్,జూలై 23:తుంగభద్ర డ్యాం నుంచి ప్రజల తాగునీటి కోసం ప్రభుత్వం నీటిని దిగువ కాలువకు విడుదల చేయడం జరిగిందని అయితే కొంత మంది తమ స్వార్థం కోసం పొలాలకు నీటిని మళ్ళింపు చేస్తున్నారని ఎల్లెల్సీ డిసి వైస్ చైర్మన్ బసాపురం రామస్వామి పేర్కొన్నారు.ఆదివారం తుంగభద్ర దిగువ కాలువపై పర్యటించడం జరిగిందని ఆయన తెలిపారు.కొన్నిప్రాంతాల్లో ఎల్లెల్సీ నీటిని మోటర్ల ద్వారా అక్రమ ఆయకట్టు దారులు తమ పొలాలకు తాగునీటిని సైతం మళ్ళించడం విచారకరమన్నారు.కేవలం తాగునీటి కోసమే ప్రభుత్వం ఎల్లెల్సీ కాలువకు నీరు విడుదల చేయడం జరిగిందని అయితే సాగునీటి కోసం పొలాలకు నీరు మళ్ళించడం వల్ల కిందకు తాగునీరు వెల్లడం లేదని అధికారులు పేర్కొంటున్నారని అన్నారు.ప్రస్థుతం తుంగభద్ర డ్యాంలో నీరు పెరుగుతున్నాయని అందువల్ల సాగుకు నీరు వదులుతారని ఆయన తెలిపారు. అందువల్ల రైతులు తాగునీటిని సాగునీటిగా వినియోగించరాదని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
నగరంలో అట్టహాసంగా 3కె రన్
కర్నూలుటౌన్, జూలై 23:జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఖచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జెసి రామస్వామి సూచించారు. ‘ప్రత్యేక ఓటరు నమోదు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని రాజ్‌విహార్ సెంటర్ నుంచి సి క్యాంపు వరకూ యువతచే 3కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు ఉన్న వారు 1,95,285 మంది ఉన్నారని, వారందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అర్హులందరూ ఓటరుగా నమోదు చేయించుకునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని, ప్రతి విద్యార్థి స్వచ్ఛందంగా ఓటరు నమోదుపై ఇంటింటా ప్రచారం నిర్వహించాలని జెసి సూచించారు. ఈ సమావేశానికి ముందు జెసి, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్ 3కె రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్‌లో తొలి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రాష్ట్ర ప్రధా న ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ నుంచి ప్రశంసాపత్రం, నగదు బహుమతి అందజేశారు. రన్‌లో కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటనారాయణ, ఎన్నికల విభాగం అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అహోబిలేసుని సేవలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
ఆళ్లగడ్డ, జూలై 23: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్‌లాల్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చకబృందం, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు బన్వర్‌లాల్ దంపతులకు ప్రసాదాలు అందజేశారు. అలాగే అహోబిలం మఠంలో వున్న 46వ పీఠాదిపతి శ్రీవన్ శఠగోప రంగనాధ యతంద్ర మహాదేశికన్ స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం పొందారు. ఆయన వెంట నంద్యాల ఆర్డీ ఓ రాంసుందర్‌రెడ్డి, ఆళ్లగడ్డ తహశీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎస్ ఐ చంధ్రశేఖర్‌రెడ్డి, ఏ ఎస్ ఐ రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.