క్రీడాభూమి

వర్తమానానికే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లీడ్స్, జూలై 7: గతంలో ఏం జరిగిందనే విషయానికి ప్రాముఖ్యత లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉండకూడదని భారత బ్యాటింగ్ స్టార్ రోహిత్ శర్మ అన్నాడు. అందుకే తాను వర్తమానానికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని ఈ వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు సాధించి, గతంలో నాలుగు సెంచరీలతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర నెలకొల్పిన రికార్డును అధిగమించిన రోహిత్ చెప్పాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అతను ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ వీడియోను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ప్రస్తుతానికే విలువ ఉంటుందని ఆ ఇంటర్వ్యూలో రోహిత్ అన్నాడు. వర్తమానంపైనే దృష్టి కేంద్రీకరిస్తానని, టాపార్డర్‌లో వ్యక్తిగతంగానూ, ఒక యూనిట్‌గానూ ఎలాంటి సేవలు అందించగలమనే విషయమే తనకు ప్రధానమని చెప్పాడు. ఒక బ్యాట్స్‌మన్ ఈ విధంగా అద్భుత ఫామ్‌ను కొనసాగించడం తాను ఏ టోర్నమెంట్‌లోనూ చూడలేదని కోహ్లీ అన్నప్పుడు రోహిత్ స్పందిస్తూ, ఫామ్‌ను కొనసాగించాలన్నదే తన ధ్యేయమని, దానిపైనే దృష్టి పెట్టానని అన్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న క్రికెటర్‌గా తాను, జట్టుగా టీమిండియా వరల్డ్ కప్ టోర్నీలోకి అడుగుపెట్టి, అందుకు తగినట్టుగానే ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి గ్రూప్ మ్యాచ్‌లో రాణించడంతో, ఆతర్వాత కూడా అదే దూకుడును కొనసాగించగలమన్న ఆత్మవిశ్వాసం ఏర్పడిందన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఎదురైన పరాజయాన్ని గురించి ప్రస్తావించగా, ఈ టోర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, అందుకే, ప్రతి జట్టూ విజయంపైనే దృష్టి కేంద్రీకరిస్తాయని అన్నాడు. ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఏ విధంగా ఆడామన్నదే కీలకమన్నాడు. ఎదురైన ఓటమి గురించి ఆలోచించకుండా, వర్తమానంలో ఆటపై ఏకాగ్రత నిలపాల్సి ఉంటుందని 2011 వరల్డ్ కప్ ఆడిన జట్టులో చోటు సంపాదించలేకపోయిన రోహిత్ అన్నాడు. 2015లో సెమీ ఫైనల్స్ వరకూ వెళ్లిన భారత్ అక్కడ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి సెమీస్‌ను న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది. ఇదే విషయాన్ని కోహ్లీ గుర్తుచేసినప్పుడు, వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్స్‌లో ప్రతి మ్యాచ్ చాలా కీలకమైనదేనని అన్నాడు. ప్రత్యర్థి జట్టు ఏది అనేది ముఖ్యం కాదని, ఒక క్రీడాకారుడిగా తమ జట్టుకు ఎలాంటి సేవలు అందిస్తున్నామన్నదే కీలకమని అన్నాడు. ఇదే ఫామ్‌ను కొనసాగించి, తర్వాతి మ్యాచ్‌లనూ గెలవడమే లక్ష్యమని రోహిత్ పేర్కొన్నాడు.
విమర్శలను పట్టించుకోను..
తాను విమర్శలను పట్టించుకోనని రోహిత్ స్పష్టం చేశాడు. టీమిండియా ఓపెనింగ్ భాగస్వామ్యం నిలకడగా రాణించడం లేదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ విమర్శించడం, దానిపై రవీంద్ర జడేజా ఘాటైన పదజాలంతో ఎదురుదాడికి దిగడాన్ని ప్రస్తావించగా, ఎవరికైనా విమర్శలు తప్పవని రోహిత్ అన్నాడు. అయితే, వాటిపై దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి లాభం ఉండదన్నాడు. తన భార్యాపిల్లలు వరల్డ్ కప్ చూసేందుకు వచ్చారని, వారితో ఎక్కువ సమయాన్ని గడపకుండా, ఎవరో ఏదో అన్నారంటూ వారి గురించి ఆలోచించడంలో అర్థం ఉండదని వ్యాఖ్యానించాడు. మంజ్రేకర్ విమర్శలు ఏ ఆటగాడికైనా సవాళ్లని, వాటికి గొప్ప ప్రదర్శనతోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. ఎవరు ఏమంటున్నారనేది తనకు అనవసరమని, తాను ఏం చేస్తున్నానో తనకు తెలుసునని అన్నాడు. చిత్తశుద్ధితో ముందుకు వెళుతున్నప్పుడు మధ్యలో వచ్చే అడ్డంకులను అధిగమించడం కష్టం కాదన్నాడు.

వరల్డ్ కప్ క్రికెట్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించిన రోహిత్ శర్మ
(ఫైల్ ఫొటో)