అనంతపురం

రైతు సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జనవరి 21: టిడిపి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శిం చారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కరవు తాండవిస్తోందన్నారు. ఇప్పటివరకు ప్రకటించిన వాతావరణ బీమా ఇంతవరకు రైతుల ఖాతాల్లోకి చేరలేదన్నారు. అదేవిధంగా ఇన్‌పుట్ సబ్సిడీ సైతం ఎప్పుడిస్తారో అర్థంకాని పరిస్థితి రైతాంగంలో నెలకొని వుందన్నారు. ఇప్పటికే పక్కనున్న కర్నాటక ప్రభుత్వానికి వెయ్యి కోట్లు కరవు నిధులు రైతులకు అందించటం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు కరవు సహాయక నిధులు కోసం నివేదికలు పంపలేదన్నారు. జిల్లాకు కరవు సహాయక బృందం వస్తున్నట్లు కొన్ని పత్రికల్లో చూశానని, ఇప్పటికే రైతన్నలు ఉపాధి అవకాశాలు లేక పరాయి రాష్ట్రాలకు వలసపోయారన్నారు. ప్రభుత్వం చెపుతున్న లెక్కల ప్రకారం 3 లక్షలు మందని, అనధికారికంగా ఈ సంఖ్య 5 లక్షలు దాకా వుంటుందన్నారు. పల్లె ప్రాంతాల్లో ఎక్కడా ఉపాధి హామీ పనులు జరగలేదన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు దాదాపు 30 టిఎంసీలు నీరు వచ్చిందని చెపుతున్నారని, ఒక్క ఎకరాకు సైతం నీరివ్వలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 19 టిఎంసీల నీటితోనే తాగు, సాగునీటి సంపూర్తిగా రైతులకు అందించటం జరిగిందన్నారు. హంద్రీనీవాను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని, అందులో నీళ్లు పారించి అంతా తాను సాధించానని ముఖ్యమంత్రి చెప్పుకోవడం పట్ల ఆయన అవహేళన చేశారు పాడి పరిశ్రమ సైతం నిస్తేజంలోకి నెట్టివేయబడిందన్నారు. పశువులకు గడ్డి లేక కబేళాలకు తరలిస్తున్నారన్నారు. పాల ధరను రూ.4 తగ్గించటం ఈ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టివేయబడిందన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా కరవు నివారణకు చేసిందేమి లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర కరవు పరిస్థితులపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని కోరారు. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాకు కరవు నివారణకు రూ.5 వేల కోట్లు తక్షణమే మంజూరు చేయాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధులు నాగరాజు, రమణ, జిల్లా కార్యదర్శి వసికేరి, రమణ పాల్గొన్నారు.
ఫోన్‌లో వేధిస్తున్న ఆకతాయి అరెస్టు
నల్లమాడ, జనవరి 21: ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్న గాజుల రమేష్‌ను అరెస్టు చేసినట్లు నల్లమాడ సిఐ శివరాముడు తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నల్లమాడలో గాజులు, స్టీల్ సామాన్ల దుకాణం నిర్వహిస్తున్న కె.రమేష్ రాత్రి పూట 7093686841 నెంబర్‌నుంచి ఫోన్ చేసి అవతలి వ్యక్తితో అసభ్యంగా మాట్లాడేవాడన్నారు. అలా ఒకటికాదు రెండు కాదు ఏకాంగా 300ల మందిని వేధించాడన్నారు. గత ఏడాదిగా ఇతడు ఇదే పని చేస్తున్నాడన్నారు. చివరకు రెడ్డిపల్లికి చెందిన మహేశ్‌ఈనెల 10వ తేదీ ఫిర్యాదు చేయడంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు వెలుగుచూశాయన్నారు. కాగా రమేష్‌తోపాటు మరో వ్యక్తి ఫోన్ ద్వారా వేధించాడని అతన్ని కూడా అరెస్టుచేశాలని బాధితులు కోరుతున్నారు.
మహిళ ఆత్మహత్య
రామగిరి, జనవరి 21: మండలంలోని కొత్తగాదిగకుంట గ్రామానికి చెందిన సునితమ్మ(25) శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒకటిన్నర సంవత్సరం వయసు గల కుమారుడు మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు భర్త నరసింహులు తెలిపాడు. కుమారుడు మరణించినప్పటి నుండి తరచూ మనోవేదనకు గురయ్యేదని, శుక్రవారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆయన వాపోయాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ శేఖర్ సంఘటనా స్థలానికి వెళ్ళి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దుకాణంలో అగ్ని ప్రమాదం
* రూ.10 లక్షల నష్టం
హిందూపురం టౌన్, జనవరి 21 : పట్టణంలోని ప్రధాన రహదారి ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న పారస్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యుదాఘాతంతో రూ.10 లక్షల నష్టం సంభవించినట్లు బాధితుడు రమేష్ వాపోయాడు. రోజూ మాదిరిగానే దుకాణానికి తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో విద్యుదాఘాతం చోటు చేసుకుని దుకాణం నుంచి పొగలు రావడంతో స్థానికులు సమాచారం ఇచ్చారన్నారు. హుటాహుటిన దుకాణానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడంతోపాటు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించినట్లు తెలిపారు. అయితే అగ్ని మాపక వాహనం వచ్చేలోపు దుకాణంలో ఉన్న దుస్తులు మొత్తం కాలిబూడిదైనట్లు వాపోయాడు. కాగా శనివారం ఉదయం అగ్నిమాపక కేంద్రం అధికారులు, పోలీసులు దుకాణాన్ని పరిశీలించారు. దాదాపు రూ.10 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితుడు అధికారులతో వాపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.