తెలంగాణ

ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక మాంధ్యం కుదిపేస్తోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శాసన సభలో సోమవారం ఆయన 2019-20 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రతిపాదించారు. 2019 ఫిబ్రవరిలో ఓట్-ఆన్-అకౌంట్ ప్రతిపాదించగా, ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1,46,492.30 కోట్ల రూపాయల వ్యయంతో బడ్జెట్‌ను తాజాగా ప్రతిపాదించారు. శాసనసభ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వార్షిక బడ్జెట్‌ను సభ ముందుంచారు. బడ్జెట్ ప్రసంగం 12.09 గంటల వరకు కొనసాగింది. అంటే 39 నిమిషాల్లో ప్రసంగం ముగిసింది. ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌లో 1,82,017 కోట్ల రూపాయలు ప్రతిపాదించగా, ఇప్పుడది 35,525 కోట్ల రూపాయలు తగ్గి, 1,46,492 కోట్ల రూపాయలకు చేరిందన్నారు.
దేశం గత ఏడాది నుండి మన రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక మాంద్యానికి గురవుతూ వస్తోందని కేసీఆర్ తెలిపారు. 2018-19 లో జాతీయ జీడీపీ వృద్ధిరేటు సరాసరిన 6.85 శాతంగా నమోదైందని, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5 శాతంగానే నమోదైందన్నారు.
ఈ ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమైన రంగాల్లో ప్రగతి తిరోగమంలో, నిరాశాజనకంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతం తగ్గిందని, అమ్మకాలు 10.65 శాతం తగ్గిందన్నారు. దీని వల్ల మూడు రకాల ప్రభావం కనబడుతోందన్నారు. వాహనాల అమ్మకం వల్ల వచ్చే పన్నులు తగ్గాయని, పెట్రోలు, డీజల్, టైర్లు తదితర విడిభాగాల అమ్మకాలు పడిపోవడంతో వ్యాట్ ఆదాయం తగ్గిందని, ఈ రంగాల్లో మూడున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, దాంతో పరిస్థితి విషమంగా ఉందన్నారు. విమాన ప్రయణీకుల సంఖ్య, కార్గో విమానాల్లో సరకు రవాణాలో వృద్ధిరేట గణనీయంగా తగ్గిందన్నారు. అలాగే రైల్వేలో కూడా గూడ్సు వ్యాగన్ల బుకింగ్‌లో వృద్ధిరేటు 4.1 శాతం నుండి 1.6 శాతానికి తగ్గిందన్నారు. బొగ్గుఉత్పత్తి వృద్ధిరేటు కూడా 10.6 శాతం నుండి మైనస్ 5.1 శాతానికి పడిపోయిందన్నారు.
దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారిన ఈ సమయంలో 2019-20 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వస్తున్నందుకు చింతిస్తునానని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో కొన్ని పరిమితులకు లోబడి ద్రవ్యవినియోగం చేయాల్సి ఉంటుందన్నారు.
మన రాష్ట్రంలో 2019-20 లో 15 శాతం ఆదాయాభివృద్ధి సాధిస్తామని
భావించగా, తొలి మూడునెలల్లో 5.46 శాతం మాత్రమే వృద్ధిరేటు సాధ్యమైందన్నారు. వాణిజ్యపన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మోటార్ వాహనాల పన్ను తదితర రంగాల్లో వృద్ధిరేటు గణనీయంగా తగ్గిందన్నారు. నాన్-టాక్స్ రెవెన్యూలో వృద్ధిరేటు 14.9 శాతం ఉంటుందని భావించగా, మైనస్ 14.16 శాతంగా నమోదైందన్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో కేంద్ర ప్రభుత్వం 4.19 శాతం కోతపెట్టిందని, దీంతో మన రాష్ట్రానికి తీవ్రమైన నష్టం వచ్చిందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కేంద్రం నుండి కేంద్రం నుండి జీఎస్‌టీ పరిహారంగా 875 కోట్ల రూపాయలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దిగజారిన ఆర్థిక పరిస్థితికి ఇది నిదర్శనంగా నిలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో మన రాష్ట్రం నుండి కేంద్రానికి 2,72,926 కోట్ల రూపాయలు పన్నుల ద్వారా వెళ్లాయని, కేంద్రం రాష్ట్రానికి వివిధ పథకాల ద్వారా కేవలం 31,902 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందన్నారు.
గుడ్డి కన్నా మెల్ల మేలు
కర్నాటక, పంజాబ్, హర్యానా తదితర రాష్టాల ఆదాయంలో కూడా బాగా తగ్గుదల కనిపిస్తోందని, ఇతర రాష్ట్రాల కన్నా మనరాష్ట్ర పరిస్థితే ‘గుడ్డికన్నా మెల్లమేలు’ అన్న విధంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో స్థిరమైన ఆర్థిక ప్రగతి, పటుతరమైన ఆర్థిక క్రమశిక్షణ ఉన్నందువల్ల ఇతర ఆర్థిక సంస్థల నుండి నిధులు సమీకరించుకోగలుగుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే నిధులను సమీకరిస్తున్నామన్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెటేతర నిధులను వినియోగించుకోవాలని భావిస్తున్నామన్నారు.
సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం
ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అభివృద్ది, సంక్షేమం పథకాల కోసం 5,37,373 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. 2014 వరకు పూర్తిగా వెనుకబడి ఉన్న తెలంగాణ నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తోందన్నారు. 2014 కు ముందు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) సగటు వృద్ధిరేటు 4.2 శాతం ఉండగా, 2018-19 సంవత్సరంలో ఇది 10.5 శాతంగా నమోదైందన్నారు. 2013-14 లో జీఎస్‌డీపీ విలువ ప్రస్తుత ధరల వద్ద 4,51,580 కోట్ల రూపాయలుగా ఉండగా, 2018-19 సంవత్సరంలో ఇది 8,65,688 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. గత ఏడాది మూలధన వ్యయం 16.9 శాతంగా నమోదై దేశంలోనే నెంబర్ వన్‌గా పేరుతెచ్చుకున్నదన్నారు. దేశ మూలధన వ్యయం కన్నా ఇది చాలా ఎక్కువన్నారు. గత ఐదేళ్లలోమూలధన వ్యయం 1,03,551 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని, వీటితో పాటు ఆర్థిక సంస్థల నుండి తెచ్చిన 65,616 కోట్ల రూపాయలు కూడా ఉన్నాయన్నారు. అంటే ఐదేళ్లలో మొత్తం మూలధనం వ్యయం 1,65,167 కోట్ల రూపాయలుగా తేలిందన్నారు. ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం 21.49 శాతం సగటు ఆదాయ వృద్ధిరేటు సాధించిందని, దాంతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధ్యమైందని కేసీఆర్ పేర్కొన్నారు. నిరంతర విద్యుత్తు ఇవ్వడం వల్ల వ్యవసాయ పంటలు బాగా పండుతున్నాయని, పరిశ్రమలు మూడు షిప్టులో పనిచేస్తూ ఉత్పత్తి పెరిగిందన్నారు. ఐటీ ఎగుమతులు గతంలో ఏడాదికి 52 వేల కోట్ల రూపాయల విలువ మేరకు జరిగితే నేడు 1,10,000 కోట్ల రూపాయలకు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఆయుష్మాన్ భారత్ కన్నా మన ఆరోగ్యశ్రీ పథకం మెరుగ్గా ఉందని, అందుకే ఆయుష్మాన్ భారత్‌ను తాము అమలు చేయడం లేదని వివరించారు.
ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు పరిపాలనా సంస్కరణలు తెచ్చామని, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను కొత్తగా తెచ్చామన్నారు. అలాగే జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. గ్రామ పంచాయతీలకు ఈ ఏడు 2,714 కోట్లు, మున్సిపాలిటీలకు 1,764 కోట్లు ప్రతిపాదించామన్నారు.
చిత్రం...ముఖ్యమంత్రి కేసీఆర్