నిజామాబాద్

పనుల్లో నాణ్యత లోపిస్తే లైసెన్స్‌లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటగిరి, జూన్ 7: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తూ పనులు చేపడితే, అలాంటి కాంట్రాక్టర్ల లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. కోటగిరి మండలం హెగ్డోలి, కొల్లూర్ గ్రామ చెరువుల్లో జరుగుతున్న మిషన్ కాకతీయ పనులను మంగళవారం మంత్రి పోచారం సందర్శించి పరిశీలించారు. కొల్లూర్‌లో మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంతో సంబంధిత శాఖ డిఇపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తుంటే, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నామమాత్రంగా పనులు చేపడుతున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లూర్ గ్రామ చెరువులో జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేసి, సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులను నిలిపివేయాలని డిఇని ఆదేశించారు. అంతకు ముందు వర్ని మండలం రుద్రూర్ నుండి కోటగిరి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీ జెండాలను మంత్రి ఆవిష్కరించడంతో పాటు నూతనంగా ఏర్పాటు చేసిన కోటగిరి ఎఎంసి కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్‌పై, టిఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై కోదండరాం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇతర పార్టీల నాయకులు చెప్పిన మాటలను వింటూ, ప్రొఫెసర్ కోదండరాం తెరాసపై బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కోట్ల నిధులతో 35లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు 51వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల ఎకరాలకు డ్రిప్ సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు. అనంతరం కోటగిరి మండల కేంద్రంలోని ఎఎంసి గోదాంలో నిర్వహించిన మండల పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి కెసిఆర్ కలలు కంటున్న బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని, ఇందులో ప్రతి నాయకుడు, కార్యకర్త తమవంతు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్‌పటేల్, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు హంగర్గా గంగాధర్, వైఎస్ ఎంపిపి శ్రీనివాస్‌రావు, సర్పంచ్‌లు స్వరూప, మహేశ్, సాయిలు, ఉదయ్, బాల్‌రాజ్, రెడ్యా నాయక్, నాయకులు సురేందర్‌రెడ్డి, పత్తి లక్ష్మన్ పాల్గొన్నారు.