జాతీయ వార్తలు

ఆ మార్పులు అమ్మ చేసినవే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 12: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ‘సలహా’మేరకే ఆమె నిర్వహిస్తున్న శాఖలను ఆర్థిక మంత్రి ఒ.పన్నీర్ సెల్వంకు బదలాయించినట్లు గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్ రావు చేసిన ప్రకటనపై ప్రతిపక్ష డిఎంకె అధినేత కరుణానిధి విస్మయం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా ఆసుపత్రిలోనే ఉన్న జయలలిత ఆమోదంతోనే శాఖల మార్పిడి జరిగిందంటూ గవర్నర్ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. అయితే ఆయన అనుమానాలను అధికార అన్నాడిఎంకె తిరస్కరించింది. జయలలిత సలహా మేరకే శాఖల బదలాయింపు జరిగిందని పార్టీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. గవర్నర్ నిర్ణయంపై అనేక ప్రశ్నలను సంధించిన కరుణానిధి జయలలిత తన శాఖల బదలాయింపునకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారా? లేక వాటిని బదలాయించాలని సలహా ఇచ్చారా? అనే ప్రశ్న కొంతమందిలో తలెత్తుతోందని ఆయన వివరించారు. జయలలిత తాను నిర్వహిస్తున్న శాఖలను తనకు విశ్వాసపాత్రుడయిన మంత్రి పన్నీర్ సెల్వంకు కేటాయించడాన్ని డిఎంకె కోశాధికారి, తన కుమారుడయిన ఎంకె.స్టాలిన్ మంగళవారం స్వాగతించిన మరుసటి రోజే కరుణానిధి ఈ ప్రకటన చేయడం విశేషం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, స్టాలిన్ సహా కొంత మంది నాయకులు అపోలో ఆసుపత్రిని సందర్శించినప్పటికీ వారెవరికీ జయలలితను నేరుగా చూసే అవకాశం ఇవ్వలేదని కరుణానిధి పేర్కొన్నారు. జయలలిత గత 19 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఒక్క ప్రకటన కూడా వెలువడలేదని ఆయన పేర్కొన్నారు. జయలలిత నిర్వహిస్తున్న శాఖలను పన్నీర్ సెల్వంకు బదలాయించడం అనేది పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకున్న చర్య కాబట్టి ఆమోదనీయమేనని ఆయన పేర్కొన్నారు. అయితే గవర్నర్ ఈ ఏర్పాటు చేయడంలో రాజ్యాంగపరమైన అన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారా? అనేదే ఇక్కడ సందేహమని కరుణానిధి పేర్కొన్నారు.
అపోలోను సందర్శించిన జైట్లీ, షా
జయలలిత చికిత్స పొందుతున్న ఇక్కడి అపోలో ఆసుపత్రిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా బుధవారం సందర్శించారు. సుమారు అరగంట సేపు వారు ఆసుపత్రిలో ఉన్నట్లు బిజెపి వర్గాలు తెలిపాయి. జయలలిత ఆరోగ్య పరిస్థితి, ఆమెకు అందిస్తున్న చికిత్స గురించి తెలుసుకున్న తరువాత వారిద్దరు మీడియాతో మాట్లాడకుండానే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు చెన్నై విమానాశ్రయంలో వారిద్దరికి తమిళనాడుకు చెందిన బిజెపి నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి చెన్నైలోని అపోలో ఆసుపత్రిని బుధవారం సందర్శించామని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తరువాత జైట్లీ, షా సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో వేర్వేరుగా చేసిన పోస్ట్‌లలో పేర్కొన్నారు. పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి కూడా బుధవారం అపోలో ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.