క్రీడాభూమి

తెల్ల ఏనుగు రూనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 25: మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు ఇంగ్లాండ్ సాకర్ జట్టు కెప్టెన్ వేన్ రూనీ తెల్ల ఏనుగులా మారాడు. అతనిని తుది జట్టులో కొనసాగించాలో, వద్దో తెలియక జట్టు కోచ్ జోస్ మోరిన్హో తల పట్టుకుంటున్నాడు. ప్రీమియర్ లీగ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా లీసెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌లో ధైర్యం చేసి రోనీని తప్పించాడు. ఆ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 4-1 తేడాతో గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకపోతే, రోనీ లేనందుకే మ్యాచ్‌ని పోగొట్టుకుందన్న విమర్శలు మోరిన్హోకు తప్పేవికావు. ఎంతో ధైర్యం చేస్తేగానీ రూనీపై వేటు వేయడం సాధ్యం కాదు. ఇంగ్లాండ్ సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు సంపాదించిన 31 ఏళ్ల రూనీకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. అతని కోసం దేనికైనా సిద్ధంగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే, అతను లేని ఇంగ్లీష్ లీగ్‌నుగానీ, ఇంగ్లాండ్ జట్టునుగానీ అభిమానులు ఊహించులేరు. మోరిన్హో ఎన్నో ఇంటర్వ్యూలో రూనీ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని తేల్చిచెప్పాడు. ‘రూనీ నుంచి ఏం కోరుకుంటున్నారు?’ అన్న ప్రశ్నకు క్షణం కూడా ఆలోచించకుండా ‘గోల్స్’ అని సమాధానమిచ్చాడు. మోరిన్హో ఆంతర్యం ఏమిటో, రూనీ గురించి అతను ఎంతగా ఆలోచిస్తున్నాడో చెప్పడానికి ఈ సమాధానం చాలు. ఇటీవల కాలంలో రూనీ ఫామ్‌లో లేడు. పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు. సెంట్రల్ స్ట్రయికర్ స్థానం నుంచి సెకండ్ హాఫ్ వరకూ వివిధ స్థానాల్లో ఆడినప్పటికీ గోల్స్ చేయలేకపోతున్నాడు. ప్రతిష్ఠాత్మక ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్‌లోనూ అతని వైఫల్యం కొనసాగుతున్నది. జట్టులో అత్యుత్తమ ఆటగాడికి కేటయించే నంబర్ 10 జెర్సీని దక్కించుకున్న రూనీ ఆ స్థానానికి సరైన న్యాయం చేయడం లేదని మోరిన్హో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. బహుశా మాంచెస్టర్ యునైటెడ్ మేనేజ్‌మెంట్ పరిస్థితి కూడా ఇదే రకంగా ఉందేమో! ఈ సీజన్‌లో అతనే ఈ జెర్సీకి హక్కుదారుడు. ప్రపంచ రికార్డు ఫీజుతో జట్టులోకి వచ్చిన పాల్ పోగ్బా, కొత్తగా అడుగుపెట్టిన స్ట్రయికర్ జ్లాటన్ ఇబ్రహిమోవిక్ ఇప్పటికే అసాధారణ ఆటగాళ్లుగా తమను తాము నిరూపించుకున్నారు. ఫామ్‌లో ఉన్న వారిని కాదని ఇంకెంత కాలం పాతకాపు రూనీకి అవకాశం ఇస్తారన్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేక, అతనిని తొలగిస్తే వచ్చేపడే ప్రమాదాలను ఎదుర్కొనే శక్తిలేక మోరిన్హో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒకటి రెండు మ్యాచ్‌ల్లో అతనిని బెంచ్‌కి పరిమితం చేసి, విజయాలను సాధిస్తే, ఆతర్వాత విమర్శలు పెద్దగా వినపడవన్నది అతని అభిప్రాయం. అయితే, ఈ ప్రయత్నం ఎంత వరకూ ఫలిస్తుదో, మాంచెస్టర్ యునైటెడ్ ఎన్ని వరుస విజయాలను సాధిస్తుందో చూడాలి. ఏదిఏమైనా తెల్ల ఏనుగు మాదిరి భారంగా మారిన రూనీని భరించడం ఇంకా ఎంతోకాలం సాధ్యం కాకపోవచ్చు.