అనంతపురం

తాగునీటి గండం తప్పదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : జిల్లాను తాగునీటి గండం భయపెడుతోంది. గతేడాది కన్నా ఈసారి మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తుంగభద్ర జలాశయం నుంచి జిల్లాకు కేటాయించే నీటి వాటాతోనే తాగునీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు ఏటా ప్రణాళికలు సిద్ధం చేసేవారు. అయితే రెండేళ్లుగా హెచ్చెల్సీ నీటి వాటా గణనీయంగా పడిపోవడంతో తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వక తప్పడం లేదు. ఈసారి కూడా జిల్లా నేతలు కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర బోర్డుపై ఒత్తిడి తెచ్చి తాగునీటి అవసరాలకు నీటిని తెప్పించుకోవడం అత్యంత అవశ్యం. గతేడాది హంద్రీనీవాకు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణాజలాలు తరలించి జిల్లాలోని తాగునీటి ప్రాజెక్టులకు నీరంది గండం నుంచి గట్టెక్కించారు. కర్ణాటకలో వర్షాలు కురిసి తుంగభద్ర, ఆల్మట్టి డ్యామ్‌లు పూర్తి చేరితేగానీ, జిల్లాలో ఈ ఏడాది అత్యంత దారుణమైన పరిస్థితి నుంచి గట్టేక్కే వీలులేదు. మరోవైపు ఆదివారం బెంగళూరులో జరగాల్సిన తుంగభద్ర బోర్డు సమావేశం ఈనెలాఖరు వాయిదా పడింది. దీంతో ఆంధ్రా వాటా నీటి కేటాయింపుల్లో జాప్యం తప్పలేదు. సమావేశం నాటికి తుంగభద్ర జలాశయంలో వరద నీరు చేరడాన్ని బట్టి కేటాయింపులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం ఈనెల 22న నిర్వహించాలని నిర్ణయించారు.
గతేడాది టిబి డ్యాం నుంచి హెచ్చెల్సీకి 11.8 టిఎంసిల నీరు కేటాయించారు. ఇందులో కర్ణాటక ప్రాంత పరిధిలోని కాలువలో నీటి చౌర్యంతోపాటు సీపేజీ, ఆవిరి నష్టాలుపోనూ జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో 105వ కి.మీ వద్దకు కేవలం 10.3 టిఎంసిలు చేరాయి. వీటికి అదనంగా హంద్రీనీవా నుంచి సుమారు 12 టిఎంసిలు తరలించి జీడిపల్లి రిజర్వాయర్‌లో నిల్వ ఉంచడంతో 23 టిఎంసిల నీటిని నిల్వ చేసుకోగలిగాం. ఈఏడాది శ్రీశైలం జలాశయంలో సైతం నీరు పూర్తి స్థాయిలో చేరే అవకాశం లేకపోవడంతో హంద్రీనీవాకు కూడా నీటి తరలింపు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో జిల్లాలోని పెన్నహోబిలం రిజర్వాయర్ (పిఎబిఆర్), గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జిబిసి), చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సిబిఆర్), తాడిపత్రి బ్రాంచి కెనాల్ (టిబిసి)తోపాటు శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టు తదితరాలకు నీటి సరఫరా చేసేందుకు గడ్డు పరిస్థితులు తలెత్తనున్నాయి. హెచ్చెల్సీ ద్వారా జిల్లాకు రావాల్సిన 32.2 టిఎంసిల నీటిలో గత మూడేళ్ల క్రితం వరకు కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారణంగా తుంగభద్ర జలాశయం నిండి మన వాటాలో 26 నుంచి 28 టిఎంసిల వరకు నీటిని పొందగలిగాం. అయితే రెండేళ్ల నుంచి తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు చేరడం దుర్లభంగా మారడంతో తాగునీటి కష్టాలు రాకుండా చూసుకోవడమే ప్రథమ ప్రాధాన్యతగా మారింది. ఈఏడాది నీటి కటకట కారణంగా వచ్చే ఏడాది ఆగస్టు వరకు నీరు నిల్వ ఉండే అవకాశమే లేదని జల వనరుల శాఖ అధికారులు సైతం అంచనా వేస్తున్నారు. అనుకోకుండా భారీగా వర్షాలు కురిసి ఇటు తుంగభద్ర జలాశయం, ఇటు శ్రీశైలం జలాశయం నిండితే తప్ప జిల్లాకు నీటి గండం తప్పే పరిస్థితి లేదు. జిల్లాలో భూగర్భజలాలు సైతం అడుగంటిపోతుండటంతో బోర్లు, బావుల్లో కూడా నీరు లభ్యమయ్యే అవకాశలు సన్నగిల్లాయి. తాగునీటి కోసం సిబిఆర్ వరకు నీటిని తరలించి నిల్వ ఉంచి కదిరి, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని గ్రామాల దాహార్తి తీర్చాల్సి ఉంది. మరోవైపు సిబిఆర్ నుంచి కడప జిల్లా పులివెందులకు తాగునీరు ఇవ్వడం ప్రశ్నార్థకమే. దీంతో ఆ జిల్లాలోని గండికోట నీరే వారికి గత్యంతరం కానున్నాయి.
సెల్‌ఫోన్‌లో మట్కా!
* ఆన్‌లైన్‌లో కోడ్‌తో నిర్వహణ
* తాడిపత్రిలో చాప కింద నీరులా విస్తరణ...
తాడిపత్రి: తాడిపత్రిలో మట్కా మహమ్మారిని రూపుమాపుతామన్న పోలీసుల మాటలు నీటి మూటలైనాయి. స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్‌లో కోడ్ నెంబర్‌తో మట్కా నిర్వహణ చాప కింద నీరులా విస్తరిస్తోంది. స్మార్ట్ ఫోన్‌లో మట్కా చిట్టీని ఫోటో తీసి వాట్సప్‌లో చిట్టీని పోస్ట్ చేస్తూ ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహణ గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. మట్కా కంపెనీ నిర్వాహకులు బీటర్లను తొలగించి, అన్‌లైన్ దందాకు తెరదించారు. మాట్కా నెంబర్లను పేపర్‌పై రాసి స్మార్ట్ఫోన్‌లో ఫోటో తీసి మట్కా కంపెనీ నిర్వాహకులు ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు వాట్సప్ పెడితే సరి. మాట్కా ఆడే వారితో ముందుగా మట్కా కంపెనీ నిర్వాహకులు రూ.10వేలకు తక్కువ కాకుండా కంపెనీకి అడ్వాన్స్ డిపాజిట్ చేయుంచుకొని, కోడ్ నెంబర్‌ను కేటాయిస్తారు. పగలు ఆటైతే డిఎం, రాత్రి ఆటైతే ఎన్‌ఎం అని రాసి, డేట్, కోడ్ నెంబర్‌తో వాట్సప్‌లో చిట్టీని పంపుతారు. డిపాజిట్ చేసిన నగదు అయిపోయేంత వరకు వారి కోడ్ నెంబర్‌పై ఆట జరుగుంది. సత్తా మట్కా డాట్ మోబి నెంబర్-1, సత్తా మట్కా డాట్ నెట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు స్క్రిబ్ డాట్ కం, సత్తా మాట్కా రిజల్ట్ డాట్‌నెట్ వెబ్‌సెట్‌లలో మాట్కా నెంబర్ తగిలింది లేదా అని ఆడిన వారు చూసుకుంటారు. మరుసటి రోజు మాట్కా నెంబర్ తగిలిందా, తగల లేదా, తగిలితే వచ్చిన మొత్తాన్ని మాట్కా కంపెనీ నిర్వాహకులు వాట్సప్‌లోనే తెలుపుతారు. గతంలో రూపాయికి రూ.90 ఇచ్చే వారని, ప్రస్తుతం రూపాయికి రూ.80 ఇస్తున్నారని సమాచారం. మట్కా నెంబర్ తగిలిన వారికి గతంలో మరుసటి రోజున నగదు మొత్తాన్ని ఇచ్చే వారని, పస్తుతం వారానికి ఒకసారి ఇస్తున్నారని సమాచారం. మిలాన్ డే 7రోజుల ఆట సోమవారం నుంచి ఆదివారం, మిలాన్ నైట్ 6 రోజుల ఆట సోమవారం నుంచి శనివారం వరకు యధేచ్చగా కొనసాగుతుంది.
జిల్లాలో మోస్తరు వర్షం
* పంటలకు ఊపిరి..
* ప్రత్యామ్నాయ పంటలకు రైతుల సమాయాత్తం..
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా ఆదివారం మోస్తరుగా కురిసింది. జిల్లాలో ఈపాటికి భారీగా బాగా కురిసి ఉంటే 5 లక్షల హెక్టార్లకు పైబడి ఖరీఫ్ వేరుశెనగ పంట జిల్లాలో సాగయ్యేది. వర్షాలు కురవకపోవడం వల్ల కేవలం 1.32 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగైంది. ఇతరత్రా పంటలు కలిపి 3.5 లక్షల హెక్టార్లకు మించకపోవడం గమనార్హం. అయితే రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తాతోపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్ర వేత్తలు ప్రకటించడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. కాగా ఆగస్టులో 88.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 24 మి.మీ వర్షం కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 63.9 మి.మీకు, 59.2 మి.మీ. కురిసింది. జూలైలో 67.4 మి.మీకు కేవలం 31.0 మి.మీ మాత్రమే కురవడంతో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో ఆఖరకు తాగునీటికి సైతం కటకట ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఆగస్టులో సైతం వర్షం ఎగనామం పెట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్ నుంచి ఆగస్టు 13 వరకు మొత్తం 167.2 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా 133 మి.మీ మాత్రమే కురిసింది. ఇక ఈనెల మొత్తంగా ఇప్పటి వరకూ 43.3 మి.మీ 35.9 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం కురిసిన కొద్దిపాటి వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 63 మండలాల్లో ఐదారు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. చాలా మండలాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు చినుకులు, జల్లులు పడ్డాయి. ఇప్పటికే భూగర్భజలాలు సైతం సుమారు 20 మండలాల్లో 60 నుంచి 70 మీటర్ల లోతుకు వెళ్లినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు 35 మండలాల వరకు 27 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. దీంతో ఈఏడాది వర్షంపై పూర్తిగా ఆశలు సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆదివారం వర్షం కురవడంతో రానున్న రెండు, మూడు రోజుల్లోనైనా భారీ వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నారు.
వజ్రాల వేట!
వజ్రకరూరు : వర్షం వచ్చిన ప్రతిసారి జిల్లాలోని వజ్రకరూరులో చిన్నారులను మొదలుకొని వృద్ధుల వరకూ కుటుంబాలకు కుటుంబాలు తరలివచ్చి వజ్రాల వేట కొనసాగించడం పరిపాటిగా మారింది. ఎక్కడి నుంచో వచ్చిన వారికి వజ్రాలు చిక్కాయని కొందరు, స్థానికులకు దొరికితే లబ్ధిపొందుతున్నారని మరికొందరు ఒకరికొకరు తోడై వజ్రాలను వెతకడమే పనిగా అలవరుచుకున్నారు. ప్రస్తుతం నాలుగు రోజులు సెలవులు రావడంతో చిన్నపాటి ఉద్యోగులు సైతం కుటుంబ సభ్యులతో అన్నపానీయాలను తీసుకుని పొలాల్లో తిరుగుతున్నారు. మండల కేంద్రంలోని వజ్రానే్వషణ కేంద్రం పొలాలతోపాటు గతంలో వజ్ర పరిశోధన సాగించి, కింబర్‌లైట్లు లభించిన చోట ప్రజలు గుంపులుగా చేరి వెతుకుతున్నారు. గుంటూరు, రాజంపేట, ధర్మవరంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు మండల కేంద్రంలో రాత్రి బస చేసి తెల్లవారుజామునే వజ్రానే్వషణ కోసం వెళ్తున్నారు. చిక్కిన ప్రతి రాయిని వజ్రామేమోనని భద్రపరుచుకుని అనుభవం ఉన్న వారికి చూపించి నివృత్తి చేసుకుంటున్నారు. కాగా సుదూర ప్రాంతాల నుంచి వజ్రానే్వషణ కోసం విచ్చేసిన ప్రజల వద్దకు దళారులు చేరి వజ్రాలు ఇలా ఉంటాయని చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. దళారులు ప్రజలకు లభించిన రాళ్లను పరిశీలించి వజ్రాలైతే తమ యజమాన్యం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగిస్తారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడికి అన్నాభిషేకం
ఆత్మకూరు: మండల పరిధిలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి శ్రావణమాసం 3వ ఆదివారం సందర్బంగా అన్నాభిషేకోత్సవం నిర్వహించారు. స్వామివారితోబాటు మంజునాథ స్వామివారికీ అన్నాభిషేకం, పార్వతీ దేవికి పుష్పార్చన చేశారు. అన్నాభిషేకోత్సవం చూసి తరించడానికి వేలాదిగా భక్తజనం పంపనూరు తరలివచ్చారు. తర్వాత స్వామివారికి జలాభిషేకం చేసి పుష్పాలతో అలంకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వాణి పంపనూరు చేరుకుని అన్నాభిషేకోత్సవం తిలకించారు. ఆలయ ధర్మకర్త రామకృష్ణారెడ్డి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు సహాయ సహకారాలందించారు.
గుత్తిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా!
* అడుగుంటుతున్న భూగర్భజలాలు
* లబోదిబోమంటున్న రైతులు
* పట్టించుకోని అధికారులు
గుత్తి : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజురోజుకూ ఇసుకకు డిమాండ్ పెరుగుతుండడంతో కొంతమంది వ్యాపారులు ఆయా గ్రామాల్లోని నదుల నుంచి ఇసుకను భారీగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం ప్రభుత్వ నిర్మాణాలకు మాత్రమే అధికారుల అనుమతితో ఇసుకను తరలించాల్సి ఉండగా అక్రమార్జనకు అలవాటు పడ్డ ఇసుక వ్యాపారులు, కాంట్రాక్టర్లు, యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మండల పరిధిలోని బేతాపల్లి, వెంగన్నపల్లి, రజాపురం, లచ్చానుపల్లిపెద్దవంక, గాజులపల్లి, మాముడూరు, అబ్బేదొడ్డి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని ఆయా గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వ స్థలాలను అనధికారికంగా సాగుచేసుకుంటున్న కొందరు భూమిపై తమకే హక్కు ఉందని ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 500 మేర వసూలు చేస్తూ ఇసుక అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. మండలం నుంచి సరిహద్దు మండలాలైన తుగ్గలి, మద్దికేర, గుంతకల్లు తదితర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. ఒక్క ట్రాక్టర్ ఇసుకను రూ. 500కు కొనుగోలు చేసినా ట్రాక్టర్ యజమానులు ఇతర ప్రాంతాలకు తరలించి రూ.2వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకకు డిమాండ్ పెరుగుతుండడంతో అందినకాడికి దండుకుందామన్న దురాశతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నా, ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. మరోవైపు నియంత్రించాల్సిన రెవెన్యూ పోలీస్ అధికారులు అప్పుడప్పుడు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి చేతులుదులుపుకుంటున్నారన్న విమర్శలు విని పిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల పరిధిలోని చేతిపంపులు, దిగుడు బా వుల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడంతో పాటు ప్రజల దాహార్తి తీర్చుకునేందుకు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా గుత్తి ఏరియాలో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటక ముందే ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై డిప్యూటీ తహశీల్దార్ మునివేలును వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణాపై వరసగా దాడులు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా గ్రామాల్లోని విఆర్‌ఎల ద్వారా నిఖా ఏర్పాటు చేసి ఇసుక రవాణాను నియంత్రిస్తామన్నారు.
చైనా వస్తువులను బహిష్కరించాలి
* బిజెపి ఆధ్వర్యంలో ర్యాలీ
హిందూపురం టౌన్ : భారతీయులందరూ చైనా వస్తువులను బహిష్కరించాలని భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి గాంధీ, అంబేద్కర్ సర్కిళ్ల మీదుగా సద్భావనా సర్కిల్ వరకూ సాగింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ క్విట్ ఇండియా స్ఫూర్తితో భారతీయులందరూ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలన్నారు. మనదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా తమ ఉత్పత్తులను అధికంగా ఎగుమతి చేస్తోందని, భారతీయ పౌరులందరూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్‌రెడ్డి, బిజెవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు పిడి పార్థసారధి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడికుర్తి హరి, బిజెపి కార్యదర్శి వరప్రసాద్, లక్ష్మీనారాయణ, తిరుమలేష్, హరీష్, అమరదేవేంద్ర, అశోక్‌కుమార్, ఉదయ్‌కుమార్, కిషోర్‌కుమార్, శంకర, ఫణి, సుధాకర్, సునిల్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత కోసం మరో స్పెషల్ డ్రైవ్
* ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి..
* సెల్‌ఫోన్‌లో మాట్లాడినా.. ట్రిపుల్ రైడింగ్‌పై చర్యలు..
* ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం అర్బన్: రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసులు జిల్లాలో విభిన్న అంశాలతో ఈ వారం మరో స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టనున్నట్లు ఎస్పీ జివిజి. అశోక్‌కుమార్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. గత వారం చేపట్టిన కొన్నింటిని యథాతథంగా కొనసాగిస్తూనే ఈ వారం మరికొన్ని అంశాలపై పకడ్భందీగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఆదివారం ఇందుకు సంబంధించి ఓ పత్రికా ప్రకటనను జిల్లా పోలీసు కార్యాలయం విడుదల చేసింది. గత వారం స్పెషల్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 18,928 వాహనాలు తనిఖీ చేసినట్లు తెలిపారు. ఇందులో నంబర్ లేని ద్విచక్ర వాహనాలు 2,327, ఓవర్ లోడింగ్ ఆటోలు 2,246, త్రిబుల్ రైడింగ్ వాహనాలు 2,279ను గర్తించటం జరిగిందన్నారు. నిబంధనలు ఉల్లఘించిన వాహనచోదకులుపై 4,714 కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు.
రాష్ట్ర, జాతీయ రహదారులపై వెళ్లే కార్లు, జీపులు తదితర వాహనాల చోదకులు 5,082 మందికి సీట్‌బెల్ట్ ధరించమని చైతన్యం చేయటం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో కొన్ని మార్పులతో మరింత రోడ్డు భద్రత ప్రమాదాలను తగ్గించడానికి విభిన్న చర్యలతో మరో స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశే్లషించగా ద్విచక్ర వాహనచోదకులు అధికంగా మృత్యువాతపడటం జరిగిందన్నారు. అందులో సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయటం ఒకటి, రెండవది హెల్మెట్ లేకుండా, మూడవది త్రిబుల్ రైడింగ్ వల్ల ఈ ప్రమాదాలు జరిగాయన్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటూ వాహనం నడపడం, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం అన్నారు. ఇక త్రిబుల్ రైడింగ్ చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలించే ఆటోలపై కేసులు నమోదు చేసి, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రైవర్‌కు పక్కన ఎవ్వరైనా కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్లను ఉపేక్షించవద్దన్నారు. రాష్ట్ర, జాతీయ రహదారులపై వెళ్లే కార్లు, జీపులు తదితర వాహన చోదకులకు సీటుబెల్టు ధరించమని సూచనలు ఇవ్వాలని పోలీసులకు సూచించారు.
జిఎస్‌టితో పెరిగిన ధరలు!
* ఆందోళనలో వినియోగదారులు
మడకశిర: కేంద్ర ప్రభుత్వం గత జూలై మాసం నుండి అమలు చేసిన వస్తు సేవల పన్ను వల్ల ధరలు పెరిగిపోవడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రకాల వస్తువుల ధరలు అన్ని చోట్ల ఒకే విధంగా ఉండాలని జిఎస్‌టి అమలు చేస్తున్న విషయం తెలసిందే. అయితే దీన్ని అమలు చేయడం వల్ల వస్తువుల ధరలు గతం కంటే పెరిగినట్టు వినియోగదారులు పేర్కొంటున్నారు. కేంద్రం అమలు చేస్తున్న జిఎస్‌టి వల్ల సరుకు ఉత్పత్తి అయిన కంపెనీ నుండి బయటకు వచ్చేసమయంలో జిఎస్‌టి అమలు చేసి ఉత్పత్తిదారుడిపై విధించాల్సి ఉంది. అయితే ప్రస్తుత మార్కెట్‌లో చాలా మంది వ్యాపారులు వస్తువులను కొనుగోలుదారులు కొనుగోలు చేసిన సమయంలో జిఎస్‌టి విధించి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారుడిపై మరింత భారం పడుతోంది. ఈ ప్రాంతంలో వ్యాపారులు బిస్కెట్లు, మందులు, ఇనుము తదితర వస్తువులను కొనుగోలు చేస్తే అదనంగా పన్ను విధిస్తున్నట్లు వాపోతున్నారు. ఇదే విషయమై వినియోగదారులు వ్యాపారులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. అయితే వ్యాపారులు మాత్రమే తాము కొత్తగా ఎలాంటి పన్నులు వేయడం వేదని, జిఎస్‌టి అమలు వల్ల పలు రకాల వస్తువుల ధరలు పెరిగినట్టు చెబుతున్నారు. ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకొని ఎలాంటి వస్తువుల ధరలు పెరిగాయి, ఏఏ వస్తువులకు జిఎస్‌టి విధించారన్న విషయాలపై అవగాహన కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
గుంతకల్లు : పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన శివ (24) ఆదివారం కర్నూలు జిల్లాలోని హత్తెబెళగల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరో యువకుడు అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు హౌసింగ్ బోర్డులో నివాసం ఉంటున్న కమలమ్మ కుమారుడు శివ, అదే ఏరియాకు చెందిన అజయ్ కర్నూలు జిల్లాలోని గూళ్యంకు ద్విచక్రవాహనంలో వెళ్లి వస్తుండగా బెళగల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని ఢీకొన్నారు. దీంతో శివ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించినట్లు టుటౌన్ పోలీసులు తెలిపారు. శవాన్ని పొస్ట్‌మార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని ఆలూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
దైవానుగ్రహంతో పునీతులు కావాలి
అనంతపురం సిటీ: హజ్ యాత్ర ఎంతో పవిత్రమైనదని, దైవానుగ్రహంతో పునీతులు కావాలని అనంతపురం తహశీల్దార్ అన్వర్ హుస్సేన్, వన్‌టౌన్ సిఐ సాయిప్రసాద్‌లు తెలిపారు. ఆదివారం నగరంలోని మసుమా బీబీ దర్గాలో హజ్ యాత్రికులకు ఆత్మీయత సత్కారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హజ్ యాత్రకు బయలుదేరి వెళ్లి వస్తున్న ముస్లింలు హాజీలుగా నైతిక విలువలు పెంపొందించుకుని తమ జీవితాల్లో వెలుగు నింపుకుని రావాలని తెలిపారు. అనంతరం దర్గాలో హజ్ యాత్రకు వెళ్తున్న వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హాజ ఖదర్‌సాబ్, మున్నా, ఫకృద్దీన్, మైనార్టీ నాయకులు సాలర్‌బాష, రషీద్ అహ్మాద్, ఇక్బాల్‌సాబ్ పాల్గొన్నారు.
జనావాసాల్లోని మద్యం షాపులు ఎత్తివేయాలి
అనంతపురం సిటీ: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా జనవాసాల్లో ఉన్న 32 మద్యం షాపులను తక్షణమే ఎత్తివేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, ఇతర మహిళా నేతంతో కలసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళల సమస్యలపై రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించి తగు కార్యాచరణ చేపట్టామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండే మద్యం షాపుల ఎత్తివేతకై త్వరలో చలో వెలగపూడి చేపడుతున్నట్లు వెల్లడించారు. మద్యం అదాయం కోసం ప్రభుత్వ అధికారులకు టార్గెట్ నిర్దేశించడం సరికాదన్నారు. డ్రగ్స్‌ను అరికడతామని ఉక్కుపాదం మోపుతామని చెబుతున్న సర్కారు మద్యం నియంత్రిస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఆదాయం కోసం పేదల కుటుంబాలను బలిచేస్తోందన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టేలా బిజెపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, నగర కార్యదర్శి చంద్రిక, నాయకురాళ్లు రామాంజినమ్మ, రాజేశ్వరి, భూలక్ష్మి, సునీత, లక్ష్మి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి పిల్లల చావులు పట్టవా
అనంతపురం సిటీ: 63 మంది పసి ప్రాణాలు ఉత్తరప్రదేశ్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించ లేక చనిపోయినా కేంద్ర, ప్రభుత్వానికి పట్టదా అని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నూర్‌మహమ్మద్ ప్రశ్నించారు. ఆదివారం గణేనాయక్ భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సూర్యచంద్ర అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నూర్‌మహమ్మద్ మాట్లాడుతూ గో సంరక్షణ కోసం 70 కోట్ల రూపాయలు కేటాయించిన యుపి ప్రభుత్వం ఆసుపత్రిలో ఆక్సిజన్‌కు కేటాయించాలని ఇంగితజ్ఞానం ఎందుకులేదన్నారు. 24 గంటల్లోనే 32 మంది చిన్నారులు చనిపోయినా ముఖ్యమంత్రి విలాసవంతమైన విందుల్లో గడపడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందించే బాధ్యత ప్రైవేటు వారికి అప్పజెప్పడం అంటేనే వైద్యానికి గాలికి వదలడమే అవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతగా ఆసుపత్రిని సందర్శించి, సౌకర్యాల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు
అనంతపురం సిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభత్వులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు కార్మికులు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని ఎఐటియూసి రాష్ట్ర కార్యదర్శి మనోహర్ మాణిక్యం పేర్కొన్నారు. నగరంలోని వికె మెమోరియల్ హాల్‌లో మూడు రోజులపాటు ఎఐటియూసి నిర్వహించే రాయలసీమ ప్రాంతీయ శిక్షణా తరగతులను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికవర్గ పోరాటాల అణిచివేతకు, ఎన్నో దశాబ్ధాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను హరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ ఎఐటియూసి చొరవతో కార్మిక ఐక్య పోరాటాలకు శ్రీకారం చుట్టాయన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా వారి శ్రమను దోపిడీ చేస్తున్నారన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సర్వీసులను క్రమబద్దీకరిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చకపోగా అధికారంలోకి వచ్చిన తరువాత 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదన్నారు. కార్మిక వ్యతిరేక విధనాలపై బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సైద్దాంతికంగా చైతన్యవంతులై పోరాటం చేయకుంటే మతోన్మాద శక్తులను నిలువరించలేమన్నారు.
కార్మికులను పోరాటాల వైపు నడిపించడానికి సైద్దాంతికంగా చైతన్యం చేయడానికి ఈ శిక్షణా తరగతులు తోడ్పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐటియూసి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని వెంకటరామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, చేనేత ప్రధాన కార్యదర్శి గోవిందు, అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన యూనియన్ నాయకురాళ్లు లలితమ్మ, భాగ్యలక్ష్మి, ఎఐటియూసి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ప్రధాన కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీ జాబితాలో చేర్చేవరకు విశ్రమించం
అనంతపురం అర్బన్: వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు విశ్రమించబోమని రాష్ట్ర వాల్మీకి సేవా సమితి ప్రధాన కార్యదర్శి బిటి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్ర వాల్మీకి సేవా సమితి నూతన కమిటీని ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. వాల్మీకి సేవా సమితి ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి సమావేశం బి.టి. రామాంజినేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి పలువురు వాల్మీకి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి.టి. వెంకటేష్ మాట్లాడుతూ 2014 ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబునాయుడు వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేరుస్తామని హామీ ఇవ్వటం జరిగిందన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయినప్పటికీ ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. మరికొద్ది నెలల్లో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే తమ కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తాం అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన రాష్ట్ర కమిటీ సభ్యులను ఆయన ప్రకటిస్తూ నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర వాల్మీకి సేవా సమితి గౌరవాధ్యక్షులుగా బి. మద్దిలేటి, రాష్ట్ర అధ్యక్షులుగా జి.ఆర్. చంద్రమోహన్, ఉపాధ్యక్షులుగా అంచెల శ్రీనివాసులు, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులుగా బి.టి. వెంకటేసులు, జి.స్వామి, వన్నూరుస్వామి, కార్యదర్శిగా రామకృష్ణ, చిన్న కంబగిరి స్వామి, రమణ, చంద్రశేఖర్‌లను ఎంపిక చేయటం జరిగిందన్నారు. మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా వాణిశ్రీని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వాల్మీకి సేవా సమితి అనంతపురం జిల్లా అధ్యక్షులుగా తలారి లోకేష్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.