అక్షర

అద్వైత భావాలు.. శుద్ధ నాస్తికత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షాత్కారం
-కె.వి.రమణారెడ్డి
వెల: రూ.200/-
ప్రతులకు: విశాలాంధ్ర,
నవచేతన పుస్తక కేంద్రాలు

‘అద్వైత భావాలతో శుద్ధ నాస్తికత్వాన్ని సమన్వయం చేస్తూ వెలువడిన ఆధునిక ఆధ్యాత్మిక గ్రంథం’ అని రచయిత గ్రంథ నామం కింద చేర్చారు. గ్రంథనామాన్ని పాఠకుడు ‘్భగవంతుడు ఒక వ్యక్తి రూపంలో లేడని స్పష్టం చేసుకొని, అన్ని స్థితులలో సర్వజ్ఞసత్తు యొక్క ప్రకాశమే అద్వైతంగా ఉందని సాక్షాత్కరించుకుంటాడని అభిప్రాయపడినాను’ అంటారాయన. భావాలలో, అభివ్యక్తి రీతిలో నిస్సందేహంగా ఇది విలక్షణ గ్రంథం. పది ప్రకరణాలలో 249 ప్రశ్నోత్తరాల రూపంలో రచన సాగింది. ముందు పది ప్రకరణాల సంగ్రహం జోడించారు. విడిగా ప్రశ్నావళి ఇచ్చారు. భావసాంద్రత కారణంగా శైలి పారిభాషిక పదాల పోహళింపు చోటు చేసుకుంది. గ్రంథాంతంలో పాఠకుల సౌలభ్యం కోసం ఆధ్యాత్మిక పారిభాషిక పద వివరణను 5 పుటలలో అందించారు. వాక్య నిర్మాణంలో సూత్రాలు, నిర్వచనాలు, విశే్లషణలు, తర్కం, వివరణలు, విమర్శలు, ఆధారాలు వంటివి విస్తృతంగా కానవస్తాయి. ప్రతి పుటలోను ఆలోచింపజేసే అంశాలున్నాయి. మచ్చుకు కొన్ని పారిభాషిక పదాలు, వాటి అర్థం; ఆధ్యాత్మిక (ఆత్మపై ఆధారపడిన); అద్వైతము (రెండుగా లేనట్టిది); చిత్తు (జ్ఞానము); జిజ్ఞాసి (సత్యం కోసం వెతికే వ్యక్తి); ద్రవ్యము (కణధూళి); సత్తాకము (శక్తిగలది); సంవృతము (సూక్ష్మమైన); సంవిత్తు (జ్ఞాన వైభవము).
నాస్తికత్వాన్ని రచయిత ఇలా వివరించారు: ‘అర్థంలేని ఆచారాలను నమ్మని శుద్ధ సాత్విక భావమే నాస్తికత. సద్విమర్శను శుద్ధ నాస్తికత్వంగా అంగీకరించాల్సిందే. ఆస్తికుడు అంటే దేవుణ్ణి వ్యక్తి రూపంలో నమ్మినవాడు. నాస్తికుడు అంటే దేవుని వ్యక్తి రూపంలో అంగీకరించనివాడు.’ రచయిత దృష్టిలో దైవం అంటే ‘దైవమనేది సర్వజ్ఞ సత్తాకమైనర ఒక విశిష్ట పదార్థమని, ఇదే ఈ వ్యక్త ప్రపంచానికి ఆధారమై అనాదియైన అస్తిత్వంగా ఉన్నదని.. అర్థం చేసుకోవాలి’. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహారాధనను సమ్మతించలేదు. ‘ప్రతీకలలో ప్రతిపాదించిన ప్రాకృతిక తత్వం మరుగున పడేసి పౌరాణికులు విగ్రహ సౌందర్యానికే ప్రాముఖ్యతనిచ్చి, మహిమలు కల్పించి వర్ణించి చెప్పడంతో ఒక విగ్రహ రూపం సామాన్యుని మెదడులో తిష్ఠవేసింది. విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చెయ్యడం మానవమాత్రునికి సాధ్యమా? ఈ విషయం వేదోపనిషత్తులలో ఒక మంత్రంలో కూడా లేదని వేదాంతులే చెప్పుకున్నారు’ అంటారాయన. రచయిత ప్రతి విషయంలోను తన అభిప్రాయాలను నిష్కర్షగా వెల్లడించారు. పాఠకులు లోతుగా పరిశీలించేందుకు, చర్చించేందుకు ఇది దోహదకారి అవుతుంది. వ్రతాల ప్రస్తావనలో ‘పౌరాణికులు కల్పించి చెప్పితేనే పుట్టుకొచ్చినాయి. వ్రతాలన్నీ స్వార్థసిద్ధి కోసం నమ్మకంతో చేసేటివే. అందులో జ్ఞానసిద్ధి అంతంత మాత్రమే’ అని విమర్శించారు.
ముక్తి గురించి వివరిస్తూ ‘జీవునికి సత్యానుభూతే ముక్తి. సత్యం అనేది సచ్చిదానంద స్వరూపం’ అని చెప్పారు. మనస్సునే రచయిత జీవాత్మగా అభివర్ణించారు. ‘ఇచ్ఛారూప మనస్సే జీవాత్మ’ సత్పదార్థ సామర్థ్యాలలో సృష్టిగా సకలాన్ని నియమించే నియోగ నియతి రూప ఆత్మ’ అని కూడా విశదం చేశారు. పరమాత్మను రచయిత ఇలా నిర్వచించారు. ‘పరమాత్మ విషయానికి వస్తే సృష్టిలో అంతర్గతంగా ఉన్న త్యాగశీల కర్మనియతియే ఇది.
సృష్టిలోని ఈ విశిష్ట లక్షణమే సృష్టికి ఆత్మ’. భగవంతుని గురించి ఆయన భావన: ‘సృష్టిసారమే భగవంతుడుగా భావించాల్సి ఉంది. సృష్టితత్వాన్ని దర్శించడమే భగవత్ సాక్షాత్కారం!’
ఒక ధ్యేయంతో, గట్టి నిబద్ధతతో రచించిన గ్రంథమిది. ఆధ్యాత్మిక వౌలికాంశాలపై రచయిత తన నిశ్చితాభిప్రాయాలను ప్రకటించారు. విస్తృత సమాలోచనకు, చర్చకు విపులావకాశాలు కల్పించారు. పాఠకులు మెదడుకు పదును పెట్టుకుంటూ ప్రతి పుటా చదివే రీతిలో రచనా సంవిధానం ఉంది. ‘మనిషి తానేమిటో తెలుసుకోగల్గి కర్మశీలలలో తనను తాను ఉద్ధరించుకుంటాడని ఆశిస్తున్నాను’ అని రచయిత విజ్ఞప్తి చేశారు. దానిని అనుశీలించడం పాఠకుల వంతు.

-జిఆర్కె