క్రీడాభూమి

ముమ్మాటికీ కుట్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా అడ్డుకుంటూ అతని భవిష్యత్తును దెబ్బతీస్తున్న డోపింగ్ కుంభకోణం సోమవారం సరికొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) నర్సింగ్‌కు బాసటగా నిలిచినప్పటికీ ఈ కుంభకోణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, తనను డోపింగ్ కుంభకోణంలో ఇరికించేందుకు జరిగిన ఈ కుట్రలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి చెందిన ఒక అధికారి ప్రమేయం ఉందని అతను ఆరోపించాడు. నర్సింగ్ యాదవ్‌తో పాటు అతని రూమ్ మేట్ సందీప్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షలో విఫలమవడం, వీరిద్దరి నుంచి సేకరించిన నమూనాల్లో మెథాండియెనోన్ అనే నిషిద్ధ ఉత్ప్రేరకం ఉందని ఆదివారం వెల్లడవడంతో నర్సింగ్‌కు డబ్ల్యుఎఫ్‌ఐ బాసటగా నిలిచింది. రియో ఒలింపిక్స్‌కు వెళ్లకుండా నర్సింగ్‌ను దెబ్బతీసేందుకే ఈ కుట్ర జరిగినట్లు స్పష్టమవుతోందని డబ్ల్యుఎఫ్‌ఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో సోనేపట్ (హర్యానా)లోని సాయ్ శిక్షణా శిబిరానికి చెందిన ఒక అధికారితో పాటు కొందరు క్రీడాకారులు, మరికొంత మంది ఇతరుల ప్రమేయం ఉన్నట్లు నర్సింగ్ యాదవ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడని డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సోమవారం విలేఖర్లకు వివరించాడు. ‘కేవలం నెల రోజుల వ్యవధిలో నర్సింగ్‌కు మూడుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇది తీవ్రమైన అనుమానాలను రేకెత్తిస్తోంది. అంతేకాకుండా అతని రూమ్‌మేట్ సందీప్ యాదవ్ కూడా డోపింగ్ పరీక్షలో విఫలమవడం నర్సింగ్‌కు వ్యతిరేకంగా ఏదో కుట్ర జరిగిందన్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది’ అని బ్రిజ్ భూషణ్ పేర్కొన్నాడు.
రియోకి వెళ్లకుండా నిరోధించేందుకే..
కాగా, తన భవిష్యత్తును దెబ్బతీసిన డోపింగ్ కుంభకోణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)తో దర్యాప్తు జరిపించాలని నర్సింగ్ యాదవ్ సోమవారం డిమాండ్ చేశాడు. ‘ఈ కుంభకోణంపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలి. రియో ఒలింపిక్స్‌కు నన్ను ఎంపిక చేయడం కోర్టు చుట్టూ తిరిగింది. అలాగే నాకు ప్రాణహాని ఉందని నేర పరిశోధక విభాగం (సిఐడి) కూడా తన నివేదికలో స్పష్టం చేసింది. ఇదంతా చూస్తుంటే ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిరోధించేందుకు నన్ను డోపింగ్ కుంభకోణంలో ఇరికించారని స్పష్టమవుతోంది’ అని నర్సింగ్ యాదవ్ పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ)కు ఫిర్యాదు చేశానని, తన కోసం మెస్‌లో తయారు చేసిన ఆహారంలో ఏదో పదార్ధాన్ని కలిపి తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నారని ఆ ఫిర్యాదులో స్పష్టం చేశానని నర్సింగ్ యాదవ్ తెలిపాడు. బ్రెజిల్‌లో వచ్చే నెల 5వ తేదీన విశ్వ క్రీడా సంబరాలు ప్రారంభం కావడానికి కేవలం పది రోజుల ముందే నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో అతను ఒలింపిక్స్‌లో పాల్గొంటాడా? లేదా? అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డోపింగ్ కుంభకోణంలో తన తప్పేమీ లేదని గట్టిగా వాదిస్తున్న నర్సింగ్ యాదవ్ బుధవారం సమావేశమవుతుందని భావిస్తున్న నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరు కానున్నాడు. తన వ్యవహారంలో పెద్ద కుట్ర జరిగిందని నాడా క్రమశిక్షణా కమిటీని ఒప్పించగలనని అతను ఆశిస్తున్నాడు. ‘ఈ వ్యవహారంలో అందరూ నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. కనుక త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నా. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు రియోకి వెళ్తానని నేను ఇప్పటికీ గట్టిగా విశ్వసిస్తున్నా’ అని నర్సింగ్ యాదవ్ చెప్పాడు.
రియో ఒలింపిక్స్ 74 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు డబుల్ ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్ కూడా పోటీపడటంతో నర్సింగ్ యాదవ్ వివాదాస్పద రీతిలో రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుశీల్ కుమార్ చేసిన డిమాండ్‌ను ఢిల్లీ హైకోర్టుతో పాటు భారత రెజ్లింగ్ సమాఖ్య తోసిపుచ్చాయి. దీంతో గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకోవడం ద్వారా ఒలింపిక్స్‌లో కోటా బెర్తు దక్కించుకున్న నర్సింగ్ యాదవ్‌నే రియో ఒలింపిక్స్‌కు ఎంపిక చేశారు.

రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (ఫైల్ ఫొటో)