క్రీడాభూమి

రాణించిన రహానే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు ఎట్టకేలకు మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో గురువారం ఆ జట్టు 7 వికెట్ల తేడాతో ఆతిథ్య ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించగా, అందుకు దీటుగా జవాబిచ్చిన సూపర్ జెయింట్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించి లక్ష్యాన్ని అధిగమించింది. ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన సూపర్ జెయింట్స్‌కు ఇది మూడో విజయం కాగా, ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఇది మూడో ఓటమి. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన అజింక్యా రహానే (48 బంతుల్లో 63 పరుగులు) సూపర్ జెయింట్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
అంతకుముందు టాస్ గెలిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మూడో ఓవర్‌లోనే ఓపెనర్ రిషభ్ పంత్ (2) వికెట్‌ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ సంజూ శ్యాంసన్ (17 బంతుల్లో 20 పరుగులు), కరుణ్ నాయర్ (23 బంతుల్లో 32పరుగులు) కొద్దిసేపు నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించారు. వీరి నిష్క్రమణ తర్వాత కెప్టెన్ జెపి.డుమినీ (32 బంతుల్లో 34 పరుగులు)తో పాటు వికెట్ కీపర్ శామ్ బిల్లింగ్స్ (15 బంతుల్లో 24 పరుగులు), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (8 బంతుల్లో 20 పరుగులు) కూడా తమవంతు రాణించగా, పవన్ నేగీ (12 బంతుల్లో 19 పరుగులు), మొహమ్మద్ షమీ (3 బంతుల్లో 2 పరుగులు) అజేయంగా నిలిచారు. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. సూపర్ జెయింట్స్ బౌలర్లలో రజత్ భాటియా, స్కాట్ బోలాండ్ రెండేసి వికెట్లు రాబట్టగా, అశోక్ దిండా ఒక వికెట్ అందుకున్నాడు.
అనంతరం 163 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన సూపర్ జెయింట్స్ జట్టులో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్లంతా చక్కగా రాణించారు. ముఖ్యంగా ఓపెనర్ అజింక్యా రహానే క్రీజ్‌లో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించాడు. ఉస్మాన్ ఖ్వాజా (27 బంతుల్లో 30 పరుగులు)తో కలసి తొలి వికెట్‌కు 59 పరుగులు, సౌరభ్ తివారీ (18 బంతుల్లో 21 పరుగులు)తో కలసి రెండో వికెట్‌కు 45 పరుగులు, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (20 బంతుల్లో 27 పరుగులు)తో కలసి మూడో వికెట్‌కు మరో 42 పరుగులు జోడించిన రహానే 38 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేసుకోవడంతో 48 బంతుల్లో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనితో పాటు థిసార పెరీరా (5 బంతుల్లో 14 పరుగులు) కూడా నాటౌట్‌గా నిలవడంతో 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సంక్షిప్తంగా స్కోర్లు
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 162/7 (సంజూ శ్యాంసన్ 20, కరుణ్ నాయర్ 32, జెపి.డుమినీ 34, శామ్ బిల్లింగ్స్ 24, క్రెయిగ్ బ్రాత్‌వైట్ 20, పవన్ నేగీ 19-నాటౌట్).
వికెట్ల పతనం: 1-13, 2-48, 3-65, 4-110, 5-137, 6-138, 7-143. బౌలింగ్: రజత్ భాటియా 4-0-22-2, స్కాట్ బోలాండ్ 4-0-31-2, అశోక్ దిండా 4-0-34-1, థిసార పెరీరా 1-0-9-0, రవిచంద్రన్ అశ్విన్ 4-0-34-0, మురుగన్ అశ్విన్ 3-0-31-0.
రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: 19.1 ఓవర్లలో 166/3 (అజింక్యా రహానే 63-నాటౌట్, ఉస్మాన్ ఖ్వాజా 30, సౌరభ్ తివారీ 21, మహేంద్ర సింగ్ ధోనీ 27, థిసార పెరీరా 14-నాటౌట్). వికెట్ల పతనం: 1-59, 2-104, 3-146. బౌలింగ్: ఇమ్రాన్ తాహిర్ 4-0-26-2, అమిత్ మిశ్రా 4-0-28-1, జయంత్ యాదవ్ 4-0-25-0, క్రెయిగ్ బ్రాత్‌వైట్ 2-0-17-0, మొహమ్మద్ షమీ 3.1-0-50-0, జెపి.డుమినీ 1-0-9-0, పవన్ నేగీ 1-0-10-0.

చిత్రం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అజింక్యా రహానే (63-నాటౌట్)
---

ఐపిఎల్‌లో నేడు

సన్‌రైజర్స్ హైదరాబాద్
గుజరాత్ లయన్స్
హైదరాబాద్‌లో
రాత్రి 8 గంటల నుంచి