తెలంగాణ

అడుగంటిన సింగూర్..అంతటా కలవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూన్ 7: మంజీర నదిపై వ్యవసాయం, తాగునీటి అవసరాలకోసం నిర్మించిన సింగూర్ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయి అన్ని వర్గాలవారిని కలవరపెడుతోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల గతంలో కూడా సింగూర్ ప్రాజెక్టు ఎండిపోయినా ఇంతటి దుర్భరమైన పరిస్థితులను చవిచూడలేదని ఆయకట్టుదారులు, ప్రజలు వాపోతున్నారు. మంజీర నీరు అంటే జంటనగరాల వాసులు అమృతంతో సమానంగా భావించే వారు. కృష్ణ, గోదావరి జలాలు నగరానికి చేరుకున్నాక మంజీరపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టులోని నీటిని పూర్తిగా సాగుకు, మిషన్ భగీరథ పథకం క్రింద ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017 సంవత్సరంలో పుష్కళంగా వర్షాలు కురియడంతో సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకోవడమే కాకుండా మిగులు జలాలను దిగువన ఉన్న మంజీర బ్యారేజ్, ఘన్‌పూర్ ఆనకట్ట, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు వదిలిపెట్టారు. అదే ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని పంటలను రక్షించడానికి ప్రభుత్వం ఉన్నఫళంగా సుమారు 14 టీఎంసీల నీటిని సింగూర్ నుంచి విడుదల చేసి తరలించింది. 2018 సంవత్సరం వర్షాకాలంలో మంజీర నది పరివాహక ప్రాంతంలో ఆశించిన వర్షాలు లేకపోవడంతో వరద నీరు అంతంత మాత్రమే వచ్చి చేరగా, ఖరీఫ్, రబీ సాగుతో పాటు మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఉపయోగించుకుంటూ వచ్చారు. సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 29.99 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుతం 0.4 టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులో నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎగువ భాగంలో ఎటు చూసినా మట్టి దిబ్బలతో ఎడారిని తలపిస్తోంది. ఉన్న నీటినిల్వ నుంచి మిషన్ భగీరథ కోసం రోజుకు 60 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా, ఎండల తీవ్రత వల్ల రోజు 30 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో అంతర్ధానమవుతోంది. శనివారం నాటి సాయంత్రానికి మృగశిర కార్తె ప్రవేశంతో తొలకరి జల్లులకు ముహూర్తం ఖరారు కానుంది. మరో నెల రోజుల వరకు వానలు పడక, వరదలు లేకపోతే సింగూర్ ప్రాజెక్టు ప్రధాన గేట్లను క్రికెట్ వికెట్లుగా ఏర్పాటు చేసుకుని ఆట ఆడే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న నీరు ప్రధాన గేట్లను ఎత్తివేసినా చుక్క నీరు కూడా బయటకు వెళ్లదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఖరీఫ్ పనులకు రైతులు ఉపక్రమించేందుకు సిద్ధమవుతున్నా సింగూర్ ప్రాజెక్టు సాగునీటిపై ఆధారపడిన కర్షకుల్లో కలవరం మొదలైంది. నారు పోసుకోవాలా వద్దా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టులో మత్స్య సంపదను పెంపొందించడానికి గత యేడాది ప్రభుత్వం పక్షాల లక్షలాది చేప పిల్లలను సింగూర్‌లో వదిలిపెట్టగా ప్రస్తుతం మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది. రోజుకు 60 క్యూసెక్కుల నీటిని మిషన్ భగీరథ పథకం సరఫరా కోసం వినియోగిస్తున్నా, నిల్వ ఉన్న నీరు మొత్తం మడ్డి మడ్డిగా, బురద మయంగా, చేపలు చనిపోయిన దుర్గంధం వెదజల్లుతుండటంతో ఆ నీరు ఏ మేరకు త్రాగడానికి పనికొస్తుందో ప్రశ్నార్థకమే. ఈ యేడాది కూడా వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తాయని గణిత శాస్త్ర నిపుణులు పేర్కొనడంతో అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు భూగర్భ జలమట్టం సైతం వందల అడుగులకు పడిపోయి, పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా బోర్లన్ని ఎండిపోతుండటంతో జలం కోసం జనం అల్లాడుతోంది. ఉన్న బోర్లు ఎండిపోగా కొత్తవాటిని తవ్వించినా నీరు రాకపోగా నైరాశ్యం చెందుతున్నారు. పట్టణాల్లోని ఆయా అపార్టుమెంట్లలో బోర్లు ఎండిపోవడంతో అద్దెకు ఉండే వారు సైతం ఖాళీ చేసి వెళ్లిపోతున్న సంఘటనలు లేకపోలేదు. కేవలం మున్సిపల్, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల తాగునీటి సరఫరాపైనే ఆధారపడిన వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రకృతి కనికరించి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిపించి సింగూర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకువస్తేకానీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడదని చెప్పవచ్చు.