అక్షర

కనుమరుగైన షితాబుఖాను చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షితాబుఖాను
అను సీతాపతిరాజు
-ఆదిరాజు వీరభద్రరావు
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక
కేంద్రాలలో

వరంగల్ కోట అనగానే కాకతీయరాజులు గుర్తుకురావడం సహజం. కానీ కాకతీయ రాజుల తర్వాత అక్కడ వేరొక వంశపు రాజు పాలించినట్లు నేటి తరానికి పెద్దగా తెలియదు. ఎప్పుడు ఖిలావరంగల్ సందర్శనకు వెళ్లినా.. అక్కడ కనిపించే ఖుష్‌మహల్‌ను చూడగానే ఇదెవరు కట్టించారో అన్న సందేహం వస్తుంది. అయితే ఖుష్‌మహల్ కాకతీయుల కట్టడమే అయినా.. దర్బార్ హాల్‌గా తీర్చిదిద్ది ఇక్కడినుంచే పాలన చేసింది మాత్రం షితాబ్‌ఖాన్ అనే రాజని ఓరుగల్లు చరిత్ర చెబుతోంది. అసలు ఈ షితాబ్‌ఖాన్ ఎవరు.. అతని చరిత్ర ఏమిటి.. అనే విషయాలు ఎప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోకుండా షితాబ్‌ఖాన్ చరిత్రను అక్షరబద్దం చేసి అతనొక హిందూ రాజు అని.. మహ్మదీయ సుల్తాన్‌ల కాలంలో సైనికుడి స్థాయినుంచి రాజ్యాధికారం చేపట్టేవరకు ఎదిగిన మహావీరుడని తెలిపే పుస్తకమే షితాబుఖాను అను సీతారామరాజు. ఈ పుస్తకం షితాబ్‌ఖాన్ జీవిత చరిత్రగా చెప్పుకోవాలి. ఖుష్‌మహల్ 15వ శతాబ్దం చివరనుంచి 16వ శతాబ్దం మొదటివరకు షితాబ్‌ఖాన్ పాలనలో అతని దర్బారు మందిరం.. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం నూటయాభై ఏళ్ల తర్వాత సీతడు అనబడే సీతాపతిరాజు తర్వాత కాలంలో షితాబ్‌ఖాన్‌గా వరంగల్ ప్రాంతాన్ని జయించి కోటలో ఖుష్‌మహల్ నిర్మాణం చేసినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. అయితే షితాబ్‌ఖాన్ చరిత్ర చాలాకాలంవరకు అజ్ఞాతంగానే ఉండి హిందూ, ముస్లిం చరిత్రకారుల భిన్నాభిప్రాయాల మధ్య ఆదరణను కోల్పోయి చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కె.వి.లక్ష్మణరావు పంతులుగారు షితాబ్‌ఖాన్‌కు సంబంధించిన చరిత్రను అక్షరబద్ధం చేసే క్రమంలో ఖిలావరంగల్‌లోని శాసనం ఆధారంగా సీతడు అనబడే ఈ షితాబ్‌ఖాన్ హిందూ రాజు అని, అతని పాలనలో ఏయే ప్రాంతాలు ఉన్నవి, అతని దండయాత్రలు ఏవిధంగా కొనసాగినవి, అతని భార్యాపుత్రులెవరు.. ఇలా అన్ని అంశాలను పరిశోధించి షితాబ్‌ఖాన్ చరిత్రను వెలుగులోకి తెచ్చారు. లక్ష్మణరావుగారు చేసిన కృషికి కొనసాగింపుగా ఆదిరాజు వీరభద్రరావుగారు షితాబ్‌ఖాన్ విషయంలో మరింత పరిశోధన చేసి కాకతీయుల పాలన తర్వాత మహ్మదీయుల దండయాత్రలో శిథిలమైన ఓరుగల్లు కోటకు పునర్వైభవం సంతరింపజేసిన గొప్ప ఆంధ్ర వీరుడంటూ అతని చరిత్రను కొంతవరకు భావితరాలకు అందించే ప్రయత్నంచేశారు. కాకతీయుల కాలంనుంచి నేటికీ అవే పేర్లతో కొనసాగుతున్న మఠెవాడ, రామన్నపేట, గిర్మాజీపేట తదితర ప్రాంతాలను పేర్కొనడమే కాకుండా శత్రు దుర్భేద్యమైన కాకతీయుల కోటలను, వరంగల్ నగరంలోని ప్రజల జీవనశైలిని, సంస్కృతిని, నాటి ఏకవీర, పాండవుల గుడి, కుమారస్వామి దేవాలయం, స్వయంభూదేవుని నికేతనం వంటి దేవాలయాల ప్రస్తావనను కూడా ఈ పుస్తకంలో చెప్పుకొచ్చారు. శంభుని గుడివద్ద లభించిన క్రీ.శ.1504నాటి షితాబుఖానుకు సంబంధించిన శాసన రూపురేఖలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రధానంగా సిపాయిగా మొదలైన సీతడి ప్రస్థానం షితాబ్‌ఖాన్ అనే రాజుగా ఎదగడం వరకు.. అతని పాలనలో హిందూ దేవాలయాల పునరుద్ధరణలో భాగంగా దెబ్బతిన్న పాంచాల రాయస్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్టించడం వంటి అనేక ఘటనలను పేర్కొంటూ హిందూ మతాభిమానిగా చెప్పారు. ఈ మహావీరుని యొక్క సరియైన చరిత్రను నిరూపించు శంభునిగుడి శాసనమును, ఏకశిలానగర కైఫియతు, కిమ్మూరు కైఫియ్యతు వంటి కొన్ని కైఫియతులను, చరిత్రకారుల గ్రంథములను పరిశీలించి అందులోని విషయాలు విభిన్నమైనప్పటికీ.. అవసరమైన వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ తెలంగాణ మహావీరుని పాలనకు చారిత్రకాధారాలున్నాయని నిరూపించే ప్రయత్నంచేశారు. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారు ముందుమాట రాస్తూ షితాబ్‌ఖాన్‌ను పాండవ మధ్యముడు అర్జునునితో పోల్చడం విశేషం. తెలంగాణ చరిత్రలో షితాబ్‌ఖాన్ అను ఓ గొప్పవీరుని చరిత్రను భావితరాలకు అందించే దిశగా చేసిన గొప్ప ప్రయత్నం ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు ముఖ్యంగా నేటి తెలంగాణ విద్యార్థులకు చాలా ఉపయుక్తం..

-రంగనాథ్ మిద్దెల