కర్నూల్

ఆరు నెలల్లో పర్యాటక సొబగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 6 : జిల్లాకు పర్యాటక సొబగులు దిద్దేందుకు పనులు ఊపందుకుంటున్నాయి. రానున్న ఆరు నెలల్లో ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను పూర్తి చేయాలని ఆ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మొదట ఆత్మకూరు సమీపంలోని బైర్లూటి గ్రామం వద్ద ఎకో టూరిజం పార్కును అటవీ శాఖ సహకారంతో దాదాపు పూర్తి చేశారు. రానున్న కృష్ణా పుష్కరాల ప్రారం భం నాటికి సిద్ధం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ భోజన వసతులతో పాటు పులులను ప్రత్యక్షంగా అడవిలో వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 5 గంటల పాటు నల్లమల అడవిలో ప్రజలు విహరించేందుకు మొదటి విడతలో 4 వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఆ తరువాత రద్దీని బట్టి దశల వారీగా వాహనాల సంఖ్యను పెంచుతారని అధికారులు వెల్లడిస్తున్నారు. కర్నూలు, అనంతపురం నుంచి రాజధాని నగరం అమరావతి, శ్రీశైలం, విజయవాడ వెళ్లే ప్రయాణికులు కూడా బైర్లూటి వద్ద కొంత సేపు విశ్రాంతి తీసుకుని వెళ్లడానికి వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటవీ ప్రాంతంలో స్వచ్ఛమైన చల్లటి గాలులు, ప్రశాంత వాతావరణంలో ప్రజలు సేద తీరడానికి అవకాశం కల్పిస్తున్నారు. అవుకు జలాశయంలో ప్రజలు బోట్లలో విహరించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయినట్లు పేర్కొంటున్నారు. జలాశయం నీటితో నిండిన అనంతరం బోటింగ్ ప్రారంభిస్తామని వారంటున్నారు. బోటింగ్‌తో పాటు అక్కడి కొండల్లో జలపాతాలు ప్రజలను ఆహ్లాదపరుస్తాయని వెల్లడిస్తున్నారు. సమీపంలో బెలుం గుహలు, యాగంటి క్షేత్రం, బ్రహ్మంగారి మఠం, రవ్వలకొండ వంటివి ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో పర్యాటకులు పర్యటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తున్నారు. కర్నూలు నగర ప్రజల కోసం ప్రత్యేకంగా రెండు పర్యాటక కేంద్రాలను ప్రారంభించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటగా గార్గేయపురం చెరువులో బోటింగ్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించామని తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లోనే ఇందుకు అవసరమైన పనులు ప్రారంభించి త్వరలో పూర్తి చేస్తామంటున్నారు. ఇక డోన్ రహదారిలో వెంగన్నబావి వద్ద ఉన్న విజయవనంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నడక, పరుగు మార్గాలు వేర్వేరుగా, పార్కు, చిన్నారులకు ఆట వస్తువులు, హోటల్ తదితర ఏర్పాట్లు ఉంటాయని తెలిపారు. ఇందుకు రూ. 12కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అనుమతి వచ్చిన వెంటనే పనులు చేపట్టి జనవరి నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంపై ఈ పనులు పూర్తయ్యే కాలం ఆధారపడి ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక జగన్నాథగట్టు, ఓర్వకల్లు రాతి వనాల్లో (రాక్ గార్డెన్) కూడా పర్యాటక కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడిస్తున్నారు. జగన్నాథగట్టుపై శిల్పారామం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రస్తుతం ప్రతిపాదనల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి పనులు చేపట్టామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏపిని దేశంలోనే
అగ్రగామిగా తీర్చిదిద్దుతాం
* మంత్రి అచ్చెన్నాయుడు
మంత్రాలయం, జూన్ 6: దేశంలోనే ఆంధ్రను అగ్రగామి రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని జిల్లా ఇన్ చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం పరిమళ పాఠశాలలో ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు, మంత్రి అచ్చెన్నాయుడు మంత్రాలయంకు మంజూరైన రూ. 5.10 కోట్లతో రాఘవేంద్ర నగర్ లో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన జల వనరులు ప్రాజెక్టులు, పశుసంవర్ధక శాఖ, పట్టుపరిశ్రమ, ఉద్యాన శాఖ, సూక్ష్మనీటి షథకం, గిరిజన సంక్షేమ శాఖ, వెనుక పడిన తరగతుల సహకార సంఘం, ఆరోగ్య శాఖ, మత్సశాఖ, మీ సేవలో రెవెన్యూ, మహిళా సాధికార సంస్థలు వంటి ప్రభుత్వ పథకాల నమూనాల ఎగ్జిమిషన్‌ను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ రెండుగా విభజించటం జరిగిందని, ఎన్నో కొత్త రాష్ట్రాలు వచ్చాయి, అక్కడ పండగ చేసుకుంటే మనకి సంతోషం లేకుండా కష్టాలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజన చేసి మనకు రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ను అంటగట్టారని అన్నారు. మంత్రాలయం నియోజక వర్గ అభివృద్దికి రూ.70 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా తీర్చు దిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు 18 గంటలు కష్టపడి పని చేస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల మేరకు మహిళలకు రూ.6వేల కోట్లు, రైతులకు రూ.25 వేల కోట్లు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని, పరిశ్రమల పెట్టాలంటే భూమి, నీరు, విద్యుత్ చాలా అవసరమన్నారు. పరిశ్రమల పెట్టుబడుల కోసం చంద్రబాబు విదేశాలకు వెళ్తుంటే ఆర్థిక ఉన్మాదులు కొందరు అడ్డుకుంటున్నారన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నా రాష్ట్రాని 2020 సంవత్సరానికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చ దిద్దడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ 30 నుండి 40 వేల మంది యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. సిద్ధేశ్వరం 5 లక్షల ఎకరాలకు, గుండ్రేవల 2 లక్షల ఎకరాలకు, పులికనుమ, వేదావతి, నగరడోణ, ఆర్డీఎస్ కుడికాలువ ద్వారా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందింస్తామని అన్నారు. ప్రాజెక్టులను పూర్తి చేసి రాబోయే కాలంలో రాయలసీమను రతనాల సీమగా తీర్చు దిద్దుతామన్నారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ, ఇన్‌చార్జి నియోజకవర్గం టిడిపి నాయకుడు తిక్కారెడ్డి మండల పరిధిలోని రచ్చమర్రి సమీపంలో నిర్మించిన గురురాఘవేంద్ర బసుల దొడ్డి జలాశయాన్ని సందర్శించి పరిశీలించారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ జిల్లానాయకులు శ్రీనివాసరెడ్డి, జాయింట్ కలెక్టర్ హరికిరణ్, డిప్యూటీ కలెక్టర్ శశిదేవి, డిఎస్పీ శ్రీనివాసరావు, కర్నూలు ఆర్డీఓ, ఎంపిడిఓ మధుసూదన్‌రెడ్డి, తహశీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, సిఐ నాగేశ్వరరావు, ఎస్సై ముణిస్వామి, మాదవరం ఎస్సై సునీల్‌కుమార్, నాయకులు నరవ రమాకాంతరెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, మంత్రాలయం సర్పంచ్ భీమయ్య, మాలపల్లి సర్పంచ్ చావడి వెంకటేష్, తదితర నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్ మూతిపై వాతలు పెట్టాలి
* మహిళలకు డిప్యూటీ సిఎం కెఇ విజ్ఞప్తి
పత్తికొండ, జూన్ 6: రాష్ట్భ్రావృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సిఎం చంద్రబాబును విమర్శిస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌కు బుద్ధి రావాలంటే మహిళలే జగన్ మూతిపై వాతలు పెట్టాలని ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి పిలుపు నిచ్చారు. సోమవారం పత్తికొండలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో భాగంగా జరిగిన సదస్సులో డిప్యూటీ సిఎం మాట్లాడుతూ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తీవ్ర భయాందోళనతో రాష్ట్రాఅభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 18 గంటలు పని చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని, రెండు సంవత్సరాల్లోనే అనూహ్యమైన అభివృద్ధి సాధించారన్నారు. అయితే ఇది చూసి ఉర్వలేక జగన్ చంద్రబాబుపై రాళ్లుతో, చెప్పులతో కొట్టాలని పిలుపు ఇవ్వడం అనుచిత వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. అందువల్ల జగన్‌కు బుద్ధి రావాలంటే మహిళలు ఇండ్లలో వంట చేసే సామాన్లతో అతనిమూతిపై వాతలు పెట్టి బుద్ధివచ్చే విధంగా పని చేయాలని కోరారు. ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని, పందికోణ రిజర్వాయర్ నుంచి తాగునీటి కోసం ప్రత్యేక పైపులైన్‌ను సాధిస్తానని, పత్తికొండ డిగ్రీ కాలేజీలో పీజీ కోర్సు ఏర్పాటు చేస్తానని అప్పటి వరకు తాను నిద్రపోనని స్పష్టం చేశారు. అలాగే టమోటా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటానని పిలుపు నిచ్చారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నీరు కుంటా, సంజీవని పథకాల ద్వారా ఎంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇటీవల కురిసిన వర్షలతో నీరు నిలిచి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ ఓబులేసు, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, మండలాల జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపిటిసిలు, నాయకులు సాంబశివారెడ్డి, మనోహర్‌చౌదరి, సుకన్య, తదితరులు పాల్గొన్నారు.
మొరాయించిన సర్వర్..
ఎంసెట్ కౌనె్సలింగ్‌కు అంతరాయం
* రాత్రి 8 గంటలకు ప్రారంభం..
* ఇబ్బందులకు గురైన విద్యార్థులు..
కర్నూలు అర్బన్, జూన్ 6:నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, రాయలసీమ యూనివర్శిటీ కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఎంసెట్-2016 కౌనె్సలింగ్, సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 1వ ర్యాంకు నుంచి 2500 ర్యాంకు వరకూ, రాయలసీమ యూనివర్శిటీలో 2501వ ర్యాంకు నుంచి 5000వ ర్యాంకు వరకూ విద్యార్థులు హాజరు కావాల్సి వుంది. అయితే ఉదయం ప్రారంభం నుంచే సర్వర్ మొరాయించడంతో సోమవారం రాత్రి 8 గంటలకు ఆలస్యంగా కౌనె్సలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి అధికారులు మెయిన్ సర్వర్‌తో తమ కేంద్రంలోని సబ్ సర్వర్‌తో లింక్ అయ్యేలా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది. సాయంత్రం వరకూ సర్వర్ లింక్ కాకపోవడం రెండు కేంద్రాల్లో ఉదయం నుంచే ఇదే పరిస్థితి వుండడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మరో పక్క విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తమ పిల్లల సర్ట్ఫికెట్లు ఎప్పుడు పరిశీలిస్తారు, కౌనె్సలింగ్ నిర్వహిస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధంలో పడ్డారు. ఓ దశలో సంబంధిత కేంద్రాల సమన్వయకర్తలు, అధికారులతో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగడంతో పాటు నిర్వహణ తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రాత్రి 8 గంటలకు కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
బావిలో పడి ఇద్దరు బాలికల మృతి
* చనుగొండ్లలో విషాదం
డోన్, జూన్ 6:ప్రమాదవశాత్తూ బావిలో పడి ఇద్దరు బాలికలు మృతిచెందిన సంఘటన సోమవారం డోన్ మండలంలోని చనుగొండ్ల, తుగ్గలి మండలంలోని లింగనేనిదొడ్డి గ్రామాల మధ్య చోటుచేసుకుంది. దీంతో చనుగొండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. వ్యవసాయానికి అనుకూలమై న వర్షాలు కురవడడం, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో గ్రామానికి చెందిన రైతులు తిమ్మప్ప, శ్రీనివాసులు గ్రామ సమీపంలోని పొలంలో పనులు చేసుకోవడానికి వెళ్లారు. వారితో పాటు వారి పిల్లలు శివమ్మ(16), పూజిత(11)ను కూడా తీసుకెళ్లారు. ఆ బాలికలు మధ్యాహ్నం వరకూ ఆడుతూ, పాడుతూ కంది కొయ్యలు ఏరివేశారు. ఆ తర్వాత బహిర్భూమికి వెళ్లి నీటి కోసం సమీపంలోని బావిలోకి దిగారు. అయితే బిందె బావిలోకి జారిపోగా దానికోసం ప్రయత్నించి పూజిత కూడా నీటిలోకి పడిపోయింది. ఇది గమనించిన శివమ్మ పూజితను కాపాడేందుకు బావిలోకి దిగింది. ఇద్దరూ నీటిలో మునిగిపోయి ఊపిరాడక మృతి చెందారు. బహిర్భూమికని చెప్పి వెళ్లిన బాలికలు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో రైతులు తిమ్మప్ప, శ్రీనివాసులు బావి వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఆ ఇద్దరు బాలికలు బావిలో విగత జీవులై కనిపించారు. దీంతో ఆ బాలికల తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్ర
* ఎమ్మెల్సీ శమంతకమణి
డోన్, జూన్ 6:ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించి అబివృద్ధిని అడ్డుకునేందుకు వైకాపా అధినేత జగన్ కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్సీ శమంతకమణి ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ప్రజలు క్షమించరని, తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి సిఎం చంద్రబాబుతోనే సా ధ్యమని స్పష్టం చేశారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం పట్టణంలోని ఎస్కేపి హైస్కూలులో చర్చావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బాబు చేస్తు న్న కృషి ప్రశంసనీయమన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాల్సి వుందని, అందు కే ప్రభుత్వం 24 గంటల పాటు విద్యు త్ సరఫరా చేస్తుందన్నారు. అయితే నిరుద్యోగ యువతీ, యువకులకు పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీల గురించి అవగాహన కల్పించడంలో ఆ శాఖ అధికారు లు విఫలమవుతున్నారని మండిపడ్డా రు. ప్రజలకు అందుబాటులో లేకుం డా ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే మీ వద్దకు ఎవరొస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నా రు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో చేప ట్టే కార్యక్రమాల గురించి అనునిత్యం రద్దీగా వుండే ఎంపిడిఓ, తహశీల్దార్ కార్యాలయాల వద్ద పూర్తి సమాచారా న్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం కష్టించి పని చేస్తుంటే అధికారుల్లో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. అనంతరం గర్భిణులకు సీశ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కె ట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ఎంపిపి టిఇ లక్ష్మిదేవి, వైస్ ఎంపిపి చలం, అగ్రికల్చర్ ఏడిఎ నర్శిరెడ్డి, డోన్, బేతంచెర్ల తహశీల్దార్లు మునికృష్ణయ్య, అంజనాదేవి, ఎంపిడిఓ క్యాథరిన్, ఏపిఓలు రమణ, శ్రీవిద్య, గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టిఇ సత్యంగౌడ్, మాజీ ఎంపిపి టిఇ శేషఫణిగౌడ్, మండల టిడిపి అధ్యక్షుడు కొత్తకోట శ్రీనివాసులు, నాయకులు తిమ్మయ్యయాదవ్, నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుతో
ఉపాధి అవకాశాలు
* జెడ్పీ చైర్మన్ రాజశేఖర్
నందికొట్కూరు, జూన్ 6:జిల్లాకు పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని, అయితే కొందరు నేతలు పరిశ్రమలకు భూములు ఇవ్వవద్దని రైతులను రెచ్చగొట్టడం భావ్యం కాదని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ హితవు పలికారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం పట్టణంలోని జైకిసాన్ పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్రం విభజన నేపథ్యంలో సిఎం చంద్రబాబు కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రియల్ హబ్ తెస్తున్నారన్నారు. అలాగే జిల్లాలో ఇరిగేషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అయితే ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి ఓర్వకల్లుకు వచ్చి పరిశ్రమల కోసం భూములు ఇవ్వవద్దని రైతులను రెచ్చగొట్టారన్నారు. జిల్లాను అభివృద్ధి చేస్తే తనకు రాజకీయ ఉనికి వుండదనే ఉద్దేశ్యంతోనే బైరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును రూ. 6వేల కోట్లతో ఏర్పాటు చేయడంతో జిల్లాకు నిరంతర విద్యుత్ అందడమేగాక పరిశ్రమలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి సాగునీటితో పాటు పరిశ్రమలకు కూడా నీటి కేటాయింపులకు ప్రత్యేకంగా రెండు పంపులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అంతకుముందుగా మండలంలోని వడ్డెమాను గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ గుండం రమణారెడ్డి, ఎంపిపి వీరం ప్రసాదరెడ్డి, జెడ్‌పిటిసి చింతకుంట లక్ష్మిదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఓస్పరి సుబ్బమ్మ, వైస్ చైర్మన్ మునాఫ్, డిప్యూటీ కలెక్టర్ సత్యం, తహశీల్దార్ రమణారావు, మున్సిపల్ డిఇ నాగభూషణంరెడ్డి, పీరుసాహేబ్‌పేట సింగిల్‌విండో చైర్మన్ కాతా రమేష్‌రెడ్డి, నాయకులు కట్టా రవికుమార్‌రెడ్డి, సత్యంరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రామయ్య, ఓబుల్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై
జగన్ విమర్శలు చేయాలి
* సిఎంపై అనుచిత వ్యాఖ్యలు తగవు..
* ప్రజల అంచనాలకు మించి నగరాభివృద్ధి
* ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
కర్నూలు సిటీ, జూన్ 6:వైకాపా అధినేత జగన్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేయాలే కానీ సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్‌రెడ్డి హితవు పలికారు. నగరంలోని ఎస్వీ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఎమ్మెల్యే ఎస్వీ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ సమకాళికుడైన సిఎం చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయటం వల్ల ఒక పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు ఈ విధంగా చేయటం ఏంటని ప్రజల్లో కూడా చులకన భావం ఏర్పడుతుందన్నారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఓదార్పు యాత్ర, పాదయాత్ర, ధర్నాలు, దీక్షలు చేపట్టినా ఏనాడూ కార్యకర్తలు, నాయకులు తిరగబడలేదని గుర్తు చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల టిడిపి నాయకులు, కార్యకర్తలు జగన్ రైతు భరోసా యాత్రను అడ్డుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పరంగా చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టి రాష్ట్భ్రాద్ధికి సహకరించాలని, లేనిపక్షంలో జగనే ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్నారని ప్రజలు భావిస్తారని వెల్లడించారు. చంద్రబాబు ఒక నెలలోనే నగరాభివృద్ధికి రూ. 200 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి నిధులు మంజూరు చేయాలని సిఎంను అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అలాగే ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాల మేరకు సిఎం చంద్రబాబు సహకారంతో ఎవరూ ఊహించని విధంగా, ప్రజల అంచనాలకు మించి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. నిరంతరం వార్డుల్లో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే నగరంలో పేద ముస్లిం మహిళల పెళ్లి కోసం దుల్హన్ పథకం కింద ఒక్కో జంటకు రూ. 50వేలు ఇస్తామన్నారు. 2014లో దుల్హన్ పథకం కింద రూ. 25వేలను వస్తువు రూపంలో ఇవ్వటం జరిగేదని ప్రస్తుతం వారి బ్యాంక్ ఖాతానే రూ. 50వేలు జమ చేస్తున్నామన్నారు. కాగా సోమవారం 211 మంది పేద ముస్లింలకు రూ. 1.5 కోట్లు అందజేశామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు రాజేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, అబ్దుల్జ్రాక్, షరీఫ్, సలీం, రాఘవేంద్రనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
పులికనుమ ప్రాజెక్టు వేగవంతం చేస్తాం
* మంత్రి అచ్చెన్నాయుడు
కోసిగి, జూన్ 6: పులికనుమ ప్రాజెక్టు విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, మంత్రాయం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి తిక్కారెడ్డితో కలిసి పులికనుమ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పులికనుమ ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం రూ 20 కోట్లు మంజూరు చేసుకుని త్వరలో పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పులికనుమ ప్రాజెక్టు పూర్తి అయితే జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి అన్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద కుడి కాలువను ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంతంలో కరవు లేకుండా చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే కోసిగి ప్రాంతానికి సంబంధించిన రైతులు పులికనుమ ప్రాజెక్టులో భూమి కోల్పోయారని, పులికమ ప్రాజెక్టు నుంచి మండలానికి తూం ఏర్పాటు చేయాలని మండల టిడిపి నాయకులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. వీరి వెంట మంత్రాలయం టిడిపి నాయకులు రామాకాంత్‌రెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి, ముత్తురెడ్డి, పంపాపతి, పెండేల్ ఆదినారాయణశెట్టి, తదితరలు ఉన్నారు.
జేబులు నింపుకునేందుకే ప్రత్యేక ప్యాకేజీ
* ఎమ్మెల్యే ఐజయ్య
నందికొట్కూరు, జూన్ 6:రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ప్రత్యేక హోదాను కోరకుండా కేవలం జేబులు నింపుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ కోరుతుందని ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. పట్టణంలోని తన నివాసంలో సోమవారం ఎమ్మెల్యే విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు టిడిపి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 8వ తేదీ అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్‌స్టేషన్లలో సిఎం చంద్రబాబు కేసులు నమోదు చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. విభజన జరిగిన 11 రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక హోదా కల్పించిందని, అయితే ఏపి నుంచి టిడిపి చేతగానితనంతో హోదాను సాధించలేకపోయిందన్నారు. సమావేశంలో కౌన్సిలర్ చంద్రశేఖర్, ఆవాజ్ కమిటీ నాయకుడు అబూబకర్ పాల్గొన్నారు.
మండ్లెం చెరువుకు గండి
జూపాడుబంగ్లా, జూన్ 6:మండల పరిధిలోని మండ్లెం చెరువుకు సోమవారం తెల్లవారుజామున గండి పడింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో చెరువు చైర్మన్ మోహన్‌రెడ్డి రైతుల సహకారంతో ఇసుక సంచులను గండికి అడ్డంగా వేసి తాత్కాలికంగా పూడ్చగలిగారు. అలాగే మైనర్ ఇరిగేషన్ డిఇ రమణారెడ్డి, ఏఇ వీరమ్మకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి శాశ్వతంగా గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ జాకీర్‌హుస్సేన్ అక్కడికి చేరుకుని రెవెన్యూ సిబ్బందితో కలిసి మధ్యాహ్నం వరకూ సంఘటనా స్థలంలోనే ఉండి ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు.
యువకుడి ఆత్మహత్య
సంజామల, జూన్ 6:మండల పరిధిలోని పేరుసోముల గ్రామంలో సోమవారం రాత్రి రత్నం రవిబాబు(30) ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ విజయభాస్కర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రత్నం ప్రసాద్, రాణెమ్మ దంపతుల కుమారుడు రత్నం రవిబాబు సోమావారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. దీంతో మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి చెంది గ్రామంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకోగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా రవిబాబుకు భార్య సులోచనమ్మ, కూతురు ఉన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బేతంచెర్ల, జూన్ 6:మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో ఈ నెల 2వ తేదీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తెలుగు బాలమద్దయ్య (35) కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఏఎస్‌ఐ బలరాం తెలిపారు. వివరాలు.. గత ఏడాది కాలంగా బాలమద్దయ్య కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడని, ఆ క్రమంలో గత గురువారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడన్నారు. ఇతడికి భార్య సావిత్రి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమాదు చేసుకుని దర్యాప్పు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.