నమ్మండి! ఇది నిజం!!

జన్మజన్మల బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చచ్చి నీ కడుపున పుడతాను’ అని కృతజ్ఞతగా చెప్పడం హిందువులకి రివాజు. కాని క్రిస్టియన్స్ పునర్జన్మని నమ్మరు. ఐనా అరుదుగా గత జన్మ గుర్తొచ్చిన అనేక ఉదంతాలు క్రిస్టియన్ దేశాల్లో వెలుగులోకి వస్తూంటాయి.
గత నలభై ఐదేళ్లుగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ‘డివిజన్ ఆఫ్ పర్‌పెక్చువల్ స్టడీస్’కి చెందిన టీం గత జన్మలని గుర్తు తెచ్చుకునేవారు చెప్పేది సేకరిస్తోంది. వారు చెప్పే దాంట్లో నిజం ఉందని ప్రొఫెసర్లు నిర్ధారిస్తే తర్వాతి పరిశోధనని కొనసాగిస్తారు. అలా వారు 2,500 కి పైగా కేసులని పరిశోధించారు. ఇవి వాటిలోని మూడు ఉదంతాలు.
తండ్రి రాన్‌తో రెండేళ్ల కొడుకు శామ్ ఓ రోజు ఇలా చెప్పాడు.
‘నేను నీ వయసులో ఉన్నప్పుడు ఇలాగే నీ డైపర్స్‌ని మార్చాను’
రాన్ ఆ మాటలకి నిశే్చష్టుడయ్యాడు. అంత చిన్న పిల్లవాడు అలాంటి మాటలు చెప్పడం అతనికి వింతగా తోచింది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు శామ్ ఇలాంటి అనేక విషయాలని తండ్రికి చెప్పాడు. రాన్, అతని భార్య కేథీ క్రమంగా కొడుకు చెప్పే అనేక విషయాలను బట్టి, రాన్ తండ్రే శామ్‌గా పుట్టాడని తెలుసుకున్నారు.
‘నువ్వు తిరిగి ఎలా వచ్చావు?’ రాన్ ఓ రోజు శామ్‌ని ప్రశ్నించాడు.
‘నేను మాయమై మళ్లీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాను’ శామ్ చెప్పాడు.
శామ్ పద్దెనిమిదో నెల నించే పూర్తి వాక్యాలు మాట్లాడటంతో వారు నిర్ఘాంతపోయారు. పిల్లలు మాట్లాడని పోర్టల్ లాంటి పదాలని కూడా ఎక్కడా నేర్చుకోకుండా శామ్ మాట్లాడేవాడు. ఆ దంపతులు వాడిని అనేక ప్రశ్నలు వేశారు.
‘నీకు తోడబుట్టిన వారు ఉన్నారా?’ అనే ప్రశ్నకి జవాబుగా ఓ సోదరి ఉండేదని, ఆమె చేపగా మారిందని శామ్ చెప్పాడు. చేపగా ఎవరు మార్చారని అడిగితే, ‘చెడ్డవాళ్లు’ అని చెప్పాడు. అరవై ఏళ్ల క్రితం రాన్ మేనత్తని ఎవరో శాన్‌ఫ్రాన్సిస్కోలో ముంచి చంపేశారు.
‘నువ్వెలా మరణించావు?’ అని అడిగితే శామ్ వెంటనే తల మీద కొట్టుకున్నాడు.
రాన్ తండ్రి సెరిబ్రల్ హేమరేజ్‌తో మరణించాడు!
రాన్ తండ్రే తమకి జన్మించాడని రాన్ దంపతులు నమ్ముతున్నారు.
సాధారణంగా పిల్లలు రెండు నించి మూడేళ్ల దాకా గత జన్మ గురించి మాట్లాడి, ఆరేడేళ్లకి ఇక ఆ విషయాలు మాట్లాడటం మానేస్తారు. ఈ వయసులోనే వారిలో బాల్యపు జ్ఞాపకాలు సమసిపోతాయి.
మరో కేసు. ఐదేళ్ల ఓ పిల్లవాడికి గత జన్మ జ్ఞాపకాలే కాక భౌతిక లక్షణాలు కూడా వచ్చాయి. పూర్వ జన్మలో అతనికి ఎడమ కన్ను కనపడదు. ఈ జన్మలో కూడా ఆ కన్ను కనపడదు.
మరో కేసులో ఓక్లహామాకి చెందిన రయాన్ అనే నాలుగేళ్ల పిల్లవాడు ఓ రోజు తెల్లవారుఝామున రెండుకి నిద్రలోంచి మేలుకుని గట్టిగా ఇలా అరిచాడు.
‘అమ్మా! నాకు మా ఇంటికి వెళ్లాలని ఉంది’
అంతకు కొన్ని నెలల ముందు నించి రయాన్ తల్లి సిండీని తను పూర్వం జీవించిన ఇంటికి తీసుకెళ్లమని బతిమాలేవాడు. తనని హాలీవుడ్‌కి తీసుకెళ్లమని, అక్కడ తనకి స్విమ్మింగ్ పూల్ గల పెద్ద ఇల్లు ఉందని చెప్పేవాడు.
‘ఈ చిన్న ఇంటికన్నా నా ఇల్లు చాలా బావుంటుంది. నాకు చాలా దిగులుగా ఉంది’ అని ఆ రాత్రి నిద్రపోయే దాకా ఏడిచాడు.
ఓ సారి ఓ పత్రికలోని పాత హాలీవుడ్ సినిమా ఫొటోని చూపించి ‘అది నేనే. అది నా ఫొటో’ అని అరిచాడు.
మర్నాడు సిండీ లైబ్రరీకి వెళ్లి 1930లలోని హాలీవుడ్‌కి చెందిన అనేక పుస్తకాలని ఇంటికి తీసుకువచ్చింది.
వాడు ప్రశాంతంగా ఉంటాడని, రయాన్‌ని ఒళ్లో పడుకోబెట్టుకుని వాటిని చూపిస్తే, వాటిని చూసే కొద్దీ వాడిలో ఉత్సాహం పెల్లుబుకింది. 1932లో విడుదలైన ‘నైట్ ఆఫ్టర్ నైట్’ అనే సినిమా స్టిల్‌లోని ఒకర్ని చూపించి ‘అది నేనే.. నా పాత్ర ఫొటో అది’ అని మళ్లీ చెప్పాడు. ఆమె నివ్వెరపోయింది.
సిండీకి, ఆమె భర్తకి పునర్జన్మ మీద నమ్మకం లేకపోయినా మర్నాడు సింథీ లైబ్రరీకి వెళ్లి గత జన్మలు గుర్తొచ్చిన పిల్లల గురించి డాక్టర్ జిమ్ టకర్ రాసిన పుస్తకాన్ని తెచ్చుకుని చదివింది. ఆ పుస్తకంలో ఇండియాలోని ఓ అమ్మాయి అకస్మాత్తుగా ఎవరికీ తెలియని భాషలో మాట్లాడే సంఘటన గురించి సిండీ చదివింది. డాక్టర్ టకర్ ఆ పాపని పరిశీలించి అది నిజమని భావించానని ఆ పుస్తకంలో రాశాడు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే ఇలాంటివి పిల్లలకి నేర్పించి మోసం చేస్తారు. మరి కొన్ని సందర్భాలలో పిల్లలే టీవీ చూసో, పెద్దల సంభాషణ వినో అలాంటి కట్టుకథలు చెప్తూంటారు కూడా అని ఆయన ఆ పుస్తకంలో రాశాడు.
డివిజన్ ఆఫ్ పర్‌పెక్చువల్ స్టడీస్‌లో గత జన్మల మీద రీసెర్చ్ చేస్తున్న ప్రొఫెసర్ టకర్ ఆ పుస్తకం చివర్లో అలాంటి పిల్లలు ఉన్నవారు తనని కాంటాక్ట్ చేయమని కోరడంతో ఆయనకి రయాన్ గురించి వివరిస్తూ ఉత్తరం రాసింది.
డాక్టర్ టకర్ రయాన్‌ని పరీక్షించి వాడికి గత జన్మ గుర్తు రావడం వాస్తవమని తేల్చాడు. హాలీవుడ్‌లోని మార్టీ మార్టిన్ అనే ఏజెంట్ నైట్ ఆఫ్టర్ నైట్ చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు. మార్టీ కూతుర్ని డాక్టర్ టకర్, రయాన్, సిండీలు కలిసారు. రయాన్ తన తండ్రి గురించి చెప్పిన ఏభై విషయాలు నిజమని మార్టీ కూతురు ధృవీకరించింది. ఇంట్లో ఆయన జీవించి ఉన్నప్పుడు ఏ వస్తువులు ఎక్కడ ఉండేవో రయాన్ సరిగ్గా చెప్పడం విశేషం.
2002లో లూజియానాకి చెందిన నాలుగేళ్ల జేమ్స్ రెండో ప్రపంచ యుద్ధంలో తను ఫైటర్ పైలట్‌గా నడిపిన విమానం అయో జిమా అనే చోట కూలిపోయిందని చెప్పాడు. ఓ రాత్రి వాడు ‘విమానం కూలిపోతోంది. విమానం అంటుకుంది. నేను బయటకి వెళ్లలేను’ అని అరుస్తూ లేచాడు. డాక్టర్ టకర్ వాడికి ఫైటర్ విమానం బొమ్మని చూపిస్తే ఏ విభాగంలో ఏం ఉంటాయో ఆ నాలుగేళ్ల కుర్రాడు చెప్పాడు. గత జన్మలో తన పేరు టోనీ అని కూడా చెప్పాడు. జేమ్స్‌కి రెండో ప్రపంచ యుద్ధం గురించి కాని, విమాన భాగాల గురించి కాని తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదు. నిజంగా టోనీ అనే అతను ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసాడని, అతని విమానం జపాన్‌లో కూలిపోయి మరణించాడని డాక్టర్ టకర్ పరిశోధనలో తెలిసింది. ఈ కుర్రాడి మీద హిస్టరీ ఛానల్‌లో ఓ టీవీ డాక్యుమెంటరీని కూడా తీసింది.
పునర్జన్మలు ఉన్నాయని నమ్ముతున్న డాక్టర్ టకర్ ఇలాంటి వాటి మీద టీవీ రియాల్టీ షోలని కూడా నిర్వహించాడు.

పద్మజ