జాతీయ వార్తలు

రాజ్యాంగానికి లోబడే కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: ‘జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి భారత రాజ్యాంగం పరిధికి బయట కానీ, స్వయంప్రతిపత్తి కల్పిస్తూ భారత ప్రభుత్వం ఆ రాష్ట్రానికి కల్పించిన సొంత రాజ్యాంగ సూత్రాల ప్రకారంగానైనా సార్వభౌమాధికారం అన్నది లేనే లేదు. కాశ్మీర్ ప్రజలంతా భారతదేశ పౌరులే. జమ్ము కాశ్మీర్ సొంత రాజ్యాంగం అనేది భారత రాజ్యాంగంలో ఒక అంతర్భాగం మాత్రమే’ అని సుప్రీం కోర్టు విస్పష్టంగా తేల్చి చెప్పింది. జమ్మూకాశ్మీర్ శాశ్వత నివాసుల స్థిరాస్తులకు సంబంధించి వారి హక్కులను పరిరక్షించే విధంగా చట్టాలను రూపొందించే పూర్తి సార్వభౌమాధికారం జమ్మూకాశ్మీర్‌కు ఉందని ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని పేర్కొంది. న్యాయమూర్తులు కురియన్ జోసెఫ్, ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ఈ విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్‌బిఐ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు చెప్పింది. ‘జమ్మూకాశ్మీర్ శాశ్వత పౌరులు కూడా ముందు భారత పౌరులేననే విషయాన్ని మేము హైకోర్టుకు గుర్తు చేయవలసిన అవసరం ఉంది’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొన్ని ఇతర దేశాల్లో ఉన్నట్టు భారత్‌లో ద్వంద్వ పౌరసత్వం లేదని పేర్కొంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రజలు ఒక ప్రత్యేక తరగతి అనే తప్పుడు భావన వల్ల హైకోర్టు ఈ కేసులో తప్పుడు నిర్ధారణకు వచ్చిందని పేర్కొంది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్-2002లోని నిబంధనల్లో పార్లమెంటు చేసిన చట్టాలకు లోబడి ఉన్నవాటిని జమ్మూకాశ్మీర్‌లో అమలు చేయవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగంలోని సెక్షన్ 5లో గల నిబంధనలను హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని తెలిపింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం.. భారత యూనియన్‌లో అంతర్భాగంగా ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని ఆ రాష్ట్ర రాజ్యాంగంలోని సెక్షన్ 3 వెల్లడిస్తోందని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.