క్రీడాభూమి

అదే జట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్లేకల్: శ్రీలంకతో జరిగిన మొదటి వనే్డలో ఆడిన జట్టునే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాంటి మార్పు లేకుండా గురువారం నాటి రెండో మ్యాచ్‌లో మైదానంలోకి దించే అవకాశాలున్నాయి. ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే తప్ప విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడానికి కోహ్లీ సుముఖత వ్యక్తం చేయడని చాలా సందర్భాల్లో రుజవైంది. చివరికి వెస్టిండీస్ టూర్‌లోనూ అతను ప్రయోగాలకు సిద్ధపడలేదు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో లంకపై 3-0 తేడాతో క్లీన్ స్వీప్ సాధించిన భారత జట్టు ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ని తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుచేసిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ 132 పరుగులతో నాటౌట్‌గా నిలిస్తే, అతనికి అండగా నిలిచిన కోహ్లీ 82 పరుగులతో క్రీజ్‌లో నిలిచి, జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఆ మ్యాచ్‌లో ఆడిన జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కోహ్లీకి కనిపించకపోవచ్చు. పైగా, జట్టులో తరచు మార్పులుచేర్పులను ప్రోత్సహించే అలవాటు అతనికి లేదు. పల్లేకల్ పిచ్ తీరును పరిశీలిస్తే, ఇద్దరి కంటే ఎక్కువ స్పిన్నర్లు అవసరం లేదని స్పష్టమవుతుంది. ఇద్దరు లెగ్ స్పిన్నర్లను లేదా ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లను తీసుకోవడం కంటే, కుడి చేతి వాటంగల లెగ్‌బ్రేక్, ఎడమచేతి వాటంతో స్పిన్ కాంబినేషన్‌నే ఉత్తమంగా కనిపిస్తుంది. ఈ కోణంలో చూస్తే, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్‌కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తున్నది. అక్షర్ 34 పరుగులకు మూడు వికెట్లు పడగొడితే, చాహల్ 60 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు. పల్లేకల్‌లో మూడో స్పిన్నర్‌కు చోటు ఉండదన్న సూత్రాన్ని కోహ్లీ పాటిస్తే, కుల్దీప్ యాదవ్‌కు మరోసారి నిరాశ తప్పదు. మనీష్ పాండే, అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్ మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది.
ఆర్డర్‌లో మార్పులు!
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కారణంగా, ముందుగా బ్యాటింగ్‌కు దిగితే భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచడం, లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా దానిని అందుకోవడం టీమిండియాకు సులభమవుతున్నది. లంక బౌలింగ్ బలహీనంగా ఉండడం భారత్‌కు లాభిస్తున్న మరో అంశం. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ ఆర్డర్‌లో కోహ్లీ ఏవైనా మార్పులు చేస్తాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. లోకేష్ రాహుల్, కేదార్ జాధవ్‌కు ఎక్కువ సేపు క్రీజ్‌లో కొనసాగేందుకు వీలుగా బ్యాటింగ్ ఆర్డర్‌ను కోహ్లీ మార్చవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు ఉన్నా, లేకున్నా, మొదటి మ్యాచ్‌లో మాదిరిగానే రెండో వనే్డలోనూ టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశాలున్నాయి. టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ ఒకటో స్థానంలో ఉంటే, శ్రీలంకది ఏడో స్థానం. ఈ వ్యత్యాసానికి ఫలితం ఎలా ఉంటుందనేది టెస్టు సిరీస్‌లో స్పష్టమైంది. వనే్డల విషయానికి వస్తే, టీమిండియా మూడో స్థానంలో ఉంటే, శ్రీలంక ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నది. ఈ తేడా ఏ స్థాయిలో ఉందనేది మొదటి వనే్డలో ప్రస్ఫుటమైంది. సీనియర్ బౌలర్లకు విశ్రాంతినిచ్చి, యువ బౌలర్లతో ప్రయోగాలు చేసే అవకాశం సెలక్టర్లకు లభించిందంటే, జట్టు ప్రమాణాలను అంచనా వేయడం కష్టం కాదు. అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్ వంటి బౌలర్లు తమతమ స్థానాలను పదిలం చేసుకోవడానికి కృష్టపడాల్సి ఉంది. అంతకు మించి జట్టులోని మిగతా ఆటగాళ్లకు ఎలాంటి ఒత్తిడి లేదు.
ఆత్మవిశ్వాసం కోల్పోయిన లంకేయులు
శ్రీలంక క్రికెటర్లు ఆత్మవిశ్వాసం కోల్పోయారన్నది వాస్తవం. ఆస్ట్రేలియా చేతిలో చావు దెబ్బతిన్న తర్వాత, బలహీనమైన జింబాబ్వే చేతిలో, స్వదేశంలోనే వనే్డ సిరీస్‌ను కోల్పోవడం జట్టును పూర్తి ఆత్మరక్షణలో పడేసింది. భారత్‌ను టెస్టు సిరీస్‌లో ఢీకొని, వైట్‌వాష్ వేయించుకోవడంతో లంక ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. ఆతర్వాత వనే్డ సిరీస్ మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. పరాజయాల గురించి ఆలోచించకుండా, సరికొత్త ఉత్సాహం, పట్టుదలతో ఆడితేగానీ కోహ్లీ సేనకు లంక గట్టిపోటీని ఇవ్వలేదు. అయితే, అంతర్గత సమస్యలు జట్టును తీవ్రంగా వేధిస్తున్నాయి. దూకుడుగా ఆడే తత్వం ఉన్న టెస్టు కెప్టెన్ దినేష్ చండీమల్‌ను వనే్డ సిరీస్ నుంచి తప్పించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. టెస్టు సిరీస్‌ను కోల్పోయినందుకు ఆటగాళ్లపై మీడియా, క్రికెట్ ప్రముఖులు విమర్శల వర్షం కురిపిస్తే, శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అధికారుల వైఖరే అందుకు కారణమని మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ ధ్వజమెత్తడం కొత్త వివాదానికి దారి తీసింది. జట్టుతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల జోక్యం ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది వ్యాఖ్యానించిన చీఫ్ కోచ్ నిక్ పోథాస్ లంక వివాదాల ఎపిసోడ్‌కు కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. మొత్తం మీద క్రికెట్ బోర్డు, అధికారులు వివాదాల్లో మునిగితేలుతుంటే, ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం ఆటగాళ్లను వెంటాడుతున్నది. ఈ పరిస్థితుల్లో వారి నుంచి అద్భుతాలు ఆశించడానికి వీల్లేదు. దీనికితోడు, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కనీసం రెండింటిని గెల్చుకుంటే తప్ప 2019 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఆడే అర్హత శ్రీలంకకు లభించదు. ఈ అంశం కూడా జట్టుపై ఒత్తిడిని పెంచుతున్నది. చండీమల్‌ను జట్టులోకి తీసుకుంటే, పరిస్థితి కొంతలో కొంత మెరుగుపడుతుంది. కానీ, మొండి పట్టును ప్రదర్శిస్తున్న ఎస్‌ఎల్‌సి అధికారులు, సెలక్టర్లు అందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అన్నదే ప్రశ్న. ఏ రకంగా చూసినా ఆత్మనూన్యత, అస్థిరత్వం తదితర అంశాలు శ్రీలంక క్రికెట్‌ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. సమస్యలను అధిగమించి, లంక ఎదురుదాడి చేయగలిగితే, అది అద్భుతమే అవుతుంది.
మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలవుతుంది.
చిత్రం.. ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన భారత క్రికెటర్లు