తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఆరోగ్యాలు, భాషలు అంతరించడం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత ఆది, సోమ, మంగళవారాలు గుంజాల గోండి గూడెంలో రెప్పలు తెరిచి మూసేసరికే గడిచిపోయాయి. అక్కడి నుండి వచ్చేప్పుడు ఎన్ని అనుభవాలో, అన్ని గుణపాఠాలు.
మంచితనం, అమాయకత్వం ఓ వైపు. గడుసుతనం, మోసం మరో వైపు గోండుల అభివృద్ధికి ఆటంకమవుతోంది. జాతీయ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ పథకాలు అన్నీ వారిని దగా చేస్తున్నాయి. మాకిది కావాలి అని అడగలేని గోండుల మంచితనం. అది రక్తంలోనే ఉందా? స్థానీయమైన మట్టి డిఎన్‌ఎలోనే దాగి వుందా? మట్టికీ మనిషికి (్భగోళికతకి) విడలేని అనుబంధమే బతుకు రీతి. రెక్కలు ముక్కలు చేసుకున్న ఆ జాతి, ఆ గూడెం ఇప్పుడు రెక్కల నొప్పులతో, కీళ్ళ వ్యాధితో మూలుగుతున్నది. ఒకే ఊరిలో నూట ఏభై మంది ఈ జబ్బుతో బాధపడడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది.
గోండుల సంస్కృతి సాహిత్యం భాషాలిపులకి గుంజాల కేంద్రంగా కొంత పనిచేసే మాకు చాలా బాధ అనిపించింది. లోపల అనారోగ్యాన్ని దాచుకుని పైకి నవ్వుతూ కనిపించడం గమనించినవారికి రంపుపు కోతే. అందుకే అక్కడ అత్యవసరంగా ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని తెలంగాణ రచయితల వేదిక సంకల్పించింది. ఈ ఆలోచనను సమర్థించింది సహాయ ఛారిటబుల్ ట్రస్ట్. డా బి.రాజగోపాలరావు, డా కొల్లు రంగారావు, గుండవరపు పద్మ అక్కడకు పెద్ద పెద్ద మందుల డబ్బాలతోపాటు వచ్చారు. వందలాది మంది రోగులకు పరీక్షలు జరిపి మందులు ఇచ్చారు. వచ్చిన రచయితలు వాలంటీర్లుగా పనిచేశారు. నగరాల్లోని సర్కారు దావఖానాలోకే కాదు ప్రభుత్వాలు ఏర్పాటుచేసే వైద్య శిబిరాలకి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి కూడా రోగులు పోవడానికి పడే జంకు చూస్తే ఆశ్చర్యం వేసింది. మన ఆరోగ్య శాఖకు పట్టిన జబ్బు అనిపించక తప్పలేదు. ఏదో ఒక కొత్త మందు కనిపెట్టాల్సిందే అనిపించింది. అది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు చేయవలసి ఉండింది. కాని దాని ప్రాధాన్యతలో ప్రజల ప్రాథమిక ఆరోగ్యం లేదు. ఇంటింటికి నల్లా నీరు అత్యవసరంగా పంపే పని ఎన్నడు ఆ మూల ఆదివాసీలను పలకరిస్తుందో తెలీదు. కాని దాని పేర మార్కులు కొట్టేయడానికి ప్రకటనలు పనికి వస్తున్నాయని అనిపిస్తోంది.
ఆదిలాబాదు నుండి విడిపోయిన కుమరం భీం జిల్లాలో పనె్నండేళ్ళలో కిడ్నీ వ్యాధితో సుమారు వందమంది మరణించారు. ఐనా ఆరోగ్య శాఖ అధికారులలో ఎలాంటి చలనం లేదు. సుద్ద కలిసిన నీళ్ళు తాగడంవల్ల కిడ్నీ వ్యాధి, కీళ్ళనొప్పులు పెరిగాయా? కారణం అది కాదని చెప్పడం సులభం. మరెందుకు మరణిస్తున్నారు? అసలు కారణం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? నడుపుతున్న ఆర్వో ప్లాంట్లు దైవాధీనం. వాటిలో నాసిరకం నీరు పొర్లుతున్నది. డయాలసిస్ చేయించుకుందామంటే ఇంకా ప్రభుత్వ దావఖానాల్లోకి మిషన్లు రాలేదు. వ్యాధి తీవ్రత తెలిసి కూడా జాప్యం చేయడం ఎందుకు? నాయకుల, అధికారుల కార్యాలయాల, ని వాస భవనాల నిర్మాణా లు అత్యంత వేగవంతంగా నడుస్తుంటాయి. కాని ప్రజల ప్రాణాలు కాపాడే పరికరాలు, యంత్రాలకు మాత్రం కొరత. అందుకే వీళ్ళ వరస చావుల వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నది అర్థం అవుతున్నది. ఆదివాసీ ప్రాంతాలలో బతకడం దుర్భరం. అందుకే నగరాలకో, మరో చోటుకో పోండని చెప్పక చెప్పే సంకేతమేమో ఇది.
ఇలాంటి కారణాలు కొన్ని, ఇతర భాషల ఆధిపత్యం వల్ల కొన్ని, ఆలనా పాలనా కరువై ఏక భాషా సూత్రం భావనతో కొన్ని భాషలు అంతరించితున్నాయి. ఈ ప్రాంతీయ, దేశ భాషలు చాలావరకు కీళ్ళనొప్పితో లేవలేక కూలపడిపోతున్నాయి. కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తున్న భాషలు కొన్ని సరైన సమయంలో డయాలసిస్ సహకారం అందకపోవడంవల్ల జీవన్మరణ దశలో ఉన్నాయి. భాషను చంపడం వల్ల ఆదివాసీ బతుకు పరారుూకరణ చెందుతుంది. పరారుూకరించిన భాష, బతుకులు తమ ప్రాంతం నుండి బలవంతంగా బయటపడే పరిస్థితికి దగ్గరవుతారు. ఇపుడు బహుశ బహుళ పెట్టుబడి కంపెనీలకి కావలసింది ఇదే. వారికి ఎర్రతివాచీ పరచాలంటే ఇలాంటి అనేక పరిస్థితుల్ని అనునిత్యం సృష్టించ బడాల్సిందే. రాబోయే ఏభై ఏళ్ళలో నాలుగు వందల భాషలు అంతరించిపోవచ్చని పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా (పిఎస్‌ఎల్‌ఐ) అధ్యక్షుడు జి.ఎన్.దేవె ప్రకటించాడు. ఇప్పుడు మన దేశంలో 780 భాషలు ఉన్నాయి. వాటిలో 400 భాషలు మన కళ్ళముందు కనుమరుగవుతాయంటాడు. దీనిలో చాలా వాస్తవం వుంది. ప్రాథమిక విద్యలో మాతృభాషని దూరం చేయడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల తెలుగు భాష శుష్కింపు ప్రారంభమైంది. తెలుగుకి కిడ్నీ వ్యాధి వంటిది దాపురించింది. డయాలసిస్ దశ వాటిల్లింది. ఇప్పుడు పట్టించుకోకపోతే ఏవౌతుంది? తెలుగు భాషకి రానున్న కాలంలో ప్రమాదం ఏర్పడితే దానికి కారణం నేటి పాలకుల తీరేనని భవిష్యత్తుకు చాటి చెప్పాలి. వీరిని తెలుగు భాషా ద్రోహులుగా ప్రకటించవలసి ఉంది. తమ తమ అధికారం, ప్రతిపక్షాలతో లేనిపోని కయ్యాలే పరిపాలనగా చెప్పుకోవడం సరికాదని చెప్పగలగాలి.
గుంజాల గ్రామంలో కీళ్ళనొప్పితో బాధపడుతూనే పరదాలు, టెంట్లు కట్టి ఆరోగ్య శిబిరాన్ని అందంగా ఏర్పాటుచేశారు. అత్యధికంగా బీపీతో బాధపడుతున్నవారు నీళ్ళు చల్లి దుమ్మూ ధూళి లేవకుండా చేశారు. తమకు అంత సీరియస్‌గా బీపీ ఉందని వారికి తెలియదు. వైద్యులే ఆశ్చర్యపోయారు. గుంజాల కోయతూర్ లిపి భాషా పండితుడు డెబ్భై ఏళ్ళుపైబడిన కోట్నక్ జంగు తన గుండె ఉన్న ప్రాంతంలో పిడికెడు గడ్డ ఒకటి లోని నుండి తన్నుకు వస్తున్నది. వింత జబ్బుతో బాధపడుతున్నాడు. అతను ఇప్పుడు బతికి వున్న గోండు లిపికి, భాషకు మిగిలిన ఏకైక మహాద్వారం. అతడిని ఎలా రక్షించుకోవాలో?
ఆరేడు రాష్ట్రాలలో ఉన్న గోండీ భాషపై ఆయా ప్రాంతీయ భాషలు, జాతీయ భాష, పరాయి దేశాల ఆంగ్ల భాష బరువు పడి సుక్కిపోతున్నది. అంత పెద్ద ఆదివాసీ భాష నలుదిక్కులా ఏడు రాష్ట్రాలలో బలహీనపడుతున్న వైనం గమనించాలి. ఇలాంటి పరిస్థితే కోయభాషపై పడి తన అసలు భాషకు అది దూరమై తెలుగు నాలుకతో పలుకుతున్న వైనం గుర్తించాలి. అలాంటి పరిస్థితి గోండీ భాషకు పట్టకూడదు. ఐతే ఏం చేయాలి? ఆదివాసీ భాషని ప్రత్యేక లిపితో అనుసంధానించి నిలపడానికి వీలున్నది. ఇప్పుడు అక్కడ అదే జరుగుతున్నది. ఒక పెద్ద నిఘంటువు, కొన్ని గోండీ సాహిత్య గ్రంథాలు, వాచకాలు ప్రచురించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం.
చివరి వాక్యం- రోగులకు ఇవ్వాల్సిన మందులు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ డిఎంహెచ్‌వో కుమరం బాలు కళ్ళముందే ఉద్యోగులు తస్కరిస్తే ఇంకేం చెప్పాలి? జరిగింది తెలిసి తప్పు అని వారి సిబ్బందికి చెప్పాల్సిన పెద్దమనిషి ఆ అక్రమాలను చూసీ చూడనట్టు ఉండడాన్ని ఏమందాం? మనుషుల్ని, భాషల్ని బతికించుకోవడానికి అడ్డుపడుతున్న పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం గాక అక్షరాలా తలలు బాదుకున్నాం.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242