ఖమ్మం

అడుగు పడేదెప్పుడో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జనవరి 18: భద్రాద్రి రామాలయం అభివృద్ధికి ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. కనీసం దీనిపై ఎవరూ స్పందించడం లేదు. అదిగో ఇదిగో అనడం తప్ప, ఎప్పుడే ఎవరూ చెప్పలేకపోతున్నారు. దాదాపు 20 నెలల క్రితం శ్రీరామనవమికి భద్రాద్రిని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని, మరో మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని, ముందుగా రూ.100 కోట్లు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 నెలలు గడిచినా భద్రాద్రి అభివృద్ధి గురించి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టత రావడం లేదు. మధ్యలో ఆర్కిటెక్ ఆనంద్‌సాయి, చినజీయర్‌స్వామి వంటి వారు రావడం, ఇదిగో ఆలయ నమూనా అంటూ కొన్ని చిత్రాలను మీడియాకు చూపించి హడావుడి చేయడం మినహా జరిగిందేమీ లేదు. ఆలయ అభివృద్ధి మాస్టర్‌ప్లాన్ తుది నమూనా మ్యాప్‌కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేయడమే తరువాయి టెండర్లు పిలుస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. నాలుగు నెలల క్రితం అయితే ఏకంగా సీఎం భద్రాద్రికి వస్తున్నారని, ఆలయాభివృద్ధికి బీజం పడనుందని అధికార పార్టీ నేతలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేశారు. ఎవరెన్ని చేసినా, ఆలయాభివృద్ధికి ఎన్ని సూచనలు అందించినా ఎందుకో భద్రాద్రిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఒకవైపు రాష్ట్రంలోని యాదాద్రి, వేములవాడ ఆలయాలకు నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతుంటే భద్రాచలం రామాలయంలో మాత్రం అభివృద్ధి పనుల ఊసే లేదు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లాగే భద్రాద్రి హామీ కూడా ఆచరణకు నోచుకోదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా అటు మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు, చివరకు అధికార పార్టీ నేతలు కూడా స్పందించలేని పరిస్థితి నెలకొంది. దీనిపై మాట్లాడేందుకు కూడా అధికార పార్టీ నేతలు ముందుకు రాకపోవడం విశేషం. దేశం గర్వించదగ్గ స్థాయిలో భద్రాద్రి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తామని పలుమార్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మాట మరవడంపై ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన, జిల్లాల పునర్విభజన అనంతరం రాష్ట్రంలో చిన్నాభిన్నమైన ప్రాంతం భద్రాచలం మాత్రమేనని పలుమార్లు కేసీఆర్ సైతం చెప్పుకొచ్చారు. సమూలంగా నష్టపోయిన భద్రాద్రికి త్వరలో మేలు జరుగుతుందని, ప్రభుత్వం నుంచి అందుకు సాయం అందుతుందని ప్రకటించిన ఆయన ఆ హామీని తుంగలో తొక్కడంతో ఈ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు.
పాలక మండలి నియామకం ఊరింపే..
భద్రాద్రి ఆలయాభివృద్ధి సంగతి అటుంచితే కనీసం ఆలయ పాలకమండలి నియామకానికి సైతం ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయ ట్రస్టుబోర్డు ఏర్పాటవుతుందని ఆశించారంతా. కానీ అందుకు విరుద్ధంగా ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంబిస్తూ విమర్శల పాలవుతోంది. అధికార పార్టీ తరఫున పలువురు పాలకమండలి చైర్మన్, సభ్యుల కోసం మొదట్లో పోటీ పడ్డారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో పైరవీలు చేయించుకున్నారు. కానీ ప్రభుత్వానికి పాలకమండలి నియమించే ఆలోచన లేకపోవడంతో వారంతా తీవ్ర నిరాశ చెందారు. దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వచ్చే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో పాలకమండలి లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆలయ పాలకమండలి లేకపోవడంతో దేవస్థానంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం కొనసాగుతోందని పలుమార్లు రుజువైంది. ఆలయ ఉద్యోగులు, అర్చకులు చేసిన తప్పులు ఇటీవల పెద్ద దుమారాన్ని లేపాయి. ఇటువంటి సమయాల్లో ఆధ్యాత్మికతకు నిలయంగా ఉండాల్సిన ఆలయం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని భక్తులు వాపోతున్నా ప్రభుత్వం నుంచి మాత్రం కదలిక రావడం లేదు. ఆలయానికి పాలక మండలి ఉంటే అభివృద్ధికి చర్యలు చేపట్టే వీలుంటుందని ప్రభుత్వానికి తెలియనది కాకున్నా తొలినుంచి జాప్యం చేస్తూ విమర్శలు మూటగట్టుకుంటుంది. ఇంత పెద్ద ఆలయంలో పరిపాలనా పరమైన ఆజమాయిషీ లేకపోవడంతోనే ఉద్యోగులు దొడ్డిదారి వ్యవహారాలు కొనసాగిస్తున్నారని, భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం రామాలయంలో ఇటువంటి దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్న తరుణంలో ప్రభుత్వం ఇప్పటికైనా పాలకవర్గం ఏర్పాటుకు పూనుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే అనేక రకాలుగా నష్టపోయిన భద్రాచలంకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రామాలయాన్ని అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.