నిజామాబాద్

ఆదమరిస్తే...అనర్థాలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, జూన్ 9: విద్యను వ్యాపారంగా మల్చుకుని ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న పలు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకుండా అభంశుభం ఎరుగని చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న తల్లిదండ్రులకు గుండెకోతను మిగుల్చుతున్నాయి. డొనేషన్లు, ఫీజులు, ట్యూషన్ రుసుము, స్కూల్ డెవలప్‌మెంట్ ఫీజుల పేరిట డబ్బులు దండుకుంటున్న ప్రైవేట్ విద్యా సంస్థలు, చివరకు స్కూల్ బస్సుల విషయంలోనూ తమ కక్కుర్తిని వీడకుండా విద్యార్థులను నిలువు దోపిడీ చేయడమే కాకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరుతో పసివారి ప్రాణాలు గాలిలో దీపంలా వేలాడుతున్నాయి. ప్రతిఏటా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యిందంటే చాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బడులకు వెళ్లిన తమ చిన్నారులు తిరిగి క్షేమంగా ఇళ్లకు చేరుకునే వరకు తల్లిదండ్రులలో ఆందోళన నెలకొంటోంది. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన స్కూల్ బస్‌లు, వ్యాన్‌లు తరుచూ ప్రమాదాలకు గురవుతుండడమే ఈ ఆందోళనకు కారణమవుతోందని చెప్పవచ్చు. బస్సులు కండీషన్‌లలో ఉండక పోవడం, అనుభవం లేని డ్రైవర్లతో వ్యాన్‌లు నడిపిస్తుండటం వలన స్కూల్ బస్సులు ఎక్కడ బోల్తా పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. స్కూల్ బస్సులు కండీషన్‌లో ఉండాలని, లైసెన్స్‌లు కలిగిన వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడం వలన యజమాన్యాలు నిబంధలను దర్జాగా ఉల్లంఘిస్తున్నాయి. యాజమాన్యాల ఇష్టారాజ్యం, అధికారుల వైఫల్యం వల్లనే స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అపతీ ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నా నిబంథనలు అమలు చేయడంలో అధికారులు ఎటువంటి పకడ్బందీ చర్యలు చేపట్టక పోవడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. అధికారుల వైఖరిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ యాజమాన్యాలు అవలంభిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగానే నిండు ప్రాణాలు బలవుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో సుమారు వెయ్యి వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో దాదాపు 300వరకు పాఠశాలలు స్కూల్ బస్‌లు, వ్యాన్‌లను నిర్వహిస్తున్నాయి. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ అయిన లెక్కల ప్రకారం చూస్తే 600వరకు స్కూల్ బస్‌లు జిల్లాలో కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి పిల్లలను తరలించేందుకు వీలుగా ఈ వాహనాల సదుపాయం సౌకర్యవంతంగానే ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం చిన్నారుల పాలిట శాపంలా పరిణమిస్తోంది. పేరుమోసిన విద్యా సంస్థలు ఈ విషయంలో అప్రమత్తంగానే ఉంటున్నప్పటికీ, ఒక మోస్తారుగా నిర్వహించబడుతున్న పాఠశాలల వాహనాలే ప్రమాదాల బారినపడుతున్నాయి. ప్రమాదాలకు గల కారణాలను పరిశీలిస్తే కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తుండడమే ప్రధాన తప్పిదంగా తెలుస్తోంది. 15 సంవత్సరాలు దాటిన వాటిని కాలం చెల్లిన వాహనాలుగా పరిగణిస్తారు. జిల్లాలో ప్రస్తుతం పాఠశాలల యాజమాన్యాలు వినియోగిస్తున్న వాహనాల్లో ఈ తరహాకు చెందినవి దాదాపు 100వరకు ఉన్నట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు పలు ప్రమాదాలు జరిగిన సమయంలో ఆర్టీఎ అధికారులు ఒకింత తనిఖీలు ముమ్మరం చేయడంతో కాలం చెల్లిన స్కూల్ బస్సులను కొంతవరకు నియంత్రించగలిగారు. అయితే బడులు ప్రారంభమయ్యే నాటికే ఫిట్‌నెస్‌లను ధ్రువీకరించుకోవాలని అధికారులు తాఖీదులు జారీ చేస్తున్నప్పటికీ, అనేక పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఏమాత్రం ఫిట్‌నెస్ లేకుండా కారుచౌకగా లభ్యమయ్యే వాహనాలను సమకూర్చుకుని వాటికి పైపై మెరుగులు దిద్దుతూ వాటిని చిన్నారులను బడులకు చేరవేసేందుకు వినియోగిస్తున్నారు. ఎక్కువగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వాహనాలను స్కూల్ బస్‌లుగా వినియోగిస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ అధికారులు నామమాత్రంగానైనా పట్టించుకోవడం లేదు. దీనికితోడు అనుభవం లేని వారిని, కనీస వయస్సు సైతం దాటని బాలలను, డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిని స్కూల్ బస్సుల వాహన డ్రైవర్లుగా నియమించుకుంటున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభం కానుండటంతో ఈ సారైనా స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ విషయంలో సంబంధిత ఆర్టీఎ అధికారులు రాజీలేని ధోరణితో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.