చిత్తూరు

పలమనేరు వైకాపా ఎమ్మెల్యే టిడిపిలోకి జంప్...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 6: పలమనేరు వైకాపా ఎమ్మెల్యే ఎన్ అమరనాథరెడ్డి టిడిపిలోకి జంప్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా వైకాపా కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో సోమవారం ఎమ్మెల్యే పలమనేరులోని తన నివాసంలో నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులు, కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అయితే తన నిర్ణయాన్ని బయటపెట్టకనే గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను వేర్వేరుగా సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొందరు టిడిపి నేతలు కూడా ఆయనతో మంతనాలు సాగించినట్లు తెలిసింది. ఇటీవల తిరుపతిలో జరిగిన టిడిపి మహానాడు సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు అమరనాథరెడ్డి పార్టీలో చేరే విషయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పార్టీ జాతీయకార్యదర్శి లోకేష్‌తో చర్చించినట్లు, వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలియవచ్చింది. అయితే ఆయన పార్టీలో చేరికను నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్, అమరనాధరెడ్డితో పోటీచేసి ఓటమి చెందిన సుభాష్‌చంద్రభోష్ వ్యతిరేకించినా, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సర్దుకుపోవాలని పార్టీ అధినేతతోపాటు లోకేష్ సర్దిచెప్పినట్లు సమాచారం. దీంతో సోమవారం అమరనాథరెడ్డి తన అనుచరుల వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించడంతో, అనేకమంది ఆయన పార్టీలో చేరేందుకే మొగ్గు చూపడంతో ఆయన కూడా సైకిల్ ఎక్కేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అమరనాథరెడ్డి పార్టీ చేరే తేదీని ప్రకటించనున్నారు. అదే రోజు వైకాపాను వీడేందుకు గల కారణాలను వివరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే టిడిపి ఆవిర్భావం నుంచి అమరనాథరెడ్డి కుటుంబానికి ఆ పార్టీతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అమరనాథరెడ్డి తండ్రి కెలవాతి రామకృష్ణారెడ్డికి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్‌టి రామారావుతో మంచి సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగాను, చిత్తూరు పార్లమెంట్ సభ్యులుగాను కొనసాగారు. ఆయన వారసత్వంగా అమరనాథరెడ్డి 1995, 2004లో రెండు పర్యాయాలు పుంగనూరు ఎమ్మెల్యేగా టిడిపి టికెట్‌పై విజయం సాధించారు. అదేవిధంగా 2009లో పలమనేరు నియోజకవర్గానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన, 2014 ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. అనంతరం జరిగిన సాధారణ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే టిడిపిలో ఉన్న కాలంలో రాష్ట్ర తెలుగుయువత అధ్యక్షుడిగాను, చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షుడిగాను కొనసాగారు. టిడిపితో ఎనలేని అనుబంధం ఉన్న ఆయన వైకాపాలో ఇమడలేకపోతున్నారు. ఈ తరుణంలో ఆ పార్టీని వీడి సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు నియోజకవర్గంలోని వైకాపాకు చెందిన జడ్పీటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపిపిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లతో పాటు, భారీసంఖ్యలో టిడిపిలో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే టిడిపి అధిష్టాన వర్గం అమరనాథరెడ్డికి ఓ కీలక పదవిని అప్పగించేందుకు సమ్మతించడంతోనే ఆయన వైకాపాను వీడేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విశ్వనీయ సమాచారం.

సాంకేతిక లోపం...
* ఆలస్యంగా ప్రారంభమైన ఇంజనీరింగ్ కౌనె్సలింగ్
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జూన్ 6: ఏపి ఎంసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు సోమవారం నిర్వహించిన ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌కు ప్రారంభంలోనే పలు అవాంతరాలు నెలకొన్నాయి. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కాలేజీతో పాటు తిరుపతిలో రెండు కేంద్రాల్లో ఈ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. చిత్తూరులో అదనపు జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి కౌనె్సలింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కౌనె్సలింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్దేశించిన ఎన్‌ఐసి సర్వర్‌లో సాంకేతిక లోపం నెలకొనడంతో ఉదయం ప్రారంభం కావాల్సిన కౌన్సిలింగ్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మొదలైంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. తొలిరోజు విద్యార్థుల సర్ట్ఫికెట్లు పరిశీలనతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించారు. ఎంసెట్‌లో 1వ ర్యాంకు నుంచి 5వేల ర్యాంకు వరకు తొలిరోజు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇందుకోసం చిత్తూరులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుతో పాటు వారి సర్ట్ఫికెట్లను పరిశీలించే పనిని అధికార బృందాలు చేపట్టాయి. అయితే సర్వర్‌లో నెలకొన్న సాంకేతిక లోపంతో గంటల తరబడి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరీక్షించాల్సి వచ్చింది. చిత్తూరులో విద్యార్థుల సౌకర్యార్థం టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు. 08572-241768 నెంబర్ ద్వారా ఎంసెట్‌పరంగా ఎలాంటి సందేహాలైనా నివృత్తి చేసుకోవచ్చని పివికెఎన్ డిగ్రీ కళాశాల, ఎంసెట్ సమన్వయకర్త ఆనందరెడ్డి తెలిపారు. 9వ తేదీ నుంచి ఎంసెట్ ర్యాంకులు పొందిన విద్యార్థులకు వెబ్ ఆప్షన్ ద్వారా కళాశాలలను ఎంచుకునే అవకాశం ఉందన్నారు. అయితే తొలిరోజు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ మందకొడిగా కొనసాగింది. చిత్తూరు కేంద్రానికి తొలిరోజు తక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చారు.

జిల్లాలోని 39 మండలాల్లో వర్షం
* అత్యధికంగా కెవిబిపురం 65.2 మి.మీ వర్షం
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, జూన్ 6: ఉపరితల ద్రోణి కారణంగా జిల్లాలోని 39 మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సరాసరి 12.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కెవిబిపురంలో 65.2 మి.మీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో పాక్షికంగా మామిడి పంటకు నష్టం వాటిల్లింది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎండ వేడిమితో అతలాకుతలమవుతున్న జిల్లా వాసులకు ఈ వర్షంతో వాతావరణం చల్లబడి కొంత ఊరటనిచ్చింది. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండటంతో రైతాంగం పంట సాగుకు సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా వేరుశనగ సాగు కోసం పొలాలను దుక్కి దున్నడానికి ఈ వర్షం అనుకూలంగా ఉండటంతో రైతాంగం ఈ దిశగా ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతోంది. జిల్లాలో వరదయ్యపాళ్యం 53 మి.మీ, నాగలాపురం 24, ఆర్‌సి పురం 29, చంద్రగిరి 18, సత్యవేడులో 23, రేణిగుంట 34, తిరుపతి అర్బన్ 11, పిచ్చాటూరు 28, పుత్తూరు 50, వడమాలపేట 54, పెనుమూరు 37, కార్వేటినగరం 36, వెదురుకుప్పం 30, ఎస్‌ఆర్ పురం 20, పూతలపట్టు 22, తవణంపల్లె 33, ఐరాల 19 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఉద్యోగ విరమణ పొందిన పాత్రికేయులకు
పెన్షన్ సౌకర్యం కల్పించేందుకు కృషి
* తిరుపతిలో ప్రెస్‌క్లబ్‌కు సొంత భవనం అవసరం
* ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వి.వాసుదేవ దీక్షితులు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జూన్ 6: ఉద్యోగ విరమణ చేసిన పాత్రికేయులకు పెన్షన్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకువెళ్లి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వి.వాసుదేవ దీక్షితులు స్పష్టం చేశారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారిగా చిత్తూరు జిల్లాకు వచ్చిన ఆయన సోమవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులను కలిశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను పాత్రికేయుల మధ్య నుంచి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అయ్యానని, తాను మీలో ఒకరినని, జర్నలిస్టుల సమస్యలు తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తానని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రెస్‌క్లబ్‌కు ఒక విశిష్టస్థానం ఉంటుందని, ఇందుకు ఒక సొంత భవనం అవసరమని అన్నారు. సిఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్‌క్లబ్‌కు సొంత భవనం ఇవ్వడానికి అంగీకరించారని తెలిసిందన్నారు. తాను అధికారులతో సంప్రదించి స్థలం కేటాయింపునకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రెస్‌క్లబ్‌లను సరస్వతీ నిలయాలుగా మార్చడానికి కృషి జరుగుతూ ఉందన్నారు. క్లబ్ అంటే అనేక అపోహలు పెట్టుకుంటున్నారని, అది సరికాదని తెలిపారు. ప్రెస్‌క్లబ్ అంటే విజ్ఞులు ఉండే ఒక స్థలమని చెప్పారు. పాత్రికేయులు సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధులన్నారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పింఛన్ లేదని, తనకు కూడా రావడం లేదని చెప్పుకున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. అర్హులైన పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డు అందజేయడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు పర్యటిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే గ్రామీణ విలేఖరులకు అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. నేటి ఆధునిక సమాజంలో పాత్రికేయులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు వాటిపై అవగాహన అవసరమన్నారు. పాత్రికేయుల సంక్షేమం పట్ల సిఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ద కలిగివున్నారని తెలిపారు. తమిళ మీడియా ప్రతినిధులకు అక్రిడేషన్ల సంఖ్య పెంచడానికి కృషి చేస్తానన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌ను డిజిటల్ కేంద్రంగా తయారు చేయడానికి కృషి చేస్తామన్నారు. పాత్రికేయుల సలహాలు, సూచనలను స్వీకరించడం జరుగుతుందన్నారు.
ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ను ఘనంగా సన్మానించిన జర్నలిస్టులు
ప్రెస్ అకాడమీ ఛైర్మన్ వి.వాసుదేవ దీక్షితులను సోమవారం ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సుధీర్‌రెడ్డి, గిరిబాబు, ఎపియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు మనె్నం చంద్రశేఖర్ నాయుడు, జర్నలిస్టు ఫోరం నాయకులు సురేంద్రరెడ్డి, హరిబాబు, త్రిమూర్తి, లక్ష్మీపతి ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈసందర్భంగా సుధీర్‌రెడ్డి, గిరిబాబులు మాట్లాడుతూ తిరుపతి ప్రెస్‌క్లబ్ పూర్వపరాలను వివరించారు. ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయలు సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలే కాకుండా సామాజిక అంశాలపై స్పందిస్తున్న తీరును వివరించారు. పాత్రికేయులు ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్న ఇంటి స్థలాలు, అక్రిడేషన్లకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత్రికేయులకు ప్రధాన సమస్యలైన ఇంటి స్థలాలు, అక్రిడేషన్లకు సంబంధించి శాయశక్తులా కృషి చేసి పరిష్కరిస్తానని తెలిపారు. ప్రెస్‌క్లబ్ నిర్వహణ అద్భుతంగా ఉందని, పాత్రికేయుల వ్యవస్థ కూడా బాగుందని ప్రశంసించారు.

విధులు సరిగ్గా నిర్వర్తించని అధికారులపై చర్యలు
* రుణాల కోసం కాలర్ పట్టుకుని నిలదీసే స్థితికి రానివ్వొద్దు
* బ్యాంకుల తీరు మారాలి
* ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై అవగాహన సదస్సులో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ హెచ్చరిక
చిత్తూరు, జూన్ 6: ఎస్సీ కార్పొరేషన్, సంక్షేమశాఖల్లో విధులు సరిగా నిర్వర్తించని అధికారుల తాట తీస్తామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. సోమవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు జూపూడి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే డిఎ సత్యప్రభ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో లబ్ధిదారులను ఉద్దేశించి జూపూడి మాట్లాడారు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తమ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు 1090 కోట్లు కేటాయించిందన్నారు. అయితే రుణాల గ్రౌండింగ్ విషయంలో బ్యాంకులు సహకరించకపోవడంతో నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోలేకపోతున్నామని వాపోయారు. ఓ ఎస్సీ నిరుద్యోగికి కార్పొరేషన్ సబ్సిడీ పోను మంజూరు చేసే 40 వేల రూపాయలు ఇచ్చేందుకు విముఖత చూపే బ్యాంకర్లు లిక్కర్ కింగ్ విజయమాల్యాకు 9700 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు ముందుకు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు తమ కార్పొరేషనే గ్యారెంటీ ఇస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఆంక్షలు విధించకుండా లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో రుణాల కోసం కాలర్ పట్టుకుని నిలదీసే స్థాయిలో లబ్ధిదారులు ఉన్నారని వెల్లడించారు. చిత్తూరు జిల్లాకు కార్పొరేషన్ దాదాపు 94 కోట్లు కేటాయించిందని, ఈ మొత్తాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారులదే అన్నారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని, అదే క్రమంలో మండల కేంద్రాలకు సైతం బదిలీ చేస్తామని హెచ్చరించారు. ఇందులో సంక్షేమాధికారులకూ మినహాయింపు లేదన్నారు. నిరుపేదల అభ్యున్నతికే ఎస్సీ కార్పొరేషన్ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగ ఎస్సీలు రుణాలు పొంది అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 25 లక్షల ఎస్సీ కుటుంబాల్లో ఒక్కరికి చొప్పున ఉపాధి కల్పించడమే టిడిపి ధ్యేయమని, అలా ఉపాధి కల్పించిన నాడే ఎస్సీల ఇంట్లో పండుగ వచ్చినట్లు అన్నారు. ఇందులో భాగంగానే తొలి విడతగా జిల్లాలోని 10వేల మంది ఎస్సీ నిరుద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని భరోసా ఇచ్చారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కార్పొరేషన్ రుణాలను ఎస్సీ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాచేసిన నాడే ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఆశయాలను నెరవేర్చిన వారవుతారని సూచించారు. టిడిపి క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వై ప్రవీణ్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా జూపూడి ప్రభాకర్‌ను నియమించడం హర్షణీయమని, ఆయన బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే కార్పొరేషన్‌లో పలు పథకాలు ప్రవేశపెట్టి అమలుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. అయితే కార్పొరేషన్‌లో అనేక పథకాలున్నా, వాటి అమలు తీరుమాత్రం అంతంత మాత్రంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తగు శ్రద్ధ వహించి గ్యారెంటీలు, రుణ మంజూరు విషయంగా బ్యాంకర్లు లబ్ధిదారులను వేధించకుండా చూడాలని కోరారు. అనంతరం లబ్ధిదారుల్లో పలువురు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. కాగా ఈ సదస్సులో చిత్తూరు కార్పొరేషన్ మేయర్ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఇడి మాధవరావు, వ్యవసాయ, పశసంవర్థక, సిరికల్చర్, బిందు, సూక్ష్మసేద శాఖల ప్రతినిధులు, పలు దళిత సంఘాల నేతలతో పాటు, దాదాపు 3వేల మందికి పైగా లబ్ధిదారులు పాల్గొన్నారు.

వేసవిలో భక్తులకు విశేష సేవలు అందించిన అధికారులకు జెఇఓ అభినందనలు
తిరుమల, జూన్ 6: వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులకు సేవలు అందించడంలో టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని జెఇఓ శ్రీనివాసరాజు ప్రశంసించారు. సోమవారం సాయంత్రం తిరుమల అన్నమయ్య భవనంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి సెలవులు ముగుస్తున్న సమయంలో వారాంతపు రద్దీ పెరుగుతుందని, వారికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం విభాగాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈకార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఓ కోదండరామారావు, ఎస్‌ఇ 2 రామచంద్రారెడ్డి, ముఖ్యభద్రతాధికారి రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి షర్మిష్ఠ, డిప్యూటి ఇఓ చెంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నవ్యాంధ్ర నిర్మాణానికి అందరి సహకారం అవసరం
* మంత్రి బొజ్జల పిలుపు
శ్రీకాళహస్తి, జూన్ 6: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం సిఎం చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రజలు, రాజకీయపార్టీలు సహకరించాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కోరారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా సోమవారం మండల కేంద్రమైన తొట్టంబేడులో దీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బొజ్జల మాట్లాడుతూ తెలంగాణ విడిపోయాక ఆదాయం తగ్గిందని, ఎపి లోటు బడ్జెట్‌లో ఉందన్నారు. చంద్రబాబు నాయుడికి గతంలో సిఎంగా పనిచేసిన అనుభవం ఉన్నందువల్ల రాష్ట్రంలోని వనరులను వినియోగించుకుని అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వడం మానేసి సిఎంపై ఆరోపణలు చేయడం, అభివృద్ధి జరగకుండా అడ్డుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి నియోజక వర్గంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందువల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈకార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ గురవయ్య నాయుడు, మున్సిపల్ ఛైర్మన్ రాధారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు చెంచయ్యనాయుడు, రామాంజులు నాయుడు, పార్టీ నాయకులు మురళీనాయుడు, రవి నాయుడు, అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.