రాష్ట్రీయం

డీఎస్‌పై వేటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 27: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ. శ్రీనివాస్‌పై వేటుకు రంగం సిద్ధమైంది. ఒకటి రెండు రోజుల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. డీఎస్‌పై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధం చేసాకే, ఆయనపై నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల నుంచి ఫిర్యాదు తెప్పించుకున్నట్టు ఈ వర్గాల సమాచారం. డీఎస్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీ కవిత ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం వరకు అంతా పార్టీ అధిష్టానం డైరెక్షన్‌లోనే జరిగినట్టు తెలిసింది. నిజామాబాద్ ఎంపీ, సిఎం కుమార్తె కవిత నేతృత్వంలోనే ప్రజాప్రతినిధులంతా సమావేశమై డీఎస్‌పై క్రమశిక్షణ తీసుకోవాలని కోరడం ఆయనపై చర్యకు రంగం సిద్ధమైందనడానికి సంకేతంగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కార్యకలాపాలకు డీఎస్ కొంతకాలం దూరంగా ఉండటం, కుమారుడు బీజేపీలో చేరడం, డీఎస్ ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్యులతో సమావేశమైన సమాచారాన్ని పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తున్నది. డీఎస్ వ్యవహారంపై వారం రోజుల కిందటనే ఫామ్ హౌస్‌లో పార్టీ ముఖ్యులతో చర్చించినట్టు సమాచారం. డీఎస్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారాన్ని పార్టీ ముఖ్యులకు సీఎం కేసీఆర్ వివరించి వారి అభిప్రాయాన్ని తీసుకున్నట్టు తెలిసింది. డీఎస్‌పై వేటుకే పార్టీ ముఖ్యులు మొగ్గు చూపిన తర్వాతనే నాటకీయంగా నిజామాబాద్ జిల్లా నేతల నుంచి ఫిర్యాదును తెప్పించుకున్నట్టు పార్టీ వర్గాల కథనం. డీఎస్‌పై వేటుకు నిర్ణయం తీసుకోవడం వల్లనే ఆయనకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిసింది. నిజామాబాద్‌లో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు డిఎస్‌పై క్రమశిక్షణా చర్యకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలియగానే ఆయన హైదరాబాద్‌కు హటాహుటినా చేరుకున్నారు. తాను సీఎంను కలువాలనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రదించగా సాయంత్రం ఆరు గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చినట్టు డీఎస్ మీడియాకు వెల్లడించారు. అయితే సాయంత్రం వరకు వేచి చూసినా సీఎంఓ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తిరిగి సంప్రదించగా సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారని, గురువారం ఉదయం విజయవాడ వెళ్లి తిరిగి వచ్చాక సమాచారం ఇస్తామని చెప్పినట్టు డీఎస్ మీడియాకు తెలిపారు.
ఇలా ఉండగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చోటు చేసుకున్న పరిణామాలతో తనపై వేటు ఖాయమని డీఎస్ కూడా అంచన వేస్తున్నారు. అయినప్పటికీ సీఎంను కలిసి వివరణ ఇచ్చాకే తనపై ఏ చర్య తీసుకున్నా ఫర్వాలేదని చెప్పాలని ఆయన భావిస్తున్నారు.
దురదృష్టకరం: డీఎస్
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు తనపై వచ్చిన ఆరోపణలు దురదృష్టకరమని డీఎస్ వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. సిఎం ఏ నిర్ణయం తీసుకున్నా సమ్మతమేనని స్పష్టం చేసారు. తన కుమారుడి నిర్ణయాలను తాను ఎలా నిలువరించగలుగుతానని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత పనుల మీద ఢిల్లీకి వెళ్లాను తప్ప కాంగ్రెస్ పెద్దలను కలువడానికి కాదని ఆయన స్పష్టం చేసారు. ఢిల్లీలో తన క్వార్టర్‌ను రిపేరు చేయించుకుని తిరిగి వచ్చానేతప్ప అక్కడ కాంగ్రెస్ నేత ఆజాద్‌ను కలిసినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పచ్చి అబద్దమని డీఎస్ ఖండించారు. ఏ పార్టీలోన్నా తన రాజకీయ జీవితంలో క్రమశిక్షణతో మెలిగానని, ఈ విషయంలో తాను ఎవరితో చెప్పించుకునే స్థితిలో లేనన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీఎం కేసీఆర్‌ను కలిసి వివరణ ఇచ్చాక తానే స్వయంగా టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయాలని డీఎస్ భావిస్తున్నట్టు తెలిసింది.