కర్నూల్

గంగుల చేరికపై భిన్నస్వరాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: మాజీ ఎంపి గంగుల ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరికపై కర్నూలు జిల్లా పార్టీలో ఆనందం వ్యక్తమవుతుండగా భూమావర్గం పునరాలోచనలో పడింది. గంగుల చేరికతో నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి విజయం ఖాయమని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తుంటే తమతో ఒక్కమాటైనా చెప్పకుండా తమ ప్రత్యర్థిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని భూమావర్గం ప్రశ్నిస్తోంది. అంతేగాక గంగుల ప్రతాపరెడ్డి టిడిపిలో చేరడంతో భవిష్యత్తు పరిణామాలపై ఆ వర్గం నాయకులు గురువారం సమాలోచనలు నిర్వహించారు. ఆయన చేరితే ప్రధానంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాజకీయంగా సంభవించే మార్పులపై భూమావర్గం చర్చించినట్లు తెలుస్తోంది. గంగుల చేరికను వ్యతిరేకించాలా లేక పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించిన తరువాతే స్పందించాలా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేకపోయినట్లు తెలుస్తోంది. పార్టీలో ఏ నాయకుడు చేరినా అంతకుముందు అదే ప్రాంతానికి చెందిన నాయకులతో సమాలోచనలు జరిపిన అనంతరమే పార్టీ పెద్దలు తుది నిర్ణయం తీసుకుంటారు.్ఫ్యక్షన్ నేపధ్యంలో బద్ధశతృవులుగా ఉన్న భూమా, గంగులవర్గాలు తమ ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకించడం సాధారణంగా జరుగుతున్న విషయం. గతంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి ఆళ్లగడ్డ టిడిపి ఇన్‌చార్జిగా ఉన్న సమయంలో వైకాపా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ పార్టీలో చేరే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లి చర్చించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో గంగుల ప్రతాపరెడ్డి విషయం ఒక్క మాట కూడా మంత్రి అఖిలప్రియకు గానీ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డికి గానీ తెలియజేయలేదని భూమావర్గం ఆరోపిస్తోంది. ఆళ్లగడ్డ వంటి కీలక నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఇరువర్గాలు ఇమడం కష్టమని ఇప్పటికే తేలిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. భూమా చేరికతో గంగుల వైకాపా తీర్థం పుచ్చుకున్న విషయాన్ని వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. గంగుల ప్రతాపరెడ్డి చేరికతో ప్రస్తుతం నంద్యాల ఎన్నికల్లో విజయావకాశాలు పక్కన పెడితే భవిష్యత్ పరిణామాలపైనే భూమా వర్గం ప్రధాన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గంగుల చేరికపై టిడిపి అధిష్టానాన్ని సంప్రదించగా ఈనెల 19వ తేదీ ఈ విషయంలో చంద్రబాబు భూమా కుటుంబీకులతో చర్చిస్తారని, కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దాంతో చంద్రబాబు ఏం చెబుతారో చూసి ఎన్నికల అనంతరం ఆలోచించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గరుడనందిలో వేడుకగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఉత్సవాలు
మహానంది: మహానంది పుణ్యక్షేత్రానికి నంది వలయంగా ఉన్న నవనందులలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ గరుడనందీశ్వర స్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, కలశ స్థాపన, జీర్ణోద్దరణ పూజలు అంగరంగ వైభవంగా ముగిశాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఈ పూజల్లో చివరి రోజైన గురువారం వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్, వైద్యనాధ శివాచార్యులుతోపాటు ప్రత్యేక వేదపండితులు పూజలకు ఉభయ దాతలైన భగద్‌దత్తు, శ్రీవాణి దంపతులు, ఆర్ మారుతి కుమార్‌చే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా యాగశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి చతుర్ధకాల పూజలు, హోమాలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగే స్థలంలో యంత్ర స్థాపనం నిర్వహించి దాతలతోపాటు చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఇఓ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఇఓ ధనుంజయలచే ధ్వజస్తంభ శిఖర కలశ ప్రతిష్ఠ మహోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వేలాది మంది ఓంకార నామస్మరణల మధ్య నిర్వహించారు. అనంతరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు కళాన్యాసం, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసనం, కుంభ ప్రదక్షిణం చేసి కలశాల్లోని జలాలతో శ్రీ పార్వతి సమేత శ్రీ గరుడనందీశ్వర స్వామి వార్లకు జీర్ణోద్ధరణ కార్యక్రమాలతోపాటు శాంతి అభిషేకం, కుంభం, కక్షజ్వాలవేద కార్యక్రమాలు గోవు, పుణ్యశ్రీ దర్శనాలను నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం ఉభయ దాతలకు వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

కానిస్టేబుళ్లు పోలీసుశాఖకు పునాదులు
కర్నూలు: పోలీస్‌శాఖకు ఆనిస్టేబుళ్లు పునాదిలాంటి వారని రాయలసీమ ఐజి షేక్ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. గురువారం నగర సమీపంలోని దినె్నదేవరపాడు వద్ద ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 2017-18 బ్యాచ్‌కు చెందిన 173 మంది 9నెలల శిక్షణను ఎస్పీ గోపినాథ్ జెట్టితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఐజి మాట్లాడుతూ విధి నిర్వహణలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నారు. పనిచేసే చోట నిబద్దతతో ఉండి ఎంచుకున్న ఉద్యోగానికి న్యాయం చేసి విలువలతో కూడిన పోలీసుగా ఉండాలన్నారు. మంచి వ్యక్తిత్వం, నిజాయితీ, దైర్యం కలిగి ఇతరకులకు ఆదర్శంగా ఉండాలన్నారు. పోలీసుస్టేషన్లు ఆశ్రయించే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో కలిగించాలన్నారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఫేస్‌బుక్, వాట్సప్ వంటి వాటితో కాలయాపన చేయకుండ ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు. అప్పగించిన విధులను నిర్వర్థించడమే సేవగా భావించాలన్నారు. పోలీసులు సమాజంతో ఒక భాగం అని, ఎప్పటికీ మర్చిపోకూడదని, పోలీసులను చూసి మరికొంత మంది యువత స్ఫూర్తిగా నిలువాలన్నారు. 9 నెలల శిక్షణలో తిరుపతి అర్బన్ 41, కడప 71, గుంటూరు 61 జిల్లాల నుండి 173 మంది ట్రైనింగ్ సివిల్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ షేక్‌షావలి, డిఎస్పీలు టిడిసి వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖరరాజు, రమణమూర్తి, సిఐలు మహేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, ఆర్‌ఐ శివారెడ్డి, ఆర్‌ఎస్‌ఐ రమేష్, టిడిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
కర్నూలు సిటీ: వైకాపా అధ్యక్షుడు జగన్‌కు నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ న్యాయాన్ని గెలిపించాలని, అవినీతికి పాల్పడే వారిని ఓడించాలని ప్రజలకు పిలుపు నివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సత్పప్రవర్తన గురించి, నీతి వాఖ్యలు వల్లిస్తుంటే దెయ్యాలు వేదాలను వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, చిన్నాన్న వివేకానందరెడ్డిలను కలిసి రాష్ట్రంలోని యువత జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని అడిగితే వారికి ఏమి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందన్నా రు. ఎందుకంటే జగన్ గతంలో జులాయిగా, ఆకతాయిగా తిరుగుతూ నిరంతరం అక్రమాలకు పాల్పడే వాడని, వాటిని తట్టుకోలేక తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం జగన్‌ను హైదరాబాద్‌లో అడుపెట్ట నీయలేదన్నారు. ఆ సమయంలో ఎప్పుడు బెంగళూర్‌లోనే ఉండే విధంగా ఏర్పాట్లు చేశాడన్నారు. అటువంటిది జగన్ నిరంతరం చంద్రబాబుపై విమర్శలు చేస్తూ ఆయన చేసే ప్రతి అభివృద్ధి పనికి అడ్డుపతూ తన నియంతృత్వ దోరణిని ప్రదరిస్తున్నాడన్నారు. చంద్రబాబును యువత ఆదర్శంగా తీసుకోవాలని ఢంకా మోగించి చెప్పుతామని, ఎందుకంటే ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రాజకీయాల్లో ఈ స్థాయికి చేరుకున్నాడని వెల్లడించారు. జగన్ గొంతెమ్మ కోర్కెలను చూసి రాజకీయ గురువు ప్రశాంతి కిషోర్ పారిపోయాడన్నారు. ముఖ్యంగా చంద్రబాబు తన ఆస్థిని అన్ని వివరాలతో సహా ప్రకటించాడని, జగన్ మాత్రం ఆయన ఆస్థులను ప్రకటించ లేదని, ఎందుకంటే గతంలో హైదరాబాద్‌లో కూడా ఇళ్లు ఉండేది కాదని, ప్రస్తుతం లోటస్ ఫాండ్ 68 గదుల ఇళ్లుతో పాటు వైట్ హౌస్‌ను తలపించే విధంగా బెంగళూర్ నందు 35 ఎకరాల్లో ఒక ఇళ్లు, చెన్నైలో ఒక ఇళ్లు ఇలా లెక్కలేనన్ని ఉన్నాయని, వాటిన్నింటిని తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాధించినవే అన్నారు. జగన్‌కు నైతిక విలువ ఉంటే తక్షణమే తన ఆస్తుల వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు అల్లబకాష్, బాబురాజ్, మహేష్ గౌడ్, నాగేంద్ర, హనుమంతరాయ చౌదరి పాల్గొన్నారు.
ఆదోనిలో మోస్తరు వర్షం
ఆదోని: ఆదోనిలో గురువారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం గంటపాటు కురిసింది. దీంతో ఆదోని పట్టణంలో ఉన్న రోడ్లు జలయం అయ్యాయి. ఆదోని మెయిన్ రోడ్డు విబిఎస్ సర్కిల్ నుంచి పాత బస్టాండ్ వరకు వర్షం నీరు నిండి రోడ్లు మీద ప్రవహించింది. మున్సిపల్ మైదానంలోకి వర్షం నీరు పరుగులు తీస్తూ మైదానం అంతా నిండిపోయింది. విబిఎస్ సర్కిల్ నుంచి రోడ్లు, కాలువలు నిండిపోయాయి. పాదచారులు, మోటార్ సైకిల్ వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి మార్కెట్, బిఎన్ థియేటర్ రోడ్డు, పోస్టల్ కాలనీ మొదలగు ప్రాంతాల్లో ఇండ్లలోకి నీరు వెళ్లడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఝాన్సీలక్ష్మీబాయి కూరగాయల మార్కెట్ రెండువైపుల రోడ్లు వర్షం నీటితో పూర్తిగా నిండిపోయి మార్కెట్‌లోకి వెళ్లడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది. రైతు బజారులో వర్షం నీరు నిలిచింది. కురిసిన వర్షం ఆదోనితోపాటు గ్రామాల్లో కురిసినట్లు సమాచారం. కురిసిన వర్షాల వల్ల పంటలకు ఊపిరి వచ్చినట్లు అయిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల దెబ్బతిన్న పంటలు మళ్ళికి చిగురు దశకు చేరుకున్నాయి.

కాంగ్రెస్ పేదల పార్టీ
నంద్యాలటౌన్: రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్ర మోదీకి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబు, జగన్‌కు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు జెడి శీలం, తులసిరెడ్డి, కిల్లీ కృపారాణిలు అన్నారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిలు రాష్ట్ర ప్రయోజనాలను నరేంద్రమోదీకి తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్ర రాజకీయ తోలుబొమ్మలాటలో బిజెపి నేతలు మోదీ, అమిత్‌షాలు సూత్రధారులు కాగా చంద్రబాబు, జగన్‌లు పాత్రధారులన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు అనేక జిమ్మిక్కులు చేస్తుండగా, 11 క్విడ్‌ప్రోకో కేసుల నుంచి బయటపడడానికి జగన్ మరికొన్ని జిమ్మిక్కులు చేస్తూ బిజెపితో చేతులు కలిపారన్నారు. టిడిపికి ఓటు వేస్తే బిజెపి ఓటు వేసినట్లేనన్నారు. రాష్ట్ర విభజన తరువాత విభజన చట్టంలోని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు మోసం చేస్తుండగా, ప్రతిపక్షంలో ఉన్న జగన్ వాటిని ప్రశ్నించకుండా రెండు పార్టీ నేతలు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమలో ఉక్కు కర్మాగారాన్ని కాంగ్రెస్ పార్టీ పేర్కొనగా మోదీ ప్రభుత్వం అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. అలాగే ప్రత్యేక ప్యాకేజీని కూడా చట్టంలో పేర్కొన్న విధంగా బిజెపి రాయలసీమకు అన్యాయం చేస్తున్నదన్నారు. అటువంటి మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు, జగన్ పోటీపడి మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. అనంతరం చంద్రబాబు, జగన్‌లు బిజెపిని నెత్తిన పెట్టుకుని మోదీ పాదాల చెంత మోకరిల్లినట్లు ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యురాలు కమలమ్మ, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్, చింతలయ్య, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో ప్రతిచిన్న అంశాన్ని వెబ్‌కాస్టింగ్ చేయాలి
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఈనెల 23వ తేదీన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని 225 పోలింగ్ కేంద్రాల్లో జరిగే ప్రతి చిన్న అంశాన్ని వెబ్‌కాస్టింగ్ చేయాలని కలెక్టర్ సత్యనారాయణ ఇంజినీరింగ్ విద్యార్థులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని సునయనా ఆడిటోరియంలో పోలింగ్ వెబ్‌కాస్టింగ్ శిక్షణ కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్ట్రోల్ అధికారి జిల్లా యంత్రాంగం వెబ్‌కాస్టింగ్ ద్వారా క్షుణ్ణంగా పరిశీలించనుందని, పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి చిన్న అంశాన్ని చిత్రీకరించాలన్నారు. పోలింగ్‌లో వెబ్‌కాస్టింగ్ అతికీలకమైన అంశంగా ఎన్నికల సంఘం సూచించిందని, ఈమేరకు వెబ్ కాస్టింగ్‌లో పూర్తి స్థాయిలో శిక్షణ పొంది ఏ చిన్న అనుమానం ఉన్నా శిక్షకులను అడిగి తెలుసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని మైక్రో అబ్జర్వులు పరిశీలిస్తుంటారని, అప్పగించిన వెబ్‌కాస్టింగ్ పనులు జాగ్రతా నిర్వహించాలన్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రతి చిన్న అశం ముఖ్యమైనదేనని, పొరపాట్లకు అవకాశం లేకుండా చిత్రీకరించాలన్నారు. రహస్య ఓటింగ్ విధానాన్ని మినహా మిగిలిన పోలింగ్ ప్రక్రియను అంతటిని వెబ్‌కాస్టింగ్ చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ హుసేన్ సాహెబ్, సాంకేతిక డిఐఓ ఇసిఎల్‌ఐ ఇంజినీర్ పుల్లారెడ్డి, పుల్లయ్య, కెవి సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ఫొటోల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి-కలెక్టర్
కర్నూలు సిటీ: నిజానికి ప్రతీకకగా వాస్తవ పరిస్థితుల్లో ఫొటోలను తీసి సమాజంలోని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలోని ఎపి ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటో చాయాచిత్ర ఎగ్జిబిషన్ ప్రదర్శనను జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దినపత్రికల్లోని వార్తాంశాల కన్నా ఫొటో ప్రాధాన్యత సంతరించకున్న నేటి తరుణంలో సమాజంలోని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ఫొటోలను తీసి పత్రికల ద్వారా ప్రజలకు అందించాలని సూచించారు. పత్రికల ద్వారా ప్రజలకు అందించాల్సిన ఫొటో ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ఫొటోలను కలెక్టర్‌గా ఆసక్తిగా పరిశీలించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకొని అభినందించారు. దైనందిన జీవితంలో మానవత్వవ విలువలు ఉట్టిపడేలా విభిన్న రీతుల్లో చూడచక్కగా ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాలన్నారు. ప్రపంచ ఫొటోగ్రాఫీ దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన ఫొటోలను ప్రజలు అందరు తిలకించాలన్నారు. ఫొటోగ్రాఫర్లు మరిన్ని మంచి ఫొటోలు తీయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గోపినాథ్‌జెట్టి, ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, కేంద్రప్రభుత్వ క్షేత్ర ప్రచార అధికారి శివ హరినాయక్, తదితరులు పాల్గొన్నారు.

జగన్ మాటలు అవాస్తవం
నంద్యాల: ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడే మాటలు అవాస్తవమని, జగన్ ఆయన్ని మినహాయించి మిగతా వారందరిని దొంగలు అనడం ఆలోచించాల్సిన విషయం అని పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే అనిత అన్నారు. గురువారం నంద్యాల టిడిపి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబును కాల్చి చంపాలి, ఉరి తీయాలని మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఓటమి భయంతో ఇంటింటికి తిరిగి ఓటేయండని అడుక్కోవడం విడ్డూరంగా ఉందన్నారు. 16 నెలలు జైలులో ఉన్న దొంగ ఓటు వేయండని అడుగుతుంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాకు ఎలా మాట్లాడారో నేర్పించారు. మీలాగ అసభ్యకరమైన వల్గర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకొని మాట్లాడడం లేదన్నారు. రోజా మాట లు మహిళా సమాజం తలదించుకొనేలా ఉన్నాయన్నారు. మహిళలు వాడే దుస్తుల గురించి ఆమె మాట్లాడుతున్నారని, రోజా ప్రొఫెషన్‌లో ఎందుకు సాంప్రదాయ దుస్తులు గుర్తుకు రాలే దా అని ప్రశ్నించారు. పీతల సుజాత దళితురాలు కావడంతో మంత్రి పదవి నుండి తీసేశారని, చంద్రబాబు దళిత ద్రోహి అని ఆరోపించారని, అయితే మంత్రి జవహర్ ఏ కులానికి చెందిన వారో ఆయన మంత్రికాలేదా అని ప్రశ్నించారు. పీతల సుజాతను అసెంబ్లీలో అవమాన పరచినప్పుడు మీ నాయకుడు స్పందించలేదు, నువ్వు, జగన్ దళిత వ్యతిరేకులను, జగన్ మాటలతో మోసం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తన వద్ద డబ్బు లేదన్న జగన్ 16 నెలల జైలులో ఎందుకు ఉన్నారని అడిగారు. వాస్తవానికి దూరంగా ఉండే కల నీకు సిఎం యోగం లేదన్నారు. జగన్ అబద్దాలు చెప్పడు, మోసం చేయడని తనకు తానే సిఎం అనుకోవడం కానీ, జగన్ జీవితంలో ఎన్నడూ సిఎం కాలేడన్నా రు. జగన్ నోరు విప్పితే అబద్దాలు, జనాలను చూస్తే నీకు ఆవేశం వస్తుందని, ఆవేశంలో మాట్లాడుతున్నానని, ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడం సిగ్గుచేటన్నారు. జగన్‌లాంటి సైకిక్ పేషంట్, ప్రజల డబ్బులు దోచుకున్న దొంగకి ఓటు అడిగే అర్హత లేదన్నారు. రోజా ఇంత ఎక్కువగా వైకాపాకి ప్రచా రం చేస్తే టిడిపికి మేలు జరుగుతుందన్నారు. రోజా ఒక ఐరన్ లెగ్ అన్న సంగతి జగన్‌కు తెలిసినట్లు లేదన్నారు. నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఘన విజయంసాధిస్తారని, జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిడిపి విజయాన్ని అడ్డుకోలేరన్నారు.
ముద్రగడ పాదయాత్రతో కాపులకు ఒరిగేదేమీలేదు : మీసాల గీత
ముద్రగడ తలపెట్టిన పాదయాత్ర వల్ల కాపులకు ఒరిగేదేమిలేదని కాపు జాతికి మచ్చ తెచ్చేందుకే ముద్రగడ వైకాపాతో కుమ్మక్కు అయ్యారని టిడిపి నాయకురాలు మీసాల గీత అన్నారు. వైకాపా అండదండలతో ముద్రగడ పాదయాత్రకు పూనుకున్నారన్నారు. పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలనలో కాపు జాతికి ఎలాంటి అండదండలు లేవని, నిర్లక్ష్యానికి గురి అయ్యామన్నారు. 2014 వైకాపా మ్యానిఫెస్టోలో కాపుల ప్రాస్థావనే లేదన్న విషయం జగన్‌కు తెలియదా అన్నారు. తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాపులను బిసిల్లో చేర్చేందుకు బిసి కమిషన్ ఏర్పాటు చేశారని, త్వరలో నివేదిక వస్తుందని, కాపులకు చట్టబద్ధంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. సిఎం చంద్రబాబు కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించారని, కాపు విద్యార్థులకు ఉన్నత విద్య, విదేశీ విద్య అవకాశాలకు ఆర్థిక సహాయం అందజేయడంతోపాటు స్వయం ఉపాధి కోసం కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్న విషయం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ మోసాలను కాపు నేతలు గమనిస్తున్నారని, నంద్యా ల ఉప ఎన్నికలోనే కాదు 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాపులు జగన్‌కు బుద్ధి చెబుతారన్నారు.
ఎసిబి కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీరుగా ఉస్మాన్ సాహెబ్
కర్నూలు ఓల్డ్‌సిటీ: 1వ అడిషనల్ జిల్లా కోర్టులో సీనియర్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్. ఉస్మాన్ సాహెబ్‌ను ఎసిబి కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎసిబి కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్‌గా పదోన్నతి పొందిన ఎస్. ఉస్మాన్ సాహెబ్‌కు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చాంద్‌బాషా, సివి.శ్రీనివాసులు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలియజేశారు.

జలాశయాలు ఖాళీ.. తాగునీటికి కటకట...
చిప్పగిరి: మండలంలోని జలాశయాలు నీరు లేక పూర్తిగా ఎండిపోవడంతో మండలంలోని గ్రామాల్లో తాగు నీటికి కటకట ఏర్పడింది. తాగునీటికోసం పడుతున్న తీరు వర్ణనాతీతమంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో తాగునీటి ఎద్దటి నెలకొని విద్యార్థులను నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 300మంది విద్యార్థులు వున్న కెజిబివి హాస్టలకు డబ్బులు వెచ్చించి ట్యాంకర్ల ద్వార నీరు అందిస్తున్నారు. తాగు నీటి సమస్య జఠిలమై నీటి కష్టాలు ఉక్కిరి బిక్కిరి అవుతుండగా నీరు సౌకర్యం మెరుగుపరచడంలో రక్షిత నీటి శాఖ అధికారులరు తిరిగిచూసిన పాపాన పోలేదని ప్రజలు అధికారులకు శాపనార్థాలు పెడుతున్నారు. మండలంలోని ఖాజీపురం, మద్దికెర రిజర్వాయర్లకు తుంగభద్ర జలాలను నింపాల్సి వుంది. గత సంవత్సరమే తుంగభద్ర నీటి వాట లేక ఇంతవరకు నీరు విడుదల పట్ల ఎలాంటి సమాచారంలేదు. తుంగభద్ర ఎగువ కాల్వకు ఆంధ్రా వాటాకింద ప్రస్తుతం తాగునీరు మాత్రమే విడుదల చేస్తామని కర్నాటక ప్రభుత్వం తెలినపినప్పటికి ఆలూరు బ్రాంచి కాల్వకు తాగు నీరు కోసం సంబంధిత రక్షిత నీటి అధికారుల ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడంలో చోద్యం చూడడంవల్ల ప్రస్తుతం ఎగువ కాల్వకు విడుదల కానున్నా తాగు నీటి వాటాలో ఎబిసి నీరు మళ్ళించాల్సి ఉందని తుంగభద్ర అధికారులు అంటున్నారు. అయినా చిప్పగిరి మండలానికి తాగునీరు వచ్చే అవకాశం ప్రశ్నార్థకంగా వుంది. తాగు నీటి కష్టాలే కోకొల్లలుగా వుండగా ఇక సాగునీరు ఇక లేనట్లేనని ఎగువ కాల్వ అనుబంధ ఆలూరు బ్రాంచి కాల్వ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలాశయంలో పూర్తి స్థాయి నీరు నిండుకున్నందున రేపోమపో సాగు నీరు విడుదల అవుతుందని ఆశతో వేచిచూస్తుండగా ఆంధ్ర వాటాలో కనీసం తాగునీరు అందడమే కష్టమెంది.ఆంధ్ర ప్రదేశ్‌కు సాగునీరు వాటా ఇవ్వాలన్న బచావత్ అవార్డ్ ప్రకారం తాగునీరైనా అందకపోవడంతో బచావత్ అవార్డు కాగితాలకు పరిమితం అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.