జాతీయ వార్తలు

యుపిలో మరో రైలు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకొంది. బుధవారం తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో పటా, అచల్డా రైల్వే స్టేషన్ల మధ్య అజమ్‌గఢ్‌నుంచి ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ఒక డంపర్‌ను ఢీకొనడంతో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడినట్లు ఉత్తర మధ్య రైల్వే ప్రతినిధి ఒకరు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు రోజుల్లో జరిగిన రెండో రైలు ప్రమాదం ఇది. ప్రమాద తీవ్రతకు ఒక బోగీ తలకిందులు కాగా, మిగతా ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయని అరాయియా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ త్యాగి చెప్పారు. ప్రమాదం సంభవించిన సమయంలో ప్రమాద స్థలం వద్ద ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌కు చెందిన పనులు జరుగుతున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే ఈ రైలును ఢీకొట్టిన డంపర్ రైల్వేకు చెందినది కాదని వారు చెప్పారు.
డంపర్ ప్రహరీ గోడను బద్దలు కొట్టి కైఫియత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌ను ఢీకొట్టడం వల్లనే బోగీలు పట్టాలు తప్పినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కానీ 25 మందికి పైగా గాయపడినట్లు ఆ ప్రకటన తెలిపింది. అయితే కనీసం 50 మంది గాయపడినట్లు అంతకుముందు నార్త్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ ఎంసి చౌహాన్ చెప్పారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, సీనియర్ అధికారులను తక్షణం సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా ఢిల్లీ-హౌరా సెక్షన్‌లో రైళ్ల రాకపోవలపై తీవ్ర ప్రభావం చూపించింది. రెండు లైన్లు మూసుకుపోవడంతో హౌరా-న్యూడిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ సహా అయిదు రైళ్లను దారి మళ్లించగా, కాన్పూర్-న్యూడిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సహా ఏడు రైళ్లను రద్దు చేశారు. మరో 40 దాకా లోకల్ రైళ్లను కూడా రద్దు చేశారు. ప్రమాద వార్త అందిన వెంటనే సీనియర్ అధికారులు హుటాహుటిన ప్రమాదం జరిగిన చోటికి వెళ్లారు. అరాయియా, ఎటావా, కనౌజ్‌లనుంచి అదనపు సిబ్బందిని, అంబులెన్స్‌లను పంపించారు. సహాయక చర్యల్లో పాలు పంచుకోవడం కోసం లక్నోనుంచి ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని కూడా పంపించారు. అలహాబాద్‌నుంచి ఒక ప్రత్యేక మెడికల్ ట్రైన్‌ను కూడా వెళ్లింది. గత ఆదివారం ముజఫర్‌నగర్ జిల్లాలో ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 24 మంది చనిపోగా, 150 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
చిత్రం.. బుధవారం ప్రమాదానికి గురైన కైఫియత్ ఎక్స్‌ప్రెస్