అక్షర

అభ్యుదయ భావాలతో ‘సేద్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కవన సేద్యం’
కెంగార మోహన్
పేజీలు: 104
వెల: రు.100/-
ప్రతులకు: ఎస్.అరుణ
ఇం.నెం.41-473-125
సాయిబాబా సంజీవయ్యనగర్
కర్నూల్- 518 001
707519071

అక్షర యుద్ధమెప్పుడూ అనివార్యమేనని భావించే యువకవి కెంగార మోహన్ తిరోగమన దిశలో పరిభ్రమిస్తున్న సమాజాన్ని ప్రశ్నించాలని వుందంటూ...అభ్యుదయ భావాలతో ‘కవనసేద్యం’ గ్రంథాన్ని వెలువరించారు. ప్రగతిశీల దృక్పథంతో రూపుదిద్దుకున్న ఇందలి యాభై కవితలు కవియొక్క ధిక్కార స్వరానికి అద్దం పట్టేలా వున్నాయి. సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా కవి తన కవిత్వాన్ని పండించయత్నించడం అభినందనీయం!
సమాజంలోని అస్తవ్యస్త పరిస్థితులపై, సమస్యలపై ఆవేదనతో స్పందిస్తూ రాసిన ఇందలి కవితల్లో కవియొక్క నిలదీసే గుణం కానవస్తుంది. యుద్ధాన్ని స్వాగతిస్తూనే శాంతిని ఆకాంక్షించే సహృదయత కల కవి మోహన్ సమస్యలను ఎత్తి చూపి వదిలేయకుండా పరిష్కారం కోసం తపన పడడాన్ని ఆయన కవిత్వంలో మనం చూస్తాం!
వైయక్తిక అనుభవాలకు సామాజికాంశాలను జోడించి కవి తన అంతరంగంలో గూడుకట్టుకున్న ఆలోచనలకు అక్షరాకృతిని ఇవ్వడంలో ఆయన ప్రతిభ కానవస్తుంది.
‘నీకోసం ఎన్నో లక్షల అక్షరాల-వరసలు పేర్చి జీవం పోసాను...ఆపాదమస్తకం ఆవరించిన చైతన్యంతో సమసమాజాన్ని నిర్మించాలనుకుంటున్నానని’ వినయంగా ప్రకటించుకున్న కవి మోహన్. ఆయన మనోఫలకంపై నాట్యం చేసే భావ చిత్రాలకు, మాయా ప్రపంచపు నీడల్ని జోడించి సప్త వర్ణాలతో జీవన దృశ్యంగా మలచాలని వుందని తన నిశ్శబ్ద గీతాన్ని మనముందుంచారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో...వలసెల్లిన పల్లెల్లోని పొగచూరిన బతుకుల వ్యధలను ఓ కవితలో అక్షరబద్ధం చేసారు.
‘కృషీవలుడు’ కవితలో తిండి, గూడు, నిద్ర, సౌఖ్యం అన్నదాత నిఘంటువుల్లోంచి బహిష్కరించబడ్డాయని, ఎండిన చేలల్లో నింగికేసి చూస్తున్న మట్టిమనిషి అస్తిపంజరాన్ని కవి అక్షరాల్లో ఆర్ద్రంగా ఆవిష్కరించారు.
‘మాయమవుతున్నది మనిషొక్కడే కాదు..మాతృభాష కూడా’ అంటూ భాషను బతికించుకుందాం రండి అని పిలుపునిచ్చారు.
విలువల పందేరంలో ఓటమి ఎప్పుడూ సమసమాజ స్వాప్నికుడిదే అంటూ ‘మరణ వాంగ్మూలం’ కవితను తీర్చిదిద్దారు.
హృదయం వర్షించినప్పుడల్లా, అక్షరాల విత్తులు విత్తుతాను...అలుపెరుగని కర్షకుణ్ణి నేను...సామాజిక చైతన్య కవన సేద్యం నాది..అంటూ ‘కవనసేద్యం’ కవితలో కవి తనకు కవిత్వంపట్ల సమాజం పట్ల వున్న మమకారాన్ని ప్రకటించిన తీరు బాగుంది.
గతమెంతో మధురమైంది, వర్తమాన మెప్పుడూ ప్రశ్నార్ధకమే అంటూ తన బాల్య స్మృతులను ఏకరువుపెడుతూ ‘ఏది, ఏవి?’ కవితను రాసారు.
కన్నీటితో తడిపిన చైతన్యాన్ని..మది కుటీరంలో నిక్షిప్తం చేసి..అక్షర ప్రభంజనం సృష్టించాలని ఆకాంక్షించే కవి, ఇంటింటా చైతన్యపు జ్వాలలు రగిలిద్దాం...అక్షరాలనే అణుబాంబులతో కలం పోరు చేద్దామని పిలుపునిచ్చారు. కూడు, గూడు, గుడ్డ కోసం భూపోరాటం చేసిన ఉద్యమ కెరటాలకు అక్షరాంజలి ఘటించారు. కరువు రక్కసి కోరలకు చిక్కి ఆత్మహత్య చేసుకున్న రైతన్నలకు కవి తమ కలంలోకి కన్నీళ్లను ఒంపి శ్రద్ధాంజలి అర్పించారు.
‘చిగురాకుల శిశిరం’ కవితలో చిగురాకు చిగురించి రాలినట్లే అతివల ఆశలూ రాలిపోతున్నాయని వాపోయారు.
స్వర ప్రకంపనల్లో పురుడు పోసుకున్న చైతన్యం ఎప్పటికైనా విజయబావుటా ఎగరేస్తుందన్న విశ్వాసమున్న కవి మోహన్ మరో ప్రపంచం సాధ్యమేనని ఓ కవితలో తేల్చి చెప్పారు.
తొలి మలి సంధ్యవేళల్లో...మానవతా పరిమళాలను వెదజల్లే మనుషుల కోసం అనే్వషిస్తుంటానని అంతరాలను చెరిపేసి..ప్రగతికి అందరం నడుం బిగిద్దామని సమసమాజ ఆవిర్భావానికి , నవ భారత నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలవుదామని ప్రకటించడం ప్రశంసనీయం!
వౌనం భావాల అలలై, అనుభవాల ఉప్పెనలతో కలిసి ఎగిసిపడుతున్నప్పుడు ప్రశ్నల విస్ఫోటనానికి అర్థమేముంటుందని ప్రశ్నించారు.
శూన్యంలోంచి అగాధాన్ని చూస్తున్నకొద్దీ ప్రతిబింబం సొగసుగా కనిపిస్తుంది. చీకటిని కుమ్మరిస్తున్న చినుకులు వెక్కిరిస్తున్నాయంటూ ‘రణన్నినాద గొంతుకలు’ కవితను ప్రారంభించిన తీరు కవితాత్మకంగా వుంది.
ఇలా ఈ గ్రంథంలో అనేక పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి. పారదర్శకమైన లక్ష్యంతో దేన్నయినా సాధించవచ్చన్న ధీమా వున్న కవి..తన ప్రగతి శీల భావాలతో కవనసేద్యం చేయడం స్వాగతించదగింది. సమాజానికి ఏదో చేయాలన్న తపన వున్న కవి తన వంతు ప్రయత్నంగా ఈ గ్రంథాన్ని తీర్చిదిద్దడం అభినందనీయం. ఇందలి కవితలు కవిత్వాంశ కోసం వెతికే పాఠకులను అంతగా మెప్పించకపోయినప్పటికీ..కవియొక్క సామాజిక చింతనను అందరు అభినందించి తీరుతారు. అక్కడక్కడ పంటికింది రాయిలా అక్షర దోషాలున్నప్పటికీ..కవి కవన వాత్సల్యం ముందు అవి పెద్దగా ప్రభావం చూపవు! సిద్ధాంత వైరాగ్యాన్ని మూలాల్లోంచి విసిరేయాల్సిన సందర్భమెప్పుడో వచ్చేసిందని సగర్వంగా ప్రకటించిన కవియొక్క ఆత్మవిశ్వాసం అభనందించదగింది...తుంబలి శివాజీ గీసిన లోపలి బొమ్మలు గ్రంథానికి నిండు శోభను కూర్చాయి.

-డి.ఎస్.