జాతీయ వార్తలు

క్రీమీలేయర్ పరిమితి పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, విద్యా సంస్థల రిజర్వేషన్ల కల్పనకు వీలుగా ఇతర వెనుకబడిన కులాల (ఓబిసి) క్రీమీలేయర్ పరిమితిని ఆరు లక్షల నుండి ఎనిమిది లక్షల రూపాయలకు పెంచుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ బుధవారం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు కేంద్ర పరిధిలోని ఉద్యోగాల ఫలాలన్నీ ఇతర బిసి కులాలకు సమానంగా లభించేలా చూసేందుకు ఉప వర్గీకరణ కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కమిషన్ తన సిఫారసులను పనె్నండు వారాల్లోగా కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది. ఓబిసి రిజర్వేషన్ల సబ్ క్యాటగరైజేషన్ కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా రాష్టప్రతికి సిఫారసు చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశంలోని మొత్తం పదకొండు రాష్ట్రాలు ఓబిసి రిజర్వేషన్లను రాష్ట్ర సర్వీసుల కోసం సబ్ క్యాటగరైజ్ చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబిసి రిజర్వేషన్ల మూలంగా ప్రయోజనం కలగని బిసి కులాల వారికి సబ్ క్యాటగరైజేషన్ వలన ప్రయోజనం కలుగుతుందని జైట్లీ తెలిపారు. దీనివల్ల బిసి రిజర్వేషన్లు ఆయా వర్గాలలోని అన్ని కులాలకు సమానంగా అందేందుకు వీలు కలుగుతుందని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ఆధారంగా బిసి సబ్ క్యాటగరైజేషన్ కమీషన్‌ను ఏర్పాటు చేస్తారన్నారు. 2012లో జాతీయ బిసి కమిషన్ సబ్ క్యాటగరైజేషన్ చేయాలని సిఫారసు చేసింది, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఇలాంటి సిఫారసు చేసిన అనంతరం మంత్రుల కమిటీ దీనిని ఆమోదించింది. ఏపి, తెలంగాణ సహా పదకొండు రాష్ట్రాలు తన రాష్ట్ర సర్వీసుల కోసం బిసి రిజర్వేషన్లను సబ్ క్యాటగరైజ్ చేసుకున్నాయని జైట్లీ వివరించారు.
కేంద్ర విద్యా సంస్థలు, ఉద్యోగాలు, ఇతర రిజర్వేషన్లకు బిసిల క్రీమీలేయర్ వార్షికాదాయ పరిమితిని ఆరు లక్షల నుండి ఎనిమిది లక్షల రూపాయలకు పెంచటం వలన ఎంతో మంది బిసిలకు ప్రయోజనం కలుగుతుందని జైట్లీ చెప్పారు. ఇక మీదట వార్షికాదాయం ఎనిమిది లక్షల కంటే అధికంగా ఉన్న వారు మాత్రమే క్రీమిలేయర్ పరిధిలోకి వస్తారని ఆయన చెప్పారు. బిసి రిజర్వేషన్ల క్రీమీలేయర్ పరిమితిని పెంచుతున్న విషయాన్ని ప్రధాని మోదీ కొంతకాలం క్రితం అసోంలో సూచనప్రాయంగా చెప్పటం తెలిసిందేనని జైట్లీ అన్నారు. బిసి రిజర్వేషన్లను సబ్ క్యాటగరైజ్ చేయాలని ఈశ్వరయ్య నాయకత్వంలోని కమిషన్ కూడా సిఫారసు చేసిందని కేంద్ర సంక్షేమ శాఖ మంత్రి తావర్‌చంద్ గెహ్లోట్ వివరించారు. దీనిలో ఎలాంటి రాజకీయం లేదని ఆయన స్పష్టం చేశారు. సబ్ క్యాటగరైజేషన్ ద్వారా ఓబిసిలలో చిచ్చుపెట్టేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. బిసి రిజర్వేషన్లను సబ్ క్యాటగరైజ్ చేయాలని గతంలో సుప్రీంకోర్టు కూడా సూచించటం మరిచిపోరాదని ఆయన తెలిపారు. రిజర్వేషన్లను ఎక్కువ మంది బిసిలకు అందేలా చేసే దీన్ని సమర్థించాలి తప్ప వ్యతిరేకించటం ఏమిటని జైట్లీ ప్రశ్నించారు. దేశంలోని వెనుకబడిన కులాలకు సంబంధించిన జనాభా వివరాలు సేకరించారా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు తావర్‌చంద్ గెహ్లోట్ సమాధానం ఇస్తూ జనాభా సేకరణ సందర్భంగా దేశంలోని వెనుకబడిన కులాల జనాభాకు సంబంధించిన వివరాలు కూడా సేకరించటం జరిగిందని, అయితే అది ప్రస్తుతం కేంద్ర హోం శాఖ వద్ద ఉన్నదని, దానిని ఇంకా బైట పెట్టలేదని తెలిపారు. బిసి కులాలకు సంబంధించిన పూర్తి వివరాలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో దాదాపు ఐదువేల వెనుకబడిన కులాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఓబిసి కులాల జాబితా కూడా తమవద్ద ఉన్నదని గెహ్లోట్ వెల్లడించారు. అయితే ఓబిసిల జనాభా వివరాలు మాత్రం వద్ద లేవని ఆయన అంగీకరించారు. బిసి, ఎస్‌సి రిజర్వేషన్లను పునర్వ్యవస్థీకరించాలనే ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేదని, పరిశీలనకు రాదని జైట్లీ ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు.
చిత్రం.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ