తెలంగాణ

నాటకీయంగా ‘చే’జారిన ఎంపీపీ పీఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, జూన్ 7: మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఎంపీపీ పీఠాన్ని కాంగ్రెస్ చేజార్చుకుంది. మెజార్టీ ఎంపీటీసీలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తన సభ్యులను కాపాడుకోలేక చేజేతులారా టీఆర్‌ఎస్‌కు అప్పగించింది. నర్సంపేట రూరల్ మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో ఆరు ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ, ఐదు ఎంపీటీసీ స్థానాలను అధికార టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంది. పోటాపోటీగా ఇరు పార్టీలు తమ ఎంపీటీసీలతో క్యాంప్ నిర్వహించారు. అయితే శుక్రవారం ఉదయం నుండి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎంపీపీ పీఠంపై కనే్నసిన టీఆర్‌ఎస్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలపై గురిపెట్టింది. దీంతో రాజుపల్లే, భాంజీపేటలకు చెందిన ఎంపీటీసీలు వీరన్న, అజ్మీరా వౌనిక శుక్రవారం కాంగ్రెస్ క్యాంప్ నుండి బయటకు వచ్చి నేరుగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయానికి వచ్చి టీఆర్‌ఎస్ ఎంపీటీసీలతో కలసిపోయారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లక్నేపల్లి ఎంపీటీసీ ఉల్లేరావు రజిత ఉంది. తన భార్య రజితను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని పేర్కొంటూ రజిత భర్త బుచ్చయ్య నర్సంపేట పోలీసుస్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్సై నాగ్‌నాథ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకుని రజితను తీసుకెళ్లేందుకు సిద్ధపడగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సైతో వాగ్వివాదానికి దిగారు. తామే రజితను స్టేషన్‌కు తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన వారిని కొనుగోలు చేస్తున్నారంటూ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోలీసుస్టేషన్ ఎదుట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. రజిత స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు చివరికి ఆమె భర్త బుచ్చయ్యకు అప్పగించారు. స్టేషన్ నుండి బయటకు వచ్చిన రజిత టీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళుతున్నప్పుడు టీఆర్‌ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహీకి తలపడ్డారు. ఎస్సై నాగ్ నాథ్ అక్కడకు చేరుకుని లాఠీ ఝళిపించడంతో చెల్లా చెదురయ్యారు. అనంతరం రజిత టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నేరుగా మండల పరిషత్‌కు చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు ఎంపీటీసీలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీలు జత కలవడంతో అధికార పార్టీ సంఖ్యా బలం ఎనిమిదికి చేరింది. కోఆప్షన్ సభ్యుడిగా ముత్తోజిపేటకు చెందిన చాంద్‌పాషకు ఎనిమిది మంది మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక లాంఛనం అయింది. అనంతరం సాయంత్రం మూడు గంటలకు జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎంపీపీగా మహేశ్వరానికి చెందిన మోతె కళమ్మ, వైస్ ఎంపీపీగా భాంజీపేటకు చెందిన అజ్మీరా వౌనికను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు. మండల పరిషత్ హాల్‌లో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

గోడ దూకి కాంగ్రెస్ ఎంపీటీసీ పరార్

తిరుమలగిరి, జూన్ 7: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల ఎంపీపీ అధ్యక్ష పదవికి ఎన్నికలలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయ. మండలంలోని 6 ఎంపీటీసీ స్థానాలలో టీఆర్‌ఎస్ 3, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను గెలవడంతో ఎంపీపీ పీఠాన్ని ఎవరూ అధిష్ఠిస్తారో అని అందరూ ఉత్కంఠతతో ఎదురుచూశారు. చివరకు హైడ్రామా నడుమ టీఆర్‌ఎస్ ఎంపీపీ అధ్యక్ష పదవిని కైవసం చేసుకుంది. ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించడానికి ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు ఉదయం 11 గంటలకు కార్యాలయానికి చేరుకున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ఎంపీటీసీలతో బేరసారాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తాటిపాముల నుండి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్ధి కర్నె ప్రవీణ్‌తో టీఆర్‌ఎస్ నాయకులు ఫొన్‌లో మాట్లాడి ఆయనను ప్రలోభ పెట్టారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రత్యేక సమావేశానికి ఆరుగురు ఎంపీటీసీలు హాజరైనట్టు అధికారులు వారితో సంతకాలు తీసుకున్నారు. తర్వాత భోజనం చేయడానికి కాంగ్రెస్ ఎంపీటీసీలు వెళ్లే క్రమంలో కార్యాలయంలోని గోడ దూకి కర్నె ప్రవీణ్ పారిపోయాడు. భోజనం తర్వాత 3గంటల ప్రాంతంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ముగ్గురు ఎంపీటీసీలు హాజరు కావడంతో ఎంపీపీగా టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన తొండ ఎంపీటీసీ ఎన్.స్నేహలతను బొడ్డు సుజాత ప్రతిపాదించగా, ధరావత్ రంగమ్మ బలపరచడంతో స్నేహలతను ఎంపీపీగా ఎన్నుకున్నారు. వైస్ ఎంపీపీగా బొడ్డు సుజాత ఎన్నికయ్యారు. ఎన్నిక సమయంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఉన్నారు. ఎన్నిక తర్వాత టీ ఆర్ ఎస్ శ్రేణులు ఎంపీపీ స్నేహలతను పూలమాలలతో సన్మానించి ఎంపీడీవో కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
వాయిదా పడిన కేతేపల్లి ఎంపీపీ ఎన్నిక
కేతేపల్లి: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల శుక్రవారం నిర్వహించాల్సిన ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. రిటర్నింగ్ అధికారి, ఎంపీడీవో శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం ఎంపీపీ, వైస్ ఎంపీపీలను ఎన్నుకునే ముందు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా కో ఆప్షన్ సభ్యుడి నియామకం కోసం ఏ ఒక్కరూ కూడా నామినేషన్‌ను దాఖలు చేయకపోవడంతో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 5 టీఆర్‌ఎస్, 2 టీఆర్‌ఎస్ స్వతంత్రులు, 4 కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తిరిగి ఎంపీపీ ఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు.