క్రీడాభూమి

బిసిసిఐకి చావుదెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఎటూ తేల్చుకోలేకపోతున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు చావుదెబ్బ తగిలింది. ఈ సిఫార్సులను డిసెంబర్ 3వ తేదీలోగా అమలు చేసి తీరాలని ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రసార హక్కులు సహా పలు కాంట్రాక్టుల బిడ్‌లను పరిశీలించి, ఖరారు చేయడానికి త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించింది. అత్యధిక ఆదాయ వనరులతో కోట్లకు పడగలెత్తిన బిసిసిఐ ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధించింది. లోధా కమిటీ ముందు హాజరై, సిఫార్సుల అమలుపై అఫిడవిట్‌ను ఇవ్వాలని ఆదేశిస్తూ కేసును డిసెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది.
అమలు చేయాల్సిందే..
భారత క్రికెట్‌లో పారదర్శకత కోసం లోధా కమిటీ చేసిన సిఫార్సులను ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేసి తీరాలని బిసిసిఐకి సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఈ ఏడాది జూలైలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఇంత వరకూ సిఫార్సుల అమలుపై స్పష్టత లేకపోవడాన్ని తప్పుపట్టింది. లోధా సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 3 వరకూ గడువును పెంచిన సుప్రీం కోర్టు ఈలోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని బిసిసిఐని ఆదేశించింది. సిఫార్సులను అమలు విషయంలో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న బిసిసిఐ పెద్దలకు తాజా ఆదేశాలు శరాఘాతమవుతున్నాయి. లోధా సిఫార్సులో చిన్నచిన్న అంశాలను అమలు చేయడం ద్వారా కీలక విషయాలను పక్కకు తప్పించవచ్చన్న బోర్డు వ్యూహం ఫలించలేదు. వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడసార్ల కంటే ఎక్కువ కాలం పాలక మండలి సభ్యులుగా ఉండరాదని లోధా కమిటీ చేసిన ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని బోర్డు అభిప్రాయం. అదే అమలైతే, అందరి కంటే ముందుగా బోర్డు ప్రస్తుత అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే తమ పదవులకు రాజీనామా చేయాల్సి వవస్తుంది. అందుకే, ఈ ప్రతిపాదనకు వారు ససేమిరా అంటున్నారు. లోధా సిఫార్సుల అమలైతే, బంగారు బాతును చేతులారా ఇతరులకు అప్పగించడమే అన్న అభిప్రాయం బోర్డు అధికారుల్లో ఉంది. కోట్లాది రూపాయల ఆదాయ వనరులున్న భారత క్రికెట్‌పై తమ ఆధిపత్యానికి గండిపడుతుందన్న ఆందోళన కూడా వారిని వేధిస్తున్నది. అందుకే ఎన్నిసార్లు డెడ్‌లైన్లు పెట్టినా అమలు చేయకుండా పదేపదే వాయిదా వేస్తూ వచ్చింది. ఏదో ఒక మార్గంలో తప్పించుకోవచ్చన్న ఆశతో రోజులు నెట్టుకొచ్చింది. కానీ, శుక్రవారం సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో బోర్డు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. లోధా సిఫార్సుల అమలుపై సుప్రీం కోర్టు ఈఏడాది జూలై 18న ఆదేశాలు జారీ చేసింది. పలుమార్లు డెడ్‌లైన్లు పెంచుతూ వచ్చి, చివరికి గత నెల 30వ తేదీలోగా సిఫార్సులు అమలు జరిగి తీరాలని అల్టిమేటం జారీ చేసింది. అంతేగాక, దారిలోకి రావాలని, లేకపోతే, దారిలోకి తెచ్చుకుంటామని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసారి డెడ్‌లైన్‌ను డిసెంబర్ 3 వరకు పెంచింది. సుమారు ఆరు నెలల సమయాన్నిచ్చిన సుప్రీం కోర్టు ఇకపై కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టమవుతున్నది.
ఆర్థికాంశాలపై దృష్టి
లోధా కమిటీ ఇటీవల లేవనెత్తిన అంశంపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. సాధారణ పాలనకు అవసరమైన మొత్తాలను తప్ప, మిగతా అన్ని రకాల చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేయాలని బిసిసిఐ ఖాతాలు ఉన్న బ్యాంకులకు లోధా కమిటీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు శుక్రవారం ప్రస్తావించింది. సభ్య సంఘాల నుంచి లోధా సిఫార్సుల అమలు చేస్తామన్న హామీతోపాటు అఫిడవిట్ వచ్చిన తర్వాతే చెల్లింపులు ఉండాలని పేర్కొంది. అంతేగాక, బోర్డు ఆర్ధిక లావాదేవీలను స్వతంత్ర బృందంతో ఆడిట్ చేస్తామని కూడా సుప్రీం కోర్టు తెలిపింది. ఈ వ్యాఖ్యలు బోర్డు అధికారుల గుండెల్లో గుబులు రేపుతున్నది. బోర్డు అంటేనే భారీ మొత్తాలన్న అభిప్రాయం అందరిలో ఉంది. కోట్లాది రూపాయల జమాఖర్చులకు ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ ఇన్నాళ్లూ రాజ్యం చెలాయించిన బోర్డుకు ఇప్పుడు సుప్రీం కోర్టు వ్యాఖ్యల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. డబ్బుపై పెత్తనం లేకపోతే, బోర్డు పాలక మండలిలో చోటు కోసం ఎవరూ వెంపర్లాడరేమో! గత నెల 21న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)ను నిర్వహించడం నుంచి సభ్య సంఘాలకు భారీ మొత్తాల్లో నిధులను మళ్లించాలన్న నిర్ణయానికి తొలుత లోధా కమిటీ, తాజాగా సుప్రీం కోర్టు అడ్డుపడ్డాయి. దీనితో వందలాది కోట్ల రూపాయల బదిలీకి బ్రేక్ పడింది. అయితే, బిసిసిఐ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలన్న ఆలోచన సుప్రీం కోర్టుకు లేనట్టు కనిపిస్తున్నది. హడావుడిగా తీసుకున్న చెల్లింపుల తీర్మానాన్ని మాత్రమే అడ్డుకున్న కోర్టు మిగతా లావాదేవీలపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.
కుడితిలో పడ్డ ఎలుక..
బిసిసిఐ అధికారుల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా మారింది. లోధా సిఫార్సులను అమలు చేయకుండా దాట వేయడం ఇకపై సాధ్యం కాదన్న వాస్తవాన్ని బోర్డు అధికారులకు స్పష్టమైంది. కాసుల పంట పండించే భారత క్రికెట్‌పై పట్టును ఎలాంటి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదని చివరి వరకూ వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. లోధా సిఫార్సులను అమలు చేయడం తప్ప వారికి మరో దారి కనిపించడం లేదు.