జాతీయ వార్తలు

కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. అధికార పార్టీకి చెందిన 9మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బిజెపి పక్షాన చేరడంతో ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ క్రమంలో పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు అనర్హులుగా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజ్వాల్ తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేశారు. అయితే 35మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసును అందించామని, వీరిలో బిజెపికి చెందిన 26మంది, కాంగ్రెస్ నుంచి వచ్చిన 9మంది ఎమ్మెల్యేలు ఉన్నారని బిజెపి ప్రకటించింది. సభను నిష్పాక్షికంగా నిర్వహించడంలో విఫలమవుతున్నందునే స్పీకర్‌పై అవిశ్వాసం ప్రకటిస్తూ నోటీసులు శాసనసభ కార్యదర్శికి అందజేశామని పేర్కొంది. ఈ పరిణామం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీచేయకముందే జరిగిందని బిజెపి అంటోంది. కాగా, శాసనసభలో పార్టీ విప్‌ను ధిక్కరించిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ చీఫ్ విప్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఇందిరా హృదయేష్ స్పీకర్‌ను కోరిన నేపథ్యంలో ఆయన నోటీసులు జారీచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నివాసాల వద్ద ఆ నోటీసులు అంటించారు. మార్చి 26వ తేదీ సాయంత్రంలోగా ఈ నోటీసులకు సమాధానాలను స్పీకర్‌కు అందజేయాలని అందులో పేర్కొన్నారు.
ఇదిలావుండగా, స్పీకర్‌పై అవిశ్వాస నోటీసును అందించిన క్రమంలో ఆయన తక్షణం పదవి రాజీనామా చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత అజయ్ భట్ స్పష్టం చేశారు. మెజారిటీ శాసనసభ్యుల అవిశ్వాసానికి గురైన స్పీకర్‌కు నోటీసులు జారీచేసే అధికారం ఎక్కడిదని కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే సుబోధ్ ఉనియాల్ ప్రశ్నించారు. కాగా, ఈ నెల 28లోగా అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు స్పీకర్ గడువు ఇవ్వడంతో ఆయనకు ఊపిరి తీసుకునే అవకాశం చిక్కింది.