తూర్పుగోదావరి

నివురుగప్పిన నిప్పు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 10: కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పోలీసు అదుపు, ఆసుపత్రికి తరలింపు నేపధ్యంలో జిల్లా అంతటా పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో అణువణువు పోలీస్ పహారా కాశారు. సుమారు 6 వేల మంది ప్రత్యేక పోలీస్ బలగాలు జిల్లా అంతటా మోహరించాయి. భారీ సంఖ్యలో పోలీసులు మప్తీలో జిల్లాను చుట్టుముట్టారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ముద్రగడను శుక్రవారం పరామర్శించేందుకు వచ్చిన సమీప బంధువులను సైతం పోలీసులు ముద్రగడ దరికి చేరనీయలేదు. ఈనేపధ్యంలో జిల్లా అంతటా తీవ్ర ఉద్రిక్తత అలుముకుంది. ముద్రగడ వైద్యాన్ని నిరాకరించడంతో ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఉత్తంఠ వ్యక్తమైంది. బలవంతంగా వైద్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంటే ముద్రగడ చేయి పట్టుకుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తూ తలను గోడకేసి కొట్టేసుకుంటానని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే శుక్రవారం ఉదయం ఒకసారి గోడకేసి కొట్టుకున్నట్టు వైద్యుల ద్వారా తెలిసింది. ముద్రగడ పద్మనాభం, ఆయన భార్య, కొడుకు, కోడలు, వియ్యంకుడు ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. ముద్రగడ ఆసుపత్రిలో కొనసాగిస్తున్న దీక్ష శుక్రవారం నాటికి రెండో రోజుకు చేరింది. భారీ పోలీస్ బలగాలు జిల్లా అంతటా చుట్టుముట్టాయి. పోలీసులు ముద్రగడ ఉన్న ఆసుపత్రిలోకి వైద్యం నిమిత్తం వచ్చే సాధారణ రోగులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపిస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లోని సుమారు కిలోమీటరు పరిధిని పోలీసులు పూర్తి అధీనంలోకి తీసుకున్నారు. సామాన్యులెవరూ అటుగా వచ్చే పరిస్థితి లేకుండా నిషేధిత ప్రాంతంగా అదుపులోకి తీసుకున్నారు. పారా మిలిటరీ, ఎఎన్‌ఎస్ స్క్వాడ్‌లు, సాయుధ పోలీస్ బలగాలు ఆసుపత్రి ప్రాంతాన్ని పోలీస్ పికెట్ల నడుమ పహారా కాస్తున్నాయి. ఎమర్జన్సీ వాతావరణాన్ని తలపించే విధంగా భయం గుప్పిట జిల్లా అంతటా నిర్మానుష్యం ఆవరించి ఉంది. పోలీసులు నాయకుల ప్రతి కదలికను పసిగడుతూ ముందస్తుగా కొంతమందిపై బైండోవర్ కేసులు పెట్టారు. పలువురు నాయకులను గృహనిర్బంధం చేశారు. కొత్తపేట ప్రాంతంలో బంద్ ప్రభావం కనిపించింది. అమలాపురంలో పోలీసులు ఛాంబర్ ప్రతినిధులను పిలిచి యథేచ్ఛగా దుకాణాలు తెరచుకోవచ్చని భరోసా ఇవ్వడంతో కోనసీమ కేంద్రమైన యథావిధిగా షాపులు తెరిచారు. బస్సులు సాధారణంగానే తిరిగాయి. ముద్రగడ ఇటీవల మర్యాద పర్యటనలో కలుసుకున్న నేతల కదలికలపై కూడా పోలీసులు ఓ కనే్నశారు. ముద్రగడను పరామర్శించేందుకు ఎవరూ రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి దరిదాపులకు ఎవరినీ రానీయడం లేదు. జిల్లాలో సెక్షన్ 30తోపాటు 144 అమల్లో ఉంచారు. ముద్రగడకు ఏవిధంగా వైద్యం అందిస్తారో తెలియని విధంగా ఉంది. మరోవైపు సన్నిహితులను, బంధువులను ఆయన వద్దకు పంపించి, వైద్యానికి అంగీకరింప చేసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలిసింది. పోలీసుల వ్యవహారం గుంభనంగా ఉంది. ఇలావుండగా ముద్రగడను ఎన్నిరోజులపాటు ఆసుపత్రిలో ఉంచుతారో తెలియని విధంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో అణువణువు పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముద్రగడ దీక్ష భగ్నం క్రమంలో పోలీసుల తీరు అమానుషంగా ఉందని తీవ్ర ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇలావుండగా ముద్రగడ అరెస్టుపై జిల్లాకు చెందిన న్యాయవాది హైకోర్టులో పిటీషన్ వేసినట్టు సమాచారం. మొత్తం మీద తూర్పు గోదావరి జిల్లా అంతా పోలీసు గుప్పిట ఉద్రిక్తత మాటున ప్రశాంతంగా ఉంది.