జాతీయ వార్తలు

ఏ సవాలునైనా ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత సైన్యం ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు 24గంటలూ సంసిద్ధంగా ఉందని, దేశ రక్షణ విషయంలో ఎటువంటి ముప్పునైనా సమర్థంగా తిప్పికొట్టగల సామర్థ్యం మన సైన్యానికి ఉందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. చైనాతో మూడు నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమం 75 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా అరుణ్ జైట్లీ రాజ్యసభలో బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1962 చైనా యుద్ధం నుంచి భారత్ నేర్చుకున్న గుణపాఠాలు భారత సైన్యాన్ని మరింత శక్తిమంతంగా సిద్ధం చేశాయన్నారు. 1948 నుంచి జమ్ముకాశ్మీర్‌నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నది ప్రతి ఒక్క భారతీయుడి ఆకాంక్ష అని జైట్లీ ఉద్ఘాటించారు. ‘మనకు సవాలు ఎదురైన ప్రతిసారీ మనదేశం మరింత బలోపేతమవుతూ వచ్చిందని గర్వంగా చెప్తున్నా’ అని జైట్లీ అన్నారు. మన సైనిక బలగాలు గడచిన దశాబ్దాలలో స్వయం సమృద్ధిని సాధించిందని ఆయన అన్నారు. ‘మన పొరుగుదేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను పూర్తిస్థాయిలో ఎదుర్కొనే సామర్థ్యం మనకుంది. 1962తో పోలిస్తే 1965, 1971 పాకిస్తాన్‌తో యుద్ధాల నాటికి మన సైనిక శక్తిపాటవాలు మరింత పెరిగాయి. ఇంకా కొన్ని సవాళ్లు ఉన్నాయని నేనూ అంగీకరిస్తున్నా. మన దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను విచ్ఛిన్నం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. కానీ, నాకు మన వీర సైనికులపైన పూర్తి విశ్వాసం ఉంది. తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో దేశాన్ని రక్షించేందుకు మన సైన్యం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంది’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొంత సంక్షోభం ఎదుర్కొన్నామని, కొంత భూభాగాన్ని కోల్పోయామని.. అయితే ఇప్పుడు ప్రతి భారతీయుడూ కోల్పోయిన భూభాగాన్ని తిరిగి దక్కించుకోవాలని కోరుకుంటున్నారని అన్నారు. రాజ్యసభ సభానాయకుడిగా మాట్లాడిన ఆయన ‘మేకిన్ ఇండియా’ నినాదాన్ని నిజం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేశంలో అన్ని రకాల హింసాత్మక చర్యలను నిరోధిస్తామని వెల్లడించారు. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం అనేవి దేశం ఎదుర్కొంటున్న రెండు పెద్ద సవాళ్లని, ఈ ఉగ్రవాదం మూలంగానే మనం మాజీ ప్రధాన మంత్రిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జమ్ముకాశ్మీర్‌లో సిఆర్‌పిఎఫ్ జవాన్లు నిర్మాణాత్మకంగా యుద్ధం చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాది పార్టీ నేత రాంగోపాల్ యాదవ్ ప్రసంగించారు.