AADIVAVRAM - Others

వేడి ఎక్కువై నల్లబడిపోతున్నారా? ( మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: ఈ మధ్య మరీ నల్లబడి పోతున్నానని అందరూ అంటున్నారు. ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటోంది. ఈ రెండింటికీ సంబంధం ఉన్నదా? నివారణోపాయం తెలుపగలరు.
-కెవిడిఎస్ ప్రసాదరావు (జగిత్యాల)
జ: ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నదా? అరికాళ్లు, అరిచేతులూ మండుతున్నాయా? కళ్లు మంటలు, కడుపులో మంట, మూత్రంలో మంట ఇలా శరీరం అంతా మంటలు పుడుతోందా? బుర్ర వేడెక్కి పోతున్నట్టున్నదా? నిద్ర సరిగా పట్టట్లేదా? ఇరిటేషన్ ఎక్కువగా ఉంటోందా? థర్మామీటరుకు ఎక్కకుండా జ్వరం వచ్చినట్టు అనిపిస్తోందా? గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటున్నట్టు అనిపిస్తోందా? చర్మం మీద వేడి పొక్కులు, పైత్యపు దద్దుర్లు వస్తున్నాయా? కోమలమైన శరీరం కాంతి తగ్గిపోతున్నట్టు గమనిస్తున్నారా? చర్మం నల్లబడుతోందా? తడి ఆరిపోయి శుష్కించినట్టు అవుతోందా? అయితే వీటిలో ఏ లక్షణాలు కనిపించినా మీకు వేడి చేసినట్టే లెక్క!
రోగి తన బాధని తనకొచ్చిన భాషలో చెప్పుకుంటాడు. రోగి బాధతోపాటు రోగి భాషని కూడా వైద్యుడు అర్థం చేసుకోగలిగి ఉండాలి. పై లక్షణాలన్నిటినీ కలిపి రోగి ‘వేడి చేసిందండీ’ అని డాక్టర్‌గారికి చెప్పుకుంటాడు. కొంతమంది వైద్యులు వేడి అనేదే లేదని రోగి ముఖానే చిరాకు పడుతుంటారు. దానివలన తన బాధ చెప్పుకోవడానికి తగిన సాంకేతిక వైద్య పరిభాష తెలియని రోగులు వైద్యుడు తన బాధని అర్థం చేసుకోవట్లేదని భావిస్తారు.
తిరిగే మోటారు ఇంజను ఎలా వేడెక్కుతుందో అత్యంత సంక్లిష్టమైన యంత్రాంగం కలిగిన మానవ శరీరం కూడా అలాగే వేడెక్కుతుంది. ఒక్కోసారి నరాల జబ్బులు, థైరాయిడ్ వ్యాధి కూడా వేడి పెరగటానికి కారణం కావచ్చు.
ఇలా వేడి అపరిమితంగా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టే మోటారింజన్లో రేడియేటర్ మీద నీళ్లు పడేలా చేసి, చల్లార్చే యంత్రాంగం ఉన్నట్టే, మన శరీరంలోనూ వేడిని అదుపు చేసేందుకు చెమట పట్టడం అనే ప్రక్రియ ఉపయోగపడుతుంది. చెమట పట్టగానే ఎంత జ్వరం అయినా తగ్గిపోతుంది. చెమట పట్టకపోతే వొంట్లో వేడి పెరిగిపోతుంది.
ఎవరికైనా సరే, చెమటలు అకారణంగా అతిగా పడ్తున్నాయంటే, బహుశా ఒంట్లో వేడి ఎక్కువగా ఉండటం కారణం కావచ్చు. తామర లాంటి చర్మ వ్యాధులు రావటానికి ఈ అతి చెమట ఒక కారణం కావచ్చు. స్థూలకాయం ఉన్న వారిక్కూడా వేడి ఎక్కువగా ఉండి, దాన్ని చల్లార్చటానికి చెమటలు ఎక్కువగా పట్టడం జరగవచ్చు.
వేడి తగ్గాలంటే వేడి చేసే ఆహారాన్ని మార్చుకోవటం మొదటి నివారణోపాయం. చలవ చేసేవి మాత్రమే తింటే త్వరగా వేడి తగ్గుతుంది. చలవ చేసే మందులు వాడాలని చూడటంకన్నా చలవ చేసే ఆహారం మీదా ఆధారపడటం మంచిది.
గంధం చెక్కని సాన మీద ఒకట్రెండు పచ్చకర్పూరం పలుకులు వేసి అరగదీసి తీసిన గంధం మంటలు పుట్టే అవయవ భాగంలో పట్టిస్తే త్వరగా మంటలు తగ్గుతాయి. కొబ్బరి ముక్కల్ని, కాసిన్ని కొబ్బరి నీళ్లని కలిపి మిక్సీ పట్టి గుడ్డలో వేసి పిండితే చిక్కటి పాలొస్తాయి. ఇవే కొబ్బరి పాలంటే! గ్లాసు పాలలో ఒక చెంచా మోతాదులో ఈ గంధాన్ని కలిపి తాగండి. వెంటనే మంటలు తగ్గుతాయి. ఈ గంధాన్ని కొద్దిసేపు ఆరనిస్తే గట్టి పడుతుంది. బఠాణీ గింజంత మాత్రలు చేసుకుని పూటకు రెండు మాత్రలు చొప్పున రోజూ మూడు పూటలా కడుపులోకి తీసుకోండి. త్వరగా వేడి తగ్గుతుంది.
ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, పొడి దగ్గు, తలతిరుగుడు లాంటి సమస్యలు త్వరగా తగ్గాలంటే యాలకులు చలవనిచ్చే ఔషధాలు. రోజు మొత్తం మీద 5 లేక 6 యాలకుల వరకూ ఒక్కొక్కటి చొప్పున నములుతూ ఉంటే చలవ చేస్తుంది.
కేరెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, కర్బూజా లేదా యాపిల్ ముక్కలు మూడింటినీ సమానంగా తీసుకుని మిక్సీ పట్టిన జ్యూస్ రోజూ రెండు పూటలా ఒక్కొక్క గ్లాసు చొప్పున తాగుతుంటే త్వరగా వేడి తగ్గుతుంది.
పుచ్చకాయ, బొప్పాయకాయ, యాపిల్, అరటి పళ్లు, గసగసాలు, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం, చలవచేసే వాటిలో ముఖ్యమైనవి. కర్బూజా పండ్లకు చలవ చేసే గుణం ఎక్కువ. కర్బూజా పండు మందపాటి తోలు తీసేసి, చిన్న ముక్కలుగా తరిగి, పంచదార చల్లుకుని తింటే నిమిషాల్లో వేడి తగ్గుతుంది.
ఆరగా ఆరగా మజ్జిగని తాగుతుంటే వేడి తగ్గుతుంది. ధనియాల పొడిని నీళ్లలో వేసి చిక్కని టీ లాగా కాచుకుని మూడు పూటలా ఒక గ్లాసు మోతాదులో తాగుతుంటే వేడి తగ్గుతుంది. వేడి వలన కలిగే తలతిరుగుడు తగ్గుతుంది. ఓ లీటరు మంచినీళ్లలో ఒకటి లేదా రెండు చెంచాల ధనియాల పొడిని వేసి, బాగా మరిగించిన నీటిని మామూలు నీటికి బదులుగా రోజూ తాగే అలవాటు చేసుకుంటే, వేడి శరీర తత్వం ఉన్న వారికి వేడి చేయకుండా ఉంటుంది.
పులుపులేని లేత కూరగాయలన్నీ చలవ చేసేవే! లేత వంకాయ, లేత బెండకాయలు కూడా అన్ని వ్యాధుల్లోనూ తినదగినవిగా ఉంటాయి. కోమలమైన ఈ కూరగాయల్ని వండుకునేప్పుడు తప్పనిసరిగా అల్లం వెల్లుల్లి పేస్టు, చింతపండు రసాలను అమితంగా కలపడం, బాగా మిరప కారం చేర్చడం, నూనెలో వేసి వేయించటం వల్ల చలవ చేసే కూరలు కూడా వేడి చేసేవిగా మారిపోతున్నాయి. వండవలసిన అవసరం లేని క్యాబేజీ కేలిఫ్లవర్ లాంటి వాటిని సలసలా కాగే నూనెలో వేసి గోబీ 65 లాంటి పేర్లు పెట్టి వండే వంటకాలు వేడిని మాత్రమే కాదు, కేన్సర్‌ని కూడా తెచ్చే ప్రమాదం ఉంది.
బూడిద గుమ్మడి, గుజ్జు, గుమ్మడిపండు గుజ్జు, సొరకాయ లేత ఆకులు, పెరుగు తోటకూర, పాలకూర, పచ్చకర్పూరం, అతి మధురం, ఇవన్నీ వేడిని తగ్గించే గొప్ప ఔషధాలు. పెరుగు తోటకూర (కూర, పప్పు వండుకునే తోటకూర) తరచూ తింటూ వుంటే వేడి తగ్గి, ఎముక పుష్టి పెరుగుతుంది.
గ్లాసు వేడిపాలలో 2 లేక 3 పచ్చకర్పూరం పలుకులు, తగినంత ఏలకుల పొడి, తగినంత గసగసాల పొడి కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తాగితే వేడి తగ్గుతుంది. మంటలు తగ్గుతాయి. కమ్మని నిద్ర పడుతుంది. శరీరానికి తేలికదనం కలుగుతుంది. మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. అయితే పదేపదే గసగసాలను వాడితే వాటికి అలవాటు పడే ప్రమాదం ఉంటుంది. అవసరం అయినప్పుడే ఈ ప్రయోగం చేయండి.
ఒక చెంచా పంచదార, పావుచెంచా కర్పూర శిలాజిత్తు కలిపి నోట్లో వేసుకుని చప్పరించండి. చాలా త్వరగా వేడి తగ్గుతుంది. 100 గ్రాముల త్రిఫలా చూర్ణం, 25 గ్రాముల యష్టి చూర్ణం ఈ రెండింటినీ కలిపిన పొడిని ఒక చెంచా మోతాదులో గ్లాసు పాలలో కలిపి బాగా మరిగించి తాగితే వేడి త్వరగా తగ్గుతుంది. ఈ మందులన్నీ ఆయుర్వేద మందుల షాపుల్లో దొరికేవే!
వేడి శరీర తత్వం ఉన్నవారికి, థైరాయిడ్ లోపం ఉన్న వారికి, కొన్ని రకాల నరాల బలహీనత లున్న వారికి తరచూ వేడి చేస్తుంటుంది. ఇలాంటి వాళ్లు బాగా చలవచేసే స్వభావం ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి అలవాటు పడటం మంచిది. వేడిని తగ్గించే మందుల కోసం ఎదురుచూడటం కన్నా, చలవచేసే ఆహారం తీసుకోవటం ఉత్తమం ఎప్పటికైనా.
చలవ చేసేవి తీసుకుంటే, చర్మం మృదువుగా, నునుపుగా, తెల్లగా, కాంతిమంతంగా ఉంటుంది. వేడిలో మునిగి తేలే శరీర తత్వాలకు చర్మం గరుకుగా, నల్లగా కాంతిహీనంగా ఉంటుంది. చలవ చేసేవి తినటం ఎప్పటికైనా ఆచరించదగ్గ సూచనే!
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట
పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com